కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శక్తివంతమైన మీకాంగ్‌ నదితో సుపరిచితులవండి

శక్తివంతమైన మీకాంగ్‌ నదితో సుపరిచితులవండి

శక్తివంతమైన మీకాంగ్‌ నదితో సుపరిచితులవండి

మీకాంగ్‌ నది ఆరు ఆసియా దేశాల గుండా వంపులు తిరుగుతూ ప్రవహిస్తుంది, అది దాదాపు 100 స్వదేశీ గుంపులకు, జాతులకు చెందిన సుమారు 10 కోట్లమందిని పోషిస్తోంది. ప్రతీ ఏడాది, ఈ నది 13 లక్షల టన్నుల చేపలను ఇస్తుంది, ఇది ఉత్తర సముద్రంలో పట్టే చేపలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ! 4,350 కిలోమీటర్లు విస్తరించివున్న ఈ నది ఆగ్నేయ ఆసియాలో ఉన్న అతి పొడవైన నది. ఈ నది అనేక దేశాల గుండా ప్రవహిస్తుంది కాబట్టి దానికి అనేక పేర్లున్నాయి, అయితే మీకాంగ్‌ అనే పేరే ఎంతో ప్రఖ్యాతి చెందింది. మీ నామ్‌ కాంగ్‌ అనే థాయ్‌ పేరుకు సంక్షిప్త రూపమే మీకాంగ్‌.

హిమాలయ శిఖరాల్లో పుట్టిన ఈ నది, పర్వతాల మీదుగా, లోతైన లోయల గుండా ప్రవహిస్తున్నప్పుడు ఉరకలు వేస్తూ యౌవన శక్తితో వేగంగా ప్రవహిస్తుంది. దానిని చైనాలో లాన్‌ట్సాంగ్‌ అని పిలుస్తారు, అది చైనాను దాటేసరికి దాని పొడవులో దాదాపు సగం దూరం ప్రయాణించి, అనూహ్యంగా 4,500 మీటర్లు దిగువకు ప్రవహిస్తుంది. ఆ తర్వాత దిగువ మీకాంగ్‌ నది 500 మీటర్లు మాత్రమే క్రిందకు ప్రవహిస్తుంది. దానివల్ల అక్కడి నుండి ఆ నది ఎంతో నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఈ నది చైనా దాటిన తర్వాత మ్యాన్‌మార్‌, లావోస్‌ దేశాల మధ్య సరిహద్దుగా ఏర్పడడమేకాక, లావోస్‌, థాయ్‌లాండ్‌ల సరిహద్దులో అధికభాగం కూడా ప్రవహిస్తుంది. అది కాంబోడియాలో రెండు శాఖలుగా విడిపోయి వియత్నామ్‌లోకి ప్రవహిస్తుంది, ఆ తర్వాత వియత్నామ్‌ డెల్టా ప్రాంతంలో అనేక కాలవలుగా ప్రవహిస్తూ దక్షిణ చైనా సముద్రంలో కలిసిపోతుంది.

1860ల చివరిభాగంలో ఫ్రెంచ్‌వారు మీకాంగ్‌ నదిగుండా చైనాలోకి ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. అయితే కాంబోడియాలోని క్రాట్యా పట్టణం దగ్గర ఉద్ధృతంగా ప్రవహించే ప్రవాహాలు, దక్షిణ లావోస్‌లో ఉగ్రరూపంలో ప్రవహించే ఖోన్‌ జలపాతాలు అనే పేరుగల వరుస జలపాతాలు అడ్డురావడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రపంచంలోని మరే ఇతర జలపాతంకన్నా ఖోన్‌ జలపాతాల్లో జాలువారే నీరు చాలా అధికం, కెనడా, అమెరికా సరిహద్దుకు ఇరుప్రక్కల ఉండే నయాగరా జలపాతంకన్నా రెండు రెట్లు ఎక్కువ నీరు క్రిందికి జారిపడుతుంది.

జీవ నది

మీకాంగ్‌ నది ఆగ్నేయ ఆసియా ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు లాంటిది. అటు లావోస్‌ రాజధాని వియంటైన్‌, ఇటు కాంబోడియా రాజధాని పోనామ్‌ ఫెన్‌లు ఆ నది ఓడరేవు నగరాలే. దిగువనున్న మీకాంగ్‌ నది వియత్నామ్‌ ప్రజలకు ప్రాముఖ్యమైన జీవనాధారంగా ఉంది. ఆ దేశంలో అది ఏడు శాఖలుగా విడిపోయి 25,000 చదరపు కిలోమీటర్ల డెల్టా ప్రాంతంగా ఏర్పడుతుంది, ఆ ప్రాంతంలో దాదాపు 3,200 కిలోమీటర్లు విస్తరించివున్న కాలవలు ఉన్నాయి. సమృద్ధిగా ఉన్న ఈ నీరు పొలాలను సాగుచేసేందుకు, వరి పండించేందుకు అమూల్యమైన ఒండ్రుమట్టిని అందిస్తూ, రైతులు ఏడాదికి మూడుసార్లు వరిపంట పండించేందుకు దోహదపడుతుంది. ప్రజాదరణ పొందిన ఆ ప్రాముఖ్యమైన ఆహారాన్ని ఎగుమతి చేయడంలో థాయ్‌లాండ్‌ తర్వాత వియత్నామ్‌ దేశానిదే రెండవ స్థానం.

మీకాంగ్‌ నదిలో దాదాపు 1,200 జాతుల చేపలు ఉన్నాయి, ఈ నదిలో కొన్ని జాతుల చేపలతోపాటు రొయ్యల పెంపకం కూడా జరుగుతోంది. ప్రజలు ఎంతో ఇష్టపడే ట్రా రీల్‌ అనే స్థానిక చేప ప్రఖ్యాతి చెందడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. కాంబోడియా కరెన్సీ అయిన రీల్‌కు ఆ చేప నుండే పేరువచ్చింది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న 2.75 మీటర్ల పొడవు పెరగగల వాలుగచేప జాతికి చెందిన చేపలకు కూడా మీకాంగ్‌ నది నివాసస్థలం. 2005లో మత్స్యకారులు 290 కిలోల బరువున్న వాలుగచేపను పట్టారు, ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొన్న అతి పెద్ద మంచినీటి చేప అదే కావచ్చు! ఈ నదిలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న మరో జాతి, ఈరావాడీ డాల్ఫిన్‌. ఇప్పుడు ఆ నదిలో 100 కన్నా తక్కువ డాల్ఫిన్‌లు మాత్రమే ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

మీకాంగ్‌ నది లక్షలాదిమందిని పోషించడమేకాక, ప్రయాణికులను తీసుకువెళ్లే చిన్న పడవలకు, సరుకులు రవాణా చేసే పెద్ద పడవలకు, మహాసముద్రం నుండి నదిలోకి వచ్చి తిరిగి వెనక్కి వెళ్లే రవాణా ఓడలకు, ఇలా అన్ని పరిమాణాల్లో ఉన్న పడవలకు ప్రధాన మార్గంగా కూడా ఉంది. ఈ నది పర్యటకులను కూడా ఆకర్షిస్తుంది ఎందుకంటే వారిలో చాలామంది వియంటైన్‌ను సందర్శించేందుకు ఖోన్‌ జలపాతాలను దాటి వెళ్లడానికి ఇష్టపడతారు. కాలవలకు, గోపురాలకు, పాతిన దూలాలపై నిర్మించిన గృహాలకు పేరుగాంచిన ఈ నగరం దాదాపు 1,000 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా వాణిజ్యానికి, రాజకీయాలకు, మతానికి కేంద్రస్థానంగా ఉంది. వియంటైన్‌ నగరం నుండి నదికి ఎగువన ఉన్న లువాంగ్‌ ప్రభాంగ్‌ నగరానికి నదిలో ప్రయాణించవచ్చు. ఈ ఓడరేవు నగరం ఒకప్పుడు పెద్ద థాయ్‌-లావో రాష్ట్రానికి కొంతకాలంపాటు రాజధానిగా ఉంది, ఫ్రెంచ్‌ వలసరాజ్య పాలనతోపాటు కొంతకాలంవరకు లావోస్‌ రాచరిక రాజధానిగా ఉంది. ఈ చారిత్రక నగరంలో ఫ్రెంచ్‌ వలసరాజ్య వాతావరణం ఇప్పటికీ కనిపిస్తుంది.

ఇటీవలి కాలంలో మీకాంగ్‌ నదిలో కలవరపర్చే మార్పులు సంభవించాయి. ఈ మార్పుల్లో, చేపలను పట్టేందుకు వినాశనకరమైన పద్ధతులు ఉపయోగించడం, అడవులను నరికివేయడం, జలశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద ఆనకట్టల నిర్మాణం వంటివి ఉన్నాయి. వాటిని చూస్తున్న అనేకమందికి పరిస్థితులు చేజారితున్నట్లు అనిపిస్తోంది. అయితే పరిస్థితులు మారతాయనే నిరీక్షణ ఉంది.

మన ప్రేమగల సృష్టికర్త త్వరలోనే తన రాజ్యం ద్వారా మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడని బైబిలు వాగ్దానం చేస్తోంది. (దానియేలు 2:​44; 7:​13, 14; మత్తయి 6:​9,10) ఆ పరిపూర్ణ ప్రపంచ ప్రభుత్వ నిర్దేశంలో భూమంతా చక్కని పరిస్థితికి తీసుకురాబడుతుంది, అలంకారార్థంగా చెప్పాలంటే, నదులు ఆనందంతో “చప్పట్లు కొట్టును.” (కీర్తన 98:​7-9) అతి శక్తివంతమైన మెకాన్‌ నది ఆ హర్షధ్వానంలో భాగం వహించును గాక. (g 11/06)

[24వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

చైనా

మ్యాన్‌మార్‌

లావోస్‌

థాయ్‌లాండ్‌

కాంబోడియా

వియత్నామ్‌

మీకాంగ్‌ నది

[24వ పేజీలోని చిత్రం]

వరి పొలాలు, మీకాంగ్‌ డెల్టా

[24వ పేజీలోని చిత్రం]

మీకాంగ్‌ నదిలో దాదాపు 1,200 జాతుల చేపలు ఉన్నాయి

[25వ పేజీలోని చిత్రం]

ఫ్లోటింగ్‌ మార్కెట్‌, వియత్నామ్‌

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

వరి పొలాలు: ©Jordi Camí/age fotostock; చేపలు పట్టడం: ©Stuart Pearce/World Pictures/age fotostock; నేపథ్యం: © Chris Sattlberger/Panos Pictures

[25వ పేజీలోని చిత్రసౌజన్యం]

మార్కెట్‌: ©Lorne Resnick/age fotostock; స్త్రీ: ©Stuart Pearce/World Pictures/age fotostock