మీరు ఎవరిని నమ్మాలి?
మీరు ఎవరిని నమ్మాలి?
“ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.”—హెబ్రీయులు 3:3.
ఈ బైబిలు రచయిత తర్కంతో మీరు ఏకీభవిస్తారా? ఆ లేఖనం వ్రాయబడినప్పటి నుండి మానవజాతి దాదాపు 2,000 సంవత్సరాల వైజ్ఞానిక పురోగతిని చవిచూసింది. ప్రకృతిలో కనబడే రూపకల్పనకు ఒక రూపకర్త, సృష్టికర్తయైన దేవునిపై నమ్మకం అవసరమని తలంచేవారు ఇంకా ఉన్నారా?
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అనేకులు, దేవునిపై నమ్మకం అవసరమనే జవాబిస్తారు. ఉదాహరణకు, అమెరికాలో న్యూస్‌వీక్ పత్రిక 2005లో నిర్వహించిన సర్వే ప్రకారం 80 శాతం మంది “విశ్వాన్ని దేవుడే సృష్టించాడని నమ్ముతున్నారు.” విద్య లేనందువల్లే వారలా నమ్ముతున్నారా? అదే నిజమైతే, మరి శాస్త్రజ్ఞుల్లో ఎవరైనా దేవుడున్నాడని నమ్ముతున్నారా? నేచర్ అనే విజ్ఞానశాస్త్ర పత్రిక 1997లో నివేదించిన ప్రకారం, సర్వే చేయబడినవారిలో దాదాపు 40 శాతం మంది జీవశాస్త్రజ్ఞులు, భౌతికశాస్త్రవేత్తలు, గణితశాస్త్రవేత్తలు దేవుడు ఉనికిలో ఉన్నాడనేకాక, ఆయన ప్రార్థనలను వింటాడని, వాటికి జవాబిస్తాడని కూడా నమ్ముతున్నారు.
అయితే, కొందరు శాస్త్రజ్ఞులు ఆ విషయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారు. నోబుల్ బహుమతి గ్రహీత డాక్టర్ హర్బర్ట్ ఎ. హాప్ట్‌మాన్ ఇటీవలి ఒక వైజ్ఞానిక సమావేశానికి హాజరైనవారితో మాట్లాడుతూ, “సహజాతీతమైన వాటిని నమ్మడం, ముఖ్యంగా దేవుణ్ణి నమ్మడం, వాస్తవిక విజ్ఞానశాస్త్రానికి విరుద్ధమైనదని, అలాంటి నమ్మకం మానవజాతి సంక్షేమానికి హానికరం” అని అన్నాడు. దేవుణ్ణి నమ్మే శాస్త్రజ్ఞులు కూడా మొక్కల్లో, జంతువుల్లో స్పష్టంగా కనిపించే రూపకల్పనకు ఒక రూపకర్త అవసరమనే విషయాన్ని బోధించేందుకు వెనకాడుతున్నారు. ఎందుకు? ఒక కారణాన్ని సూచిస్తూ స్మిత్‌సోనియన్ సంస్థలో శిలాజ జీవశాస్త్రవేత్తగా ఉన్న డగ్లస్ హెచ్. ఎర్విన్ ఇలా అంటున్నాడు: “విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఒక నియమం ఏమిటంటే, అది అద్భుతాలను అంగీకరించదు.”
మీరు ఏమి ఆలోచించాలో, ఏమి నమ్మాలో ఇతరులు మీకు నిర్దేశించేందుకు మీరు అనుమతించవచ్చు, లేదా మీరే స్వయంగా కొన్ని ఆధారాల్ని పరిశీలించి ఒక నిర్ధారణకు రావాలనుకోవచ్చు. మీరు తర్వాతి పేజీల్లో విజ్ఞానశాస్త్రపరంగా క్రొత్తగా కనుగొన్న విషయాల గురించి చదువుతుండగా, ‘ఒక సృష్టికర్త ఉన్నాడనే నిర్ధారణకు రావడం హేతుబద్ధమైనదేనా’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (g 9/06)
[3వ పేజీలోని బ్లర్బ్]
మీరే స్వయంగా ఆధారాల్ని పరిశీలించండి
[3వ పేజీలోని బాక్సు]
యెహోవాసాక్షులు సృష్టివాదులా?
బైబిలు పుస్తకమైన ఆదికాండములో నమోదు చేయబడిన సృష్టి వృత్తాంతం నిజమని యెహోవాసాక్షులు నమ్ముతారు. అయితే, బహుశా మీరు అనుకుంటున్నట్లుగా యెహోవాసాక్షులు సృష్టివాదులు కాదు. ఎందుకు? ఎందుకంటే, చాలామంది సృష్టివాదులు ఈ విశ్వం, భూమి, దానిలోని జీవరాశులన్నీ దాదాపు 10,000 సంవత్సరాల క్రితం 24 గంటలున్న ఆరు సృష్టి దినాల్లోనే సృష్టించబడ్డాయని నమ్ముతారు. అయితే, బైబిలు అలా బోధించడం లేదు. * అంతేకాక, సృష్టివాదులు బైబిలు సమర్థించని మరెన్నో సిద్ధాంతాలను అంగీకరించారు. కానీ, యెహోవాసాక్షులు తమ మత బోధలన్నింటికీ దేవుని వాక్యాన్నే ఆధారంగా చేసుకుంటారు.
అంతేకాక, కొన్ని ప్రాంతాల్లో సృష్టివాదులు అనే పదం, రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే సనాతనవాద గుంపుల్ని సూచించేందుకు పర్యాయపదంగా ఉపయోగించబడుతోంది. ఆ గుంపులు రాజకీయవేత్తలను, న్యాయాధిపతులను, విద్యావేత్తలను సృష్టివాదుల మత విధానాన్ని, శాసనాలను, బోధలను స్వీకరించమని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తాయి.
యెహోవాసాక్షులు రాజకీయాల్లో తటస్థంగా ఉంటారు. శాసనాలు చేసి, వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాలకున్న హక్కును వారు గౌరవిస్తారు. (రోమీయులు 13:1-7) అయితే, వారు “లోకసంబంధులు కారు” అని యేసు చెప్పిన మాటల్ని వారు గంభీరంగా తీసుకుంటారు. (యోహాను 17:14-16) వారు తమ బహిరంగ పరిచర్య ద్వారా దేవుని కట్టడల ప్రకారం జీవించడంలోని ప్రయోజనాలేమిటో తెలుసుకునేందుకు ప్రజలకు మంచి అవకాశాన్నిస్తారు. అయితే, బైబిలు ప్రమాణాలను అంగీకరించేందుకు ఇతరుల్ని బలవంతపెట్టే పౌర శాసనాలు విధించే సనాతనవాదుల గుంపుల ప్రయత్నాలకు మద్దతివ్వడం ద్వారా యెహోవాసాక్షులు తమ క్రైస్తవ తటస్థతను ఉల్లంఘించరు.
[అధస్సూచి]
^ ఈ సంచికలోని 18వ పేజీలో ఉన్న “బైబిలు ఉద్దేశము: విజ్ఞానశాస్త్రం ఆదికాండములోని వృత్తాంతానికి విరుద్ధంగా ఉందా?” అనే ఆర్టికల్‌ను దయచేసి చూడండి.