కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సరస్సు గులాబీరంగులో ఉండడమా?

సరస్సు గులాబీరంగులో ఉండడమా?

సరస్సు గులాబీరంగులో ఉండడమా?

సెనెగల్‌లోని తేజరిల్లు! రచయిత

ఒక సరస్సు గులాబీరంగులో ఉండడం సాధ్యమేనా? పింక్‌ లేక్‌ అనే పేరుగల రెట్‌బా సరస్సు మేము నివసిస్తున్న ప్రాంతమైన పశ్చిమాఫ్రికాలో ఉన్న సెనెగల్‌లోని డాకర్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంవల్ల, ఆ సరస్సుకి నిజంగా ఆ పేరు తగినదో కాదో చూడటానికి మేము అక్కడికి వెళ్ళాలనుకున్నాం. మేము అక్కడికి చేరుకుంటుండగా, సూర్యరశ్మి వెలుగులో మెరుస్తున్న నీరు మాకు కనిపించింది. అది నిజంగానే అందమైన గులాబీరంగులో ఉంది. నీటిలోని సూక్ష్మజీవులతో, సూర్యకాంతివల్ల కలిగే ప్రతిచర్య మూలంగా నీరు ఆ అసాధారణమైన రంగులో ఉంటుందని మా టూర్‌ గైడ్‌ వివరించాడు. అయితే, ఇక్కడ ఆ సరస్సు రంగు మాత్రమేకాక చూడతగ్గవి ఇంకెన్నో ఉన్నాయి.

అంత ఎక్కువ లోతుండని ఈ సరస్సులోని నీటి అడుగున ఉప్పు పొర పరచినట్లుగా ఉంది. ఆ నీళ్ళు ఎంత ఉప్పగా, తేలడానికి అనువుగా ఉంటాయంటే, సందర్శకుల్లో కొందరు దాని ఉపరితలంపై సునాయాసంగా తేలియాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడాన్ని మేము గమనించాం.

గులాబీరంగు సరస్సు వందలాదిమందికి ఆదాయాన్నిస్తుందనే విషయంలో సందేహం లేదు (1). తీరం పొడవునా కార్మికులు ట్రక్కుల్లో ఉప్పు నింపుతున్నారు. స్థానికులు సరస్సులోనుండి ఉప్పు ఎలా తీస్తున్నారో గమనించడానికి మేము కొంతసేపు అక్కడే నిలబడ్డాం. సరస్సులో కొంతమంది మగవాళ్ళు ఛాతిలోతు నీటిలో నిలబడి పొడవైన గడ్డపారలతో ఉప్పుగడ్డలను పగలగొడుతూ కనిపించారు. వారు దానిని పారలతో గంపల్లోకి ఎత్తి, పడవల్లో నింపుతున్నారు. ఒక టన్ను ఉప్పును పోగుచేయడానికి మూడు గంటలు పడుతుందని వారిలో ఒక కార్మికుడు మాకు చెప్పాడు. ఆ పడవలు దాదాపు మునిగేంతగా అవి నింపబడుతున్నాయి (2). ఆ పడవలు తీరం చేరిన తర్వాత, ఆడవారు ఆ పని కొనసాగిస్తూ, ఉప్పును బకెట్లలోకి నింపి వాటిని తమ తలపై మోసుకువెళ్తారు (3). వారంతా అలా కలిసి మానవ కన్వేయర్‌ బెల్టులా పనిచేస్తారు.

మా యాత్ర ఒక అద్భుతమైన అనుభవం. మన భూమి యెహోవానుండి వచ్చిన ఒక అమూల్య బహుమతి అనేందుకు ఉన్న ఎన్నో అద్భుతాల్లో ఈ గులాబీరంగు సరస్సు కూడా ఒకటి.​—కీర్తన 115:16. (g05 9/22)

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

Photo by Jacques CLEMENT, Clichy, FRANCE at http://community.webshots.com/user/pfjc