కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కాలిప్సో ట్రినిడాడ్‌లోని ప్రత్యేకమైన జానపద సంగీతం

కాలిప్సో ట్రినిడాడ్‌లోని ప్రత్యేకమైన జానపద సంగీతం

కాలిప్సో ట్రినిడాడ్‌లోని ప్రత్యేకమైన జానపద సంగీతం

ట్రినిడాడ్‌లోని తేజరిల్లు! రచయిత

ట్రినిడాడ్‌, టొబాగో జంట ద్వీపాల రిపబ్లిక్‌ గురించి మీరు విన్నప్పుడు మీకేమి గుర్తుకొస్తుంది? అనేకమందికి వాద్య బృందాల స్టీలు డ్రమ్ముల ధ్వనులు, కాలిప్సో సంగీతపు ఉత్తేజపరిచే చరణాలు జ్ఞాపకమొస్తాయి. నిజానికి, కాలిప్సో సంగీతంలోని ఆకట్టుకునే ధ్వనులు, ప్రత్యేకమైన శైలి అది పుట్టిన దక్షిణ కరీబియన్‌ దీవుల్లోనేకాక అనేక ఇతర దేశాల్లో కూడా ప్రజాదరణ పొందాయి. *

కాలిప్సో కాలాలూ అనే పుస్తకం ప్రకారం, కాలిప్సో అనే పేరు “1898వ సంవత్సరం తర్వాత ట్రినిడాడ్‌ ఉత్సవాల్లో ఎవరైనా తాగిన మైకంలో పాడిన పాటలనేకాదు స్టేజీలపై సంగీతంలో కాస్త ప్రావీణ్యం ఉన్నవారు లేదా మంచి ప్రావీణ్యం ఉన్నవారు పాడిన పాటలన్నింటినీ” సూచిస్తుంది. ఆఫ్రికా బానిసలు ట్రినిడాడ్‌కు తెచ్చిన ఆఫ్రికన్‌ల కథలు చెప్పే చారిత్రాత్మక సాంప్రదాయం నుండి కాలిప్సో సంగీతం ఆవిర్భవించి ఉండవచ్చు. ఆ తర్వాతి కాలంలో ప్రజాదరణ పొందిన ఆఫ్రికన్‌ల పాటలు, నృత్యం, డోలు వాయించడంతోపాటు ఫ్రెంచ్‌, హిస్పానిక్‌, ఇంగ్లీష్‌ మరితర జాతుల సంగీతాలు కలిసిన మిశ్రిత సంగీతం నుండి అనతికాలంలో కాలిప్సో ఆవిర్భవించింది.

కాలిప్సో అనే పేరు ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు. చక్కని ప్రదర్శనను అభినందించడానికి పశ్చిమ ఆఫ్రికాలో ఉపయోగించే కైసో అనే వాడుక పదం నుండి కాలిప్సో పదం వచ్చిందని కొందరు నమ్ముతారు. 1830లలో ట్రినిడాడ్‌, టొబాగోల్లోని బానిసత్వం ముగిసే ముందు కూడా వార్షికోత్సవ వేడుకల్లో షాంట్వెల్‌లు (గాయకులు) తమ గొప్పను చాటుకుంటూ, ఒకరినొకరు పరిహసించుకుంటూ పాడే పాటలను వినడానికి ప్రజలు గుమిగూడేవారు. కాలిప్సోనియన్లు అని పిలువబడే కాలిప్సో గాయకుల్లో ప్రతీఒక్కరూ తాము ప్రత్యేకంగా గుర్తించబడేందుకు ఒక రంగస్థల పేరు పెట్టుకుని, ప్రత్యేక తరహా శైలిని అలవర్చుకునేవారు.

సంగీత శైలి, ప్రభావం

మొదటినుంచీ కాలిప్సోనియన్లు తమ బుద్ధి చాతుర్యాన్నిబట్టి మెచ్చుకోబడేవారు. అంతేకాదు, చాలామంది కాలిప్సో గాయకులు అనేక చరణాల పద్యాన్ని ఎంతో నేర్పుతో అప్పటికప్పుడు వల్లిస్తూ, మధ్యమధ్యలో పద్య అంశానికి ఎంతో చక్కగా సరిపోయే విధంగా, విషయం కళ్ళ ముందు కదిలేలా చేసే వర్ణనలతో పాటను మరింత ఆసక్తికరంగా చేసేవారు. పూర్వం ట్రినిడాడ్‌కు వలసవచ్చిన ఆఫ్రికన్లు లేదా నిమ్నజాతి ప్రజలు మాత్రమే కాలిప్సోనియన్లుగా ఉండేవారు, నేడు అన్ని రకాల జాతులకు, వర్ణాలకు, తరగతులకు చెందినవారు కాలిప్సోనియన్లుగా ఉన్నారు.

ట్రినిడాడ్‌, టొబాగోలకు పూర్వం సాంస్కృతిక నిర్దేశకునిగా పనిచేసిన డాక్టర్‌ హాలిస్‌ లివర్‌పూల్‌ చరిత్రకారుడే కాదు, ఒక కాలిప్సోనియన్‌ కూడా. ఆయన వెనకటి కాలిప్సోనియన్‌ గాయకుల గురించి మాట్లాడుతూ, తేజరిల్లు! పత్రికతో ఇలా అన్నాడు: “ప్రజలు ముఖ్యంగా వినోదం కోసం, పుకార్లు వినడానికి, తాము విన్న సంఘటనల గురించి వాకబు చేయడానికి [కాలిప్సో] గుడారాలకు వచ్చేవారు కాబట్టి వారిని నవ్వించడమే కాలిప్సోనియన్ల ప్రధాన ధ్యేయంగా ఉండేది. ప్రత్యేకంగా, ఉన్నత వర్గాలవారు నిమ్నవర్గాలవారు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి వచ్చేవారు, అక్కడి గవర్నరు ఆయన సహాయకులు రాజకీయపరంగా తాము ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవడానికి వచ్చేవారు.”

కాలిప్సోనియన్లు తరచూ అధికారంలో ఉన్నవారిని, సమాజంలోని ఉన్నత వర్గాలకు చెందినవారిని తమ పరిహాసానికి వస్తువుగా వాడుకునేవారు. ఆ కారణంగానే, కాలిప్సోనియన్లు సామాన్య ప్రజల వీరులుగా, ఛాంపియన్లుగా గౌరవించబడేవారు, కానీ అధికారంలో ఉన్నవారు మాత్రం వారిని కంట్లో నలుసులా పరిగణించేవారు. కాలిప్సోనియన్లు కొన్నిసార్లు పాటలను ఎంత విమర్శనాత్మకంగా రచించేవారంటే, వారిని నియంత్రించడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించి అమలు చేయాల్సివచ్చింది. దానికి ప్రతిస్పందనగా ఆ గాయకులు పాటల్లోని సాహిత్యాన్ని ద్వంద్వార్థ పదాలతో వ్రాసి, దాన్నో ప్రత్యేక కళగా రూపొందించారు. కాలిప్సో పాటల్లోని సాహిత్యాన్ని అలా ద్వంద్వార్థ పదాలతో వ్రాయడం నేటికీ ప్రధాన విషయంగానే ఉంది.

కాలిప్సోనియన్లు కేవలం భాషను ఉపయోగించేవారే కాదు భాషను సృష్టించేవారు కూడా. నిజానికి, వెస్టిండీస్‌ల రోజువారీ సంభాషణలోని పదజాలం వృద్ధి చెందడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు. అందుకే అనేకమంది, చివరకు కొందరు రాజకీయ నాయకులు కూడా, ఒక నిర్దిష్ట విషయాన్ని నొక్కిచెప్పడానికి తరచూ కాలిప్సోనియన్ల మాటలను ఉల్లేఖించడంలో ఆశ్చర్యం లేదు.

ఆధునిక కాలిప్సో

ఇటీవలి సంవత్సరాల్లో విభిన్న సంగీత అభిరుచులున్న ప్రజల కోసం కాలిప్సోలో వివిధ శైలులు, మిశ్రమ సంగీతం రూపొందించబడింది. వేరే ఇతర సంగీతాల్లోని సాహిత్యంలాగే కాలిప్సో పాటల సాహిత్యంలో కూడా ఉన్నత నైతిక విలువలు కనిపించవు. అందుకే మనం వినేవాటి విషయంలో సరైన ఎంపిక చేసుకోవడం జ్ఞానయుక్తం. (ఎఫెసీయులు 5:​3, 4) ‘ఈ పాట సాహిత్యంలోని ద్వంద్వార్థ మాటల భావాన్ని నా పిల్లలకు లేదా ఆ సంగీతం గురించి తెలియని వ్యక్తికి వివరించడానికి నేను ఇబ్బందిపడతానా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

మీరు ట్రినిడాడ్‌, టొబాగోలకు వస్తే, అక్కడున్న అందమైన సముద్రతీరాలను, రాతి గుట్టలను చూసి పరవశించిపోతారు, ఆ ద్వీపంలోని జాతుల, సంస్కృతుల కలయికను చూసి ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా వయోభేదం లేకుండా అందరిని ఆకట్టుకుంటున్న ఉత్తేజపరిచే స్టీలు వాయిద్యాల ఆర్కెస్ట్రాలను, కాలిప్సో సంగీతాన్ని కూడా మీరు ఆనందించవచ్చు. (g 12/06)

[అధస్సూచి]

^ స్టీలు వాయిద్య బృందాలు సాధారణంగా కాలిప్సో సంగీతాన్ని వాయిస్తారు. కానీ కాలిప్సో గాయకుడు మాత్రం సామాన్యంగా గిటారు, బాకా, సాక్సోఫోన్‌, డోలువంటి వాయిద్యాలను ఉపయోగిస్తాడు.

[28, 29వ పేజీలోని చిత్రాలు]

స్టీలు డ్రమ్ములు