కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రజస్వల అవడానికి ముందే మీ అమ్మాయికి అన్నీ వివరించండి

రజస్వల అవడానికి ముందే మీ అమ్మాయికి అన్నీ వివరించండి

రజస్వల అవడానికి ముందే మీ అమ్మాయికి అన్నీ వివరించండి

యౌవనారంభ దశ అనేక మార్పులను తీసుకొస్తుంది. ఎదిగే ఈ వయసులో అమ్మాయిలు రజస్వలవుతారు, అది “ఋతుస్రావ ఆరంభం” అని నిర్వచించబడుతోంది.

రజస్వలయ్యే సమయం అమ్మాయిలకు చాలా ఒత్తిడితో కూడిన సమయంగా ఉంటుంది, వాళ్ళు సాధారణంగా ఈ పరిస్థితిని అయోమయ భావాలతో ఎదుర్కొంటారు. యౌవనారంభ దశలో కలిగే అనేక ఇతర మార్పుల్లాగే ఇది కూడా కలవరపరిచేదిగా ఉంటుంది. విషయం సరిగా తెలియక లేదా చాలా సందర్భాల్లో అసలేమీ తెలియక చాలామంది అమ్మాయిలు మొదటిసారి ఋతుస్రావమైనప్పుడు ఎంతో భయానికి, వ్యాకులతకు గురవుతారు.

రజస్వలకు సంబంధించిన విషయాలు తెలుసుకుని సిద్ధంగావున్న అమ్మాయిలు సాధారణంగా మొదటిసారి ఋతుస్రావమైనప్పుడు దాన్ని చాలా అనుకూలభావంతో దృష్టిస్తారు. అయితే, చాలామంది అమ్మాయిలు అలా సిద్ధంగావుండడం లేదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఒక సర్వేలో 23 దేశాలకు చెందినవారిని అడిగినప్పుడు, వారిలో దాదాపు మూడింట ఒక వంతుమంది రజస్వలవ్వడం గురించి తమకు ముందుగా తెలియజేయబడలేదని చెప్పారు. ఏమీ తెలియక సిద్ధంగా లేనందున, రజస్వలైనప్పుడు ఏంచేయాలో ఆ అమ్మాయిలకు తెలియలేదు.

ఋతుస్రావం గురించి లేదా రజస్వలవ్వడం గురించి ముందు ఏమీ తెలియని స్త్రీలు చాలా ప్రతికూలమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లు నివేదించారు. ఒక అధ్యయనంలో, స్త్రీలు తాము రజస్వలైన సమయం గురించి వివరించడానికి “భీతిచెందాను,” “ఆందోళనచెందాను,” “కలవరపడ్డాను,” “భయపడిపోయాను” వంటి మాటల్ని ఉపయోగించారు.

సాధారణంగా రక్తం చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. ఎందుకంటే రక్తస్రావంతోపాటు సాధారణంగా నొప్పి, బాధ ఉంటాయి. కాబట్టి, సరైన వివరణ లేదా సిద్ధపాటు లేనప్పుడు, సంస్కృతిపరమైన స్థిరాభిప్రాయాలు, ఊహాకల్పితాలు, లేక చివరికి అజ్ఞానం వంటివి ఋతుస్రావమనేది జబ్బుకూ లేదా గాయానికీ సంబంధించిందని తప్పుగా భావించేలానో, అది సిగ్గుపడవలసిన విషయంగా దృష్టించేలానో చేస్తాయి.

ఆరోగ్యవంతులైన అమ్మాయిలందరికీ సర్వసాధారణంగా ఋతుస్రావమవుతుందని మీ అమ్మాయి తెలుసుకోవాలి. తల్లిదండ్రులుగా మీరు, ఆమెకేవైనా ఆందోళనలు, భయాలు ఉంటే వాటిని పోగొట్టడానికి సహాయం చేయవచ్చు. ఎలా?

తల్లిదండ్రుల పాత్ర ప్రాముఖ్యమైనది

ఋతుస్రావానికి సంబంధించిన సమాచారాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, ముద్రిత సమాచారం, చివరికి విద్యాసంబంధిత చలనచిత్రాలు వంటి అనేక మూలాల నుండి పొందవచ్చు. ఈ సమాచార మూలాలు సాధారణంగా ఋతుస్రావానికి సంబంధించిన శారీరక విధుల గురించి, అలాగే ఋతుస్రావ సంబంధిత పరిశుభ్రత గురించి చాలా విలువైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు చాలామంది తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అయినా, అమ్మాయిలకు ఈ సమాచార మూలాలు ప్రస్తావించని ప్రశ్నలు, అవసరాలు ఉండవచ్చు. ఋతుస్రావమైనప్పుడు ఏమి చేయాలో తెలిసినా అమ్మాయిలు తరచూ ఋతుస్రావ సంబంధిత వివిధ భావోద్వేగాలతో, భావాలతో ఎలా వ్యవహరించాలో తెలియక తికమక పడుతుంటారు.

అమ్మమ్మలు, నానమ్మలు, అక్కలు, ప్రాముఖ్యంగా తల్లులు ఆ అమ్మాయిలకు అవసరమైన అదనపు సమాచారాన్ని, భావోద్వేగ మద్దతును అందజేసి సహాయం చేయవచ్చు. చాలా తరచుగా అమ్మాయిలు ఋతుస్రావ సంబంధిత సమాచారాన్ని తమ తల్లి అయితే బాగా తెలియజేస్తుందని భావిస్తారు.

మరి తండ్రుల మాటేమిటి? చాలామంది అమ్మాయిలు ఋతుస్రావం గురించి వారితో మాట్లాడడానికి సిగ్గుపడతారు. మద్దతునివ్వడం ద్వారా, అర్థంచేసుకోవడం ద్వారా తమ తండ్రులు పరోక్షంగా సహాయం చేయాలని కొందరు కోరుకుంటే, ఇతరులు ఆయన ఈ విషయాలకు దూరంగా ఉంటే మంచిదని భావిస్తారు.

అనేక దేశాల్లో తండ్రి మాత్రమే ఉండే కుటుంబాలు గత కొద్ది దశాబ్దాల్లో అధికమయ్యాయి. * కాబట్టి, చాలామంది తండ్రులు తమ అమ్మాయిలకు ఋతుస్రావం గురించి వివరించడమనే సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ తండ్రులు ఋతుస్రావ సంబంధిత మౌలికాంశాల గురించి, అలాగే తమ కుమార్తెల్లో కలుగుతున్న ఇతర శారీరక భావోద్వేగ మార్పుల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. తండ్రులు ఈ విషయంలో ఆచరణయోగ్యమైన సలహా కోసం, సహాయం కోసం తమ సొంత తల్లులను లేదా అక్కాచెల్లెళ్ళను సంప్రదించవచ్చు.

వివరించడం ఎప్పుడు ప్రారంభించాలి?

అమెరికా, దక్షిణ కొరియా, పశ్చిమ యూరప్‌లోని కొన్ని భాగాలు వంటి పారిశ్రామిక దేశాల్లో, సాధారణంగా రజస్వలయ్యే వయసు 12 నుండి 13 సంవత్సరాలు, అయితే అది 8 ఏళ్ళ వయసంత త్వరగానూ 16, 17 ఏళ్ళ వయసంత ఆలస్యంగానూ రావచ్చు. ఆఫ్రికా ఆసియాల్లోని కొన్ని భాగాల్లో, రజస్వలయ్యే సగటు వయసు కాస్త ఎక్కువ. ఉదాహరణకు, నైజీరియాలో సగటు వయసు 15 సంవత్సరాలు. జన్యువులు, ఆర్థిక స్థోమత, పోషణ, శారీరక కార్యకలాపాలు, నివసిస్తున్న ప్రదేశం సముద్రమట్టానికి ఎంత ఎత్తున ఉందనే విషయం వంటి వివిధ అంశాలు రజస్వలయ్యే వయసుపై ప్రభావం చూపిస్తాయి.

మీ అమ్మాయి రజస్వల అవకముందే ఆమెకు ఆ విషయం వివరించడం ప్రారంభిస్తే మంచిది. కాబట్టి, చాలా చిన్న వయసులోనే అంటే, మీ అమ్మాయి దాదాపు ఎనిమిదేళ్ళ వయసులో ఉండగానే, శారీరక మార్పుల గురించి ఋతుస్రావం గురించి ఆమెకు వివరించడం ప్రారంభిస్తే మంచిది. ఇది చాలా చిన్న వయసని మీరనుకోవచ్చు, కానీ మీ అమ్మాయి ఎనిమిది పది సంవత్సరాల మధ్య వయసులో ఉంటే, ఆమె శరీరం హార్మోన్ల పెరుగుదలకు ప్రతిస్పందనగా అప్పటికే అంతర్గతంగా పరిపక్వత చెందడం మొదలైవుంటుంది. ఛాతి పెరగడం, శరీర రోమాలు అధికమవడం వంటి యౌవనారంభ సంబంధిత బాహ్య శారీరక మార్పులను మీరు గమనించగలుగుతారు. చాలామంది అమ్మాయిలు రజస్వలవ్వడానికి ముందు హఠాత్తుగా (ఎత్తు, బరువు చాలా త్వరగా) పెరిగిపోతారు.

విషయాన్ని ఎలా వివరించాలి?

రజస్వల వయసుకు చేరుకుంటున్న అమ్మాయిలు సాధారణంగా ఏమి జరుగుతుందా అనే ఉత్సుకతతో ఉంటారు. పాఠశాలలో ఇతర అమ్మాయిలు ఆ విషయం గురించి మాట్లాడుకోవడం వాళ్ళు విని ఉండవచ్చు. వాళ్ళకు ప్రశ్నలు ఉండవచ్చు గానీ దాని గురించి సరిగ్గా ఎలా అడగాలనేది వారికి తెలియకపోవచ్చు. ఆ విషయం గురించి వాళ్ళు కలతపడుతుండవచ్చు.

తల్లిదండ్రుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సాధారణంగా ఋతుస్రావ సంబంధిత సమాచారాన్ని తల్లులే చక్కగా తెలియజేయగల స్థానంలో ఉన్నా, ఈ విషయం గురించి మాట్లాడవలసి వచ్చేసరికి తరచూ వారు తాము తగినంత సిద్ధంగా లేనట్లు భావిస్తారు, ఇబ్బందిపడతారు. బహుశా మీరు కూడా అలాగే భావిస్తుండవచ్చు. కాబట్టి రజస్వలవడం గురించి, ఋతుస్రావం గురించి మీరు మీ అమ్మాయితో సంభాషణ ఎలా ప్రారంభిస్తారు?

రజస్వలయ్యే వయసుకు చేరుకుంటున్న అమ్మాయిలు సరళమైన, నిర్దిష్టమైన సమాచారాన్ని అర్థంచేసుకోగలుగుతారు. అలాంటి సమాచారంలో, ఋతుస్రావం ఎంత తరచుగా అవుతుంది, ఎంత కాలంపాటు అవుతుంది, లేక ఎంత రక్తం పోతుంది వంటివి ఉండవచ్చు. కాబట్టి, ఋతుస్రావ సంబంధిత విషయాల గురించి మాట్లాడే తొలి దశల్లో, ఋతుస్రావంతో ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించిన సత్వర, ఆచరణయోగ్య అంశాలపై అవధానముంచడం మంచిది. అంతేగాక, రక్తస్రావమవుతున్నప్పుడు ఎలా ఉంటుంది? లేక ఏమి జరుగుతుందని ఎదురుచూడాలి వంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పవలసి ఉండవచ్చు.

తర్వాత, మీరు ఋతుస్రావం ఎలా అవుతుందనే వివరాలను చర్చించాలనుకోవచ్చు. తరచూ, మీరు ఆరోగ్య కార్యకర్తల నుండి లేదా గ్రంథాలయం నుండి, పుస్తకాల దుకాణం నుండి విద్యా సంబంధిత సమాచారాన్ని సంపాదించుకోవచ్చు. విషయాలను వివరించడంలో అలాంటి పుస్తకాలు సహాయకరంగా ఉండవచ్చు. కొంతమంది అమ్మాయిలు ఈ పుస్తకాలు వ్యక్తిగతంగా చదువుకోవాలనుకోవచ్చు. మరి కొంతమంది అమ్మాయిలు మీరు వారితో కలిసి ఆ సమాచారాన్ని చదవాలని ఇష్టపడుతుండవచ్చు.

సంభాషణ ప్రారంభించడానికి ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. పెరిగి పెద్దవారవడం గురించి చెబుతూ సరళంగా చర్చ ప్రారంభించండి. బహుశా మీరిలా చెప్పవచ్చు: “త్వరలోనే ఏదోకరోజు నువ్వు అమ్మాయిలందరికీ సాధారణంగా ఎదురయ్యే ఒక పరిస్థితిని ఎదుర్కొంటావు. అదేమిటో నీకు తెలుసా?” లేక తల్లి వ్యక్తిగతంగా ఇలా వ్యాఖ్యానిస్తూ ప్రారంభించవచ్చు: “నేను నీ వయసులో ఉన్నప్పుడు, బహిష్టయితే ఎలా ఉంటుందో అనుకునేదాన్ని. నేను, నా స్నేహితురాళ్ళు దాని గురించి స్కూల్లో మాట్లాడుకునేవాళ్ళం. మీ స్నేహితురాళ్ళు కూడా దాని గురించి మాట్లాడ్డం మొదలుపెట్టారా?” ఋతుస్రావం గురించి ఆమెకు అప్పటికే ఏమి తెలుసో అడిగి, ఏవైనా అపోహలుంటే తొలగించండి. మీ తొలి సంభాషణల్లో అంతా కాకపోయినా, ఎక్కువగా మీరే మాట్లాడవలసి ఉంటుందని గ్రహించి అందుకు సిద్ధంగా ఉండండి.

ఈ విషయాన్ని చర్చించేటప్పుడు, ఒక స్త్రీగా మీరు రజస్వలైన సమయంలో అనుభవించిన వ్యాకులతను, చింతను గుర్తుతెచ్చుకుని ఆ విషయాల గురించి మాట్లాడవచ్చు. మీరు ఏమి తెలుసుకోవాలి? ఏమి తెలుసుకోవాలనుకున్నారు? మీకు ఎలాంటి సమాచారం సహాయపడింది? ఋతుస్రావం గురించిన అనుకూల, అననుకూల అంశాల గురించి సమతుల్య దృక్కోణాన్ని అందజేయడానికి కృషి చేయండి. ప్రశ్నలకు తప్పక సమాధానం చెప్పండి.

కొనసాగే ప్రక్రియ

ఋతుస్రావ సంబంధిత విద్యను, ఒకసారి చెబితే సరిపోతుందిలే అని భావించే బదులు, కొనసాగే ప్రక్రియగా దృష్టించండి. మీరు ఒకేసారి వివరాలన్నీ మాట్లాడేయవలసిన అవసరం లేదు. చిన్నపిల్లలకు ఒకేసారి ఎక్కువ విషయాలు చెప్పేస్తే ఉక్కిరిబిక్కిరైపోవచ్చు. పిల్లలు దశలవారీగా విషయాలు తెలుసుకుంటారు. అంతేగాక, సమాచారాన్ని వివిధ సందర్భాల్లో పదే పదే చెప్పడం అవసరం కావచ్చు. అమ్మాయిలు ఎదుగుతుండగా, అదనపు వివరాలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు.

మరో విషయమేమిటంటే, కౌమారప్రాయమంతటిలోనూ ఋతుస్రావం విషయంలో అమ్మాయిల దృక్కోణం మారుతూనే ఉంటుంది. మీ అమ్మాయికి బహిష్టుల సంబంధంగా మరికాస్త అనుభవం వచ్చిన తర్వాత, ఆమెకు బహుశా వేరే చింతలు, ప్రశ్నలు తలెత్తవచ్చు. కాబట్టి, మీరు ఆమెతో సమాచారం పంచుకోవడం కొనసాగిస్తూ, ఆమె ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. మీ అమ్మాయి వయసుకు, అర్థం చేసుకునే సామర్థ్యానికి తగట్టుగా ఎలా చెబితే అర్థవంతంగా, సముచితంగా ఉంటుందనే దానిపై దృష్టి కేంద్రీకరించండి.

చొరవ తీసుకోండి

కానీ మీ అమ్మాయికి ఈ విషయంలో ఆసక్తి లేనట్లు అనిపిస్తే ఏం చేయాలి? బహుశా ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడ్డానికి సంకోచిస్తోందేమో. లేక నిస్సంకోచంగా ప్రశ్నలు అడగడానికి బహుశా ఆమెకు కాస్త సమయం కావాలేమో. లేక తెలుసుకోవలసినదంతా తాను ఇప్పటికే తెలుసుకున్నానని కూడా ఆమె చెబుతుండవచ్చు.

అమెరికాలో, ఆరవ తరగతి అమ్మాయిలపై నిర్వహించబడిన ఒక అధ్యయనంలో, చాలామంది అమ్మాయిలు తాము రజస్వలవ్వడానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుని, దాని కోసం సిద్ధపడివున్నట్లు భావించారు. అయితే, మరింత ప్రశ్నించిన తర్వాత, వారికి విషయం అంతా తెలియదనీ, సంస్కృతిపరమైన స్థిరాభిప్రాయాలపై, ఊహాకల్పితాలపై ఆధారపడిన అనేక అపోహలను వారు అప్పటికే నిజాలని నమ్ముతున్నారనీ వెల్లడయ్యింది. కాబట్టి మీ అమ్మాయి తాను రజస్వలవడానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుని దాని కోసం సిద్ధపడివున్నానని చెప్పినా, దాని గురించి మీరు ఆమెతో మాట్లాడ్డం అవసరం.

మీరు చొరవ తీసుకుని అప్పుడప్పుడూ కాస్సేపు ఋతుస్రావం గురించి మాట్లాడాలి, తరచూ అలా మాట్లాడుతూ ఉండాలి. నిజంగా, అది తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మీ సహాయం అవసరమని మీ కుమార్తె ఆ సమయంలో అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆమెకు మీ సహాయం అవసరం. మీకు చికాకు, అసమర్థతా భావాలు కలుగవచ్చు, అయినా విడిచిపెట్టకండి. ఓర్పు వహించండి. కొంతకాలానికి, మీ ప్రయత్నాలు ఎంత విలువైనవో మీ అమ్మాయి నిస్సందేహంగా గుర్తిస్తుంది. (g 5/06)

[అధస్సూచి]

^ జపాన్‌లో తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలు 2003లో అత్యధికమయ్యాయి. అమెరికాలో, తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న ప్రతీ 6 కుటుంబాల్లో ఒకటి తండ్రి మాత్రమే ఉన్న కుటుంబంగా ఉంటోంది.

[11వ పేజీలోని బ్లర్బ్‌]

మీ అమ్మాయి రజస్వలవ్వకముందే ఆమెకు ఆ విషయాలను వివరించడం మంచిది

[13వ పేజీలోని బాక్సు]

ఋతుస్రావం గురించి మీ అమ్మాయితో ఎలా మాట్లాడాలి?

ఆమెకు ఇప్పటికే ఏం తెలుసో అడగండి. అపోహలను తొలగించండి. విషయం గురించి మీరు, మీ అమ్మాయి సరైన సమాచారాన్ని పొందేలా జాగ్రత్త వహించండి.

మీ అనుభవాన్ని పంచుకోండి. రజస్వల విషయంలో మీ అనుభవం గురించి ఆలోచించడం ద్వారా, దాన్ని మీ అమ్మాయితో పంచుకోవడం ద్వారా మీరు ఆమెకు ఎంతో అవసరమైన భావోద్వేగ మద్దతును ఇవ్వగలుగుతారు.

ఆచరణయోగ్యమైన సమాచారాన్ని అందజేయండి. అమ్మాయిలు అడిగే సాధారణ ప్రశ్నలేమిటంటే: “స్కూల్లో ఉన్నప్పుడు బహిష్టయితే ఏం చేయాలి?” “నేను ఏ శానిటరీ నాప్‌కిన్స్‌ వాడాలి?” “వాటినెలా వాడాలి?”

వాస్తవాలను సరళంగా వివరించండి. మీ అమ్మాయి వయసుకు, దాన్ని అర్థం చేసుకోవడంలో ఆమె సామర్థ్యానికి అనుగుణంగా సమాచారాన్ని మలచండి.

తెలుసుకుంటూ ఉండడాన్ని ప్రోత్సహించండి. రజస్వలవ్వకముందే మీ అమ్మాయితో ఆ విషయాల గురించి మాట్లాడండి, రజస్వలైన తర్వాత కూడా అవసరాన్నిబట్టి ఆ సంభాషణలు కొనసాగించండి.

[12వ పేజీలోని చిత్రం]

అర్థం చేసుకునేవారిగా ఉండండి. మీ అమ్మాయి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడ్డానికి సంకోచిస్తుండవచ్చు