చెర్నోబిల్‌కు చేసిన ఒక రోజు ప్రయాణం
చెర్నోబిల్‌కు చేసిన ఒక రోజు ప్రయాణం
యుక్రెయిన్‌లోని తేజరిల్లు! రచయిత
చెర్నోబిల్ అణు ఉత్పాదక కేంద్రంలో 20 సంవత్సరాల క్రితం ఇంతకుముందెన్నడూ జరగని రీతిలో ఘోరదుర్ఘటన సంభవించింది. 1986, ఏప్రిల్ 26న, ఆ కేంద్రంలో ఉన్న నాలుగు రియాక్టర్లలో ఒకటి ప్రమాదకరమైన రీతిలో కరిగింది. సాధారణంగా, మానవులవల్ల లేక ప్రకృతి కారణంగా విపత్తులు సంభవించినా, శుభ్రపరచడం, పునర్నిర్మాణం వీలౌతుంది. అయితే, ఈ దుర్ఘటనవల్ల హానికరమైన దీర్ఘకాలిక ప్రభావాలు సంభవించాయి.
ఇటీవలి సంవత్సరాల్లో, ఈ కేంద్రానికి దగ్గర్లో ఉన్న పట్టణాలకు చెందిన మునుపటి నివాసులు ప్రతీ ఏడాది మే 9న, ఒకప్పుడు తమ గృహాలుగా ఉన్న, తాము విడిచివెళ్లిన ఇళ్లను చూడడానికి వస్తున్నారు. ఇతర సమయాల్లో, అంత్యక్రియలకు హాజరవడానికి ఇక్కడికి వస్తున్నారు. అణుధార్మిక ప్రభావాలను అధ్యయనం చేయడానికి శాస్త్రజ్ఞులు కూడా ఆ పట్టణాలను సందర్శిస్తున్నారు. అంతేకాక, ఇటీవలే యుక్రేనియన్ టూర్ కంపెనీలు ఆ ప్రాంతానికి ఒక రోజు టూర్ ఏర్పాటు చేశాయి.
ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక, 2005 జూన్‌లో, మొదటి పేజీ కథనంలో, ప్రిపెట్‌ను చూడడానికి “టూర్‌గైడ్ల సహాయంతో” చేసే “ఆరోగ్య ప్రమాదాలు లేని” చిన్న యాత్రల గురించి వివరించింది. * రియాక్టర్ల నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిపెట్ నగర జనాభా దాదాపు 45,000, అది 1970లలో స్థాపించబడింది. అయితే, అణు విపత్తు సంభవించిన తర్వాత, ప్రజలు అనేక ఇతర నగరాలను విడిచివెళ్లినట్లే ఈ నగరాన్ని కూడా విడిచివెళ్లారు. ఆ తర్వాత, అణుధార్మికత కారణంగా అలాంటి ప్రాంతాల్లోకి ప్రవేశం నిషేధించబడింది. రియాక్టర్లు కరిగిన సమయానికి అన్నా, విక్టర్ రుడ్నిక్‌లు దాదాపు ఒక సంవత్సరంగా ప్రిపెట్‌లో నివసిస్తున్నారు. *
దానికన్నా అతి చిన్నదైన చెర్నోబిల్ పట్టణం (అణు కేంద్రానికి కూడా అదే పేరు) రియాక్టర్ల నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ పట్టణంలో మునుపు నివసించినవారు ఆ పట్టణాన్ని ప్రతీ సంవత్సరం చూడడానికి కొన్ని సంవత్సరాలుగా అనుమతించబడుతున్నారు. చెర్నోబిల్ నిజానికి రుడ్నిక్ దంపతుల స్వస్థలం కాబట్టి, వారు ఈ సమయంలో చెర్నోబిల్‌ను సందర్శించారు. కొన్ని సంవత్సరాల క్రితం నేనూ, నా భార్యా వారితో కలిసి ఈ పట్టణానికి చేసిన యాత్రను నన్ను వివరించనివ్వండి.
దుఃఖకరమైన మా సెలవుదినం
యుక్రెయిన్ దేశ రాజధాని కేవ్‌కు ఉత్తర దిశలో ఉన్న రహదారి మీదుగా మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మేము చిన్న పట్టణాల గుండా ప్రయాణించాం, ఆ పట్టణాల్లో రోడ్డుకు ఇరుప్రక్కల ఇళ్లున్నాయి, ఆ ఇళ్ల ముందుభాగాలు పూలతో కళకళలాడుతున్నాయి, ప్రజలు కూరగాయల తోటలను సాగుచేస్తున్నారు. పట్టణాల మధ్య మొక్కజొన్న, గోధుమ, ప్రొద్దుతిరుగుడు పొలాలు, నింగి నేలను కలిసేంత దూరం వరకు కనిపించాయి.
అయితే, కొంత దూరం వెళ్లిన తర్వాత మేమొక అదృశ్యమైన సరిహద్దును దాటాం. అలాంటి సరిహద్దును సూచించే బోర్డు ఏదీ లేదు, కానీ పరిస్థితులు వేరుగా ఉన్నట్లు మాత్రం గ్రహించాం. దారి వెంబడి ఉన్న పట్టణాల్లో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించివుంది. శిథిలమౌతున్న ఇళ్ల కిటికీలు పగిలిపోయివున్నాయి, తలుపులకు తాళంకప్పలు వేలాడుతున్నాయి. ఇళ్ల ప్రాంగణాలు కలుపుమొక్కలతో నిండిపోయాయి, తోటలు పిచ్చిగా పెరిగాయి.
మేము రియాక్టర్ల నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆంక్షలు విధించబడిన ప్రాంతంలోకి ప్రవేశించాం. “ఈ ప్రాంతంలో ఉన్న పట్టణాల్లో అణుధార్మికత శాతం అధికంగా ఉంది, ఇక్కడి నుండి అనేక పట్టణాలకు, గ్రామాలకు చెందిన 1,50,000 కన్నా ఎక్కువమంది, మునుపటి సోవియట్ యూనియన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రొత్త గృహాలకు తరలించబడ్డారు” అని అన్నా మాకు చెప్పింది.
మేము ఇంకా కొంత ప్రయాణం చేసి కొద్దిసేపటికి మరో ప్రాంతానికి చేరుకున్నాం, ముళ్ల తీగల కంచె ఆ ప్రాంతాన్ని
మిగతా ప్రపంచం నుండి వేరు చేస్తుంది. దానికి దగ్గర్లో, కస్టమ్ కంట్రోల్‌రూమ్‌లా ఉన్న చెక్క భవనంలోని గార్డులు వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఒక గార్డు మా పాస్‌పోర్టులను పరిశీలించి, మా వాహనం నంబరును వ్రాసుకుని గేటు తెరిచాడు.మేము ఇప్పుడు ఆంక్షలు విధించబడిన ప్రాంతంలో ఉన్నాం. లేత ఆకులతో నిగనిగలాడుతున్న పచ్చనిచెట్ల నీడ రోడ్డు మీద పడుతోంది. దట్టంగా ఉన్న చిన్నపొదలు నేలమీద వ్యాపించివున్నాయి, నేను ఊహించినట్లు అక్కడ అసలు కాలిపోయిన చెట్లుగానీ, ముడుచుకుపోయిన పొదలుగానీ లేనేలేవు. ఇంకా ముందుకెళ్తే ఇటుకలతో నిర్మించిన తెల్లని నిర్మాణం మీద నీలి అక్షరాలతో చెర్నోబిల్ పట్టణం పేరు కనిపించింది.
చెర్నోబిల్ పొలిమేర్లలో ఒక మందుల దుకాణం ఉంది. విక్టర్ వాళ్లమ్మ ఒకప్పుడు అక్కడ పనిచేసేది. దుకాణం తెరిచి ఉంచే వేళలు చూపించే మాసిపోయిన బోర్డు, దుమ్ముపట్టి పాడుగా కనిపిస్తున్న కిటికీకి ఇంకా వేలాడుతోంది. పట్టణ సెంట్రల్ పార్కు దగ్గర కళాభవనం ఉంది. పని పూర్తైన తర్వాత తాను, మరితర పట్టణవాసులు, వివిధ కళాకారుల ప్రదర్శనలు చూస్తూ ఎలా విశ్రాంతి తీసుకునేవారో అన్నా గుర్తుచేసుకుంది. దగ్గర్లో, యుక్రెయినా అనే సినిమా థియేటర్ ఉంది, ఒకప్పుడు పిల్లలు తీక్షణమైన వేడిని తప్పించుకుని సౌకర్యవంతంగా ఉండే చల్లని థియేటర్‌లో క్రొత్త సినిమా చూడడానికి వెళ్లేవారు. చీకటి ఆడిటోరియమ్‌లో వారి నవ్వులు వినిపించి చాలాకాలమైంది. అన్నా, విక్టర్‌లు మమ్మల్ని తమ ఇంటికి తీసుకువెళ్లారు, వారి ఇల్లు పట్టణ కేంద్రానికి చాలా దగ్గర్లో ఉంది. ఎలాంటి సంరక్షణలేని కారణంగా మొక్కలు ప్రధాన ద్వారానికి అడ్డంగా ఉన్నాయి, కాబట్టి మేము ఒకరి వెనుక ఒకరం నడుస్తూ, పిచ్చిగా పెరిగిన కలుపుమొక్కల మీదుగా పెరటిద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశించాం, అప్పటికల్లా అక్కడ తలుపులు లేకుండా ఒక పెద్ద రంధ్రం మాత్రమే మిగిలివుంది.
ఇంటిలోపలి భాగం పూర్తిగా నాశనమైంది. తుప్పుపట్టిన మంచంమీద బూజుపట్టిన పరుపు క్రిందికి అణగిపోయివుంది. గోడకు అతికించిన వాల్‌పేపర్‌లు పాడైపోయి వ్రేలాడుతున్నాయి. చెత్తాచెదారంతో నిండిన గదిలో నుండి ఒక పాత ఫోటోను తీసుకోవడానికి అన్నా క్రిందికి వంగింది. “నేను ఇక్కడికి మళ్లీ వచ్చినప్పుడు ప్రతీది ఇంతకుముందున్నట్లే ఉండడం చూడాలని నేను ఎప్పుడూ కోరుకునేదాన్ని, మా ఇళ్లు చెత్తకుప్పగా తయారవడం, మా వస్తువులు సంవత్సరాలుగా దొంగిలించబడడం చూసి నాకు ఎంతో బాధగా ఉంది!” అని ఆమె బాధ నిండిన స్వరంతో అంది.
మేము రుడ్నిక్‌ల గృహం నుండి బయటికివచ్చి ఆ వీధిలో నడవడం మొదలుపెట్టాం. వీధిలోని ఒక మూలలో కొంతమంది ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. మేము ఆ రోడ్డు మీద అరకిలోమీటరు వరకు నడిచాం, అది నిర్మలమైన పెద్దనది ఒడ్డున ఉన్న పార్కు దగ్గర ఆగిపోయింది. చెస్ట్‌నట్ చెట్ల తెల్లని పూలు గాలికి ఊగుతున్నాయి. అక్కడ, పడవ ఎక్కే ప్రదేశానికి తీసుకువెళ్ళే మెట్ల దగ్గర, 1986వ సంవత్సరంలోని ఒకరోజు, ఆ ప్రాంతాన్ని వదిలివెళ్ళడానికి వందలాదిమంది పడవల కోసం వేచివున్నారు.
గత సంవత్సరం, రుడ్నిక్ కుటుంబం, ప్రిపెట్‌లో ఉన్న తమ పాత ఇంటిని మొదటిసారి చూసివచ్చారు. 19 సంవత్సరాల క్రితం న్యూక్లియర్ రియాక్టర్‌లు కరిగినప్పుడు వారు నగరాన్ని విడిచివెళ్లారు.
పునరాలోచించాల్సిన సమయం
2006 ఏప్రిల్‌లో న్యూక్లియర్ విపత్తుకు సంబంధించిన 20వ వార్షికోత్సవం వివిధ రకాల వేడుకల ద్వారా జ్ఞాపకం చేసుకోబడింది. మానవుడు యథార్థంగా ప్రయత్నిస్తున్నా, దైవిక పర్యవేక్షణ లేకుండా భూవ్యవహారాలను విజయవంతంగా చేపట్టడం అతనివల్ల కాదని ఆ వేడుకలు గంభీరమైన రీతిలో అనేకమందికి గుర్తుచేస్తాయి.—యిర్మీయా 10:23.
గత సెప్టెంబరులో ఆ విషాద ఘటనవల్ల కలిగిన ప్రభావాలను తిరిగి అంచనా వేసిన వైజ్ఞానిక నివేదిక ఫలితాలు విడుదల చేయబడ్డాయి. ఐక్యరాజ్యసమితి నియమించిన కమీషన్ ఆ నివేదికను తయారుచేసింది, ఆ దుర్ఘటన ప్రారంభంలో 56 మందిని పొట్టనబెట్టుకుందని ఆ నివేదిక తెలియజేసింది, రేడియేషన్ వ్యాధి కారణంగా చివరకు 4,000 మంది మాత్రమే మరణించివుండవచ్చని అంచనావేసింది. 15,000 నుండి 30,000 వరకు మరణించివుండవచ్చని గతంలో వేయబడిన అంచనాలు వెల్లడి చేశాయి. ఐక్యరాజ్యసమితి నివేదికను “అణుశక్తివల్ల పొంచివున్న ప్రమాదాలను కప్పిపుచ్చడానికి చేసిన పక్షపాత ప్రయత్నంగా అనేక పర్యావరణ గుంపులు పరిగణించి, దానిపై దాడిచేశాయి” అని న్యూయార్క్ టైమ్స్‌లో 2005 సెప్టెంబరు 8న వచ్చిన సంపాదకీయం వ్యాఖ్యానించింది.
తన సృష్టికర్తయైన యెహోవా దేవుని గురించి తెలుసుకున్న విక్టర్, విపత్తు తర్వాత ఇలా వ్యాఖ్యానించాడు: “దేవుని రాజ్యం వచ్చినప్పుడు అలాంటి ఘోర దుర్ఘటనలు మళ్లీ ఇక ఎన్నడూ సంభవించవని మాకు తెలుసు కాబట్టి మేమిప్పుడు మానసికంగా కృంగిపోవడంలేదు. చెర్నోబిల్ దగ్గరున్న మా ప్రియమైన ఇంటిచుట్టూ ఉన్న పల్లె ప్రాంతాలు, ప్రస్తుత పరిస్థితి నుండి తేరుకొని అద్భుతమైన పరదైసులో భాగమయ్యే సమయం కోసం మేము ఎదురుచూస్తున్నాం.”
ప్రారంభంలో భూమ్మీదున్న పరదైసు పునఃస్థాపించబడి భూవ్యాప్తంగా విస్తరించబడుతుందనే బైబిలు వాగ్దానాన్ని చెర్నోబిల్ దుర్ఘటన సంభవించినప్పటి నుండి లక్షలాదిమంది గట్టిగా నమ్మడం ప్రారంభించారు. (ఆదికాండము 2:8, 9; ప్రకటన 21:3, 4) గత 20 సంవత్సరాల్లో, కేవలం యుక్రెయిన్‌లోనే, 1,00,000 కన్నా ఎక్కువమంది ఆ నిరీక్షణను నమ్మడం ప్రారంభించారు! దేవుని సంకల్పాల గురించి తెలుసుకోవాలనుకునేవారికి వాగ్దానం చేయబడిన ఉజ్జ్వలమైన భవిష్యత్తు గురించి ఆలోచించేలా మీరు కూడా పురికొల్పబడుదురు గాక. (g 4/06)
[అధస్సూచీలు]
^ వివిధ అధికారులు అలాంటి చిన్న యాత్రలు సురక్షితమైనవని ప్రకటించినా, తేజరిల్లు! ఆ ప్రాంతాలకు ఎలాంటి వ్యక్తిగత ప్రయాణ ప్రణాళికలను సిఫారసు చేయడంలేదు లేక సమర్థించడంలేదు.
^ తేజరిల్లు! మే 8, 1997 సంచికలోని 18-21 పేజీలు చూడండి.
[16వ పేజీలోని బాక్సు/చిత్రం]
లిక్విడేటర్లకు స్మారక చిహ్నం
ఈ నిలువెత్తు స్మారక చిహ్నం, చెర్నోబిల్ విపత్తు సంభవించిన తర్వాత శుభ్రపరిచే పనుల్లో పాల్గొన్నవారి గౌరవార్థం నిర్మించబడింది, వారు లిక్విడేటర్లు అని పిలవబడ్డారు. ఆ పనివారు మంటలను ఆర్పేసి, పొగలుకక్కుతున్న న్యూక్లియర్ కేంద్రాన్ని గట్టిగా మూసేసి, కలుషిత పదార్థాలను తొలగించారు. ఈ పనిలో లక్షలాదిమంది భాగం వహించారు. ఈ దుర్ఘటన కారణంగానే దాదాపు 4,000 మంది చనిపోయారని, చనిపోయినవారిలో చాలామంది ఆ పనివాళ్ళేనని అంచనా.
[15వ పేజీలోని చిత్రం]
చెర్నోబిల్ పట్టణం పేరు, అక్కడున్న సినిమా థియేటర్
[15వ పేజీలోని చిత్రం]
రుడ్నిక్ కుటుంబం, చెర్నోబిల్‌లో ఉన్న వారి గృహం
[16వ పేజీలోని చిత్రాలు]
రియాక్టర్‌లు కరిగిన న్యూక్లియర్ కేంద్రం, అది ప్రిపెట్‌లో ఉన్న రుడ్నిక్ కుటుంబపు ఇంటికి (ఇన్‌సెట్) దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది