కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

అమెరికాలోని కాలిఫోర్నియాలోవున్న రెండు జాతీయ పార్కుల గుహలను అధ్యయనం చేసినప్పుడు 27 క్రొత్త జంతు జాతులు వెలుగుచూశాయి. “మన చుట్టూ ఉన్న లోకం గురించి మనకు ఎంత కొద్దిగా తెలుసో అది రుజువుచేస్తుంది” అని జాతీయ పార్కు విభాగంలో గుహ నిపుణునిగా పనిచేస్తున్న జోయెల్‌ డస్పాన్‌ చెబుతున్నాడు.​​—⁠స్మిత్సోనియన్‌, అమెరికా.

ప్రపంచ జనాభాలోని ఇరవైశాతం మందికి మంచినీళ్లు అందుబాటులో లేవు. 40 శాతం మందికి ప్రాథమిక పారిశుద్ధ్య వసతులు అందుబాటులో లేవు.​​—⁠మెలీన్యో, మెక్సికో. (g 1/07)

“రోజంతా టీవీ చూస్తుండడంవల్ల, కుటుంబమంతా కలిసి భోజనం చేసే అలవాటు కనుమరుగవడంవల్ల, పిల్లలను కూర్చోబెట్టి ముందుకు తోసుకెళ్లే బళ్లవల్ల కూడా” తల్లిదండ్రుల, పిల్లలు మధ్య సంభాషణ తగ్గిపోతోంది. దానివల్ల స్కూలుకు వెళ్లడం ప్రారంభించిన పిల్లలు వారు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నప్పుడు “కోపంతో చిందులేస్తారు.”​​—⁠ది ఇండిపెండెంట్‌, బ్రిటన్‌. (g 2/07)

ఆఫీసులో సూక్ష్మక్రిములు

ఆరిజోనా విశ్వవిద్యాలయ మైక్రోబయోలజిస్ట్‌లు అమెరికాలోని అనేక నగరాల్లోని కార్యాలయాల్లో సూక్ష్మక్రిముల శాతాన్ని అంచనావేశారు. గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ వార్తాపత్రిక చెబుతున్న ప్రకారం, “(వరుసక్రమంలో) ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, వాటర్‌ ఫౌంటెన్‌ హ్యాండిళ్లు, మైక్రోవేవ్‌ అవన్‌ హ్యాండిళ్లు, కీ-బోర్డులు వంటి ఐదు వస్తువులమీద క్రిములు అధికంగా ఉన్నాయని” ఆ మైక్రోబయోలజిస్ట్‌ల పరిశోధనలో తేలింది. వారి నివేదిక ప్రకారం, “సూక్ష్మక్రిములు సగటున ఒక డెస్క్‌టాప్‌పై వంటగది బల్లమీదకన్నా వందరెట్లు ఎక్కువగా, ఒక మామూలు టాయిలెట్‌ సీటుమీదకన్నా 400 రెట్లు ఎక్కువగా ఉంటాయి.” (g 1/07)

ఉష్ణమండల వ్యాధులపై సన్నగిల్లిన శ్రద్ధ

అనేక ఉష్ణమండల వ్యాధులను వైద్య పరిశోధకులు పట్టించుకోవడంలేదు. ఎందుకు? “విచారకరమైన పరిస్థితి ఏమిటంటే . . . ఔషధ పరిశ్రమ [క్రొత్త చికిత్సల] కోసం అన్వేషించడం లేదు” అని స్కాట్లాండ్‌లోని డూండీ విశ్వవిద్యాలయంలో సూక్ష్మాణువుల జీవశాస్త్రవేత్త అయిన మైఖెల్‌ ఫర్గాసన్‌ చెబుతున్నాడు. అలా ప్రయత్నించడానికి ఔషధ కంపెనీలకు ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం లభించడం లేదు, ఎందుకంటే అవి తమ పెట్టుబడిని మళ్లీ రాబట్టుకునే అవకాశమే లేదు. ఈ కంపెనీలు అల్జీమర్‌ వ్యాధి, స్థూలకాయం, నపుంసకత్వంవంటి శారీరక పరిస్థితులకు సంబంధించిన లాభదాయక ఔషధాలను ఉత్పత్తి చేయడానికే మొగ్గుచూపుతున్నాయి. పరిస్థితి ఇలావుండగా, దాదాపు “10 లక్షలమంది ఎప్పటిలాగే సురక్షితమైన, సమర్థమైన చికిత్సలు దొరక్క ప్రతీ సంవత్సరం మలేరియాతో మరణిస్తున్నారు” అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక చెబుతోంది. (g 2/07)

మధుమేహం​—⁠ప్రపంచవ్యాప్త మహమ్మారి

ఇంటర్నేషనల్‌ డయాబిటిస్‌ ఫెడరేషన్‌ అందించిన సమాచారం ప్రకారం, గత 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్నట్లు నిర్ధారించబడినవారి సంఖ్య 3 కోట్ల నుండి 23 కోట్లకు పెరిగినట్లు వెల్లడౌతుందని ద న్యూయార్క్‌ టైమ్స్‌ చెబుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న పది దేశాల్లో ఏడు వర్ధమాన దేశాలే. “ప్రపంచం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద ఆరోగ్య విపత్తుల్లో మధుమేహం ఒకటి” అని ఆ ఫెడరేషన్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ మార్టిన్‌ సిలింగ్‌ చెప్పాడు. “ప్రపంచంలోని కొన్ని నిరుపేద దేశాల్లో, ఈ వ్యాధి సోకిన తర్వాత ప్రజలు ఎక్కువకాలం జీవించలేకపోతున్నారు” అని ఆ నివేదిక చెబుతోంది.

ప్రపంచంలోని ఎత్తైన రైలుమార్గం

2006 జూలైలో ప్రారంభించబడిన ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైలుమార్గం బీజింగ్‌ను 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిబెట్‌ రాజధాని అయిన లాసాతో అనుసంధానం చేస్తుంది. “ఆ రైలు మార్గం ఇంజనీరింగుకు సంబంధించిన ఒక అద్భుతం, అది శాశ్వతంగా మంచుతో గడ్డకట్టిన అస్థిరమైన నేల గుండా పయనిస్తూ, సముద్రమట్టానికి 4,800 మీటర్ల కన్నా ఎత్తులో ఉన్న ప్రదేశానికి చేరుకుంటుంది” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ చెబుతోంది. ఇంజనీర్లు అధిగమించిన సవాళ్లలో ఒకటి, ట్రాక్‌బెడ్‌ను స్థిరంగా ఉంచేందుకు దానిని ఏడాది పొడవునా గడ్డకట్టి ఉండేలా చేయడం. ఆ రైలు మార్గాల్లో పయనించే రైళ్లు ఎంతో ఎత్తులో వెళ్తుంటాయి కాబట్టి బోగీల్లో గాలి నింపాల్సివస్తుంది, ప్రయాణికులందరికీ సరిపోయేలా ఆ బోగీల్లో ఆక్సిజన్‌ సరఫరా కూడా అందుబాటులో ఉంటుంది. (g 3/07)