కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్కూల్లో జరిగే లైంగిక కార్యకలాపాలకు నేనెలా దూరంగా ఉండగలను?

స్కూల్లో జరిగే లైంగిక కార్యకలాపాలకు నేనెలా దూరంగా ఉండగలను?

యువత ఇలా అడుగుతోంది . . .

స్కూల్లో జరిగే లైంగిక కార్యకలాపాలకు నేనెలా దూరంగా ఉండగలను?

“ప్రతిరోజూ పిల్లలు సెక్స్‌ గురించే మాట్లాడతారు. ఆడపిల్లలు సహితం మగపిల్లల వెంటపడతారు, స్కూల్లోనే వాళ్ళు సెక్స్‌లో పాల్గొంటారు.”​—ఐలీన్‌, 16.

“మా స్కూల్లో స్వలింగసంపర్కులు ఇతర పిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తిస్తారు, అయినా వాళ్ళు దాన్ని తప్పుగా భావించరు.”​—మైఖేల్‌, 15. *

మీతరగతిలోని పిల్లలు ఎప్పుడూ సెక్స్‌ గురించే మాట్లాడుతున్నారా? కొంతమంది కేవలం మాట్లాడడం కంటే ఎక్కువే చేస్తున్నారా? అలాగైతే మీరు, స్కూలుకు వెళ్లడాన్ని, “A సర్టిఫికెట్‌ చిత్రం షూటింగ్‌లోని ఒక సన్నివేశంలో నటించడం”తో పోల్చిన ఒక యౌవనస్థురాలిలాగే భావిస్తుండవచ్చు. వాస్తవమేమిటంటే, పాఠశాలలో చాలామంది యౌవనస్థులు సెక్స్‌ గురించి మాట్లాడాలనే, చివరికి సెక్స్‌లో పాల్గొనాలనే ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు.

మీ తోటి విద్యార్థులు “హుకింగ్‌ అప్‌” గురించి, అంటే ఏ విధమైన భావోద్వేగ అనుబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొనడం గురించి మాట్లాడడం మీరు వింటుండవచ్చు. కొన్ని సందర్భాల్లో, పిల్లలు కేవలం ముఖ పరిచయం ఉన్నవాళ్ళతో హుక్‌ అప్‌ అవుతారు. మరికొన్ని సందర్భాల్లో, తాము ఇంటర్నెట్‌ ద్వారా కలిసిన అపరిచితులతో సెక్స్‌లో పాల్గొంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ, హుక్‌ అప్‌ కావడంలోని లక్ష్యం, ఈ విషయంలో ప్రేమను ఎంతమాత్రం ప్రస్తావనకు తేకుండా ఉండాలన్నదే. “దీనిలో ఇద్దరు వ్యక్తులు తమ శారీరక కోరికలకు లొంగిపోవడం తప్ప మరింకేమీ లేదు” అని 19 సంవత్సరాల డానియెలా చెబుతోంది.

చాలా స్కూళ్ళలో హుకింగ్‌ అప్‌ ఎంతో చర్చనీయాంశంగా మారిందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. “ప్రతీ వారాంతం తర్వాత స్కూలు ఆవరణలు, క్రొత్తగా ఎవరు హుక్‌ అప్‌ అయ్యారనేదాని గురించిన చర్చలతో నిండిపోతాయి, స్నేహితులు వాటి గురించి సవివరంగా చర్చించుకుంటుంటారు” అని 17 సంవత్సరాల ఒక అమ్మాయి తన పాఠశాల వార్తాపత్రికలో వ్రాసింది.

మీరు బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తుంటే, ఎప్పుడూ సెక్స్‌ గురించే మాట్లాడుతున్నట్లుండే ప్రజల మధ్య మీరు ఒంటరివారైనట్లు అనిపించవచ్చు. గుంపుతో కలవకపోతే, మీరు సులభంగా అపహాస్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొంతవరకు ఎదురుచూడవలసిందే, ఎందుకంటే ఇతరులు మీ విధానాన్ని అర్థం చేసుకోనప్పుడు, వారు మిమ్మల్ని ‘దూషిస్తారు’ అని బైబిలు చెబుతోంది. (1 పేతురు 4:​3, 4) అయినా, ఎగతాళి చేయబడాలని ఎవరూ కోరుకోరు. కాబట్టి మీరు స్కూల్లోని లైంగిక విషయాలకు దూరంగా ఉంటూనే మీ నిర్ణయాన్నిబట్టి మీరెలా సగర్వంగా ఉండవచ్చు? మొదటిగా, లైంగిక శోధన ఎందుకంత శక్తిమంతమైనదో అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం.

మిమ్మల్ని మీరు తెలుసుకోండి

కౌమారప్రాయంలో శారీరకంగానూ, భావోద్రేకపరంగానూ మీలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు ఈ వయసులో ఉన్నప్పుడు, మీలో లైంగిక కోరికలు బలంగా ఉంటాయి. ఇది పూర్తిగా సహజమేనని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు స్కూల్లో ఎవరివైపైనా బలంగా ఆకర్షించబడితే, మీరు స్వతహాగా చెడ్డవారనో, మీలో నైతిక పరిశుభ్రత లేదనో అనుకోనవసరంలేదు. మీరు పవిత్రంగా ఉండాలనుకుంటే తప్పకుండా ఉండగలరు!

కౌమారప్రాయంలో సాధారణంగా అంతర్గత మధనం ఉంటుందనే కాక, మీరు మరో విషయాన్ని కూడా తెలుసుకుని ఉండాలి. అపరిపూర్ణులుగా మానవులు అందరూ చెడు చేయడం వైపే మొగ్గుచూపుతారు. అపొస్తలుడైన పౌలు కూడా ఇలా అంగీకరించాడు: “వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.” తన అపరిపూర్ణతలు, తాను “దౌర్భాగ్యుడను” అని భావించేలా చేశాయని కూడా పౌలు చెప్పాడు. (రోమీయులు 7:​23, 24) కానీ ఆయన వాటిపై విజయం సాధించాడు, మీరు కూడా సాధించగలరు!

మీ తోటి విద్యార్థులను అర్థంచేసుకోండి

ముందు పేర్కొన్నట్లుగా, మీ తోటి విద్యార్థులు ఎప్పుడూ సెక్స్‌ గురించే మాట్లాడుతుండవచ్చు, అందులో తమకు కలిగిన అనుభవాల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుండవచ్చు. వారు మీపై చూపించగల దుష్ప్రభావం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. (1 కొరింథీయులు 15:​33) అలాగని మీరు మీ తోటి విద్యార్థులను మీ శత్రువుల్లా చూడనవసరం లేదు. ఎందుకు?

మీ తోటి విద్యార్థులకు కూడా మీకున్నలాంటి కోరికలే ఉంటాయి. వాళ్ళు కూడా చెడుచేయడం వైపే మొగ్గుచూపుతారు. కానీ మీలా కాకుండా, వారిలో కొందరు ‘దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారిగా’ ఉంటుండవచ్చు. లేదా, కుటుంబ సభ్యుల మధ్య ‘అనురాగరాహిత్యం’ ఉన్న గృహాల నుండి వారు వచ్చివుండవచ్చు. (2 తిమోతి 3:​1-4) మీ తోటి విద్యార్థుల్లో కొందరికి, మంచి తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమపూర్వక క్రమశిక్షణ, నైతిక తర్ఫీదు లభించి ఉండకపోవచ్చు.​—ఎఫెసీయులు 6:4.

మీకు సుళువుగా అందుబాటులోవున్న, జ్ఞానానికి అత్యున్నత మూలమైన దేవుని వాక్యమైన బైబిలు తమ దగ్గర లేనందున, సులభంగా కోరికలకు లొంగిపోవడంవల్ల కలిగే నష్టం గురించి మీ తోటి విద్యార్థులకు తెలియకపోవచ్చు. (రోమీయులు 1:​26, 27) అది, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకు కారు నడపడం నేర్పించకుండానే వేగంగావెళ్లే శక్తిమంతమైన కారు వాళ్ళకిచ్చి, రద్దీగావున్న రహదారిపైకి పంపించినట్లు ఉంటుంది. అలా కారులో వెళ్ళడం తాత్కాలికంగా ఎంతో ఉత్తేజకరంగానే ఉంటుండవచ్చు, కానీ ప్రమాదం మాత్రం పొంచివుంటుంది. కాబట్టి మీ తోటి విద్యార్థులు మీ సమక్షంలో సెక్స్‌ గురించి మాట్లాడ్డం మొదలుపెడితే, లేక తమతోపాటు అనైతిక ప్రవర్తనలో పాల్గొనమని మిమ్మల్ని బలవంతపెట్టడానికి ప్రయత్నిస్తే మీరేమి చేయవచ్చు?

అనైతిక సంభాషణకు దూరంగావుండండి

మీ తోటి విద్యార్థులు దుర్నీతికర సెక్స్‌ గురించి మాట్లాడ్డం మొదలుపెడితే, మీకు వినాలనే, లేదా వాళ్ళకు భిన్నంగా ఉండకుండా వాళ్ళతో కలవాలనే శోధన కలగవచ్చు. కానీ మీరలా చేస్తే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి. వాళ్ల సంభాషణలో మీరు చూపించే ఆసక్తి, మీరు నిజంగా ఎలాంటి వ్యక్తో లేక మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారో చూపిస్తుందా?

కాబట్టి, మీరు సంభాషిస్తుండగా, ఆ సంభాషణ దుర్నీతికర సెక్స్‌ వైపుకు మళ్లుతున్నప్పుడు మీరేమి చేయాలి? మీరు లేచి అక్కడినుండి వెళ్లిపోవాలా? ఖచ్చితంగా అలాగే చేయాలి! (ఎఫెసీయులు 5:3, 4) “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 22:3) కాబట్టి సంభాషణ ఆపి వెళ్లిపోవడం ద్వారా మీరు అమర్యాదగా ప్రవర్తించడం లేదు గానీ మీరు బుద్ధితో వ్యవహరిస్తున్నట్లు అవుతుంది.

నిజంగా, అనైతిక సంభాషణ జరుగుతున్న స్థలం నుండి వెళ్ళిపోవడం ఎబ్బెట్టుగా ఉంటుందేమో అని మీరు భావించనవసరం లేదు. మీరు సిగ్గుపడకుండా, అలా వదిలి వెళ్ళిపోయే ఇతర రకాల సంభాషణలు ఉన్నాయి, ముఖ్యంగా చర్చించబడుతున్న విషయంలో మీకు ఆసక్తి లేకపోతే, లేదా అందులో భాగం వహించకూడదని మీరనుకుంటే తప్పకుండా మీరు వెళ్ళిపోతారు. ఉదాహరణకు, సాయుధ దొంగతనం చేయాలని మీ తోటి విద్యార్థులు కొందరు మాట్లాడుకుంటున్నారనుకోండి. మీరు అక్కడే ఉండి వాళ్ల పథకం గురించి వింటారా? మీరలా చేస్తే, మీరూ వాళ్ళల్లో ఒకరిగానే దృష్టించబడతారు. కాబట్టి, జ్ఞానయుక్తంగా మీరు అక్కడినుండి వెళ్ళిపోవడానికే ఎంచుకుంటారు. సంభాషణ దుర్నీతికర సెక్స్‌ వైపు మళ్ళినప్పుడు కూడా అలాగే చేయండి. మీరు స్వనీతిమంతుల్లా కనిపించకుండానే, హేళనకు గురయ్యేలా ప్రవర్తించకుండానే అక్కడినుండి వెళ్ళిపోయే మార్గం కోసం చూడవచ్చు.

నిజమే మీరు ప్రతీసారి అలాంటి పరిస్థితి నుండి దూరంగా వెళ్ళలేకపోవచ్చు. ఉదాహరణకు, తరగతిలో మీ ప్రక్కన కూర్చునే వాళ్ళు మీతో సెక్స్‌ గురించి సంభాషించడానికి ప్రయత్నించవచ్చు. అలాగైతే, మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయవద్దని స్థిరంగానే అయినా మర్యాదపూర్వకంగా వాళ్ళకు చెప్పవచ్చు. అదీ పని చేయకపోతే, మీరు బ్రిండా చేసినట్లు చేయవచ్చు. “నన్ను వేరే స్థలంలో కూర్చోబెట్టమని యుక్తిగా టీచర్‌ను అడిగాను” అని ఆమె చెబుతోంది.

వివేచన కలిగివుండండి

మీ తోటి విద్యార్థుల్లో కొందరు, మీరు తమ అపరిశుభ్ర సంభాషణల్లో ఎందుకు భాగం వహించడంలేదో ఎప్పుడో ఒకసారి తప్పక తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళు మీ నైతిక విలువ గురించి అడిగితే, వివేచనతో జవాబు చెప్పండి. ఎందుకంటే, కొందరు మీ దృక్కోణాన్ని అర్థం చేసుకునే బదులు మిమ్మల్ని హేళన చేయడానికే అలా అడిగే అవకాశం ఉంది. కానీ మిమ్మల్ని ప్రశ్నించేవారి ఉద్దేశం సరైనదే అయితే, మీ నమ్మకాల గురించి సగర్వంగా తెలియజేయండి. చాలామంది యౌవనస్థులు బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు తమ తోటి విద్యార్థులకు సహాయం చేయడానికి, యువత అడిగే ప్రశ్నలు​—ఆచరణాత్మక సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఉపయోగించారు. *

దృఢనిశ్చయతతో ఉండండి

ఎవరైనా తోటి విద్యార్థి, తెగించి మిమ్మల్ని ముట్టుకోవడానికో ముద్దుపెట్టుకోవడానికో ప్రయత్నిస్తే మీరేమి చేయాలి? మీరలా చేయడానికి ఆ వ్యక్తిని అనుమతిస్తే, ఆ తప్పుడు పని కొనసాగించడానికి కావలసిన ధైర్యం అతడికి గానీ ఆమెకు గానీ లభించేలా చేస్తారు. ఒక చెడ్డ స్త్రీ తనను పట్టుకుని ముద్దుపెట్టుకోవడానికి అనుమతించిన ఒక యౌవనస్థుని గురించి బైబిలు వర్ణిస్తోంది. అతడు ఆమె తనతో లైంగికంగా పురికొల్పే విధంగా మాట్లాడ్డానికి అనుమతించాడు. దాని ఫలితం? “వెంటనే పశువు వధకు పోవునట్లు . . . వాడు దానివెంట పోయెను.”​—సామెతలు 7:​13-23.

దానికి భిన్నంగా, అలాంటి పరిస్థితిలోనే యోసేపు ఎలా వ్యవహరించాడో గమనించండి. ఆయన యజమాని భార్య పదే పదే ఆయనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆయన స్థిరంగా నిరాకరించాడు. చివరికి ఆమె ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన వెంటనే అక్కడినుండి పారిపోయాడు.​—ఆదికాండము 39:​7-12.

మీ తోటి విద్యార్థిగానీ మరెవరైనా పరిచయస్థులు గానీ మిమ్మల్ని అనుచితంగా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మీరు యోసేపులా తీవ్రమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఐలీన్‌ ఇలా చెబుతోంది: “ఎవరైనా అబ్బాయి నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే నేను వద్దని చెబుతాను. అయినా అతడు వినిపించుకోకపోతే, దూరంగా ఉండమని నేను గట్టిగా అరుస్తాను.” తన స్కూల్లో ఉన్న అబ్బాయిల గురించి ఐలీన్‌ ఇంకా ఇలా చెబుతోంది: “వాళ్ళు మిమ్మల్ని గౌరవించేలా మీరు చేస్తేనే తప్ప వాళ్ళు మిమ్మల్ని గౌరవించరు.”

అనైతిక సంభాషణను వినడానికి మీరు నిరాకరిస్తూ, సముచితమైనప్పుడు మీ నైతికస్థానం గురించి గౌరవపూర్వకంగా వివరిస్తూ, అనైతిక చర్యలను స్థిరంగా తిరస్కరిస్తుంటే మీరు కూడా మీ తోటి విద్యార్థుల గౌరవాన్ని చూరగొంటారు. మరో ప్రయోజనం ఏమిటంటే, మీ విషయంలో మీకు సంతృప్తి కలుగుతుంది. మరింత ప్రాముఖ్యంగా, యెహోవా ఆమోదం మీకుంటుంది.​—సామెతలు 27:​11. (g 3/06)

ఆలోచించవలసిన విషయాలు

◼ అనైతిక సంభాషణ జరుగుతున్నప్పుడు అక్కడినుండి వెళ్ళిపోడానికి మీరు ఏమి చెప్పవచ్చు?

◼ మీ తోటి విద్యార్థి మిమ్మల్ని అనుచితంగా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరు ఏమి చెబుతారు, ఏమి చేస్తారు?

[అధస్సూచీలు]

^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ యెహోవాసాక్షులు ప్రచురించినది.

[17వ పేజీలోని చిత్రం]

సంభాషణ అనైతిక సెక్స్‌ వైపు మరలితే, అక్కడినుండి వెళ్ళిపోండి

[18వ పేజీలోని చిత్రం]

అనుచితంగా ముట్టుకోబోతుంటే స్థిరంగా తిరస్కరించండి