కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టికర్త ఉన్నాడని మేము నమ్మడానికిగల కారణాలు

సృష్టికర్త ఉన్నాడని మేము నమ్మడానికిగల కారణాలు

సృష్టికర్త ఉన్నాడని మేము నమ్మడానికిగల కారణాలు

వివిధ విజ్ఞానశాస్త్ర రంగాలకు చెందిన అనేకమంది నిపుణులు, ప్రకృతి జ్ఞానవంతంగా రూపొందించబడిందని గ్రహిస్తారు. భూమ్మీదున్న ఎంతో సంక్లిష్టమైన జీవం యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చిందనే నమ్మకం తర్కవిరుద్ధమైనదని వారు భావిస్తారు. అందుకే, శాస్త్రజ్ఞుల్లో, పరిశోధకుల్లో అనేకులు సృష్టికర్త ఉన్నాడని నమ్ముతారు.

వారిలో కొందరు యెహోవాసాక్షులయ్యారు. బైబిల్లో పేర్కొనబడిన దేవుడే ఈ భౌతిక విశ్వాన్ని రూపొందించి, సృష్టించాడని వారు నమ్ముతున్నారు. వారు ఆ నిర్ధారణకు ఎందుకు వచ్చారు? తేజరిల్లు! పత్రిక వారిలో కొందరిని ఇంటర్వ్యూ చేసింది. వారిచ్చిన జవాబులు మీకు ఆసక్తికరంగా అనిపించవచ్చు. *

“జీవంలో నిగూఢమైన సంక్లిష్టత”

వుల్ఫ్‌-ఎక్కెహార్డ్‌ లాన్నిగ్‌

పరిచయం: గత 28 ఏళ్లలో నేను మొక్కల్లోని జన్యు ఉత్పరివర్తనాలకు సంబంధించిన పరిశోధన చేశాను. వాటిలో 21 ఏళ్లుగా నేను జర్మనీలోని కొలోన్‌లో ఉన్న మాక్స్‌-ప్లాంక్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ సంస్థలో పని చేస్తున్నాను. సుమారు మూడు దశాబ్దాల నుండి నేను యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘంలో పెద్దగా కూడా సేవ చేస్తున్నాను.

జన్యుశాస్త్రంలో నేను జరిపిన పరిశోధనలు, ప్రయోగాలతోపాటు, జీవశాస్త్ర అంశాలైన శరీరధర్మశాస్త్రాన్ని, స్వరూపశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా నేను జీవంలోని అపారమైన, నిగూఢమైన సంక్లిష్టతను గ్రహించగలిగాను. ఆ అంశాలను నేను అధ్యయనం చేసినప్పుడు, ప్రాణులన్నింటికీ, చివరకు అతి సూక్ష్మమైన జీవరాశులను కూడా జ్ఞానవంతుడైన రూపకర్త సృష్టించాడనే నా నమ్మకం మరింత బలపడింది.

శాస్త్రవేత్తలకు జీవంలోని సంక్లిష్టత గురించి బాగా తెలుసు. అయితే, వారు ఈ అద్భుతమైన వాస్తవాలను సాధారణంగా పరిణామాన్ని గట్టిగా సమర్థించే విధంగానే వివరిస్తారు. కానీ, నా అభిప్రాయం ప్రకారం, బైబిల్లోని సృష్టి వృత్తాంతానికి వ్యతిరేకంగా చేయబడే వాదనలు, సునిశిత వైజ్ఞానిక పరిశోధన చేసినప్పుడు తప్పని రుజువౌతాయి. నేను దశాబ్దాలుగా అలాంటి ఎన్నో వాదనలను పరిశీలించాను. ప్రాణుల గురించి చాలా శ్రద్ధగా అధ్యయనం చేసి, భూమిపై జీవం ఉనికిలో ఉండే విధంగా విశ్వాన్ని నియంత్రించే నియమాలు ఎలా ఖచ్చితంగా విధించబడ్డాయో పరిశోధించినప్పుడు, సృష్టికర్త ఉన్నాడని నేను నమ్మకుండా ఉండలేకపోతున్నాను.

“నేను పరిశీలించే ప్రతీదానికీ ఒక కారణం ఉంది”

బైరన్‌ లియాన్‌ మెడోస్‌

పరిచయం: నేను అమెరికా నివాసిని, నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనే సంస్థలో లేసర్‌ ఫిసిక్స్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాను. భౌగోళిక ఉష్టోగ్రత, వాతావరణం, గ్రహాల సంబంధిత ఇతర విషయాలను మరింత సమర్థవంతంగా పరిశోధించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే పనిలో నేనిప్పుడు ఉన్నాను. వర్జీనియా ప్రాంతంలోని కిల్‌మార్నోక్‌లో ఉన్న యెహోవాసాక్షుల సంఘంలో నేనొక పెద్దగా ఉన్నాను.

నేను ఎక్కువగా భౌతికశాస్త్ర సూత్రాలను ఆధారం చేసుకుని నా పరిశోధన సాగిస్తుంటాను. కొన్ని విషయాలు ఎందుకు జరుగుతాయో, ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. నా పరిశోధనా రంగంలో, నేను పరిశీలించే ప్రతీదానికీ ఒక కారణం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలను చూశాను. ప్రకృతిలో ఉన్న వాటన్నింటికీ దేవుడే అసలైన కారకుడని అంగీకరించడం వైజ్ఞానికపరంగా సహేతుకమైనదని నేను నమ్ముతున్నాను. ప్రకృతి నియమాలు ఎంత స్థిరంగా ఉన్నాయంటే, అవన్నీ ఒక వ్యవస్థాపకుని చేత, సృష్టికర్త చేత విధించబడ్డాయని నేను నమ్మకుండా ఉండలేకపోతున్నాను.

విషయాలు అంత స్పష్టంగా ఉన్నప్పుడు, అనేకమంది శాస్త్రజ్ఞులు పరిణామాన్ని ఎందుకు నమ్ముతున్నారు? పరిణామవాదులు బహుశా ముందే ఏర్పరచుకున్న నిర్దిష్ట అభిప్రాయాలతో ఆధారాల్ని పరిశీలిస్తుండవచ్చా? శాస్త్రజ్ఞుల్లో అలా జరగడం కొత్తేమీ కాదు. వారి పరిశోధనలు సృష్టికర్త ఉన్నాడని నిరూపిస్తున్నా, వారు ఖచ్చితంగా సరైన ముగింపుకే వస్తారని చెప్పలేం. ఉదాహరణకు, లేజర్‌ కిరణాల సంబంధిత భౌతిక శాస్త్రాన్ని అధ్యయం చేసే వ్యక్తి, కాంతి సాధారణంగా తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది కాబట్టి, కాంతి కూడా ఒక శబ్దంలాగే తరంగమని వాదించవచ్చు. అయితే, ఆయన పరిశోధన అసంపూర్ణంగానే ఉంటుంది, ఎందుకంటే కాంతి ఫోటాన్‌లు అనబడే రేణువుల సముదాయాల రూపంలో కూడా ప్రయాణిస్తుందని ఆధారాలు సూచిస్తున్నాయి. అదే విధంగా, పరిణామం వాస్తవమని వాదించేవారు కేవలం పాక్షిక రుజువులపైనే ఆధారపడి నిర్ధారణలకు వస్తారు, అంతేకాక వారు ఆధారాల్ని పరిశీలిస్తున్నప్పుడు కూడా తాము ముందే ఏర్పర్చుకున్న నిర్దిష్ట అభిప్రాయాలు తమ నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు అనుమతిస్తారు.

పరిణామాన్ని సమర్థించే “నిపుణులే” అదెలా జరిగిందో తమలో తాము వాదించుకుంటున్నప్పుడు పరిణామ సిద్ధాంతం వాస్తవమని అంగీకరించే వారున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు, కొందరు నిపుణులు 2ను 2తో కలిపితే 4 వస్తుందనీ, మరికొందరు నిపుణులు బహుశా 3 లేక 6 రావచ్చని చెబితే గణితశాస్త్రం రుజువుచేయబడిన వాస్తవమని మీరు అంగీకరిస్తారా? విజ్ఞానశాస్త్రం కేవలం రుజువు చేయగలిగేవాటిని, పరీక్షించగలిగేవాటిని, పునరుత్పత్తి చేయగలిగేవాటినే అంగీకరిస్తే, ప్రాణులన్నీ కేవలం ఒకే మూలజీవి నుండే పరిణామం చెందాయనే సిద్ధాంతం వైజ్ఞానిక వాస్తవం కాదు. (g 9/06)

“శూన్యం నుండి ఏదీ ఉద్భవించదు”

కెన్నెత్‌ ల్లాయిడ్‌ టనాకా

పరిచయం: నొక భూవిజ్ఞాన శాస్త్రవేత్తని. ప్రస్తుతం ఆరిజోనాలోని యు.ఎస్‌. జియాలాజికల్‌ సర్వే ఇన్‌ ఫ్లాగ్‌స్టాఫ్‌ అనే సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. దాదాపు మూడు దశాబ్దాలుగా నేను భూవిజ్ఞాన శాస్త్రంలోని వివిధ రంగాల పరిశోధనలతోపాటు, గ్రహాల పరిశోధనల్లో కూడా పాల్గొన్నాను. నా పరిశోధనా వ్యాసాలు అనేకం, మార్స్‌ గ్రహానికి చెందిన చిత్రపటాలు ప్రముఖ వైజ్ఞానిక పత్రికల్లో ప్రచురించబడ్డాయి. బైబిలు చదవమని ప్రోత్సహించడానికి ఒక యెహోవాసాక్షిగా నేను ప్రతీ నెలా దాదాపు 70 గంటలు గడుపుతున్నాను.

పరిణామ సిద్ధాంతం నాకు బోధించబడింది, కానీ ఈ విశ్వాన్ని రూపొందించేందుకు అవసరమైన అపార శక్తి, ఒక శక్తిమంతుడైన సృష్టికర్త లేకుండానే వచ్చిందనే విషయాన్ని నేను నమ్మలేకపోయాను. శూన్యం నుండి ఏదీ ఉద్భవించలేదు. అంతేకాక, సృష్టికర్త ఉన్నాడని నిరూపించే గట్టి వాదన బైబిల్లో ఉండడం కూడా నేను చూశాను. ఆ పుస్తకంలో, నేను పరిశోధించే రంగానికి సంబంధించిన ఎన్నో వైజ్ఞానిక వాస్తవాలు ఉన్నాయి, మచ్చుకు చెప్పాలంటే, భూమి గుండ్రంగా ఉందనీ, అది “శూన్యముపైన” వేలాడుతుందనే విషయాలు అందులో ఉన్నాయి. (యోబు 26:7; యెషయా 40:​22) మానవ పరిశోధనలు రుజువుచేయకముందే ఎంతో కాలం క్రితమే బైబిల్లో ఆ నిజాలు వ్రాయబడ్డాయి.

మనం సృష్టించబడిన రీతిని గురించి ఆలోచించండి. మనకు గ్రహణశక్తులు, స్వీయావగాహన, తెలివైన ఆలోచనలు, సంభాషించే సామర్థ్యాలు, భావాలున్నాయి. ప్రత్యేకంగా, మనం ప్రేమానుభూతి పొందగలం, ప్రేమను కనపరచినవారిపట్ల కృతజ్ఞత చూపించగలం, దాన్ని వ్యక్తపరచగలం. ఇంతటి అద్భుతమైన గుణాలు మానవుల్లో ఎలా వచ్చాయో పరిణామ సిద్ధాంతం వివరించలేదు.

మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి, ‘పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించే సమాచారాన్ని అందించే మూలసమాచారాలు ఎంత ఆధారపడదగినవి, ఎంత నమ్మదగినవి?’ భూవిజ్ఞానశాస్త్ర నివేదికలు అసంపూర్ణంగా, సంక్లిష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. పరిణామవాదులు తాము ప్రతిపాదించిన సిద్ధాంతాల్ని వైజ్ఞానిక పద్ధతల ప్రకారం ప్రయోగశాలల్లో నిరూపించలేకపోయారు. శాస్త్రజ్ఞులు సమాచారాన్ని సేకరించడానికి సాధారణంగా మంచి పరిశోధనా పద్ధతుల్ని ప్రయోగించినా, వారు తమ పరిశోధనా ఫలితాల్ని వివరిస్తున్నప్పుడు స్వార్థపూరిత ఉద్దేశాలే వారిని తరచూ ప్రభావితం చేస్తాయి. సమాచారం అసంపూర్ణంగా లేదా పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు శాస్త్రజ్ఞులు తమ సొంత అభిప్రాయాల్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తారని అందరికీ తెలుసు. వారి వృత్తి, ఆత్మాభిమానమే వారికి ప్రాముఖ్యం.

ఒక శాస్త్రజ్ఞునిగా, బైబిలు విద్యార్థిగా నేను, సరైన అవగాహన కోసం తెలిసిన అన్ని వాస్తవాలతో, పరిశోధనలతో పొందికగావున్న పూర్తి సత్యాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తాను. సృష్టికర్తపై నమ్మకముంచడమే ఎంతో సహేతుకమైనదని నాకానిపిస్తుంది.

“జీవకణంలో స్పష్టంగా కనిపించే రూపకల్పన”

పౌలా కిన్చిలో

పరిచయం: జీవకణాల, అణుజీవశాస్త్రం, సూక్ష్మజీవుల శాస్త్రానికి సంబంధించిన రంగాల్లో పరిశోధకురాలిగా నాకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. నేను ప్రస్తుతం అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న అట్లాంటా నగరంలోని ఎమరీ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాను. రష్యన్‌ భాషా సమాజంలో నేనో స్వచ్ఛంద బైబిలు బోధకురాలిగా కూడా సేవ చేస్తున్నాను.

జీవశాస్త్రంలో నా విద్యాభ్యాసంలో భాగంగా జీవకణం, దానిలోని భాగాల గురించే ప్రత్యేకంగా నాలుగు సంవత్సరాలు అధ్యయనం చేశాను. కణంలోని అనువంశిక సూక్ష్మాణువులైన డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎ, మాంసకృత్తులు, జీవక్రియల గురించి నేను నేర్చుకునే కొద్దీ వాటిలోని సంక్లిష్టత, సంస్థీకరణ, ప్రామాణికనుబట్టి నేనెంతో విస్మయం చెందాను. మానవుడు కణాల గురించి సంపాదించిన అపార జ్ఞానాన్నిబట్టి నేను ఆశ్చర్యపోయినా, దాని గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని గ్రహించి మరింత ఆశ్చర్యపోయాను. కణంలో స్పష్టంగా కనిపించే రూపకల్పన నేను దేవుణ్ణి నమ్మడానికి ఒక కారణం.

బైబిలు అధ్యయనం చేయడంవల్ల సృష్టికర్త పేరేమిటో నాకు తెలిసింది, ఆయనే యెహోవా దేవుడు. ఆయన జ్ఞానవంతుడైన రూపకర్త మాత్రమే కాక, నాపట్ల శ్రద్ధ చూపించే దయ, ప్రేమగల తండ్రి. బైబిలు జీవిత సంకల్పం గురించి వివరించడమేకాక, సంతోషకరమైన భవిష్యత్తు నిరీక్షణను కూడా ఇస్తోంది.

యౌవనులకు స్కూల్లో పరిణామం గురించి బోధించబడుతున్నప్పుడు, దేనిని నమ్మాలో వారికి అర్థంకాకపోవచ్చు. అప్పుడు వారు అయోమయ పరిస్థితిని ఎదుర్కోవచ్చు. వారు ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్ముతుంటే, అది వారి విశ్వాసానికే పరీక్షగా తయారౌతుంది. కానీ, వారు మన చుట్టూవున్న ప్రకృతిలోని అద్భుతమైన అనేక సృష్టికార్యలను పరిశీలించడం ద్వారా, సృష్టికర్త గురించిన, ఆయన గుణాల గురించిన జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండడం ద్వారా ఆ పరీక్షను ఎదుర్కోవచ్చు. నేను కూడా అలాగే చేసి బైబిల్లోని సృష్టి వృత్తాంతం ఖచ్చితమైనదనీ, అది వాస్తవిక విజ్ఞానానికి విరుద్ధమైనది కాదనే నిర్ధారణకు వచ్చాను.

“అద్భుతంగా రూపొందించబడిన స్పష్టమైన నియమాలు”

ఎన్రీక్‌ హర్నాన్డెజ్‌ లీమస్‌

పరిచయం: నేను యెహోవాసాక్షుల పూర్తికాల సేవకుణ్ణి. నేను సైద్ధాంతిక భౌతికశాస్త్రవేత్తను కూడా. నేను ప్రస్తుతం, మెక్సికోలోని నేషనల్‌ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాను. నక్షత్రాలు వృద్ధి చెందేందుకు కారణమయ్యే గురుత్వాకర్షక విధ్వంసం అనే అసాధారణ ప్రక్రియకు ఉష్ణగతిక సిద్ధాంతాల ప్రకారం సరైన వివరణను కనుక్కోవడానికి నేను ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాను. డిఎన్‌ఎ సీక్వెన్సుల సంక్లిష్టత గురించి కూడా పరిశోధించాను.

జీవం ఎంత సంక్లిష్టమైందంటే అది కేవలం యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చే అవకాశమే లేదు. ఉదాహరణకు, డిఎన్‌ఎ సూక్ష్మాణువులో ఉండే అపారమైన సమాచారం గురించి ఆలోచించండి. గణితశాస్త్రానుసారంగా, క్రోమోజోమ్‌ 9 లక్షల కోట్ల సందర్భాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చే అవకాశం ఉంది, అంటే అలా జరగడం దాదాపు అసంభవమే. ఒక్క క్రోమోజోమ్‌నే కాదు ప్రాణుల్లో ఉన్న అద్భుతమైన సంక్లిష్టత జ్ఞానంతో సంబంధం లేని శక్తి మూలంగా ఉనికిలోకి వచ్చిందని నమ్మడం మూర్ఖత్వమే అని నేను అనుకుంటున్నాను.

అంతేకాక, సూక్ష్మ పదార్థాలు మొదలుకొని అంతరిక్షంలోని సువిశాల నక్షత్ర వీధుల వరకున్న పదార్థంలోని అత్యంత సంక్లిష్ట స్వభావం గురించి నేను అధ్యయనం చేసినప్పుడు, వాటి కదలికల్ని నియంత్రించేందుకు అద్భుతంగా రూపొందించబడిన స్పష్టమైన నియమాలనుబట్టి నేను ముగ్ధుణ్ణయ్యాను. నా అభిప్రాయం ప్రకారం, ఈ నియమాలు ఒక ప్రజ్ఞావంతుడైన గణితశాస్త్రజ్ఞుని పనితనాన్ని ప్రదర్శించడమేకాక, అవి ప్రవీణుడైన గొప్ప కళాకారుడు ధృవీకరించిన హస్తాక్షరాల్లా కూడా ఉన్నాయి.

నేనొక యెహోవాసాక్షినని ఇతరులకు చెప్పినప్పుడు వారు తరచూ ఆశ్చర్యపోతారు. నాకు దేవునిపై నమ్మకం ఉండడం ఏమిటి అని వారు కొన్నిసార్లు నన్ను అడుగుతారు. వారి ప్రతిస్పందన అర్థం చేసుకోదగినదే, ఎందుకంటే అనేక మతాలు తమ సభ్యులను, బోధించబడే వాటి గురించి రుజువులు అడగమని లేదా తమ నమ్మకాలు గురించి పరిశోధించమని ప్రోత్సహించవు. అయితే, బైబిలు మన “వివేచనను” ఉపయోగించమని ప్రోత్సహిస్తోంది. (సామెతలు 3:21) ప్రకృతి జ్ఞానవంతంగా రూపొందించబడిందని చూపించే రుజువులతోపాటు బైబిల్లోని ఆధారాలు, దేవుడు ఉనికిలో ఉన్నాడనేకాక, ఆయన మన ప్రార్థనలను శ్రద్ధగా వింటాడనే నమ్మకాన్ని కూడా కలుగజేస్తున్నాయి.

[అధస్సూచి]

^ ఈ ఆర్టికల్‌లోని నిపుణుల అభిప్రాయాలు, వారి పైఅధికారుల అభిప్రాయాలే కానవసరం లేదు.

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

నేపథ్యంలో ఉన్న అంగారక గ్రహం: Courtesy USGS Astrogeology Research Program, http://astrogeology.usgs.gov