కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను ఎందుకు చదవాలి?

నేను ఎందుకు చదవాలి?

యువత ఇలా అడుగుతోంది . . .

నేను ఎందుకు చదవాలి?

“నాకు చదివే ఓపిక లేదు. చదవడంకన్నా, టీవీ చూడడానికే నేను ఇష్టపడతాను.” ​—మార్గరీటా, 13, రష్యా.

“పుస్తకం చదవడం, లేదా బాస్కెట్‌ బాల్‌ ఆడడంలో ఏదో ఒకటి చేయాల్సివస్తే నేను ఆడడానికే ఇష్టపడతాను.” ​—ఆస్కర్‌, 19, అమెరికా.

మీరు ఈ వాక్యం వరకు చదవడానికి సమయం తీసుకున్నారంటే, చదవడమనే నైపుణ్యాన్ని నేర్చుకోవడం ప్రాముఖ్యమని మీరిప్పటికే గ్రహించి ఉంటారు. అయినా, బహుశా ఓ పుస్తకాన్ని లేదా పత్రికలోని శీర్షిక చదవడమనేది మాత్రలు వేసుకోవడంలా ఉంటుందని మీకు అనిపిస్తుండవచ్చు. దానివల్ల ప్రయోజనం ఉందని మీకు తెలుసు, కానీ వాటిని వేసుకోకుండా ఉండాలనే మీరు కోరుకుంటారు.

చదువుతున్నప్పుడు ఎదురయ్యే సవాళ్ల గురించి, చదవడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి యౌవనులకున్న అభిప్రాయాలను ఏమిటో తెలుసుకోవడానికి తేజరిల్లు! పత్రిక 11 దేశాల్లోని యౌవనులను ఇంటర్వ్యూ చేసింది. వారి వ్యాఖ్యానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

చదవడం మీకు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది?

“అలా చేయడానికి నాకు సమయమే దొరకడంలేదు.”—సేమ్సేహాన్‌, 19, జర్మనీ.

“చదవడం చాలా కష్టమైన పని. నేను కాస్త సోమరినని అనుకుంటున్నాను.” ​—ఎజేకియల్‌, 19, ఫిలిప్పీన్స్‌.

“విసుగు పుట్టించే అంశాల గురించి చదవమని బలవంతపెట్టబడడం నాకస్సలు ఇష్టంలేదు.”—క్రిస్టియన్‌, 15, ఇంగ్లాండ్‌.

“చిన్న పుస్తకమైతే బహుశా చదవాలనిపిస్తుందేమో, కానీ అది చాలా పెద్ద పుస్తకమైతే నాకు భయమేస్తుంది.”—ఎరికో, 18, జపాన్‌.

“ఇతర విషయాలు చాలా సులభంగా నా దృష్టిని మళ్ళిస్తాయి. నేను ఏకాగ్రత నిలపలేను.” ​—ఫ్రాన్సిస్కో, 13, దక్షిణాఫ్రికా.

క్రైస్తవ యౌవనస్థులు బైబిలు చదవాలని ప్రోత్సహించబడుతున్నారు. (కీర్తన 1:​1-3) అలా చేయడం మీకు కష్టమా? అలా అయితే, ఎందుకు?

“బైబిలు చాలా పెద్ద పుస్తకం! నా జీవితమంతా చదివినా నేను దాన్ని పూర్తి చేయలేనేమో!”—ఆన్నా, 13, రష్యా.

“బైబిల్లో కొన్ని భాగాల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, అవి అంత ఆసక్తికరంగా కూడా ఉండవు.—జెస్రీల్‌, 11, ఇండియా.

“నా సమయ పట్టిక ఎంతో క్రమరహితంగా ఉండడంవల్ల బైబిలును క్రమంగా చదవడం నాకు కష్టంగా ఉంది.”—ఎల్సా, 19, ఇంగ్లాండ్‌.

“ఇంటి పనులు అలాగే స్కూలు పని చేయడంలోనే నా సమయమంతా గడిచిపోతుంది, కాబట్టి నాకు అది ఓ సవాలుగా ఉంది.”—జురిసడాయ్‌, 14, మెక్సికో.

“నాకు ఇష్టమైన పనులు చేయడంలో వెచ్చించే సమయాన్ని నేను తగ్గించలేకపోతున్నాను, కాబట్టి బైబిలు చదవడం నాకు కష్టం.”—షో, 14, జపాన్‌.

చదవడం ఒక సవాలనే విషయం స్పష్టం. కానీ దానికోసం ప్రయాసపడడంవల్ల ఫలితమేదైనా ఉంటుందా? చదవడంవల్ల మీరెలాంటి ప్రయోజనం పొందారు?

“చదవడంవల్ల నా విషయ పరిజ్ఞానం పెరిగింది, అందుకే నేను ఇతరులతో మరింత ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నాను.”—మోనీషా, 14, ఇండియా.

“చదవడం నాకు ఉపశమనాన్నిచ్చి నా సమస్యల గురించి ఆలోచించకుండా ఉండడానికి సహాయం చేస్తుంది.—ఆలిసన్‌, 17, ఆస్ట్రేలియా.

“చదవడం ద్వారా, సందర్శించడానికి నాకెన్నటికీ వీలుకాని ప్రదేశాలకు కూడా నేను వెళ్లగలుగుతాను.”—డుయాన్‌, 19, దక్షిణాఫ్రికా.

“ఇతరులు చెప్పేదానిపై ఆధారపడకుండా, నేనే స్వయంగా విషయాలను పరిశీలించుకోవడానికి చదవడం నాకు సహాయం చేస్తుంది.”—అబీయు, 16, మెక్సికో.

చదవడాన్ని ఆస్వాదించేందుకు మీకేమి సహాయం చేసింది?

“బాల్యంనుంచే నా తల్లిదండ్రులు నన్ను బిగ్గరగా చదవమని ప్రోత్సహించారు.”—టాన్యా, 18, ఇండియా.

“నా తల్లిదండ్రులు నా ఊహాశక్తిని ఉపయోగించమని, చదువుతున్నప్పుడు, వివరించబడిన ఘటనలను మనసులో చిత్రించుకోమని నన్ను ప్రోత్సహించారు.”—డానియల్‌, 18, ఇంగ్లాండ్‌.

“నాకు మరింత ఆసక్తికరంగా అనిపించే బైబిలు పుస్తకాలు అంటే కీర్తనలు, సామెతలు వంటివి చదవడం ద్వారా బైబిలు చదవడం ప్రారంభించమని మా నాన్న సలహా ఇచ్చాడు. నాకు ఇప్పుడు బైబిలు చదవడమనేది భారంగాకాక, ఆనందాన్నిచ్చేదిగా ఉంది.”—కెరీన్‌, 16, దక్షిణాఫ్రికా.

“నాకు నాలుగు ఏండ్లు వచ్చేసరికి, నా తల్లిదండ్రులు నేను పుట్టినప్పటినుండి నా కోసం దాచిపెట్టిన పుస్తకాలన్నింటితో పుస్తకాల అరను, డెస్క్‌ను సిద్ధంచేశారు.”—ఆరి, 14, జపాన్‌.

బైబిలు చదవడం ప్రాముఖ్యమని మీరెందుకనుకుంటున్నారు?

“బైబిలు గురించిన ఎన్నో తప్పుడు విషయాలను ప్రజలు నమ్ముతున్నారు. ఆ విషయాల్ని మీరే స్వయంగా పరిశీలించుకోగలిగితే చాలా మంచిది.” (అపొస్తలుల కార్యములు 17:11)​—మాథ్యూ, 15, అమెరికా.

“బైబిలును అర్థం చేసుకోవడానికి చాలా ధ్యానించాల్సి ఉంటుంది. కానీ, దాన్ని చదవడంవల్ల నేను నా నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో నా అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నాను.” (1 తిమోతి 4:​13)​—జేన్‌, 19, ఇంగ్లాండ్‌.

“నేను బైబిలు చదువుతున్నప్పుడు యెహోవా నాతో నేరుగా మాట్లాడుతున్నాడనిపిస్తుంది. అది కొన్నిసార్లు నా మనోభావాల్ని ప్రభావితం చేస్తుంది. (హెబ్రీయులు 4:​12)​—ఒబదియా, 15, ఇండియా.

“బైబిలు, యెహోవా నా గురించి ఏమనుకుంటున్నాడో నాకు తెలియజేస్తుంది, నాకు మంచి మార్గనిర్దేశాన్నిస్తుంది, కాబట్టి నేను బైబిలు చదవడాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటున్నాను.” (యెషయా 48:17, 18)​—విక్టోర్యా, 14, రష్యా.

బైబిలు, బైబిలు సాహిత్యం చదవడానికి మీకు సమయం ఎప్పుడు దొరుకుతుంది?

“నాకు ఒక సమయ పట్టిక ఉంది. నేను ప్రతీ ఉదయం లేచినవెంటనే మొదటిగా బైబిల్లోని ఒక అధ్యాయం చదువుతాను.”—లాయిస్‌, 17, బ్రెజిల్‌.

“నేను స్కూలుకు ప్రయాణిస్తున్నప్పుడు ట్రెయిన్‌లో బైబిలు, ఇతర క్రైస్తవ సాహిత్యాలు చదువుతాను. గత నాలుగు సంవత్సరాలుగా నేను ఇలాగే చేయగలుగుతున్నాను.”—టాయిచి, 19, జపాన్‌.

“నేను నిద్రపోయేముందు ప్రతీరాత్రి బైబిల్లో కొంతభాగాన్ని చదువుతాను.”—మారియా, 15, రష్యా.

“నేను ప్రతీరోజు కావలికోట లేదా తేజరిల్లు! పత్రికల్లోని నాలుగు పేజీలు చదువుతాను. తదుపరి సంచికలు వచ్చేలోపు నేను వాటిని పూర్తి చేయగలుగుతున్నాను.”—ఎరికో, 18, జపాన్‌.

“నేను ప్రతీ ఉదయం స్కూలుకు వెళ్లేముందు బైబిలు చదువుతాను.”—జేమ్స్‌, 17, ఇంగ్లాండ్‌.

పైన పేర్కొనబడినట్లుగా, చదవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడంలో కూడా అది సహాయం చేస్తుంది. బైబిలు చదవడం, ఈ పత్రికతోసహా ఇతర బైబిలు ఆధారిత సాహిత్యాలు చదవడం మీరు ‘దేవునికి సన్నిహితమవడానికి’ కూడా సహాయం చేస్తుంది. (యాకోబు 4:8) కాబట్టి, చదవడం మీకు సవాలుగా ఉన్నా, పట్టువదలకండి! (g 5/06)

వీటి గురించి ఆలోచించండి

◼ మీరు దేవుని వాక్యం చదవడం ఎందుకు ప్రాముఖ్యం?

◼ బైబిలు, బైబిలు సాహిత్యాన్ని చదవడానికి వీలుగా మీరు ఎలా ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకోవచ్చు?​—ఎఫెసీయులు 5:​15.

[22వ పేజీలోని బాక్సు]

చదివిన విషయాల్ని, తెలిసిన విషయాలతో ముడిపెట్టండి

మీ గురించీ, మీ పరిసరాల గురించీ మీకు ఇప్పటికే ఉన్న పరిజ్ఞానాన్ని, మీరు చదివే విషయాలతో ముడిపెట్టండి. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి:

చదువుతున్నదాన్ని-చదివేసినదానితో ముడిపెట్టడం నేను ప్రస్తుతం చదువుతున్నదానిలో వివరించబడిన సన్నివేశాలు, సమస్యలు నేను ముందే చదివేసిన పుస్తకాల్లో, పత్రికల్లో లేదా కథల్లో వర్ణించబడిన వాటిని పోలి ఉన్నాయా? నేను చదివిన పుస్తకాల్లోని పాత్రలకున్న గుణాలే ఈ పుస్తకంలోని పాత్రలకు కూడా ఉన్నాయా?

చదివేదానితో మీ పరిస్థితుల్ని పోల్చుకోండి ఈ సమాచారం నా పరిస్థితులకు, నా సంస్కృతికి, నా సమస్యలకు ఎలా వర్తిస్తుంది? నా సమస్యలు పరిష్కరించుకోవడానికి లేదా నా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి నేనీ సమాచారాన్ని ఉపయోగించగలనా?

చదివేదాన్ని మీ పరిసరాలతో పోల్చుకోండి నేను చదువుతున్న సమాచారం ప్రకృతి గురించి, పర్యావరణం గురించి, విభిన్న సంస్కృతుల గురించి లేదా సమాజంలోని సమస్యల గురించి నాకేమి నేర్పిస్తుంది? ఈ సమాచారం సృష్టికర్త గురించి నాకేమి బోధిస్తోంది?