కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె తాను తెలుసుకున్నవాటిని అమూల్యమైనవిగా ఎంచింది

ఆమె తాను తెలుసుకున్నవాటిని అమూల్యమైనవిగా ఎంచింది

ఆమె తాను తెలుసుకున్నవాటిని అమూల్యమైనవిగా ఎంచింది

ఒక మహిళ రాసిన ఉత్తరం ఇటీవల దొరికింది, ఆమె దాన్ని తాను 2004 మే నెలలో క్యాన్సర్‌తో మరణించడానికి కొంతకాలం ముందు రాసింది. బహుశా ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమె ఆ ఉత్తరాన్ని పూర్తిచేయలేకపోయి ఉండవచ్చు. అయితే, కొంతకాలం తర్వాత పోస్టు చేయబడని ఆ ఉత్తరాన్ని చదివినవారు కంటతడిపెట్టేంతగా కదిలించబడ్డారు, దేవునిపట్ల వారి విశ్వాసం బలపడింది.

ఆ ఉత్తరాన్ని రాసిన సూజన్‌, అమెరికాలోని కనెక్టికట్‌లో ఉన్న యెహోవాసాక్షుల క్రైస్తవ పెద్దకు మొదటిసారి ఫోన్‌ చేసినప్పుడు తానొక టీనేజర్‌నని దానిలో వర్ణించింది. ఆ కౌమారదశలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆమె ఆ ఉత్తరంలో వివరించింది. హృదయాన్ని స్పృశించే ఆ ఉత్తరం 2005 నవంబరులో సూజన్‌ వాళ్ల అమ్మకు ఇవ్వబడింది, ఆమె దాని ప్రతిని న్యూయార్క్‌లోని యెహోవాసాక్షుల ప్రధానకార్యాలయానికి పంపింది.

తనకు 1973లో కనెక్టికట్‌లో ఉన్న ఒక సంఘపెద్ద ఫోన్‌ నంబరు టెలిఫోన్‌ డైరెక్టరీలో దొరికినట్లు సూజన్‌ రాసింది. “ఆ సంవత్సరం నాకు ఎంతో ప్రాముఖ్యమైనది, నాకప్పుడు 14 ఏళ్లు, కావలికోట, తేజరిల్లు! పత్రికలు చదివిన తర్వాత అది సత్యమనే నిర్ణయానికి వచ్చాను. గతంలో నేనెన్నడూ యెహోవాసాక్షులను కలవలేదు కాబట్టి నేను వారి నంబరు కోసం టెలిఫోన్‌ డైరెక్టరీలో వెతికాను. నా టెలిఫోన్‌ నంబరులోని మొదటి మూడు అంకెలతో ప్రారంభమయ్యే నంబరునే ఎంచుకున్నాను. సహోదరుడు జెన్రిక్‌ నాతో ఫోన్‌లో మాట్లాడుతూ, నేను సాక్షులను ఎన్నడూ కలవలేదని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు” అని ఆమె వివరించింది. *

ఒక నాటకీయ సమస్య

సూజన్‌ తన ఉత్తరంలో వివరించిన దాని ప్రకారం, ఆమెకు పదేళ్లు ఉన్నప్పుడు వాళ్లమ్మ ఆమెను కనెక్టికట్‌లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికి పంపింది. అసలైతే ఆమె కొంతకాలం ఉండడానికే అక్కడికి వెళ్ళింది, కానీ ఆ తర్వాత, తానిక చిన్నమ్మతోనే ఉండిపోతానని ఫ్లోరిడాలో ఒంటరిగా ఉన్న వాళ్లమ్మకు సూజన్‌ చెప్పింది. తన పరిస్థితి “స్టాక్‌హోమ్‌ సిండ్రోమ్‌లా తయారైందని, దీనికి గురైనవారు తమను అణచివేసేవారితో బంధాన్ని ఏర్పరచుకుంటారు” అని సూజన్‌ తన ఉత్తరంలో రాసింది. * ఆమె చిన్నమ్మ ఆమెతో ఎంతో కఠినంగా వ్యవహరించింది.

“మా చిన్నమ్మ, ఆమె సహచరుడు నాతో ఎంతో క్రూరంగా ప్రవర్తించారు. అంతేకాక, బయటివారు ఏనాడూ మా ఇంటిగడప తొక్కేవారుకాదు. మా అమ్మ నా ఖర్చుల కోసం ఎంతో డబ్బు పంపించినా, నేను పాఠశాలకు వెళ్తున్నప్పుడు మధ్యాహ్న భోజనంగానీ మంచి బట్టలుగానీ ఇచ్చేవారు కాదు. నా దగ్గర ఒక జత లోదుస్తులు మాత్రమే ఉండేవి, నాకన్నా కొన్ని సంవత్సరాలు చిన్నవారైన మా చిన్నమ్మ ఇద్దరి కూతుళ్ళకు సమస్తం ఇవ్వబడేవి” అని సూజన్‌ రాసింది. తనకు బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని చిన్నమ్మకు తెలిస్తే, తాను సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుందని తానెందుకు ఊహించిందో వివరించేందుకు ఆమె పైనున్న విషయాలను రాసింది.

సూజన్‌ బైబిలు జ్ఞానాన్ని ఎలా పెంచుకుంది?

“సహోదరుడు జెన్రిక్‌, నన్ను లారా అనే పరిణతి చెందిన సహోదరికి పరిచయం చేశాడు, ఆమె నాకున్న అనేక బైబిలు ప్రశ్నలకు జవాబిచ్చేందుకు నాతో ఎంతో సమయం గడిపింది. వాణిజ్య సంబంధమైన లాండ్రీలోనే మేము ఎక్కువగా కలుసుకునేవాళ్లం” అని సూజన్‌ రాసింది. తాను అప్పటివరకు ఏ విషయంలోనూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదని, అయితే ఆ సహోదరితో బైబిలు చర్చించి, నిత్యజీవమునకు నడుపు సత్యము వంటి బైబిలు ఆధారిత సాహిత్యాలను చదివిన తర్వాత, ఆమె సొంతగా నిర్ణయం తీసుకుంది.

సూజన్‌ ఇంకా ఇలా చెబుతోంది: “అది శుక్రవారం రాత్రి, నేను సాక్షులతో మాట్లాడుతున్నానని మా చిన్నమ్మతో చెప్పినప్పుడు, ఆమె నన్ను వంటగది మధ్యలో నిలబెట్టి రాత్రంతా మెలకువగా ఉండేలా చేసింది. ఆ సంఘటన తర్వాత, సాక్షిగా మారాలనే నా దృఢనిశ్చయం మునుపటికన్నా మరింత బలపడింది.”

అప్పటినుండి సహోదరుడు జెన్రిక్‌, ఆమె బైబిలును అర్థం చేసుకునేందుకు సహాయం చేయడానికి సూజన్‌కు సాహిత్యాలిస్తూ వచ్చాడు. “యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం 1974 (ఆంగ్లం) నాకిప్పటికీ గుర్తుంది, ఎందుకంటే అది నాజీ జర్మనీలోని సాక్షులు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో, దానికి ముందు హింసను ఎలా సహించారో ఆ వార్షిక పుస్తకం వివరించింది. . . . నేను రాజ్యగీతాలను నేర్చుకునేందుకు వాటిని క్యాసెట్టులో రికార్డు చేయమని ఒక పెద్దను ఆ తర్వాతే కోరాను. ఒక ఏడాదిలోనే నేను ‘సింగింగ్‌ అండ్‌ అకంపెనీయింగ్‌ యువర్‌సెల్ఫ్‌ విత్‌ మ్యూజిక్‌ ఇన్‌ యువర్‌ హార్ట్స్‌’ అనే 1966 పాటల పుస్తకంలోని మొత్తం 119 పాటలను వరుసగా పాడగలిగేదాన్ని” అని సూజన్‌ రాసింది.

“ఆ మధ్యకాలంలోనే, సహోదరుడు జెన్రిక్‌ నాకు బైబిలు ప్రసంగాల, నాటకాల, సమావేశ కార్యక్రమాల క్యాసెట్లను కూడా ఇచ్చేవాడు. ఆయన 10వ నంబరు మార్గంలో ఒక టెలిఫోన్‌ స్తంభం దగ్గర వాటిని ఉంచేవాడు, నేను అక్కడి నుండి వాటిని తెచ్చుకునేదాన్ని. . . . నేను ఒక్క కూటానికి కూడా హాజరవకుండానే సాధ్యమైనంత ప్రగతి సాధించాను కాబట్టి నా పరిస్థితి అప్పుడు నన్ను నిరుత్సాహపరిచింది. బహుశా అందుకే సంఘర్షణ కొనసాగించే ఓపిక నాలో నశించివుండవచ్చు.”

తర్వాతి రెండు సంవత్సరాలు ఎంతో కష్టంగా గడిచాయని సూజన్‌ చెప్పింది. ఆమె తనకు తెలిసిన ఆ ఇద్దరు సాక్షులను పూర్తిగా కలుసుకోవడం మానేసింది. అయితే “పాటలన్నీ నేర్చుకోవడం ఒక ‘శాపంగా’ మారింది” అని ఆ తర్వాత ఆమె చెప్పింది. ఎందుకు? “పాటల్లో ఉన్న ‘యావే సైనికులు సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకోరు’ వంటి మాటలు నాకు గుర్తొచ్చేవి. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జర్మనీ సామూహిక నిర్బంధ శిబరంలో ఉన్న ఒక సాక్షి ఆ మాటలు రాశాడని నాకు తెలుసు, అది నన్ను మరింత వేధించింది. నేను పిరికిదాన్నని, యెహోవా నన్ను విడిచిపెట్టాడని నాకు అనిపించింది” అని ఆమె రాసింది. *

చివరకు స్వేచ్ఛ

“నా 18వ పుట్టినరోజున నా జీవితంలో పెద్ద మార్పు సంభవించింది. ఎన్నో ఏళ్ల నుండి మా ఇంటికి సాక్షులు రావడంలేదు, ఎందుకంటే మేము ‘సందర్శించకూడని గృహంగా’ నమోదుచేయబడ్డాం. అయితే ఆ రోజు వేరే సంఘానికి చెందిన ఒక సాక్షి మా ఇంటికి వచ్చింది, ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి నేను ఆమెతో మాట్లాడగలిగాను. నాకు గుర్తున్నంతవరకు నేను శనివారం ఒంటరిగా ఇంట్లో ఉండడం అదే మొదటిసారి. యెహోవా నన్ను విడువలేదు అనడానికి అది రుజువని నేను అనుకున్నాను. కాబట్టి నేను మొదట్లో ఫోన్‌చేసిన సహోదరుడు జెన్రిక్‌కు ఫోన్‌ చేసి, నేను మా చిన్నమ్మ ఇంటిని విడిచి రావడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో నాకు సలహా ఇవ్వమని అడిగాను. కొంతకాలం తర్వాత ఆ ఇంటిని వదలడానికి నాకు సహాయం అందింది.”

1977 ఏప్రిల్‌లో సూజన్‌ మరో ప్రాంతానికి తరలివెళ్లింది. ఆమె ఉత్తరంలో ఇంకా ఇలా ఉంది: “చివరకు ఆ తర్వాతి ఏడాది నేను కూటాలన్నిటికీ, సమావేశాలన్నిటికీ హాజరవగలిగాను, పరిచర్యలో పాల్గొనడం మొదలుపెట్టాను. నేను మా అమ్మను మళ్లీ కలుసుకోగలిగాను. మా చిన్నమ్మవాళ్లు నాతో ఎంత కఠినంగా వ్యవహరించారో ఆమెకు తెలియదు కాబట్టి ఆమె ఎంతో చలించిపోయింది. ఆమె వెంటనే జోక్యం చేసుకొని, నాకు కావాల్సినవన్నీ సమకూర్చబడేలా చూసింది. కొన్నేళ్ల క్రితం అమ్మ అలాస్కాకు తరలివెళ్లింది. ఆమె బైబిలు సత్యాలపట్ల ఎంతో ఆసక్తి చూపించింది కాబట్టి, నేను ఆమెతో ఉండడానికి 1978లో అలాస్కాకు వెళ్లాను. కొంతకాలానికి ఆమె సాక్షి అయింది, ఆమె నేటికీ నమ్మకంగానే ఉంది.”

“నేను కూటాలకు హాజరుకావడం మొదలుపెట్టిన తర్వాత, సహోదరుడు జెన్రిక్‌, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని ఒక గుంపు సందర్శించే ఏర్పాట్లు చేశాడు, నన్ను కూడా ఆ గుంపుతోపాటు రమ్మని ఆహ్వానించాడు. ఇతరులు నాకు ఇప్పటివరకు ఇచ్చిన బహుమతుల్లో చిరకాలం నిలిచే బహుమతి అదే, ఎందుకంటే యెహోవా సంస్థపట్ల జీవితాంతం కృతజ్ఞత కనబరచేందుకు అది నాకు ప్రేరణనిచ్చింది. నేను చెప్పాలనుకున్నదంతా చెప్పాను. సకాలంలో ఈ ఉత్తరాన్ని పూర్తిచేయాలని అనుకున్నాను కాబట్టి నేను దీనిని సంక్షిప్తంగా రాశాను.”

నిజానికి, పైన పేర్కొనబడిన మాటలు లైన్ల మధ్య ఖాళీలు లేని ఆరున్నర పేజీల ఉత్తరంలో కొంతభాగం మాత్రమే. సూజన్‌ తన ఉత్తరం ముగింపులో ఇలా రాసింది: “పోయిన నెల ఆసుపత్రిలో ఉన్నప్పుడు నా ఆరోగ్యం మరింత క్షీణించింది, నా మరణం సమీపించిందని నేను అనుకున్నాను . . . నేను మరో రెండు వారాలు ఆరోగ్యంగా ఉంటే చాలు, కొన్ని పనులను పూర్తి చేసుకుంటాను అని యెహోవాకు ప్రార్థించాను. . . . నేను ఎంతోకాలం జీవిస్తానని అనుకోవడంలేదు, సత్యంలో ఉన్న ఈ సంవత్సరాల్లో అందరూ ఆశించే శ్రేష్ఠమైన జీవితాన్ని నేను అనుభవించానని, అది ఎంతో అద్భుతంగా గడిచిందని నేను ఒప్పుకోవాలి.”

ఈ ఉత్తరంలో, సాధారణంగా చివర్లో ఉండే మాటలు గానీ సంతకం గానీ లేవు, అంతేకాక అది పోస్టు చేయబడలేదు. ఆ ఉత్తరాన్ని చూసినవారికి, దానిని ఎవరికి అందజేయాలో అర్థం కాలేదు. అయితే ప్రారంభంలో పేర్కొనబడినట్లు, ఆ ఉత్తరాన్ని ఆఖరికి సూజన్‌ వాళ్ల అమ్మకు పంపించారు.

సూజన్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం

సూజన్‌ 1979, ఏప్రిల్‌ 14న బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ల అమ్మ ఫ్లోరిడాకు తిరిగివచ్చింది. సూజన్‌ అలాస్కాలో ఉన్న నార్త్‌ పోల్‌ సంఘంతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంది కాబట్టి ఆమె అక్కడే ఉండిపోయింది. కొంతకాలం తర్వాత ఆమె పయినీరుగా పూర్తికాల పరిచర్య ప్రారంభించింది. చివరకు ఆమె ఫ్లోరిడాకు తరలివెళ్లింది, 1991లో ఆమె క్రైస్తవ పెద్ద అయిన తోటి పయినీరు పరిచారకుణ్ణి వివాహం చేసుకుంది, సూజన్‌ మరణించిన కొంతకాలానికి ఆయన కూడా మరణించాడు.

సూజన్‌ను, ఆమె భర్తను సంఘంలోనివారు ఎంతో ప్రేమించేవారు. ఆమె అనారోగ్యానికి గురై, తాము పూర్తికాల పరిచర్య కొనసాగించలేని పరిస్థితి ఏర్పడేంతవరకు వారిద్దరు కలిసి పూర్తికాల పరిచర్యలోనే ఉన్నారు. ఆమె దాదాపు 20కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తికాల పరిచర్యను ఆస్వాదించింది. ఫ్లోరిడాలో జరిగిన ఆమె అంత్యక్రియల కార్యక్రమానికి నార్త్‌ పోల్‌ సంఘం ఫోను ద్వారా అనుసంధానం చేయబడింది.

యెహోవా సేవకులు అనుభవించే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలపట్ల మరింత కృతజ్ఞతతో ఉండడానికీ, అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణతో ఉండడానికీ సూజన్‌ ఉత్తరం మనకు సహాయం చేస్తుంది. (అపొస్తలుల కార్యములు 24:​14) దేవుడు తనకు సన్నిహితమయ్యే వారందరికీ సన్నిహితంగా ఉన్నాడని ఆమె అనుభవం స్పష్టం చేస్తుంది.​—⁠యాకోబు 4:​7, 8. (g 12/06)

[అధస్సూచీలు]

^ సహోదరుడు జెన్రిక్‌, ఆయన భార్య 1993లో జరిగిన ఘోర దుర్ఘటనలో మరణించారు.

^ తేజరిల్లు! (ఆంగ్లం), డిసెంబరు 22, 1999, 7వ పేజీ చూడండి.

^ యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (ఆంగ్లం), పాట 29, “సాక్షులారా, ముందుకు సాగండి!”

[23వ పేజీలోని బ్లర్బ్‌]

“సత్యంలో ఉన్న ఈ సంవత్సరాల్లో అందరూ ఆశించే శ్రేష్ఠమైన జీవితాన్ని నేను గడిపాను, అది ఎంతో అద్భుతంగా గడిచింది”

[21వ పేజీలోని చిత్రం]

సూజన్‌కు పదేళ్లున్నప్పుడు

[23వ పేజీలోని చిత్రం]

తన భర్త జేమ్స్‌ సిమోర్‌తో సూజన్‌