కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టవర్‌ బ్రిడ్జి లండన్‌కు ముఖద్వారం

టవర్‌ బ్రిడ్జి లండన్‌కు ముఖద్వారం

టవర్‌ బ్రిడ్జి లండన్‌కు ముఖద్వారం

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

ఏనాడూ ఇంగ్లాండ్‌ను సందర్శించనివారికి కూడా టవర్‌ బ్రిడ్జి గురించి తెలుసు. ప్రతీ ఏడాది వేల సంఖ్యలో పర్యటకులు దానిని సందర్శిస్తారు. ప్రతీ రోజు లండన్‌వాసులు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండానే లేదా కనీసం దానిని ఒక్కమారైనా చూడకుండానే దానిని దాటి వెళ్తారు. లండన్‌లో అందరికీ తెలిసిన ప్రముఖ స్థలాల్లో టవర్‌ బ్రిడ్జి ఒకటి.

ఈ బ్రిడ్జి, నదికి ఎగువన ఉన్న లండన్‌ బ్రిడ్జి ఒకటేనని పొరబడకూడదు. ఈ టవర్‌ బ్రిడ్జి సమీపంలోవున్న టవర్‌ ఆఫ్‌ లండన్‌కు సంబంధించినది. పూర్వం 1872లో ఇంగ్లండు పార్లమెంటు థేమ్స్‌ నదిపై వంతెనను నిర్మించడానికి అనుమతిస్తూ చట్టం తయారుచేసింది. లండన్‌ టవర్‌యొక్క గవర్నరు దానికి వ్యతిరేకించినా, టవర్‌ బ్రిడ్జి రూపకల్పన కూడా అచ్చం లండన్‌ టవర్‌లాగే ఉండాలనే షరతుపై ఆ నదిమీద మరో వంతెనను నిర్మించేందుకు పార్లమెంటు అంగీకారం తెలిపింది. ఆ అధికారిక ప్రతిపాదన కారణంగానే నేటి టవర్‌ బ్రిడ్జి రూపుదిద్దుకొంది.

థేమ్స్‌ నదిని దాటేందుకు 18, 19 శతాబ్దాల్లో అనేక వంతెనలు నిర్మించబడ్డాయి, వాటిలో ఓల్డ్‌ లండన్‌ బ్రిడ్జి అత్యంత ప్రఖ్యాతిగాంచింది. అనేక సంవత్సరాలుగా వాడుకలోవున్న కారణంగా 1750కల్లా దాని పునాదులు బలహీనపడడమేకాక, పెరుగుతున్న ట్రాఫిక్‌కు చాలా ఇరుకుగా మారింది. దానికి దిగువన రద్దీ ఎక్కువగా ఉన్న నౌకాశ్రయంలో ప్రపంచ నలుమూలల నుండి వచ్చే నౌకలు నిలువ నీడకోసం ఒకదానితో ఒకటి పోటీపడేవి. ఆ కాలంలో అలా ఎంత ఎక్కువ సంఖ్యలో నౌకలు అక్కడికి వచ్చిచేరేవంటే, ఒకదానికొకటి ఆనుకొని నిలబడిన నౌకల మీదుగా ఒక వ్యక్తి చాలా కిలోమీటర్లు నడిచివెళ్ళగలడని చెప్పబడేది.

కార్పొరేషన్‌ ఆఫ్‌ లండన్‌ విన్నపం మేరకు నగర ఆర్కిటెక్ట్‌ హోరేస్‌ జోన్స్‌, లండన్‌ బ్రిడ్జి ఉన్న స్థలంనుండి నదికి దిగువన, గాతిక్‌ శైలిలో కదిలే వంతెనను నిర్మించాలనే ప్రతిపాదన చేశాడు. థేమ్స్‌ నదిగుండా పశ్చిమ దిక్కులో నౌకాశ్రయానికి చేరుకునే నౌకలకు అది సుళువైన మార్గంగా కూడా ఉంటుంది. అనేకులు వినూత్నమని పరిగణించిన రూపకల్పనకు ఇది నాంది పలికింది.

విశేషమైన రూపకల్పన

జోన్స్‌ అనేక ప్రాంతాలు సందర్శించాడు, నెదర్లాండ్స్‌లో కాలవలపై నిర్మించబడిన చిన్న కదిలెడు వంతెనలు చూసినప్పుడు, నౌకలు వెళ్లేందుకు వీలుగా మధ్యలో పైకి ఎత్తబడగల వంతెనను నిర్మించాలనే తలంపు ఆయనకు వచ్చింది. అలా ఆయన బృందం గీసిన నమూనాల్లోంచి ఆ ప్రఖ్యాత టవర్‌ బ్రిడ్జి కార్యరూపందాల్చి స్టీలు చట్రం, తాపీపనిలాంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి నిర్మించబడింది.

టవర్‌ బ్రిడ్జికి రెండు ప్రధాన గోపురాలున్నాయి, ఆ రెండు గోపురాలను కలిపే కాలిబాటలు రహదారికి 34 మీటర్ల ఎత్తులో, సగటు నీటిమట్టానికి దాదాపు 42 మీటర్ల ఎత్తులో నిర్మించబడ్డాయి. నదికి ఇరువైపులనుండి నిర్మించబడిన రహదారులు ఆ వంతెన రెండుగా తెరుచుకునే స్థానం వరకువచ్చి ఆగిపోతాయి. రెండుగా తెరుచుకునే ఆ వంతెన భారీ రెక్కలు ఒక్కొక్కటి 1,200 టన్నుల బరువుతో, 86 డిగ్రీల కోణంలో పైకిలేస్తూ తెరుచుకుంటాయి. అలా పైకి తెరుచుకున్న రెక్కల క్రిందుగా 10,000 టన్నుల రవాణా సామర్థ్యంగల ఓడలు సులభంగా వెళ్లగలవు.

వంతెన తెరుచుకునేందుకు అవసరమైన శక్తి

ఆ వంతెన రెక్కలను ఎత్తడం కోసం, పాదచారులను కాలిబాటలవద్దకు తీసుకువెళ్లే ప్యాసింజర్‌ లిఫ్టుల కోసం, ట్రాఫిక్‌ను నియంత్రించే సిగ్నల్స్‌ కోసం హైడ్రాలిక్‌ శక్తి ఉపయోగించబడుతుంది. అవును, ఆ వంతెన రెక్కలను తెరిచేందుకు నీరే ఉపయోగించబడుతోంది! ఆ నీరు దానికి అవసరమైనదానికన్నా రెండింతలు ఎక్కువ శక్తినే సమకూరుస్తోంది.

ఆ వంతెనకు దక్షిణంవైపు, బొగ్గుతో నడిచే నాలుగు బాయిలర్లలో చదరపు సెంటీమీటరుకు 5 నుండి 6 కేజీల పీడనాన్ని కలిగించే ఆవిరి ఉత్పత్తి చేయబడుతుంది. దానిలో రెండు పెద్ద పంపులను నడిపించేంత శక్తి ఉంటుంది. ఆ పంపులు చదరపు సెంటీమీటరుకు 60 కేజీల పీడనంతో నీటిని పంపుచేస్తాయి. ఆ వంతెన రెక్కలను ఎత్తడానికి కావల్సిన శక్తిని పట్టి ఉంచేందుకు, ఆ ఒత్తిడిగల నీటిని ఆరు భారీ ఘటాల్లో నిల్వచేస్తారు. అవి వంతెన రెక్కలను ఎత్తేందుకు ఉపయోగించే మొత్తం ఎనిమిది ఇంజన్లకు కావల్సినంత శక్తిని అందజేస్తాయి. ఆ శక్తిని ప్రయోగించిన సత్వరమే, 50 సెంటీమీటర్ల కైవారమున్న ఇరుసులపై ఆధారపడిన వంతెన రెక్కలు తెరుచుకుంటాయి. అవి పూర్తిగా తెరుచుకునేందుకు కేవలం ఒక నిమిషం మాత్రమే పడుతుంది.

ఆధునిక టవర్‌ బ్రిడ్జిని సందర్శించడం

ఈ రోజుల్లో ఆవిరికి బదులు విద్యుచ్ఛక్తి వాడుకలోకి వచ్చింది. అయితే గత సంవత్సరాల్లోలాగే, టవర్‌ బ్రిడ్జి తెరుచుకున్నప్పుడు రహదారిపై ట్రాఫిక్‌ స్తంభిస్తుంది. పాదచారులు, పర్యటకులు, ఇతర సందర్శకులు ఆ వంతెన పనితీరును చూసి ఆశ్చర్యపోతారు.

హెచ్చరిక అలారమ్‌ మ్రోగుతుంది, రహదారులను మూసివేసే గడియలు వేయబడతాయి, చివరి వాహనం దాటిపోయిన తర్వాత, వంతెన కంట్రోలర్స్‌ వంతెనపై వాహనాలేమీ లేవనే సిగ్నల్‌ ఇస్తారు. ఏ మాత్రం శబ్దం చేయకుండా వంతెన రెక్కలను పట్టివుంచే బోల్టులు విడిపోయి, అవి పైకిలేస్తూ తెరుచుకుంటాయి. అప్పుడు అవధానం నదివైపు మళ్లుతుంది. అది టగ్‌బోట్‌ కావచ్చు, విహారయాత్రా నౌక కావచ్చు లేదా ఓడ కావచ్చు, అందరి కళ్లూ వెళ్లే ఆ నావపైనే ఉంటాయి. కొద్ది నిమిషాల తర్వాత సిగ్నల్స్‌ మారతాయి. వంతెన రెక్కలు క్రిందికి వాలుతూ రహదారి గడియలవరకు వస్తాయి. వాహనాల ముందు సైకిళ్లపై నిలిచివున్నవారు ఆ వంతెనను మొదట దాటేందుకు ముందుకు కదులుతారు. క్షణాల్లోనే టవర్‌ బ్రిడ్జి యథాస్థితికి వచ్చి, మళ్లీ నావలు వచ్చినప్పుడు తిరిగి తెరుచుకుంటుంది.

కుతూహలం ఉన్న సందర్శకుడు పదేపదే తెరుచుకునే ఈ ప్రక్రియను మాత్రమే చూస్తూ కూర్చోడు. ఇతరులతో కలిసి ఉత్తర గోపురంలోవున్న లిఫ్టులో పైకివెళ్లి, “టవర్‌ బ్రిడ్జి ఎక్స్‌పీరియన్స్‌” ప్రదర్శనశాలలో ఉంచిన బొమ్మ నమూనాతోపాటు జాగ్రత్తచేయబడిన వంతెన చరిత్రను తెలుసుకోవాలనుకుంటాడు. పెయింటింగ్‌ చేయబడిన ఇంజనీరింగ్‌ అద్భుతాలు, అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవం, రంగురంగుల ఫోటోలు, ప్రదర్శనా ఫలకాలు టవర్‌ బ్రిడ్జి అద్భుత నిర్మాణాన్ని వివరిస్తాయి.

ఎత్తైన ప్రదేశంలోని కాలిబాటలు అంత ఎత్తునుండి సందర్శకులు లండన్‌ అందాలను చూసి పరవశించేలా చేస్తాయి. పశ్చిమదిశగా, సెయింట్‌ పాల్స్‌ క్యాథీడ్రిల్‌, ఆర్థికసంబంధ ప్రాంతాల్లోని బ్యాంకు భవనాలు, సుదూరంగావున్న తపాలా కార్యాలయం కనువిందు చేస్తాయి. ఒక వ్యక్తి తూర్పుదిశగా, నౌకల్లో సరుకునింపడాన్ని, దించడాన్ని చూడాలనుకోవచ్చు, అయితే ఇప్పుడవి నది దిగువన నగర ప్రాంతానికి దూరంగా తరలించబడ్డాయి. ఇప్పుడు వాటి స్థానంలో నగర అభివృద్ధి జరుగుతూ అద్భుతమైన భవంతులు పుట్టుకొస్తున్నాయి. లండన్‌లోని ఈ ప్రఖ్యాత స్థలంనుండి చూడగల వాటిని అద్భుతమని, ఆశ్చర్యమని ఆసక్తికరమని సరిగానే వర్ణించవచ్చు.

మీరు లండన్‌ను సందర్శిస్తుంటే, ఈ చారిత్రక నిర్మాణాన్ని ఎందుకు సునిశితంగా పరిశీలించకూడదు? మీ సందర్శనం అసాధారణమైన ఆ ఇంజనీరింగ్‌ అద్భుతకార్యాన్ని మీ మనసులపై ప్రగాఢంగా ముద్రవేస్తుంది. (g 10/06)

[16వ పేజీలోని చిత్రం]

ఇంజన్లకు ఒకప్పుడు శక్తిని అందించేందుకు ఆవిరితో నడిచిన రెండు పంపుల్లో ఒకటి

[చిత్రసౌజన్యం]

Copyright Tower Bridge Exhibition

[16, 17వ పేజీలోని చిత్రం]

నిమిషంకన్నా తక్కువ సమయంలో పూర్తిగా ఎత్తబడిన వంతెనయొక్క రెండు రెక్కలు

[చిత్రసౌజన్యం]

©Alan Copson/Agency Jon Arnold Images/age fotostock

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Brian Lawrence/SuperStock