కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిణామ సిద్ధాంతం వాస్తవమేనా?

పరిణామ సిద్ధాంతం వాస్తవమేనా?

పరిణామ సిద్ధాంతం వాస్తవమేనా?

“సూర్యుడు వేడిగా ఉంటాడనేది ఎంత నిజమో, పరిణామ సిద్ధాంతం కూడా అంతే నిజం” అని ప్రఖ్యాత పరిణామ సైద్ధాంతిక శాస్త్రవేత్త అయిన ఫ్రొఫెసర్‌ రిచర్డ్‌ డాకిన్స్‌ వాదిస్తున్నాడు. ప్రయోగాలు, నేరుగా జరిపిన పరిశోధనలు సూర్యుడు వేడిగా ఉంటాడని నిరూపించాయన్నది నిజమే. అయితే, పరిణామ సిద్ధాంతాన్ని కూడా ప్రయోగాలు, నేరుగా చేసిన పరిశోధనలు అంతే ఖచ్చితంగా నిరూపిస్తున్నాయా?

ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక విషయాన్ని మనం స్పష్టం చేసుకోవాలి. కాలగమనంలో ప్రాణుల సంతతిలో చిన్న మార్పులు జరుగుతాయని ఎంతోమంది శాస్త్రజ్ఞులు గమనించారు. ఛార్లెస్‌ డార్విన్‌ ఆ సిద్ధాంతాన్ని “డిసెంట్‌ విత్‌ సబ్సీక్వెంట్‌ మోడిఫికేషన్‌” (తర తరానికి జరిగే మార్పులతో జన్మించే సంతతి) అని పిలిచాడు. అలాంటి మార్పులు పరిశోధించబడి, ప్రయోగాత్మకంగా నమోదు చేయబడి, జంతువుల్ని లేదా మొక్కలను పెంచేవారిలో అనేకమందిచేత విరివిగా ఉపయోగించబడుతున్నాయి. * ఆ మార్పులు జరగడమనేది వాస్తవం. అయితే, శాస్త్రజ్ఞులు ఆ మార్పులు “మైక్రోఎవల్యూషన్‌” (పరిణామ క్రమంలో చిన్న మార్పులు) అనే పిలుస్తారు. ఆ పేరు, అనేకమంది శాస్త్రజ్ఞులు వాదిస్తున్నట్లుగా ఆ చిన్న మార్పులు పూర్తిగా భిన్నమైన సిద్ధాంతానికి, అంటే ఇంతవరకూ ఎవరూ గమనించని మాక్రోఎవల్యూషన్‌ (పరిణామ క్రమంలో పెద్ద మార్పులు) జరుగుతాయనడానికి కూడా రుజువునిస్తోందని సూచిస్తోంది.

డార్విన్‌ అలా కనిపించే మార్పులకు మించి ఆలోచించాడు. ఆయన తన ప్రఖ్యాత పుస్తకమైన ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీషీస్‌లో ఇలా వ్రాశాడు: “ప్రాణులన్నీ ప్రత్యేకంగా సృష్టించబడ్డాయని నేననుకోవడంలేదు, కానీ అవి కొన్ని మూలజీవుల నుండి క్రమంగా వచ్చాయని అనుకుంటున్నాను.” యుగయుగాల కాలగమనంలో ఆ “కొన్ని మూలజీవుల్లో” లేదా సూక్ష్మ జీవాకారాల్లో “అత్యంత సూక్ష్మమైన మార్పులు” జరగడంతో భూమిపై ఇన్ని కోట్ల వైవిధ్యమైన ప్రాణులు ఉనికిలోకి వచ్చాయి. ఈ సూక్ష్మ మార్పులన్నీ కలిసి, చేపలు ఉభయచర జీవులుగా, నరవానరాలు మనుష్యులుగా మారేందుకు అవసరమైన పెద్ద మార్పులుగా పరిణామం చెందాయని పరిణామవాదులు బోధిస్తారు. ఆ పెద్ద మార్పుల్నే వారు మాక్రోఎవల్యూషన్‌ అని అంటారు. అనేకులకు ఈ రెండవ సిద్ధాంతమే తర్కబద్ధంగా అనిపిస్తుంది. వారిలా అనుకోవచ్చు, ‘ఒకవేళ ఒక జాతిలోనే సూక్ష్మ మార్పులు సంభవించే అవకాశముంటే, సుదీర్ఘ కాలగమనంలో పరిణామ సిద్ధాంతం పెద్ద మార్పులను ఎందుకు తీసుకురాలేదు?’ *

పరిణామ క్రమంలో మాక్రోఎవల్యూషన్‌ సిద్ధాంతం మూడు ప్రధాన తలంపులపై ఆధారపడి ఉంది:

1. ఉత్పరివర్తనాలవల్ల కొత్త జాతుల్ని సృష్టించవచ్చు. *

2. ప్రకృతివరణము (నేచురల్‌ సెలెక్షన్‌) కొత్త జాతులు ఆవిర్భవించేలా చేస్తుంది.

3. మొక్కల, జంతువుల పరిణామ క్రమంలో పెద్ద మార్పులు జరిగాయని శిలాజ వివరాలు నివేదిస్తున్నాయి.

పెద్ద మార్పులు జరిగాయనేది వాస్తవమని నమ్మేందుకు బలమైన ఆధారాలున్నాయా?

ఉత్పరివర్తనాలు కొత్త జాతుల్ని సృష్టించగలవా?

చెట్ల లేదా జంతువుల రూపాలు చాలావరకు కణాల్లోని కేంద్రకంలో ఉండే జన్యు సంకేతంలోని, బ్లూప్రింట్లలోని సమాచారం ఆధారంగానే రూపొందుతాయి. * జన్యు సంకేతంలో జరిగే ఉత్పరివర్తనాలు లేదా యాదృచ్ఛిక మార్పులవల్ల చెట్ల లేదా జంతువుల సంతతిలో మార్పులు సంభవించవచ్చని పరిశోధకులు కనిపెట్టారు. నోబుల్‌ బహుమతి గ్రహీత, ఉత్పరివర్తనాల అధ్యయన వ్యవస్థాపకుడైన హర్మెన్‌ జె. ముల్లర్‌ 1946లో ఇలా అన్నాడు: “అలా అసాధారణమైన, చిన్న మార్పులన్నీ కృత్రిమంగా రూపొందించే జంతువుల, మొక్కల్ని మెరుగుచేయడంలో ప్రధాన పాత్ర పోషించడమే కాక, అవి ప్రకృతివరణం ద్వారా పరిణామం వృద్ధి చెందేందుకు కూడా ఎంతో ప్రాముఖ్యం.”

ఉత్పరివర్తనాలు కొత్త జాతులనే కాదు మొక్కల్లో, జంతువుల్లో కొత్త కుటుంబాల్నే ఉత్పత్తిచేస్తాయనే వాదంపై మాక్రోఎవల్యూషన్‌ ఆధారపడి ఉంది. ఇంత ఖచ్చితంగా చేస్తున్న వాదనను నిరూపించే మార్గమేదైనా ఉందా? సుమారు 100 సంవత్సరాలు జన్యుశాస్త్ర పరిశోధనలు ఏమి వెల్లడిచేస్తున్నాయో గమనించండి.

యాదృచ్ఛికంగా జరిగిన ఉత్పరివర్తనాల ద్వారానే ప్రకృతివరణం మొక్కల్లో కొత్త జాతులు ఏర్పడేలా చేయగలిగితే, మానవ నిర్దేశిత కృత్రిమ ఉత్పరివర్తనాలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయనే ఆలోచనను శాస్త్రజ్ఞులు 1930వ దశాబ్దపు చివరి సంవత్సరాల్లో ఎంతో ఉత్సాహంతో అంగీకరించారు. జర్మనీలోని మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ రిసెర్చ్‌ సంస్థలో శాస్త్రజ్ఞునిగా పనిచేస్తున్న వుల్ఫ్‌ ఎక్కెహార్డ్‌ లాన్నిగ్‌ను తేజరిల్లు! పత్రిక ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆయనిలా వ్యాఖ్యానించారు, “అనేక జీవశాస్త్రజ్ఞుల్లో, జన్యుశాస్త్రజ్ఞుల్లో, బ్రీడర్స్‌లో ఆ ఉత్సాహం రెట్టింపైంది.” ఎందుకు ఆ ఉత్సాహం? దాదాపు 28 సంవత్సరాలు మొక్కల్లోని ఉత్పరివర్తనాల జన్యుశాస్త్రాన్ని అధ్యయనం చేసిన లాన్నిగ్‌ ఇలా జవాబిచ్చారు: “మొక్కలు, జంతువుల్లో సంప్రదాయబద్ధంగా జరుగుతున్న బ్రీడింగ్‌ పద్ధతిని మార్చే సమయం ఆసన్నమైందని ఆ పరిశోధకులు అనుకున్నారు. కొన్ని అనుకూలమైన ఉత్పరివర్తనాలను కలిగించడం, మరికొన్నింటిని ఎన్నుకోవడం ద్వారా వారు మెరుగైన మొక్కలను, జంతువులను రూపొందించవచ్చని అనుకున్నారు.” *

పరిణామక్రమాన్ని వేగవంతం చేస్తాయనే ఆశను రేకెత్తించిన పద్ధతులను ఉపయోగించి, అమెరికా, ఆసియా, యూరప్‌లలోని శాస్త్రజ్ఞులు భారీ నిధులతో పరిశోధనా కార్యక్రమాలను చేపట్టారు. దాదాపు 40కన్నా ఎక్కువ సంవత్సరాలుగా చేసిన తీవ్ర పరిశోధనా ఫలితాలేమిటి? “పెద్ద మొత్తంలో ఖర్చు జరిగినా, ఇర్రేడియేషన్‌ పద్ధతిలో కలిగించిన ఉత్పరివర్తనాల ద్వారా అధిక శాతం ఉత్పత్తినిచ్చే మొక్కల రకాలను రూపొందించేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి” అని పరిశోధకుడైన పీటర్‌ జెంగ్‌బుష్‌ అంటున్నారు. లాన్నిగ్‌ ఇలా అన్నారు: “1980 వచ్చేసరికి, శాస్త్రజ్ఞుల ఉత్సాహం, ఆశలన్నీ ప్రపంచవ్యాప్తంగా నీరుగారిపోయాయి. పాశ్చాత్య దేశాల్లో ఉత్పరివర్తనాల బ్రీడింగ్‌ ప్రత్యేక పరిశోధనా శాఖను మూసేశారు. ఆ ఉత్పరివర్తనాలన్నీ ‘ప్రతికూలమైన ఫలితాలను’ ఇచ్చాయి, అంటే అవి చనిపోయాయి లేదా ప్రకృతిలోని రకాలకన్నా బలహీనంగా రూపొందాయి. *

అయినా, దాదాపు 100 సంవత్సరాల ఉత్పరివర్తనాల పరిశోధన నుండి, ప్రత్యేకంగా 70 సంవత్సరాల ఉత్పరివర్తనాల బ్రీడింగ్‌నుండి లభించిన సమాచారం ఆధారంగా ఉత్పరివర్తనాలకు కొత్త జాతుల్ని సృష్టించే సామర్థ్యం ఉందో లేదో శాస్త్రజ్ఞులు నిర్ధారించుకోవచ్చు. ఆధారాల్ని పరిశీలించిన తర్వాత, లాన్నిగ్‌ ఈ నిర్ధారణకు వచ్చారు: “ఉత్పరివర్తనాలు [మొక్కల లేదా జంతువుల] ప్రధాన జాతులను పూర్తి కొత్త జాతిగా మార్చలేవు. సంభావ్యతల నియమాలనుబట్టి, 20వ శతాబ్దంలో చేపట్టిన ఉత్పరివర్తనాల పరిశోధనల అనుభవాలు, ఫలితాలు అదే విషయాన్ని రుజువుచేశాయి. కాబట్టి, జన్యుశాస్త్రం ప్రకారం నిర్దిష్ట జాతిగా వర్గీకరించబడినవాటికి నిజంగా పరిమితులు ఉంటాయని, అందువల్ల అకస్మాత్తుగా సంభవించే ఉత్పరివర్తనాలవల్ల ఆ పరిమితులను తీసివేయడం లేదా నిర్మూలించడం అసాధ్యమని లా ఆఫ్‌ రికర్రంట్‌ వేరియేషన్‌ సూచిస్తోంది.”

పైన పేర్కొనబడిన వాస్తవాలు ఏమి సూచిస్తున్నాయో ఆలోచించండి. ఉత్పరివర్తనాలను కృత్రిమంగా కలిగించడం ద్వారా, అనుకూలమైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా ఉన్నత శిక్షణ పొందిన శాస్త్రజ్ఞులే కొత్త జాతుల్ని ఉత్పత్తి చేయలేకపోతున్నప్పుడు, జ్ఞానంతో సంబంధంలేని ప్రక్రియలు కొత్త జాతుల్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందా? ఉత్పరివర్తనాలు ఉనికిలో ఉన్న జాతిని మరో కొత్త జాతిగా మార్చలేవని పరిశోధనలు చూపిస్తున్నప్పుడు, పరిణామక్రమంలో పెద్ద మార్పులు ఎలా సంభవించి వుంటాయి?

ప్రకృతివరణము కొత్త జాతుల ఆవిర్భవానికి నడిపిస్తుందా?

ప్రకృతివరణము అని తాను పేరుపెట్టిన ప్రక్రియవల్ల వాతావరణానికి తట్టుకునే జీవరాశులే సజీవంగా ఉంటాయనీ, తట్టుకోలేని జీవరాశులు చివరకు నశించిపోతాయని డార్విన్‌ నమ్మాడు. జాతులు విస్తరించి, వేరైపోయినప్పుడు, వాటిలో ఏ జాతుల జన్యు ఉత్పరివర్తనాలు ఆ క్రొత్త వాతావరణానికి తట్టుకుంటాయో వాటినే ప్రకృతివరణము ఎంపిక చేసుకుంటుందని ఆధునిక పరిణామవాదులు బోధిస్తారు. అలా వేరైపోయిన గుంపులు చివరకు కొత్త జాతిగా మారతాయని పరిణామవాదులు వాదిస్తారు.

ముందు పేర్కొనబడినట్లుగా, ఉత్పరివర్తనాలు పూర్తిగా కొత్త జాతుల మొక్కల్ని లేదా జంతువుల్ని ఉత్పత్తి చేయలేవని పరిశోధనల ఆధారాలు బలంగా చూపిస్తున్నాయి. అయినా, కొత్త జాతిని ఉత్పత్తి చేయడానికి ప్రకృతివరణము అనుకూలమైన ఉత్పరివర్తనాలను ఎంపిక చేసుకుంటుందని పరిణామవాదులు చేసే వాదనకు వారిచ్చే ఆధారాలు ఏవి? అమెరికాలోని నేషనల్‌ ఎకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (NAS) 1999లో ప్రచురించిన ఒక బ్రోషురు ఇలా అంటోంది: “జాతి ఉత్పత్తిలో [కొత్త జాతి పరిణామంలో] ఆసక్తికరమైన ఒక ఉదాహరణ డార్విన్‌ గాలాపాగోస్‌ ద్వీపాల్లో అధ్యయనం చేసిన 13 రకాల చిన్న ఫించ్‌జాతి పిట్టలది, అవిప్పుడు డార్విన్‌ పిట్టలు అని పిలువబడుతున్నాయి.”

1970లలో, పీటర్‌, రోజ్‌మేరీ గ్రాంట్‌ల సారథ్యంలోని ఒక పరిశోధనా బృందం ఆ చిన్న పిట్టల గురించి అధ్యయనం చేయడం ప్రారంభించింది, ఒక సంవత్సరం అనావృష్టి తర్వాత చిన్న ముక్కులున్న పిట్టలకన్నా కాస్త పొడవైన ముక్కున్న పిట్టలు బ్రతికి బయటపడ్డాయని వారు కనిపెట్టారు. ప్రధానంగా ఆ పిట్టల ముక్కుల పొడవు, ఆకారం ఆధారంగా ఆ 13 జాతుల చిన్న పిట్టలను వర్గీకరిస్తారు కాబట్టి, వారు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని కనిపెట్టాం అనుకున్నారు. ఆ బ్రోషురు ఇంకా ఇలా చెప్పింది: “ద్వీపాల్లో దాదాపు పది సంవత్సరాలకు ఒకసారి అనావృష్టి సంభవిస్తే, ఆ చిన్నపిట్టల ఒక కొత్త జాతి ఆవిర్భవించడానికి సుమారు 200 సంవత్సరాలు పడుతుందని గ్రాంట్‌ దంపతులు అంచనా వేశారు.”

అయితే, అసంబద్ధమైనవే అయినా ప్రాముఖ్యమైన కొన్ని వాస్తవాలను పేర్కొనడాన్ని NAS బ్రోషురు నిర్లక్ష్యం చేసింది. ఆ అనావృష్టి తర్వాతి సంవత్సరాల్లో చిన్న ముక్కులున్న పిట్టలే మళ్ళీ అధిక సంఖ్యలో ఉండేవి. కాబట్టి, పీటర్‌ గ్రాంట్‌, పట్టభద్రురాలైన విద్యార్థిని లైల్‌ గిబ్స్‌ “ప్రకృతివరణం వ్యతిరేక దిశలో జరుగుతున్నట్లు” తాము గమనించామని 1987లో నేచర్‌ అనే వైజ్ఞానిక పత్రికలో వ్రాశారు. వాతావరణం మారినప్పుడల్లా, “పిట్టల ముక్కుల పొడవునుబట్టి వాటి సంఖ్య పెరుగుతూ తగ్గుతూ ఉంది” అని గ్రాంట్‌ 1991లో వ్రాశాడు. ఆ పిట్టల విభిన్న “జాతుల్లో” కొన్ని వేరే జాతి పిట్టలతో జతకట్టి పెంటిపిట్టలకన్నా మరింత ఎక్కువకాలం జీవించిన సంతతిని ఉత్పత్తి చేసినట్లు కూడా పరిశోధకులు గమనించారు. అలా వేరే జాతులతో జతకట్టడం కొనసాగితే, 200 సంవత్సరాల్లోపే రెండు “జాతుల” విలీనత ఏర్పడుతుందనే నిర్ధారణకు పీటర్‌, రోజ్‌మేరీ గ్రాంట్‌లు వచ్చారు.

వెనకటికి 1966లో పరిణామవాది, శరీరనిర్మాణ శాస్త్రజ్ఞుడైన జార్జ్‌ క్రిస్టోఫర్‌ విలియమ్స్‌ ఇలా వ్రాశాడు: “పరిణామంలో మార్పులను వివరించడం కోసం ప్రకృతివరణము సిద్ధాంతాన్ని ముందుగా వృద్ధి చేయడం శోచనీయమని నేననుకుంటున్నాను. ప్రాణులు వాతావరణానికి ఎలా తట్టుకుంటాయో వివరించడానికే ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించడం మరింత ప్రాముఖ్యం.” ఒకవేళ విలియమ్స్‌ నిర్ధారణలే సరైనవైతే, మారుతున్న పరిస్థితుల్ని తట్టుకునేలా జాతులకు ప్రకృతివరణము సహాయం చేస్తుండవచ్చు, అయితే “అది ఏ కొత్త జాతిని సృష్టించదని” పరిణామ సైద్ధాంతికుడు జెఫ్రీ స్క్వార్ట్స్‌ 1999లో వ్రాశారు.

నిజానికి, డార్విన్‌ చిన్న పిట్టలు “కొత్త జాతి”గా ఏమీ మారడం లేదు. అవి ఇంకా చిన్న పిట్టలుగానే ఉన్నాయి. అంతేకాక, అవి వేర్వేరు జాతుల మధ్య జతకడతాయనే విషయం, కొందరు పరిణామవాదులు జాతుల్ని వర్గీకరించే పద్ధతులపై సందేహాలు లేవదీస్తోంది. అదనంగా, ప్రముఖ వైజ్ఞానిక విద్యాసంస్థలు కూడా చివరకు ఆధారాల్ని చూపించడంలో పక్షపాతం చూపిస్తున్నాయనే విషయాన్ని అది వెల్లడిచేస్తోంది.

పరిణామ క్రమంలో పెద్ద మార్పులు జరిగాయని శిలాజ వివరాలు చూపిస్తున్నాయా?

ముందు పేర్కొనబడిన NAS బ్రోషుర్‌ చదివుతున్నవారికి, పరిణామక్రమంలో పెద్ద మార్పులు జరిగాయని అనేందుకు శాస్త్రజ్ఞులు వెలికితీసిన శిలాజాలు అవసరమైన ఆధారాల్ని ఇస్తున్నాయనే అభిప్రాయం కలిగేలా చేస్తుంది. అదిలా అంటోంది: “చేపలకు ఉభయచర ప్రాణులకు మధ్య, ఉభయచర ప్రాణులకు, సరీసృపాలకు మధ్య, సరీసృపాలకు క్షీరదాలకు మధ్య, క్షీరదాలకు క్షీరదాలలోని ఉన్నత వర్గాలకు మధ్య ఎన్ని మాధ్యమిక ప్రాణులు కనిపెట్టబడ్డాయంటే అవి ఒక జాతి నుండి మరో జాతికి మారినప్పుడు తరచూ అవి ప్రత్యేకంగా ఏ జాతికి చెందినవో గుర్తించడం చాలా కష్టం.”

విషయాన్ని ఇంత నిర్భీతిగా చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకు? ఎందుకంటే, 2004లో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ అనే పత్రిక, ఆ శిలాజాల వివరాలు, “పరిణామానికి సంబంధించిన చలనచిత్రంలోని 1000 చిత్రాల్లో 999 చిత్రాల్ని కట్టింగ్‌ రూమ్‌లోనే తొలగించిన అసంపూర్ణ చిత్రంలా ఉన్నాయి” అని వర్ణించింది. ఆ వెయ్యి చిత్రాల్లో మిగిలిన ఒక్క చిత్రం పెద్ద మార్పుల ప్రక్రియను నిజంగా నిరూపిస్తోందా? శిలాజాల వివరాలు అసలు ఏమని చూపిస్తున్నాయి? యుగయుగాల కాలగమనంలో “అనేక జాతుల పరిణామ క్రమంలో చాలా తక్కువ లేదా అసలు మార్పులే జరగలేదని” ఆ నివేదికలు చూపిస్తున్నాయని పరిణామవాదాన్ని ఎంతో బలంగా నమ్మే నైల్స్‌ ఎల్డరెడ్జ్‌ ఒప్పుకుంటున్నాడు.

నేటివరకు, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు దాదాపు 20 కోట్ల పెద్ద శిలాజాలను, వందలకోట్ల చిన్న శిలాజాలను వెలికితీసి వాటి వివరాలను భద్రపరిచారు. అన్ని ప్రధాన జాతుల జంతువులు ఒక్కసారిగా ఉనికిలోకివచ్చి ఏ మార్పులూ లేకుండా అలాగే జీవించాయని, అనేక జాతులు అవెలా ఉనికిలోకి వచ్చాయో అలాగే ఒక్కసారిగా కనుమరుగైపోయాయని ఆ విస్తారమైన, వివరణాత్మకమైన వివరాలు చూపిస్తున్నాయని అనేకమంది పరిశోధకులు ఒప్పుకుంటున్నారు. శిలాజాల వివరాల ఆధారాలను సమీక్షించిన తర్వాత, శరీరధర్మ శాస్త్రజ్ఞుడైన జోనతన్‌ వేల్స్‌ ఇలా వ్రాశాడు: “రాజ్యాలు, ఫైలా, విభాగాల దశల్లో ఒకే మూలజీవినుండి కొన్ని మార్పులతో ప్రాణులన్నీ ఉనికిలోని వచ్చాయనేది వైజ్ఞానిక పరిశోధనల ప్రకారం వాస్తవం కాదు. శిలాజాల వివరాల ఆధారంగా, అణువ్యవస్థల ఆధారంగా నిర్ధారణలకు రావడం సరైన సిద్ధాంతం కాదు.”

పరిణామ సిద్ధాంతం​—⁠వాస్తవమా లేక కల్పితమా?

పేరుగాంచిన అనేకమంది పరిణామవాదులు మాక్రోఎవల్యూషన్‌ వాస్తవమని ఎందుకు వాదిస్తారు? రిచర్డ్‌ డాకిన్స్‌ తర్కాన్ని విమర్శించిన తర్వాత ప్రఖ్యాత పరిణామవాదుడు రిచర్డ్‌ లవాంటెన్‌ ఇలా అన్నారు, “విచక్షణా జ్ఞానానికి వ్యతిరేకమైన వైజ్ఞానిక వాదనలను అనేకమంది శాస్త్రజ్ఞులు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే వారు ముందే ఒక వాదానికి అంటే భౌతిక వాదానికి కట్టుబడి ఉన్నారు.” * జ్ఞానవంతుడైన రూపకర్త ఉండవచ్చనే విషయాన్ని పరిగణించడానికి కూడా అనేకమంది శాస్త్రజ్ఞులు నిరాకరిస్తారు ఎందుకంటే, లవాంటెన్‌ వ్రాస్తున్నట్లుగా “విజ్ఞానశాస్త్రం సృష్టికర్త ఉండవచ్చనే విషయాన్ని అంగీకరించలేదు.”

ఈ విషయం గురించి, సమాజశాస్త్రజ్ఞుడైన రాడ్నీ స్టార్క్‌ అన్న మాటలు సైంటిఫిక్‌ అమెరికన్‌ పత్రికలో ఇలా ఉల్లేఖించబడ్డాయి: “మీరు విజ్ఞానాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉండాలంటే, మతానికి సంబంధించిన ప్రతిబంధాలన్నింటినీ విడిపించుకుని రావాలి అనే విషయం దాదాపు 200 ఏళ్లుగా వ్యాప్తిచేయబడుతోంది.” పరిశోధనా విశ్వవిద్యాలయాల్లో “మతాన్ని అవలంబించేవాళ్ళు దేవుని గురించి మాట్లాడకపోయినా నాస్తికులు మాత్రం వారితో కలివిడిగా ఉండరు” అని ఆయన అన్నారు. స్టార్క్‌ అభిప్రాయం ప్రకారం, “ఒక వ్యక్తి [శాస్త్రజ్ఞుల] సమాజంలోని ఉన్నత వర్గాల్లో నాస్తికునిగా ఉండడంవల్ల ప్రయోజనాలున్నాయి.”

పరిణామక్రమంలో పెద్ద మార్పులు జరిగాయనేది నిజమని నమ్మాలంటే, భౌతికంగా కనిపించేవి తప్ప మరేది తెలుసుకునే అవకాశం లేదని భావించే లేదా నాస్తిక శాస్త్రజ్ఞులు తమ పరిశోధనా ఫలితాలను తమ సొంత నమ్మకాలు ప్రభావితం చేసేలా అనుమతించరని మీరు నమ్మాలి. శతాబ్ద కాలంగా ఉత్పరివర్తనాలు గురించి జరిపిన పరిశోధన, అధ్యయనాలు వందలకోట్ల ఉత్పరివర్తనాలు, ఒక్క నిర్దిష్ట జాతిని మరో జాతిగా మార్చలేదని నిరూపిస్తున్నా, ఉత్పరివర్తనాలు, ప్రకృతివరణమే జీవంలోని సంక్లిష్టమైన రూపకల్పన ఉన్న జీవరాశులు ఉనికిలోకి వచ్చేలా చేశాయని మీరు నమ్మాలి. అనేక ప్రధాన జాతుల మొక్కలు, జంతువులు అకస్మాత్తుగా ఆవిర్భవించాయని, యుగయుగాల కాలగమనంలో కూడా అవి మరో రకమైన ప్రధాన జాతిగా మారిపోలేదని శిలాజాల వివరాలు ఎంతో బలమైన ఆధారాలనిస్తున్నా, ప్రాణులన్నీ ఒకే మూలజీవినుండి ఉద్భవించాయని మీరు నమ్మాలి. అలాంటి నమ్మకాలు వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయని మీకు అనిపిస్తుందా? లేక అవి కల్పితమా? (g 9/06)

[అధస్సూచీలు]

^ కుక్కల్ని పెంచేవారు తమకు కావలసిన విధంగా చిన్న కాళ్లు లేదా పెద్ద జూలు ఉండేలా తమ కుక్కలను వేరే జాతి కుక్కలతో జతచేయవచ్చు. అయితే, వారు తేవాలనుకున్న ఈ మార్పులు తరచూ కుక్కల్లోని జన్యు ప్రక్రియల్లోని లోపాల కారణంగా వస్తాయి. ఉదాహరణకు, డాక్స్‌హండ్‌ అనే కుక్కలో మృదులాస్థి సరిగా పెరగకపోవడమే అది చిన్నగా ఉండడానికి కారణం.

^ “జాతులు” (species) అనే పదం ఈ ఆర్టికల్‌లో తరచూ ఉపయోగించబడింది, అయితే, బైబిలు పుస్తకమైన ఆదికాండములో “జాతులు” (kind) అనే విస్తృతార్థంగల పదం ఉపయోగించబడిందని మీరు గమనించాలి. శాస్త్రజ్ఞులు కొత్త జాతులు పరిణమించాయని పేర్కొన్నప్పుడు, అది తరచూ ఆదికాండములోని “జాతుల” నుండి పరిణామం చెందే వివిధ speciesను మాత్రమే సూచిస్తుంది.

^ “ప్రాణుల వర్గీకరణ” అనే బాక్సును చూడండి

^ కణంలోని జీవద్రవ్యం (సైటోప్లాసమ్‌), దాని కణజాలము, ఇతర నిర్మాణ భాగాలు కూడా ఒక ప్రాణి రూపాన్ని నిర్దేశించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పరిశోధనలు చూపిస్తున్నాయి.

^ ఈ ఆర్టికల్‌లోని లాన్నిగ్‌ అభిప్రాయాలు ఆయన స్వంతవి. అవి మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ రిసెర్చ్‌ సంస్థ అభిప్రాయాల్ని సూచించడం లేదు.

^ కొత్త ఉత్పరివర్తితాలు వేగంగా తగ్గిపోతుండగా తరచూ అవే రకమైన ఉత్పవర్తితాలు తిరిగి కనబడుతున్నాయనీ, ఉత్పరివర్తనాల ప్రయోగాలు పదేపదే నిరూపించాయి. ఈ అసాధారణ విషయం నుండే లాన్నిగ్‌ “లా ఆఫ్‌ రికర్రంట్‌ వేరియేషన్‌”ను కనిపెట్టాడు. అదనంగా, 1 శాతంకన్నా తక్కువ మొక్కల ఉత్పరివర్తనాలే తదుపరి పరిశోధన కోసం ఎన్నుకోబడ్డాయి, వాటిలో కేవలం 1 శాతం మాత్రమే మార్కెట్‌లో అమ్మేందుకు తగినవిగా ఉన్నాయని తేలింది. జంతువుల్లో జరిపిన ఉత్పరివర్తనాల బ్రీడింగ్‌ మొక్కలకన్నా ఘోరమైన ఫలితాలనిచ్చింది, ఆ పద్ధతి పూర్తిగా వదిలివేయబడింది.

^ భౌతిక వాదం అనే పదం భౌతిక పదార్థాలే ప్రధాన సత్యం అని వాదించే సిద్ధాంతాన్ని సూచిస్తుంది, ఆ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని జీవంతోపాటు ప్రతీది సహజాతీతమైన శక్తి ప్రమేయం లేకుండానే ఉనికిలోకి వచ్చింది.

[15వ పేజీలోని బ్లర్బ్‌]

“ఉత్పరివర్తనాలు [మొక్కల లేదా జంతువుల] ప్రధాన జాతులను పూర్తి కొత్త జాతిగా మార్చలేవు”

[16వ పేజీలోని బ్లర్బ్‌]

ఒక జాతి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారగలదని మాత్రమే డార్విన్‌ పిట్టలు నిరూపిస్తున్నాయి

[17వ పేజీలోని బ్లర్బ్‌]

శిలాజాల వివరాల ప్రకారం, అన్ని ప్రధాన జాతుల జంతువులు ఒక్కసారిగా ఉనికిలోకివచ్చి ఏ మార్పులూ లేకుండా అలాగే జీవించాయి

[14వ పేజీలోని చార్టు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ప్రాణుల వర్గీకరణ

ప్రాణులు ప్రత్యేక జాతులుగా, రాజ్యాలు అనే పెద్ద గుంపులుగా వర్గీకరించబడ్డాయి. * ఉదాహరణకు, మానవులు, పండ్లు తినే ఈగలు ఎలా వర్గీకరించబడ్డాయో చూపిస్తున్న ఆ క్రింది చార్టును చూడండి.

మానవులు పండ్లు తినే ఈగలు

జాతులు సెపీయన్స్‌ మెలానోగాస్టర్‌

ప్రజాతి హోమో డ్రాసోఫైలా

కుటుంబం హోమినిడ్స్‌ డ్రాసోఫైలిడ్స్‌

క్రమం ప్రైమేట్స్‌ డిప్తేరా

విభాగం క్షీరదాలు పురుగులు

వర్గం కోర్‌డేట్స్‌ ఆర్త్రోపాడ్స్‌

రాజ్యం జంతువులు జంతువులు

[అధస్సూచి]

^ గమనిక: మొక్కలు, జంతువులు “వాటి వాటి జాతుల ప్రకారం” పునరుత్పత్తి చేస్తాయని ఆదికాండము 1వ అధ్యాయం చెబుతోంది. (ఆదికాండము 1:12, 21, 24, 25) అయితే, బైబిల్లోని “జాతి” అనే పదం విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన పదం కాదు, కాబట్టి విజ్ఞానశాస్త్ర పదమైన “జాతులు” అనే పదం బైబిల్లోని పదం ఒకటే అని తలంచకూడదు.

[చిత్రసౌజన్యం]

పై చార్టు జోనతన్‌ వెల్స్‌ వ్రాసిన ఐకన్స్‌ ఆఫ్‌ ఎవల్యూషన్‌​—⁠సైన్స్‌ ఆర్‌ మిథ్‌? వై మచ్‌ ఆఫ్‌ వాట్‌ వి టీచ్‌ ఎబౌట్‌ ఎవల్యూషన్‌ ఈజ్‌ రాంగ్‌ అనే పుస్తకంపై ఆధారపడినది

[15వ పేజీలోని చిత్రాలు]

సరిగా రూపొందని పండ్లు తినే ఈగ (పైన ఉన్నది), అదింకా పండ్లు తినే ఈగేనా

[చిత్రసౌజన్యం]

© Dr. Jeremy Burgess/Photo Researchers, Inc.

[15వ పేజీలోని చిత్రాలు]

కొత్త ఉత్పరివర్తితాలు వేగంగా తగ్గిపోతుండగా తరచూ అవే రకమైన ఉత్పరివర్తితాలు తిరిగి కనబడుతున్నాయనీ ఉత్పరివర్తనాల ప్రయోగాలు పదేపదే నిరూపించాయి. (చూపించబడిన ఉత్పరివర్తనానికి పెద్ద పువ్వులున్నాయి)

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

From a Photograph by Mrs. J. M. Cameron/ U.S. National Archives photo

[16వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఫించ్‌ పిట్టల తలలు: © Dr. Jeremy Burgess/ Photo Researchers, Inc.

[17వ పేజీలోని చిత్రసౌజన్యం]

డైనోసార్‌: © Pat Canova/Index Stock Imagery; శిలాజాలు: GOH CHAI HIN/AFP/Getty Images