కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమాధానపరులుగా ఉండడం ఆచరణాత్మకమైనదేనా?

సమాధానపరులుగా ఉండడం ఆచరణాత్మకమైనదేనా?

బైబిలు ఉద్దేశము

సమాధానపరులుగా ఉండడం ఆచరణాత్మకమైనదేనా?

అత్యంత ప్రఖ్యాతిగాంచిన తన ప్రసంగంలో యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “సమాధానపరచువారు ధన్యులు.” “సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” అని కూడా ఆయన అన్నాడు. (మత్తయి 5:​5, 9) సమాధానపరులుగా ఉండడమంటే ఇతరులతో సమాధానకరంగా ఉండడం, లేదా మనం మాత్రమే ప్రశాంతంగా ఉండడం కాదు. సమాధానపరునిగా ఉండే వ్యక్తి ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండేందుకు చొరవ తీసుకోవడమేకాక, ఇతరులతో శాంతిని నెలకొల్పడానికి చురుకుగా కృషి చేస్తాడు.

పైన ఉల్లేఖించబడిన యేసు మాటలు మన కాలంలో ఆచరణసాధ్యమైనవేనా? ఈ ఆధునిక ప్రపంచంలో విజయం సాధించాలంటే, ఒక వ్యక్తి ఇతరుల్ని భయపెట్టేవారిగా, కోపోద్రేకిగా, చివరికి దౌర్జన్యం చేసేవానిగా కూడా ఉండాలని కొందరు అనుకుంటారు. కీడుకు ప్రతికీడు, ఉద్రేకానికి ప్రతిగా ఉద్రేకంతోనే వ్యవహరించడం జ్ఞానయుక్తమైనదేనా? లేదా సమాధానపరులుగా ఉండడం ఆచరణాత్మకమైనదా? “సమాధానపరచువారు ధన్యులు” అని యేసు పలికిన మాటల గురించి మనమెందుకు ధ్యానించాలో చూపించే మూడు కారణాలను పరిశీలిద్దాం.

◼ సాత్వికమైన మనస్సు “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము” అని సామెతలు 14:30 చెబుతోంది. కోపం, ద్వేషం అనేవి స్ట్రోక్‌కు, గుండెపోటుకు కారకాలు కాగలవని ఎన్నో వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. గుండె జబ్బులతో బాధపడుతున్నవారి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇటీవలి ఒక వైద్య సంబంధ పత్రిక, విపరీతమైన కోపాన్ని విషంతో పోల్చింది. ఆ పత్రిక ఇలా కూడా వ్యాఖ్యానించింది: “విపరీతంగా కోపపడడం అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.” కానీ, సమాధానాన్ని నెలకొల్పడానికి కృషి చేసేవారు మాత్రం “సాత్వికమైన మనస్సు” పెంపొందించుకొని ప్రయోజనాలను చవిచూస్తారు.

వియత్నామీయుల సమాజంలో ప్రస్తుతం బైబిలు బోధకునిగా ఉన్న 61 ఏండ్ల జిమ్‌ దానికి ఓ ఉదాహరణ. ఆయనిలా వివరిస్తున్నాడు: “ఆరు సంవత్సరాలు మిలటరీలో పనిచేసి, మూడుసార్లు వియత్నామ్‌లో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్న తర్వాత నాకు దౌర్జన్యం, కోపం, అసహనం అంటే ఏమిటో బాగా తెలిశాయి. నా గతజీవిత ఛాయలు నన్ను వేధించి, నాకు నిద్ర లేకుండా చేసేవి. కొంతకాలానికే, ఒత్తిడి పెరిగింది, కడుపు, నరాలకు సంబంధించిన వ్యాధులు నన్ను అనారోగ్యానికి గురిచేశాయి.” ఆయనకేది ఉపశమనాన్నిచ్చింది? ఆయనిలా జవాబిస్తున్నాడు: “యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం నా ప్రాణాల్ని కాపాడింది. శాంతియుతమైన నూతనలోకానికి సంబంధించిన దేవుని సంకల్పాన్ని గురించి తెలుసుకోవడంవల్ల, ‘నవీన స్వభావాన్ని’ ఎలా ధరించుకోవాలో తెలుసుకోవడంవల్ల ప్రశాంత మనస్సును పొందాను. తత్ఫలితంగా నా ఆరోగ్యం ఎంతో మెరుగయ్యింది.” (ఎఫెసీయులు 4:22-24; యెషయా 65:17; మీకా 4:1-4) సమాధాన వైఖరి పెంపొందించుకోవడంవల్ల మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగవుతుందని అనేకమంది ఇతరులు కూడా స్వీయానుభవం నుండి తెలుసుకున్నారు.​—సామెతలు 15:13.

◼ సంతోషభరిత సంబంధాలు మనం సమాధాన వైఖరిని ప్రదర్శించినప్పుడు ఇతరులతో మనకున్న సంబంధాలు మెరుగవుతాయి. ‘కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణను, సకలమైన దుష్టత్వాన్ని విసర్జించాలి’ అని బైబిలు నిర్దేశిస్తోంది. (ఎఫెసీయులు 4:​31) దౌర్జన్యపూరితంగా ప్రవర్తించేవారు తరచూ ఇతరుల్ని దూరం చేసుకుని, ఆధారపడదగిన స్నేహితులు లేకుండా ఒంటరిగా మిగిలిపోతారు. సామెతలు 15:18 ఇలా వ్యాఖ్యానిస్తుంది: “కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.”

న్యూయార్క్‌ నగరంలో క్రైస్తవ పెద్దగా ఉన్న 42 ఏండ్ల ఆండీ, దౌర్జన్యపూరిత వాతావరణంలో పెరిగాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “ఎనిమిది సంవత్సరాల వయస్సులో నాకు బాక్సింగ్‌ చేయడంలో శిక్షణ ఇవ్వబడింది. ప్రత్యర్థులు కూడా మనుష్యులే అనే తలంపు నాకు వచ్చేది కాదు. బదులుగా ‘దెబ్బవేయి లేదా దెబ్బతిను’ అనే ఆలోచనే ఉండేది. ఆ తర్వాత నేను ఓ గ్యాంగ్‌లో చేరాను. మేము ఎన్నోసార్లు వీధి పోరాటాల్లో, హింసాయుతమైన పోరాటాల్లో పాల్గొనేవాళ్లం. ఇతరులు నా తలకి తుపాకీ గురిపెట్టడాన్ని, నాపైకి కత్తిదూయడాన్ని ఎదుర్కొన్నాను. అనేకమందితో నా స్నేహం సమస్యలతో, భయంతో నిండి ఉండేది.”

ఆండీ సమాధానం నెలకొల్పడానికి కృషి చేసేలా ఏది సహాయం చేసింది? ఆయనిలా చెబుతున్నాడు: “నేనొకరోజు యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో కూటానికి వెళ్ళాను, అక్కడి ప్రజల్లో ఉన్న ప్రేమపూర్వక వైఖరిని నేను వెంటనే గుర్తించగలిగాను. అప్పటినుండి, సమాధానాన్ని ప్రేమించే ఈ ప్రజలతో నేను చేసిన సహవాసం, నేను ప్రశాంతమైన మనసు పెంపొందించుకోవడానికి నాకు సహాయం చేసింది, క్రమంగా అది నా గత ఆలోచనా విధానాన్ని మార్చేసింది. నేను ఎంతోమంది చిరకాల స్నేహితులను సంపాదించుకొన్నాను.”

◼ భవిష్యత్‌ నిరీక్షణ సమాధానపరులుగా ఉండడానికున్న అత్యంత ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, అలా ఉండడంవల్ల మనం మన సృష్టికర్త వెల్లడిచేసిన చిత్తాన్ని గౌరవించి ఘనపరుస్తాం. దేవుని స్వంత వాక్యమైన బైబిలు మనల్ని ఇలా ప్రోత్సహిస్తోంది: “సమాధానము వెదకి దాని వెంటాడుము.” (కీర్తన 34:14) యెహోవా దేవుని ఉనికిని గుర్తించి, జీవాన్నిచ్చే ఆయన బోధలను తెలుసుకోవడం, వాటి ప్రకారం నడుచుకోవడం, ఆయనతో వ్యక్తిగత స్నేహాన్ని నెలకొల్పుకోవడాన్ని సాధ్యం చేస్తుంది. ఆ బలమైన సంబంధం ఉంటే, “దేవుని సమాధానము” మనకు లభిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ శ్రేష్ఠమైన సమాధానాన్ని ఎవరూ తీసివేయలేరు.​—ఫిలిప్పీయులు 4:6, 7.

అంతేగాక, మనం సమాధానకరంగా ఉండడం ద్వారా మనం ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నామో యెహోవాకు చూపిస్తాం. ఆయన వాగ్దానం చేసిన శాంతియుతమైన నూతనలోకానికి చెందిన ప్రమాణాలకు అనుగుణంగా జీవించగలమని దేవునికి మనం ఇప్పుడే రుజువు చేయవచ్చు. యేసు చెప్పినట్లుగా, ఆయన భక్తిహీనుల్ని నిర్మూలించి, దీనులు ‘భూమిని స్వతంత్రించుకొనేలా’ చేసినప్పుడు దాన్ని చూడడానికి మనం అక్కడ ఉండవచ్చు. అది ఎంతటి ఆశీర్వాదమో కదా!​—కీర్తన 37:10, 11; సామెతలు 2:20-22.

అవును, “సమాధానపరచువారు ధన్యులు” అని యేసు పలికిన మాటలు ఆచరించడం ఎంత ప్రాముఖ్యమో స్పష్టంగా చూడగలం. మనం ప్రశాంతమైన మనసును, మంచి సంబంధాలను, భవిష్యత్తుకోసం దృఢమైన నిరీక్షణను అనుభవించవచ్చు. “సమస్త మనుష్యులతో సమాధానముగా” ఉండడానికి మనం శాయశక్తులా ప్రయత్నిస్తే ఆ ఆశీర్వాదాలు మన సొంతమవుతాయి.​—రోమీయులు 12:18. (g 5/06)

[28వ పేజీలోని చిత్రాలు]

“నా ఆరోగ్యం ఎంతో మెరుగయ్యింది.”​—జిమ్‌

[29వ పేజీలోని చిత్రాలు]

“నేను ఎంతోమంది చిరకాల స్నేహితులను సంపాదించుకొన్నాను.”​—ఆండీ