కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిద్రిస్తున్న రాకాసి నీడలో జీవించడం

నిద్రిస్తున్న రాకాసి నీడలో జీవించడం

నిద్రిస్తున్న రాకాసి నీడలో జీవించడం

అగ్నిపర్వతాలు అనాదిగా నిగూఢమైనవిగానే ఉన్నాయి. అవి శతాబ్దాలపాటు ప్రశాంతంగా నిద్రావస్థలో ఉండి, హఠాత్తుగా సంభ్రమాశ్చర్యాలు గొలిపేలా, ప్రాణాంతకమైన రీతిలో మేల్కొంటాయి. అగ్నిపర్వత విస్ఫోటనం నిమిషాల్లో ఊళ్లను తుడిచిపెట్టి, ప్రాణనష్టం కలిగించగలదు.

అగ్నిపర్వతాలు వినాశనకరమైనవనే విషయాన్ని ఎవరూ సందేహించరు. గత మూడు శతాబ్దాల్లోనే అవి వందల వేలమంది ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్నాయి. నిజమే, మనలో చాలామంది వాటికి దూరంగా సురక్షిత స్థలంలో నివసిస్తున్నా, లక్షలాదిమంది భూనివాసులు విస్ఫోటం చెందగల అగ్నిపర్వతాలకు దగ్గర్లోనే నివసిస్తున్నారు. ఉదాహరణకు, ఈక్వెడార్‌ దేశ రాజధానియైన క్విటో నగరానికి ఈశాన్యంగా అతి సమీపంలో పిచించా అనే అగ్నిపర్వతం ఉంది. మెక్సికో నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో పోపోకాటెపెటల్‌ పర్వతం ఉంది, దాని పేరుకి అజ్టెక్‌ భాషలో “పొగ వెళ్లగక్కే పర్వతం” అని అర్థం. న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌, ఇటలీలోని నేపుల్స్‌లాంటి పెద్ద నగరాలు అగ్నిపర్వతాలపై లేదా వాటి దిగువన నెలకొని ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే, లక్షలాదిమంది ప్రజలు తమ కాళ్లక్రింద భూమి భీకరంగా గర్జించి, నిద్రిస్తున్న రాకసి తిరిగి మేల్కొనే అవకాశమున్న ప్రాంతాల్లో జీవిస్తున్నారు.

వినాశనకరమైన రాకాసి

నేపుల్స్‌ నివాసులు సుమారు 3,000 సంవత్సరాలుగా వెసూవియస్‌ పర్వత సమీపంలో నివసిస్తున్నారు. ఈ పర్వతం నేపుల్స్‌కు కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాని చుట్టూ ప్రాచీన సొమ్మా పర్వత శ్రేణి ఉంది. భూమిపై అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాల్లో వెసూవియస్‌ కూడా ఒకటి. దాని అడుగుభాగం సముద్రమట్టానికి దిగువన ఉంటుంది కాబట్టి, దాని ఎత్తు కనిపించేదానికన్నా ఎక్కువే.

వెసూవియస్‌ పర్వతం గతంలో చాలాసార్లు పేలింది. చాలామందికి తెలిసినట్లుగా అది సా.శ. 79లో పేలి పాంపేయీ, హర్కులేనియమ్‌ నగరాలను నేలమట్టం చేసింది అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు 50 సార్లు పేలింది. అది 1631లో వినాశనకరంగా పేలినప్పుడు దాదాపు 4,000 మంది దానికి ఆహుతయ్యారు. ఆ సమయంలోనే “లావా” అనే పదం వాడుకలోకి వచ్చింది. లాటిన్‌ భాషలో లాబి అనే పదం నుండి వచ్చిన ఈ పదానికి “జారడం” అనే అర్థం ఉంది, నిటారైన వెసూవియస్‌ పర్వతం నుండి ఏటవాలుగా ప్రవహించే లావాకు అది చక్కని నిర్వచనం.

వెసూవియస్‌ పర్వతం శతాబ్దాలుగా లావాను వెళ్లగక్కుతూనే ఉంది. అది 1944లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో పేలి మిత్రపక్షాల సైనికులను దట్టమైన బూడిదతో కప్పేసింది. సమీపంలోని పట్టణాలైన మాసా, సాన్‌ సెబాస్ట్యానోలు బూడిద క్రింద కూరుకుపోయాయి, ఇటలీలోని “ఫునికులీ ఫునికులా” అనే జానపద గీతంతో ప్రాచుర్యం పొందిన ప్రఖ్యాత పర్వతప్రాంత ఫ్యూనిక్యులార్‌ రైలుబండి కూడా నాశనమైంది.

నేడు నేపుల్స్‌లో నివసించేవారు తమకు అతి సమీపంలో పొంచివున్న ప్రమాదాన్ని ఎరగనట్టే తమ జీవితాలను గడిపేస్తున్నారు. పర్యాటకులు అక్కడి చారిత్రాత్మక, నైపుణ్యవంతమైన నిర్మాణాలను చూసి నివ్వెరపోతారు. అక్కడి దుకాణాలు, కాఫీ హోటళ్లు జనంతో కిటకిటలాడుతుంటాయి, నేపుల్స్‌లోని సముద్రంలో తెల్లని తెరచాపలు కనువిందు చేస్తాయి. వెసూవియస్‌ పర్వతం కూడా ప్రఖ్యాత ఆకర్షణే. అదిప్పుడు నిద్రిస్తున్న రాకాసిగాకాక, రమణీయమైన ప్రకృతి దృశ్యంగా పరిగణించబడుతోంది.

ఆక్లాండ్‌​—అగ్నిపర్వతాల నగరం

న్యూజీలాండ్‌లో ఉన్న ఆక్లాండ్‌ నౌకాశ్రయ నగరంలో అక్కడక్కడా అగ్నిపర్వతాలు ఉన్నాయి. నిజానికి, 10 లక్షలకన్నా ఎక్కువమంది 48 అగ్నిపర్వతాల నడుమ జీవిస్తున్నారు. పూర్వం అగ్నిపర్వతాలు సృష్టించిన లోయలు ఇప్పుడు రెండు నౌకాశ్రయాలుగా మారాయి, విస్ఫోటన మిగిల్చిన అవశేషాలు ఇప్పుడు ద్వీపాలుగా మారాయి. వాటిలో, ఆరు వందల సంవత్సరాల పురాతనమైన రానిటోటో అన్నింటికన్నా కాస్త పెద్దదైన ద్వీపం, అది నీటిలో వెసూవియస్‌ పర్వతం ఉన్నంత ఎత్తే ఉంటుంది. అగ్నిపర్వత విస్ఫోటంవల్ల ఆ ద్వీపం ఏర్పడినప్పుడు దానికి దగ్గరలోని మయోరి అనే గ్రామం బూడిదలో కూరుకుపోయింది.

ఆక్లాండ్‌ నివాసులు అగ్నిపర్వతాల నడుమ జీవించడాన్ని నేర్చుకున్నారు. మోన్గేకీకీ అనే అగ్నిపర్వతం ఇప్పుడు ఆక్లాండ్‌ మధ్యలో ఓ ఉద్యానవనంగా, గొర్రెల ఫామ్‌గా ఉంది. కొన్ని అగ్నిపర్వతాలు ఇప్పుడు సరస్సులుగా, తోటలుగా లేక క్రీడా ప్రాంగణాలుగా మార్చబడ్డాయి. ఒకటి శ్మశానవాటికగా ఉంది. సుదూర రమణీయ దృశ్యాలతో కనువిందు చేసుకోవడానికి వీలుగా అగ్నిపర్వతాల ఏటవాలు ప్రాంతాల్లో నివసించడానికి అనేకమంది ఇష్టపడుతున్నారు.

ఆక్లాండ్‌లో ముందుగా మయోరీలు, 180 ఏళ్ల క్రితం యూరోపియన్‌లు స్థిరపడ్డప్పుడు వారు దానిలోని అగ్నిపర్వతాల గురించి అంతగా ఆలోచించలేదు. సముద్రానికి సమీపంలో మంచి సారవంతమైన భూమి తమ వశమవుతోందనే విషయాన్ని మాత్రమే వారు చూశారు. ప్రపంచంలోని ఇతర స్థలాల్లో కూడా అగ్నిపర్వతాలున్న ప్రాంతాల్లో భూమి సారవంతంగానే ఉంటుంది. ఉదాహరణకు, ఇండోనేషియాలో వరి పండించే అత్యుత్తమ పంటపొలాలు అగ్నిపర్వతాల సమీపంలోని భూములే. పశ్చిమ అమెరికాలో శ్రేష్ఠమైన సాగు భూములు అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఏర్పడ్డవే. సరైన పరిస్థితుల్లో లావా క్రింద కూరుకుపోయిన భూమి కూడా విస్ఫోటం జరిగిన సంవత్సరంలోపే పంటనివ్వగలదు.

ముందుగానే హెచ్చరించే పద్ధతులు

‘అగ్నిపర్వతాలకు దగ్గరలో నివసించడం ప్రమాదకరం కదా’ అని చాలామంది కలవరపడవచ్చు. దానికి జవాబు అవుననే చెప్పాలి. అయితే, శాస్త్రజ్ఞులు భూకంపాలను, అగ్నిపర్వతాల ప్రేలుళ్లను శ్రద్ధగా పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు, యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ, నేపుల్స్‌, ఆక్లాండ్‌లతోపాటు లోకమంతటా భవిష్యత్తులో పేలే అవకాశమున్న అగ్నిపర్వతాలను జాగ్రత్తగా కనిపెడుతోంది. ఆ రెండు నగరాల్లో విస్ఫోటం జరిగినప్పుడు తీసుకోవాల్సిన అత్యవసర చర్యల పథకాలు అమల్లో ఉన్నాయి. ఇరవైనాలుగు గంటల సాటిలైట్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ విధానాన్ని, నిర్దిష్ట స్థానాల్లో ఏర్పర్చిన సీస్మోమీటర్లను (భూకంపాల తీవ్రతను, ప్రదేశాన్ని తెలిపే ఉపకరణాలను) ఉపయోగించి శాస్త్రజ్ఞులు శిలాద్రవం, భూ అంతర్భాగంలోని కదలికలను పసిగడతారు.

వెసూవియస్‌ పర్వతం నిరంతరం పరిశీలించబడుతోంది. 1631లో సంభవించినంత తీవ్రమైన విస్ఫోటం సంభవిస్తే ఏమి చేయాలో ఇటలీలోని అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర పథకాలను ఏర్పాటు చేశారు. అగ్నిపర్వతం పేలక ముందే ప్రమాదస్థలంలోని ప్రజల్ని హెచ్చరించి అక్కడినుండి ఖాళీ చేయించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మోనోజెనెటిక్‌ వోల్కానిక్‌ ఫీల్డ్‌ అని శాస్త్రజ్ఞులు పిలిచే ప్రాంతంలో ఆక్లాండ్‌ ఉంది. అంటే అక్కడున్న అగ్నిపర్వతం పేలడానికి బదులు మరో స్థలంలో సరికొత్త అగ్నిపర్వతం పుట్టుకురావచ్చు. కానీ చాలారోజుల నుండి చాలా వారాల వరకు కొనసాగే భూకంపాలు సంభవిస్తేనే అలా జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలా భూకంపాల ద్వారా ముందుగానే హెచ్చరికలు లభించినప్పుడు ప్రజలు తలదాచుకొనేలా మరో సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కోవడానికి సరిపడా సమయం ఉంటుంది.

ప్రమాదాలను దృష్టిలో ఉంచుకోవాలి

అగ్నిపర్వతాలపై నిఘా వేయడం ప్రాముఖ్యమైన పనే అయినా, ప్రజలు హెచ్చరికలను లక్ష్యపెట్టకపోతే అంతటి ప్రయాస బూడిదలో పోసిన పన్నీరౌతుంది. కొలంబియాలోని అర్మేరోలో ఉన్న నెవాడో డెల్‌ రూయిస్‌ అగ్నిపర్వతం 1985లో పేలబోతోందని అధికారులకు హెచ్చరిక ఇవ్వబడింది. నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఆ పర్వతం కంపిస్తూ స్పష్టంగా ప్రమాద సంకేతాన్ని ఇచ్చినా అధికారులు నగరవాసులను భయపడవద్దనే చెప్పారు. ఆ నగరాన్ని కబళించిన లావావల్ల 21,000 మంది మృత్యువాతపడ్డారు.

అలాంటి బీభత్సాలు జరగడం అరుదే అయినా, అవి మరోసారి పేలే ముందు ఉండే ప్రశాంత సమయాన్ని మరింత పరిశోధన చేయడానికి, మరింతగా సిద్ధపడడానికి ఉపయోగించబడుతున్నాయి. కాబట్టి, చుట్టుప్రక్కల జీవిస్తున్నవారు నిద్రిస్తున్న ఆ రాకాసిని ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించడానికి నిరంతరం వాటిని కనిపెడుతూ ఉండడం, అవసరమైన సిద్ధపాటు చేసుకోవడం, వాటి గురించి ప్రజలకు తెలియజేయడం సహాయం చేస్తుంది. (g 2/07)

[24వ పేజీలోని బాక్సు/చిత్రం]

సిద్ధంగా ఉండండి!

ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ప్రాంతంలో పొంచివున్న ప్రమాదాల గురించి తెలుసుకోండి. అవి సంభవించినప్పుడు ఒకవేళ కుటుంబ సభ్యులు మీనుండి విడిపోతే ఎక్కడ కలుసుకోవాలో, మీ ఆచూకీని ఎవరికి తెలియజేస్తారనే విషయాన్ని ముందే నిర్ణయించుకోండి. నీరు, ఆహారం, ప్రథమ చికిత్స బాక్సు, బట్టలు, రేడియోలు, వాటర్‌ప్రూఫ్‌ టార్చీలు, అదనపు బ్యాటరీలు లాంటి అత్యవసర సామగ్రి దగ్గర ఉండేలా చూసుకోండి. ఎక్కువరోజులకు సరిపోయేంత సామగ్రిని దగ్గర ఉంచుకోండి.

[23వ పేజీలోని చిత్రం]

వెసూవియస్‌ అగ్నిపర్వత శిఖరబిలానికి దగ్గరగా నడుస్తున్న పర్యాటకులు

[చిత్రసౌజన్యం]

©Danilo Donadoni/Marka/age fotostock

[23వ పేజీలోని చిత్రం]

వెసూవియస్‌ పర్వతం ఎదురుగా కనిపించే నేపుల్స్‌, ఇటలీ

[చిత్రసౌజన్యం]

© Tom Pfeiffer

[23వ పేజీలోని చిత్రం]

సా.శ. 79లో పేలి పాంపేయీ, హర్కులేనియమ్‌ నగరాలను నేలమట్టం చేసిన గొప్ప విస్ఫోటాన్ని చూపిస్తున్న చిత్రకారుని ఊహా చిత్రం

[చిత్రసౌజన్యం]

© North Wind Picture Archives

[24వ పేజీలోని చిత్రం]

ఆక్లాండ్‌లో విస్ఫోటన అవశేషాలవల్ల ఏర్పడిన ద్వీపాల్లో ఒకటైన రానిటోటో

[24, 25వ పేజీలోని చిత్రాలు]

పైన, కుడివైపున: మెక్సికోలోని పోపోకాటెపెటల్‌ పర్వతం

[చిత్రసౌజన్యం]

AFP/Getty Images

Jorge Silva/AFP/Getty Images

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

USGS, Cascades Volcano Observatory