ఒక జీవరసాయన శాస్త్రజ్ఞునితో జరిపిన ఇంటర్వ్యూ
ఒక జీవరసాయన శాస్త్రజ్ఞునితో జరిపిన ఇంటర్వ్యూ
మైఖెల్ జె. బిహి ప్రస్తుతం అమెరికాలో ఉన్న, పెన్సిల్వేనియాలోని లెహిగ్ విశ్వవిద్యాలయంలో జీవరసాయనశాస్త్ర పండితునిగా పనిచేస్తున్నారు. ఆయన 1996లో డార్విన్స్ బ్లాక్ బాక్స్—ద బయోకెమికల్ ఛాలెంజ్ టు ఎవల్యూషన్ అనే స్వీయ పుస్తకాన్ని విడుదల చేశాడు. తేజరిల్లు! (ఆంగ్లం) మే 8, 1997 సంచికలో, “మనం ఇక్కడికి ఎలా వచ్చాం? యాదృచ్ఛికంగానా లేక రూపకల్పన ద్వారానా?” అనే శీర్షికలతో ప్రచురించబడిన ఆర్టికల్స్ పరంపరలో బిహి వ్రాసిన పుస్తకమే ఉదాహరించబడింది. డార్విన్స్ బ్లాక్ బాక్స్ పుస్తకం ప్రచురించబడిన తర్వాత గడిచిన దశాబ్దంలో పరిణామ సిద్ధాంతవేత్తలు బిహి లేవనెత్తిన వాగ్వాదాలను ఖండించేందుకు ఎంతో ప్రయత్నించారు. బిహి రోమన్ క్యాథలిక్ కాబట్టి, ఆయన విజ్ఞానపరంగా చేసే నిర్ధారణలను తన మత నమ్మకాలు ప్రభావితం చేసేందుకు అనుమతించాడని వారు ఆరోపించారు. ఆయన తర్కం విజ్ఞానశాస్త్రానికి విరుద్ధమని మరికొందరు వాదించారు. ఆయన చెప్పిన విషయాలు ఎందుకంత వివాదాన్ని రేపాయో తెలుసుకోవడానికి తేజరిల్లు! పత్రిక ప్రొఫెసర్ బిహిని ఇంటర్వ్యూ చేసింది.
తేజరిల్లు!: జీవం జ్ఞానవంతంగా రూపొందించబడిందని అనేందుకు ఆధారాలున్నాయని మీరెందుకు అనుకుంటున్నారు?
ప్రొఫెసర్ బిహి: మనం దేనిలోనైనా సంక్లిష్టమైన వ్యవస్థీకరణను చూస్తే, అది రూపొందించబడిందనే ముగింపుకు వస్తాం. ఉదాహరణకు, మనం రోజూ ఉపయోగించే యంత్రాలనే తీసుకోండి, గడ్డి కత్తిరించే యంత్రం, కారు లేదా వాటికన్నా చిన్న వస్తువులనే తీసుకోండి. ఎలుకల బోనును ఒక ఉదాహరణగా ఉపయోగించడానికి నేను ఇష్టపడతాను. అందులో ఎలుకను పట్టుకోవడం కోసం వివిధ భాగాలు ఏర్పాటు చేయబడ్డాయని మీరు గమనిస్తారు కాబట్టి అది రూపొందించబడిందనే ముగింపుకు వస్తారు.
సూక్ష్మప్రాణులు సహితం జీవించేందుకు ఏమి చేస్తాయో తెలుసుకునేంతగా నేడు విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందింది. మనల్ని ఆశ్చర్యపరిచేలా, ప్రాణుల్లోని సూక్ష్మాణువుల్లో కూడా సంక్లిష్టమైన వ్యవస్థీకరణ ఉందని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ఉదాహరణకు, జీవకణాల్లో ఒక భాగం నుండి మరో భాగానికి అవసరమైన పదార్థాల్ని చేర్చే చిన్న అణువులు అనబడే “ట్రక్కులు” ఉన్నాయి. ఈ “ట్రక్కులకు” కుడి ఎడమల మార్గాన్ని సూచించేందుకు అంతకంటే చిన్నవైన సూక్ష్మాణువుల “సైన్ పోస్టులు” ఉన్నాయి. కొన్ని కణాలు ద్రవాలగుండా ప్రయాణించేలా వాటిని ముందుకుతోసే అణువుల “ప్రొపెల్లర్లు” ఉన్నాయి. ప్రజలు మరెక్కడైనా అలాంటి సంక్లిష్టమైన వ్యవస్థీకరణను చూసినప్పుడు, అది రూపొందించబడిందనే ముగింపుకు వస్తారు. ఆ సంక్లిష్టత ఎందుకు ఉందో ఛార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతమే కాదు మరే సిద్ధాంతమూ వివరించలేదు. సాధారణంగా అటువంటి వ్యవస్థీకరణ రూపకల్పనకు రుజువుగా ఉంటుంది కాబట్టి, ఆ అణువ్యవస్థలను జ్ఞానవంతుడైన వ్యక్తి రూపొందించాడని నమ్మడం సబబే.
తేజరిల్లు!: ప్రకృతి జ్ఞానవంతంగా రూపొందించబడిందనే మీ నిర్ధారణలతో మీ సహోద్యోగుల్లో ఎక్కువమంది ఏకీభవించకపోవడంపై మీ అభిప్రాయమేమిటి?
ప్రొఫెసర్ బిహి: ప్రకృతి ఒక వ్యక్తిచేత జ్ఞానవంతంగా రూపొందించబడిందనేది విజ్ఞానపరంగా వివరించలేని విషయాలను సూచిస్తుందని అంటే అదెంతో సహజాతీతమైనదిగా ఉన్నట్లు భావిస్తారు కాబట్టే చాలామంది శాస్త్రజ్ఞులు నా అభిప్రాయాలతో ఏకీభవించరు. నా అభిప్రాయం అనేకుల్ని ఇబ్బందిపెడుతుంది.
అయితే, ఆధారాలు దేన్ని సూచిస్తాయో దాన్నే విజ్ఞానశాస్త్రం నమ్మాలని నాకు బోధించబడేది. సృష్టికర్త ఉన్నాడనే ముగింపుకు రావడానికి ఆధారాలు అంత బలంగా ఉన్నా, అలా నమ్మడంవల్ల తమకు ఇష్టంలేని నైతిక విలువల్ని పాటించాల్సి వస్తుందనే కారణంతో ఆ వాస్తవాన్ని నిరాకరించడం నా దృష్టిలో పిరికితనమే.తేజరిల్లు!: జీవం జ్ఞానవంతంగా రూపొందించబడిందని అంగీకరించడం అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుందని వాదించే విమర్శకుల మాటలకు మీరెలా ప్రతిస్పందిస్తారు?
ప్రొఫెసర్ బిహి: అజ్ఞానంవల్ల రూపకల్పన జరిగిందనే ముగింపుకు ఎవరూ రారు. మనకు తెలియని కారణంగా మనం దాన్ని నమ్మడం లేదు; మనకు లిసినదాన్నే మనం నమ్ముతున్నాం. డార్విన్ 150 సంవత్సరాల క్రితం తన పుస్తకమైన ది ఒరిజిన్ ఆఫ్ స్పీసిస్‌ను ప్రచురించినప్పుడు జీవం సామాన్యంగా ఉన్నట్లు అనిపించింది. కణం ఎంత సామాన్యమైనదంటే అది సముద్రంలోని బురదనుండి అకస్మాత్తుగా ఆవిర్భవించవచ్చు అని శాస్త్రజ్ఞులు అనుకున్నారు. కానీ ఆ తర్వాత, కణం చాలా సంక్లిష్టమైనదని, మన 21వ శతాబ్దంలోని యంత్రాలకన్నా అది మరెంతో సంక్లిష్టమైనదని విజ్ఞానశాస్త్రం కనిపెట్టింది. దాని వ్యవస్థీకరణలోని సంక్లిష్టత అది రూపొందించబడిందని నిరూపిస్తోంది.
తేజరిల్లు!: మీరు పేర్కొన్న అణువుల్లోని సంక్లిష్టమైన వ్యవస్థీకరణను పరిణామ క్రమం ప్రకృతివరణం ద్వారా సృష్టించగలదని నిరూపించే ఏ ఆధారాలనైనా విజ్ఞానం ఇవ్వగలిగిందా?
ప్రొఫెసర్ బిహి: మీరు వైజ్ఞానిక సాహిత్యాన్ని పరిశీలిస్తే, పరిణామక్రమం ద్వారా అణువుల్లో సంక్లిష్టమైన వ్యవస్థీకరణ ఎలా పరిణమించిందో వివరించే సిద్ధాంతాల్ని ప్రయోగాత్మకంగాగానీ లేదా వాటి ప్రకారం వివరణాత్మక వైజ్ఞానిక నమూనాను తయారుచేయడానికి గానీ ఎవరూ నిజంగా ప్రయత్నించలేదని మీకు తెలుస్తుంది. నా పుస్తకం ప్రచురించబడినప్పటి నుండి పది సంవత్సరాల వరకు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ లాంటి అనేక వైజ్ఞానిక సంస్థలు, జీవం జ్ఞానవంతంగా రూపొందించబడిందని అనేందుకు ఆధారాలున్నాయనే విషయాన్ని త్రోసిపుచ్చేందుకు వారు చేయగలినదంతా చేయమని తమ సభ్యులకు అత్యవసర విన్నపాలు చేసినా, వారు తాము చెప్పేదాన్ని నిరూపించడానికి ఆధారాలు చూపించలేదనేది మాత్రం వాస్తవం.
తేజరిల్లు!: మొక్కల్లోని లేదా జంతువుల్లోని కొన్ని అంశాల్ని చూపిస్తూ, వాటి రూపకల్పన సరిగాలేదని వాదించేవారి మాటలకు మీరెలా ప్రతిస్పందిస్తారు?
ప్రొఫెసర్ బిహి: ఒక ప్రాణిలో ఫలానిది ఎందుకుందో మనకు కారణం తెలియనంతమాత్రాన అది ప్రాముఖ్యమైనదని కాదని అర్థం కాదు. ఉదాహరణకు, నిరుపయోగమని భావించబడే అవశిష్టమైన శరీర భాగాలు మానవ శరీరం, ఇతర ప్రాణుల రూపకల్పన సరిగాలేదని చూపిస్తోందని తలంచబడేది. ఉదాహరణకు, ఆంత్రపుచ్ఛం, గళగ్రంథులను అవశిష్టమైన అవయవాలుగా పరిగణించి, వాటిని శస్త్రచికిత్స ద్వారా తీసివేసేవారు. కానీ ఆ తర్వాత ఆ అవయవాలకు రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర ఉందని కనిపెట్టారు, అవిప్పుడు అవశిష్టమైన శరీర భాగాలుగా పరిగణించబడడం లేదు.
జీవశాస్త్రంలో మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా కూడా జరుగుతాయి. కానీ, కారుకు సొట్టపడినంత మాత్రాన లేదా టైరుకు పంక్చరు అయినంత మాత్రాన ఆ కారు లేదా ఆ టైరు రూపొందించబడలేదని దానర్థం కాదు. అదేవిధంగా, శరీర నిర్మాణంలో కొన్ని యాదృచ్ఛికంగా జరిగినంత మాత్రాన జీవంలో ఉన్నతమైన, సంక్లిష్టమైన అణువుల రూపకల్పన యాదృచ్ఛికంగానే ఆవిర్భవించిందని దానర్థం కాదు. అలా వాదించడం తర్కబద్ధం కాదు. (g 9/06)
[12వ పేజీలోని బ్లర్బ్]
“సృష్టికర్త ఉన్నాడనే ముగింపుకు రావడానికి ఆధారాలు అంత బలంగా ఉన్నా, అలా నమ్మడంవల్ల తమకు ఇష్టంలేని నైతిక విలువల్ని పాటించాల్సి వస్తుందనే కారణంతో ఆ వాస్తవాన్ని నిరాకరించడం నా దృష్టిలో పిరికితనమే.”