కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంత సులభంగా అంతరించని నీటి ఎలుగుబంటి

అంత సులభంగా అంతరించని నీటి ఎలుగుబంటి

అంత సులభంగా అంతరించని నీటి ఎలుగుబంటి

జపాన్‌లోని తేజరిల్లు! రచయిత

◼ తేమ ఉన్న ఎలాంటి చోటైనా అంటే నాచు, మంచు, వాగులు, వేడి నీటిబుగ్గలు, సరస్సులు, మహాసముద్రాలు, చివరకు మీ పెరట్లోనే సృష్టిలో అతిసూక్ష్మమైన జీవుల్లో ఒకటైన నీటి ఎలుగుబంటి మీకు తారసపడవచ్చు. అది ఎక్కడైనా, ఎలాగైనా జీవించగలదు. అది కంటికి కనిపించనంత చిన్నది, దాని శరీరం నాలుగు భాగాలుగా విభజించబడినట్లుగా ఉండి, రక్షణార్థమైన చర్మపు పైపొర ఉంటుంది. దానికి ఎనిమిది కాళ్లు, ప్రతీకాలికి రెండు గోళ్ల పంజా ఉంటుంది. పైకి అది చూడడానికి తూలుతూ నడుస్తున్న ఎలుగుబంటిలా కనిపిస్తుంది, అందుకే దానికి ఆ పేరు వచ్చింది.

నీటి ఎలుగుబంట్లు టార్డిగ్రేడా వర్గానికి చెందినవి అంటే అవి “నెమ్మదిగా నడిచే జీవులు.” వాటిలో వందలకొద్దీ జాతులను కనిపెట్టారు, వాటిలో ఆడవి ఒకేసారి 1 నుండి 30 వరకు గ్రుడ్లు పెడతాయి. కేవలం గుప్పెడు తడి ఇసుక లేదా మట్టిలో ఈ చిన్న ప్రాణులు వేలసంఖ్యలో ఉంటాయి. వాటిని కనుగొనడానికి మరొక మంచి స్థలం ఇంటిపైకప్పు మీద ఉండే నాచు.

నీటి ఎలుగుబంట్లు ఎలాంటి వాతావరణంలోనైనా బ్రతకగలవు. “వాటిలో కొన్నింటిని గాలి చొరబడని స్థలంలో ఎనిమిది రోజులు, మామూలు ఉష్ణోగ్రతలో హీలియమ్‌ వాయువుతో నిండిన గదిలో మూడు రోజులు ఉంచారు, ఆ తర్వాత వాటిని మైనస్‌ 272 డిగ్రీల సెల్సియస్‌ శీతల స్థితిలో ఉంచాక వాటిని మళ్లీ మామూలు ఉష్ణోగ్రతకు తెచ్చినప్పుడు అవి తిరిగి బ్రతికాయి” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. మనిషికి ప్రాణాంతకంగా మారగల ఎక్స్‌రే కిరణాల ధార్మికత వందలరెట్లు ఎక్కువగా ఉన్నా అవి బ్రతికుండగలవు. కనీసం సిద్ధాంతపరంగానైనా వాటికి అంతరిక్షంలో కొంతకాలంవరకు జీవించే సామర్థ్యం ఉండవచ్చు.

దాని వెనుక దాగివున్న రహస్యం ఏమిటంటే, అవి తమ జీవప్రక్రియలన్నీ 0.01 శాతంకన్నా నెమ్మదిగా అయిపోయేలా అంటే దాదాపు కనిపెట్టలేనంత నెమ్మదయ్యేలా మృత్యువులాంటి స్థితిలోకి జారుకుంటాయి! అలా చేయడానికి అవి తమ కాళ్లను లోపలికి ముడుచుకుని, కోల్పోయిన నీటికి బదులు ప్రత్యేక తరహా చక్కెర పదార్థాన్ని ఉపయోగించుకుంటూ, టున్‌ అని పిలువబడే మైనం కప్పిన చిన్నని బంతిలా ముడుచుకుపోతాయి. తేమగల మామూలు పరిస్థితులు తిరిగి కల్పించబడినప్పుడు అవి కొన్ని నిమిషాల్లో లేదా కొన్ని గంటల్లో తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. ఒక సందర్భంలోనైతే నీటి ఎలుగుబంట్లు 100 ఏళ్లు అలా క్రియాశూన్య స్థితిలో ఉన్నా చివరికవి విజయవంతంగా తేరుకున్నాయి!

అవును, ఆ చిన్న “నేలను ప్రాకు జీవులు” మౌనంగానే అయినా అద్భుత రీతిలో యెహోవాను స్తుతిస్తున్నాయి.​—⁠కీర్తన 148:​10, 13. (g 3/07)

[30వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Diane Nelson/Visuals Unlimited