కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు జీవరాశుల్ని సృష్టించడానికి పరిణామక్రమాన్ని ఉపయోగించాడా?

దేవుడు జీవరాశుల్ని సృష్టించడానికి పరిణామక్రమాన్ని ఉపయోగించాడా?

దేవుడు జీవరాశుల్ని సృష్టించడానికి పరిణామక్రమాన్ని ఉపయోగించాడా?

“ప్రభువా [యెహోవా], మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.”​—ప్రకటన 4:​10, 11.

ఛార్లెస్‌ డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని వ్యాప్తిచేసిన కొద్దికాలానికే, దాన్ని అంగీకరించిన అనేక నామకార్థ క్రైస్తవ శాఖలు ఆ సిద్ధాంతాన్ని, దేవునిపై తమకున్న నమ్మకాన్ని మిళితం చేసేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టాయి.

నేడు, అత్యంత ప్రఖ్యాతిగాంచిన “క్రైస్తవ” మత గుంపులు జీవరాశుల్ని సృష్టించేందుకు దేవుడే ఏదో విధంగా పరిణామక్రమాన్ని ఉపయోగించి ఉంటాడని అంగీకరించేందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిర్జీవ రసాయనాలనుండి ప్రాణులన్నీ వాటంతటవే పరిణమించి, చివరకు మానవులు ఆవిర్భవించేలా ఆ ప్రక్రియ వృద్ధిచెందేందుకు దేవుడే ఈ విశ్వంలో కార్యప్రణాళికను రూపొందించాడని కొందరు బోధిస్తారు. దైవిక పరిణామక్రమం అని పిలువబడే ఈ బోధను సమర్థించేవారు, ఈ ప్రక్రియ ఒకసారి ప్రారంభమైన తర్వాత దేవుడు అందులో జోక్యం చేసుకోలేదని భావిస్తారు. మరికొందరు, అనేక జాతుల మొక్కల, జంతువుల సముదాయాలు ఉత్పన్నమయ్యేందుకు దేవుడే పరిణామక్రమాన్ని అనుమతించినా, ఆ ప్రక్రియను కొనసాగించేందుకు ఆయన మధ్యమధ్యలో జోక్యం చేసుకున్నాడు అని అనుకుంటారు.

రెండురకాల బోధలు పరస్పరం పొందికగా ఉంటాయా?

పరిణామ సిద్ధాంతం నిజానికి బైబిలు బోధలతో పొందికగా ఉందా? పరిణామ సిద్ధాంతమే నిజమైతే, మొదటి మానవుడైన ఆదాము సృష్టి గురించిన బైబిలు వృత్తాంతం అక్షరార్థంగా అర్థం చేసుకోవాల్సిందిగా కాక, కేవలం నీతి కథను బోధించే పాఠంగానే ఉంటుంది. (ఆదికాండము 1:​26, 27; 2:​18-24) ఈ బైబిలు వృత్తాంతాన్ని యేసు అలాగే దృష్టించాడా? యేసు ఇలా అన్నాడు: “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు​—ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.”​—మత్తయి 19:​4-6.

యేసు ఆ సందర్భంలో ఆదికాండము 2వ అధ్యాయంలోని సృష్టి వృత్తాంతం నుండి పేర్కొన్నాడు. మొదటి వివాహం కేవలం ఒక కల్పిత కథే అని యేసు నమ్మివుంటే, వివాహ పరిశుద్ధతను గురించిన తన బోధను సమర్థించడానికి ఆయన దానిని ప్రస్తావించి ఉండేవాడా? అలా ప్రస్తావించి ఉండేవాడు కాదు. అది చారిత్రక వాస్తవమని తెలుసు కాబట్టే, యేసు ఆదికాండములోని ఆ వృత్తాంతాన్ని పేర్కొన్నాడు.​—యోహాను 17:​17.

అదేవిధంగా, యేసు శిష్యులు కూడా ఆదికాండము వృత్తాంతాన్ని నమ్మారు. ఉదాహరణకు, లూకా సువార్తలో యేసు వంశక్రమం ఆదామువరకు వెనక్కి లెక్కించబడింది. (లూకా 3:​23-38) ఒకవేళ ఆదాము కల్పిత పాత్రే అయి వుంటే, ఆ వంశక్రమ పట్టిక ఏ వ్యక్తి నుండి వాస్తవం కల్పితంగా మారింది? ఆ వంశవృక్ష ఆరంభమే కల్పితమైతే, యేసు తానే మెస్సీయనని, దావీదు వంశంలో జన్మించానని చెప్పుకోవడం ఎంతమేరకు నమ్మశక్యంగా ఉంటుంది? (మత్తయి 1:1) ఆ సువార్త రచయిత లూకా తాను “మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొని” వాటిని గురించి వ్రాశానని చెప్పాడు. ఆయన ఆదికాండములోని సృష్టి వృత్తాంతాన్ని నమ్మాడనేది స్పష్టం.​—లూకా 1:1-3.

అపొస్తలుడైన పౌలుకు యేసుపై ఉన్న విశ్వాసం ఆదికాండము వృత్తాంతంపై పౌలుకున్న నమ్మకంతో ముడిపడి ఉంది. ఆయనిలా వ్రాశాడు: “మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.” (1 కొరింథీయులు 15:​21, 22) ఒకవేళ ఆదాము మానవుల పితరుడు, లేదా ఎవరి ద్వారానైతే “పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో” ఆ వ్యక్తే కాకపోతే, ఆయన ద్వారా సంక్రమించిన పాపపు ప్రభావాలను తీసివేయడానికి యేసు మరణించాల్సిన అవసరమేమిటి?​—రోమీయులు 5:12; 6:​23.

ఆదికాండములోని సృష్టి వృత్తాంతాన్ని బలహీనపర్చడమంటే క్రైస్తవ విశ్వాసపు పునాదుల్నే బలహీనపర్చినట్లవుతుంది. పరిణామ సిద్ధాంతం, క్రీస్తు బోధలు పొందికగా లేవు. ఆ రెండింటినీ కలిపేందుకు చేసే ఏ ప్రయత్నమైనా మన విశ్వాసాన్ని బలహీనపర్చడమే కాక, ఆ విశ్వాసం “గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్ట” బడుతుంది.​—ఎఫెసీయులు 4:​14.

గట్టి పునాదిపై ఆధారపడిన విశ్వాసం

ఎన్నో శతాబ్దాలుగా బైబిలు విమర్శలను, దాడులను ఎదుర్కొంటోంది. అన్ని సందర్భాల్లోనూ బైబిలు చెప్పేదే సత్యమని రుజువైంది. బైబిలు చరిత్ర, ఆరోగ్యం, విజ్ఞానశాస్త్రం గురించి ప్రస్తావించినప్పుడల్లా, అది ఆధారపడదగినదని రుజువైంది. మానవ సంబంధాల విషయంలో అదిచ్చే సలహా నమ్మదగినది, కాలాతీతమైంది. మానవ వేదాంతాలు, సిద్ధాంతాలు పచ్చగడ్డిలాగే మొలకెత్తి, ఆ తర్వాత వాడిపోతాయి, కానీ దేవుని వాక్యం ‘నిత్యము నిలుస్తుంది.’​—యెషయా 40:8.

పరిణామం గురించిన బోధ కేవలం విజ్ఞానశాస్త్ర సిద్ధాంతమే కాదు. అది మానవ తత్వంగా చిగురించి దశాబ్దాలకాలంలో వృద్ధిచెందింది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో, ప్రకృతిలో రూపకల్పన ఉందని బలంగా చూపిస్తున్న అనేక ఆధారాలను వివరించడానికి చేసిన ప్రయత్నాలవల్ల డార్విన్‌ రూపొందించిన సాంప్రదాయక పరిణామ బోధలో క్రమేణా మార్పులు వచ్చాయి. మీరు ఈ అంశాన్ని మరింతగా పరిశీలించాలని మేము ప్రోత్సహిస్తున్నాం. ఈ పత్రికలోని ఇతర ఆర్టికల్‌లను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మీరలా చేయవచ్చు. అదనంగా, మీరు ఈ పేజీలో, 32వ పేజీలో చూపించబడిన ప్రచురణలను కూడా చదివేందుకు ఇష్టపడవచ్చు.

ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత, బైబిలు పూర్వం జరిగినవాటిని గురించి చెబుతున్న విషయాలపై మీ నమ్మకం మరింత బలపడినట్లు మీరు గ్రహిస్తారు. మరింత ప్రాముఖ్యంగా, భవిష్యత్తు గురించి బైబిలు చేసే వాగ్దానాలపై మీ విశ్వాసం మరింత దృఢమౌతుంది. (హెబ్రీయులు 11:1) “ఆకాశమును భూమిని . . . సృజించిన” యెహోవాను స్తుతించడానికి కూడా మీరు పురికొల్పబడతారు.​—కీర్తన 146:6. (g 9/06)

అదనంగా చదువాలనుకునే ప్రచురణలు

బైబిలు ప్రామాణికతకు సంబంధించిన ప్రత్యేక ఉదాహరణలు ఈ బ్రోషుర్‌లో చర్చించబడ్డాయి

మరిన్ని విజ్ఞానశాస్త్ర ఆధారాల్ని పరిశీలించి, మనపట్ల శ్రద్ధ చూపించే దేవుడు ఇంత బాధను ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోండి

“భూమిపట్ల దేవుని సంకల్పమేమిటి?” అనే ప్రశ్నకు జవాబు ఈ పుస్తకంలోని 3వ అధ్యాయంలో ఉంది

[10వ పేజీలోని బ్లర్బ్‌]

యేసు ఆదికాండములోని సృష్టి వృత్తాంతాన్ని నమ్మాడు. ఆయన పొరబడ్డాడా?

[9వ పేజీలోని బాక్సు]

పరిణామం అంటే ఏమిటి?

“పరిణామం” అనే పదానికి “ఒకదాని నుండి మరో దానికి మారే ప్రక్రియ” అనేది ఒక నిర్వచనం. అయితే ఆ పదాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, అది నిర్జీవ వస్తువుల్లో జరిగే పెద్ద మార్పులను అంటే విశ్వం వృద్ధి చెందడం వంటివాటిని వర్ణించేందుకు ఉపయోగించబడుతుంది. అలాగే అది ప్రాణుల్లో జరిగే చిన్న మార్పులను అంటే మొక్కలు, జంతువులు వాతావరణానికి అనుగుణంగా తమలో మార్పులు చేసుకోవడం వంటివాటిని వర్ణించేందుకు కూడా ఉపయోగించబడుతుంది. అయితే జీవమనేది నిర్జీవ రసాయనాలనుండి ఆవిర్భవించి, స్వీయ పునరుత్పాదక కణాలుగా మారి, క్రమక్రమంగా మరింత సంక్లిష్టమైన ప్రాణులుగా మారింది, అలా ఉత్పత్తైన ప్రాణులన్నింటిలో మానవుడే అత్యంత తెలివైన ప్రాణి అనే సిద్ధాంతాన్ని వివరించేందుకే ఆ పదం సర్వసాధారణంగా ఉపయోగించబడుతోంది. ఈ ఆర్టికల్‌లో, “పరిణామం” అనే పదం మూడవ అర్థాన్నే సూచిస్తూ ఉపయోగించబడింది.

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

అంతరిక్షం ఫోటో: J. Hester and P. Scowen (AZ State Univ.), NASA