ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
◼ “గత 500 సంవత్సరాల్లో మానవ కార్యకలాపాల కారణంగా 844 జాతులు (లేదా అరణ్యప్రాంతాల్లోని జాతులు) అంతరించిపోయాయి.”—ఐ.యు.సి.ఎన్, వరల్డ్ కన్సర్వేషన్ యూనియన్, స్విట్జర్లాండ్.
◼ ప్రభుత్వ లెక్కల ప్రకారం బ్రిటన్‌లోని స్త్రీపురుషుల్లో 6 శాతం మంది సలింగ సంయోగులు. 2005లో చేయబడిన చట్టం “సలింగ సంయోగులు ‘వివాహం’ చేసుకోవడాన్ని అనుమతించింది,” అలాగే అది వారికి వివాహిత స్త్రీపురుష దంపతులకు ఉండే హక్కులను కూడా కల్పించింది.—ద డైలీ టెలిగ్రాఫ్, ఇంగ్లాండ్. (g 11/06)
◼ “వివాహ జతల్లో దాదాపు 50 శాతం మంది తాము తమ జతను ‘ఆర్థిక సంబంధ విషయాలలో మోసం చేస్తున్నామని’, తాము చేస్తున్న ఖర్చుల గురించి తమ జతతో అబద్ధాలు చెబుతున్నామని ఒప్పుకున్నారు.”—ద వాల్ స్ట్రీట్ జర్నల్, అమెరికా.
◼ మారుతున్న వాతావరణం కారణంగా ప్రజలు వదిలిపెట్టిన, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే స్థలం మారిన మొట్టమొదటి ఊరు ఓషియానియాలోని వనౌటులో ఉన్న లాటేవు లేదా టిగ్వా ద్వీపం అని చెప్పవచ్చు. అక్కడి ఇళ్ళు “తుఫానులవల్ల, శక్తిమంతమైన కెరటాలవల్ల తరచూ మునిగిపోతూ ఉండేవి.”—వనౌటు న్యూస్, వనౌటు. (g 12/06)
పన్నెండు సంవత్సరాలు జైల్లో ఉన్నారు—ఎందుకు?
తూర్పు ఆఫ్రికాలోని ఎరిట్రియాలో ఉన్న సావాలో ముగ్గురు యెహోవాసాక్షులు గత 12 సంవత్సరాలుగా జైల్లో ఉంచబడ్డారు. వారిపై ఎలాంటి నేరారోపణ లేదు, వారి కేసు విచారణ చేయలేదు. కుటుంబ సభ్యులతో సహా ఎవరూ వారిని కలవడానికి అనుమతించడంలేదు. కారణం? వారు సైన్యంలో చేరడానికి నిరాకరించడమే. తమ మతనమ్మకాల కారణంగా యుద్ధాల్లో పాల్గొనడానికి లేదా ఆయుధాలు చేపట్టడానికి నిరాకరించిన వ్యక్తి ఎరిట్రియన్ చట్ట ప్రకారం దోషి. యువకులను అరెస్టు చేసినప్పుడు, వారిని మిలటరీ క్యాంపులో నిర్బంధించి, అక్కడ తరచూ తీవ్రంగా కొడతారు, అనేక రకాలుగా హింసిస్తారు. (g 10/06)
ఉద్యోగస్థలంలో అమర్యాద ప్రవర్తన
“ఉద్యోగస్థలంలో అమర్యాద ప్రవర్తనవల్ల సంస్థ వెచ్చించిన సమయం, చేసిన కృషి వ్యర్థమవుతుంది, సామర్థ్యాలున్నవారిని చేజార్చుకోవాల్సి వస్తుంది” అని ద వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతోంది. ఇంటర్వ్యూ చేయబడిన సుమారు 3,000 మందిలో 90 శాతం కంటే ఎక్కువమంది “ఉద్యోగస్థలంలో అసభ్య ప్రవర్తనను ఎదుర్కొన్నాము” అని చెప్పారు. వారిలో సగంమంది “జరిగినదాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేశామని” “25 శాతం మంది ఉద్యోగంలో సరిగ్గా పనిచేయడం మానేశామని,” 8 మందిలో ఒకరు ఉద్యోగాన్ని వదిలేశామని చెప్పారు. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న విశ్వవిద్యాలయంలోని నిర్వాహక వర్గంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ క్రిస్టీన్ పొరాత్ ప్రకారం, “ఒక సంస్థలో అమర్యాద ప్రవర్తన ఉందనడానికి, దాని ఉద్యోగులు సరిగా పని చేయకపోవడం, పని ఎగ్గొట్టడం, చివరకు దొంగతనం చేయడం కూడా సూచనలు” అని జర్నల్ అంటోంది. (g 11/06)
పర్యావరణానికి హానితలపెట్టని సెంట్రల్ హీటింగ్ వ్యవస్థ
“ఒలీవ గింజలతో సెంట్రల్ హీటింగ్ వ్యవస్థను (ఒక కేంద్రస్థానం నుండి గొట్టాలద్వారా వేడినీటితో లేదా గాలితో లేదా ఆవిరితో మొత్తం భవనంలో వెచ్చదనాన్ని కలగజేసే విధానాన్ని) ఏర్పాటుచేసే రోజులు వచ్చేశాయి” అని ఎల్ పాయిస్ అనే స్పానిష్ వార్తాపత్రిక నివేదించింది. వాటివల్ల ఉద్భవించే వేడి మాడ్రిడ్‌లోని కనీసం 300 ఇళ్లకు వెచ్చదనాన్ని, వేడినీటిని ఇస్తుంది. వేరే ఇంధనాలతో పోలిస్తే, ఒలీవ గింజలు కారుచౌక. అవి నూనెకన్నా 60 శాతం, బొగ్గుకన్నా 20 శాతం తక్కువ ఖరీదైనవి. వాటిని కాల్చినప్పుడు వెలువడే కార్బన్‌డైయాక్సైడ్, అవి సహజరీతిలో కుళ్ళినప్పడు వెలువడినంత పరిమాణంలోనే ఉంటుంది కాబట్టి, అవి వాతావరణాన్ని కలుషితం చేయవు. అవి అందుబాటులో ఉండడం మరో ప్రయోజనం. ఒలీవ పండ్లనుండి నూనెను తీసివేసిన తర్వాత వాటి గింజలు పిప్పిగా మిగిలిపోతాయి. ఓలీవ నూనె ఉత్పత్తిలో స్పెయిన్‌దే ప్రథమస్థానంగా పరిగణించబడుతోంది. (g 10/06)
నూరేళ్ల వృద్ధులు ఎక్కువవుతున్నారు
ఈ రోజుల్లో నూరేళ్లు జీవించడం అసాధారణమేమీ కాదని న్యూ సైంటిస్ట్ పత్రిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా నేడు దాదాపు 2,00,000 మంది నూరేళ్ల వృద్ధులున్నారు. అంతేకాక, ఆ పత్రిక ప్రకారం, వారిలో 66 మంది తమ 110వ పుట్టినరోజు జరుపుకుని శతాధికవృద్ధులయ్యారు. దీర్ఘాయుష్షు గురించిన వాదనలు ఎంతమేరకు సరైనవో నిరూపించడం కొన్ని సందర్భాల్లో కష్టమేనని న్యూ సైంటిస్ట్ పత్రిక ఒప్పుకుంటున్నా, “నమ్మదగిన రికార్డులు లేకపోవడాన్నిబట్టి నేడు జీవించేవారిలో ఇంచుమించు 450 మంది శతాధికవృద్ధులు ఉండవచ్చని కూడా చెప్పవచ్చు.” (g 12/06)