కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విజ్ఞానశాస్త్రం వ్యాధులన్నిటినీ నయం చేస్తుందా?

విజ్ఞానశాస్త్రం వ్యాధులన్నిటినీ నయం చేస్తుందా?

విజ్ఞానశాస్త్రం వ్యాధులన్నిటినీ నయం చేస్తుందా?

ఆధునిక విజ్ఞానశాస్త్రం వ్యాధులన్నిటినీ నయం చేస్తుందా? యెషయా, ప్రకటన గ్రంథాల్లోని బైబిలు ప్రవచనాలు, వ్యాధుల్లేని లోకాన్ని స్వయంగా మానవుడే తీసుకువచ్చే కాలం గురించి మాట్లాడుతున్నాయా? ఆరోగ్య సంరక్షణ రంగంలో సాధించిన అనేక విజయాల దృష్ట్యా, విజ్ఞానశాస్త్రానికి అది అసాధ్యమేమీ కాదని కొందరు అనుకుంటున్నారు.

ప్రభుత్వాలు, దాతలు ఐక్యరాజ్యసమితితో కలిసి గతంలో ఎన్నడూలేని విధంగా వ్యాధులపై పోరుసాగిస్తున్నారు. వారు సంఘటితంగా వర్ధమాన దేశాల్లోని పిల్లలకు టీకాలు ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ శిశు సంక్షేమ నిధి ప్రకారం, దేశాలు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తే, “2015 కల్లా, ప్రపంచంలోని నిరుపేద దేశాల్లో జీవిస్తున్న 7 కోట్లకన్నా ఎక్కువమంది పిల్లలు ప్రతీ సంవత్సరం క్షయ, కంఠవాతము (డిఫ్తీరియా), ధనుర్వాతం, కోరింతదగ్గు, తట్టువ్యాధి, రుబెల్లా, పీత జ్వరము, హెమోఫిలస్‌ ఇన్‌ఫ్లుయెన్జా టైప్‌ బి, హెపటైటిస్‌ బి, పోలియో, రోటవైరస్‌, న్యూమాకాకస్‌, మెనింగాకస్‌, మెదడువాపు వంటి వాటికి ప్రాణరక్షక టీకాలు పొందుతారు.” పరిశుభ్రమైన నీళ్లు, చక్కని పోషకాహారం సరిపోయేంత అందుబాటులో ఉంచడంతోపాటు ఆరోగ్య సూత్రాలను బోధించడం వంటి ప్రాథమిక ఆరోగ్య అవసరాలను తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నారు.

అయితే శాస్త్రజ్ఞులు కేవలం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకన్నా ఎక్కువ అందించాలని కోరుకుంటున్నారు. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం వైద్య రంగంలో విప్లవాన్ని తీసుకువస్తోంది. దాదాపు ప్రతీ ఎనిమిది సంవత్సరాలకు శాస్త్రజ్ఞులు తమ వైద్య పరిజ్ఞానాన్ని రెట్టింపు చేసుకుంటారని చెప్పబడుతోంది. వ్యాధులపై జరుగుతున్న పోరులో ఇటీవల సాధించిన సాంకేతిక విజయాల్లో, లక్ష్యాల్లో కేవలం కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

ఎక్స్‌రే చిత్రాలు: దాదాపు 30 కన్నా ఎక్కువ సంవత్సరాల నుండి వైద్యులు, ఆసుపత్రులు సిటి స్కాన్‌గా పిలవబడే రోగ నిర్ధారణా పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. సిటి అనే సంక్షిప్తనామం కంప్యూటెడ్‌ టోమోగ్రఫీని సూచిస్తుంది. సిటి స్కానర్లు మన శరీరాల్లోవున్న అవయవాల త్రిమితీయ ఎక్స్‌రే చిత్రాలను తీస్తాయి. ఈ చిత్రాలు రోగ నిర్ధారణకు, శరీరంలోవున్న లోపాలను పరిశోధించడానికి సహాయకరంగా ఉంటాయి.

వికిరణకు గురవడంవల్ల ఎదురయ్యే అపాయాల గురించి కొంత వివాదమున్నా, అభివృద్ధి చెందుతున్న ఈ పరిజ్ఞానంవల్ల భవిష్యత్తులో చేకూరే ప్రయోజనాల విషయంలో వైద్య నిపుణులు ఆశాభావంతో ఉన్నారు. చికాగో హాస్పిటల్‌ విశ్వవిద్యాలయంలో రేడియోలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మైఖెల్‌ వానీర్‌ ఇలా అంటున్నాడు: “ఈ రంగంలో గత కొన్ని సంవత్సరాల్లోనే నమ్మశక్యంకానంత ప్రగతి సాధించారు.”

సిటి స్కానర్లు ఇప్పుడు వేగంగా, మరింత ఖచ్చితంగా ఫలితాలనిస్తూ స్వల్ప వ్యయంతోనే అందుబాటులో ఉన్నాయి. క్రొత్త స్కానింగ్‌ పద్ధతులవల్ల లభించే ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, అవి వేగంగా ఫలితాలు ఇస్తాయి. ప్రత్యేకంగా, గుండెను స్కానింగ్‌ చేయడానికి అవెంతో ఉపకరిస్తాయి. గుండె ఎల్లప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి, దాని ఎక్స్‌రే చిత్రాలు అస్పష్టంగా రావడంవల్ల దాని స్థితిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమయ్యేది. న్యూ సైంటిస్ట్‌ పత్రిక వివరిస్తున్న ప్రకారం, క్రొత్త స్కానర్లు “ఒక గుండె స్పందన కన్నా వేగంగా శరీరం చుట్టూ తిరగడానికి ఒక సెకనులో మూడో వంతు సమయం మాత్రమే” తీసుకొని స్పష్టమైన చిత్రాలను తీస్తాయి.

వైద్యులు ఆధునిక స్కానర్ల సహాయంతో శరీరంలోని అవయవాల నిర్మాణ వివరాలను మాత్రమే కాక, కొన్ని భాగాల జీవరసాయన చర్యలను కూడా పరిశోధించవచ్చు. దీనివల్ల ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను పసిగట్టవచ్చు.

రొబొటిక్‌ సర్జరీ: అత్యాధునిక రోబోలు కనీసం వైద్యరంగంలోనైనా సైన్స్‌ ఫిక్షన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పటికే వేలాది శస్త్రచికిత్సలు రోబోల సహాయంతో జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రోబోట్‌కు అదనంగా అమర్చిన అనేక పరికరాలను నిర్దేశించే రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆ పరికరాలకు కత్తులు, కత్తెరలు, కెమెరాలు, కణజాలములను దగ్ధము చేసే సాధనాలతోపాటు శస్త్రచికిత్సకు సంబంధించిన ఇతర సాధనాలు కూడా అమర్చబడి ఉంటాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానంవల్ల వైద్యులు ఎంతో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను నమ్మశక్యం కానంత ఖచ్చితంగా చేయగలరు. “సాంప్రదాయ పద్ధతిలో శస్త్రచికిత్స చేయించుకున్నవారికన్నా ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేయించుకున్నవారు రక్తాన్ని తక్కువగా కోల్పోతారు, నొప్పి తక్కువగా ఉంటుంది, వైద్యపరమైన చిక్కులు తక్కువ ఉంటాయి, ఆసుపత్రిలో తక్కువ రోజులు గడుపుతారు, త్వరగా కోలుకుంటున్నట్లు ఈ పద్ధతిని ఉపయోగించిన వైద్యులు గమనించారు” అని న్యూస్‌వీక్‌ పత్రిక నివేదిస్తోంది.

నానోమెడిసిన్‌: నానోటెక్నాలజీని వైద్యరంగంలో ఉపయోగించడాన్నే నానోమెడిసిన్‌ అంటారు. సూక్ష్మాతిసూక్ష్మమైన పరికరాలను ఉపయోగించే, సృష్టించే శాస్త్రమే నానోటెక్నాలజీ. ఈ సాంకేతిక విజ్ఞానంలోని ప్రమాణాలను నానోమీటర్లలో కొలుస్తారు, అది ఒక మీటరులో నూరుకోట్ల వంతు. *

ఆ ప్రమాణం ఎంత చిన్నదో అర్థం చేసుకోవడానికి క్రింది విషయాలను పరిశీలించండి. మీరిప్పుడు చదువుతున్న పేజీ, దాదాపు 1,00,000 నానోమీటర్ల మందం ఉంటుంది, మానవుని వెంట్రుక దాదాపు 80,000 నానోమీటర్ల మందం ఉంటుంది. ఒక ఎర్రరక్త కణానికి దాదాపు 2,500 నానోమీటర్ల వృత్తవ్యాసం ఉంటుంది. ఒక సూక్ష్మక్రిమి దాదాపు 1,000 నానోమీటర్ల పొడవు, ఒక వైరస్‌ దాదాపు 100 నానోమీటర్ల పొడవు ఉంటాయి. మీ డిఎన్‌ఎ వృత్తవ్యాసం దాదాపు 2.5 నానోమీటర్లు ఉంటుంది.

సమీప భవిష్యత్తులో, విజ్ఞానశాస్త్రజ్ఞులు మానవ శరీరంలో వైద్యవిధానాలను నిర్వహించేందుకు రూపొందించబడిన చిన్న పరికరాలను నిర్మించగలరని ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ప్రతిపాదించేవారు నమ్ముతున్నారు. సాధారణంగా నానోమెషీన్స్‌గా పిలవబడే ఈ చిన్న రోబోలకు ఎన్నో నిర్దిష్టమైన ఆదేశాలతో ప్రోగ్రామ్‌ చేయబడ్డ సూక్ష్మాతిసూక్ష్మమైన కంప్యూటర్లు ఉంటాయి. ఆశ్చర్యకరంగా, ఎంతో సంక్లిష్టమైన ఈ యంత్రాలు 100 నానోమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉన్న భాగాలతో నిర్మించబడతాయి. అవి ఒక ఎర్రరక్త కణపు వృత్తవ్యాసంకన్నా 25 రెట్లు చిన్నవి!

ఆ యంత్రాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, ఏదో ఒకరోజు అవి అతి చిన్న రక్తకేశనాళికల గుండా పయనించి రక్తహీన ధాతువులకు ఆక్సిజన్‌ అందించగలుగుతాయి, రక్త నాళాల్లో అడ్డంకులను, మెదడు కణాల్లోని ప్లాక్‌ను తొలగించగలుగుతాయి, వైరస్‌లను, సూక్ష్మక్రిములను, మరితర అంటువ్యాధి కారకాలను పసిగట్టి వాటిని నాశనం కూడా చేయగలుగుతాయి. నానోమెషీన్లు మందులను నేరుగా నిర్దిష్ట కణాలకు చేరవేసేందుకు కూడా ఉపయోగించబడవచ్చు.

నానోమెడిసన్‌ సహాయంతో క్యాన్సర్‌ను పసిగట్టడంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు. వైద్యశాస్త్రంలో, భౌతికశాస్త్రంలో, బయోమెడికల్‌ ఇంజనీరింగులో ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ సామ్యూయెల్‌ విక్లిన్‌ ఇలా అన్నాడు: “గతానికన్నా ఎంతో త్వరగా అత్యల్ప క్యాన్సర్లను పసిగట్టి, శక్తివంతమైన మందులతో కంతి ఉన్న ప్రాంతానికే చికిత్స చేసి, అదే సమయంలో అపాయకరమైన దుష్ప్రభావాలను తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.”

అది భవిష్యత్తు గురించిన ఊహాగానంలా అనిపించినా, కొంతమంది శాస్త్రజ్ఞుల మనసుల్లో నానోమెడిసిన్‌ ఎంతో వాస్తవికంగా ఉంది. మనం తర్వాతి దశాబ్దంలో అడుగుపెట్టేలోగా జీవకణాలను బాగుచేయడానికి, వాటి సూక్ష్మాణువుల నిర్మాణాన్ని తిరిగి అమర్చడానికి నానోటెక్నాలజీ ఉపయోగించబడుతుందని ఈ రంగంలోని ప్రముఖ పరిశోధకులు భావిస్తున్నారు. ఆ సాంకేతిక విజ్ఞానాన్ని ప్రదిపాదిస్తున్న ఒక వ్యక్తి ఇలా వాదిస్తున్నాడు: “20 శతాబ్దంలోని సామాన్య వ్యాధులన్నిటినీ, చికిత్సవల్ల కలిగే బాధలన్నిటినీ, వేదనలన్నిటినీ దాదాపు తీసివేసి, మానవులు తమ సామర్థ్యాలను ఎక్కువగా ఉపయోగించేందుకు నానోమెడిసిస్‌ దోహదపడుతుంది.” ప్రయోగశాలలోని జంతువులమీద చేస్తున్న నానోమెడిసిన్‌ ప్రయోగాలు చక్కని ఫలితాలను ఇస్తున్నాయని కూడా నేడు కొందరు శాస్త్రజ్ఞులు నివేదిస్తున్నారు.

జినోమిక్స్‌: జన్యు నిర్మాణానికి సంబంధించిన అధ్యయనాన్ని జినోమిక్స్‌ అంటారు. మానవ శరీరంలోని ప్రతీ కణం జీవానికి అత్యావశ్యకమైన ఎన్నో భాగాలతో నిండివుంటుంది. ఆ భాగాల్లో జన్యువు ఒకటి. మనలో ప్రతీ ఒక్కరికీ కేశాల రంగు, నిర్మాణం, మేనిఛాయ, కళ్ల రంగు, ఎత్తుతోపాటు మన భౌతిక స్వరూపానికి సంబంధించిన ఇతర లక్షణాలను నిర్ధారించే దాదాపు 35,000 జన్యువులు ఉంటాయి. శరీరంలోవున్న అవయవాల స్థితిని నిర్ధారించడంలో కూడా మన జన్యువులు ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

జన్యువులకు హాని జరిగినప్పుడు, అది మన ఆరోగ్యంమీద ప్రభావం చూపించవచ్చు. వాస్తవానికి కొందరు పరిశోధకులు, అన్ని వ్యాధులు జన్యు లోపంవల్ల కలుగుతున్నాయని నమ్ముతున్నారు. లోపమున్న కొన్ని జన్యువులు మనకు మన తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తాయి. మరికొన్ని మన వాతావరణంలోని హానికరమైన పదార్థాల ప్రభావానికి గురికావడంవల్ల పాడౌతాయి.

మనం వ్యాధుల బారినపడే అవకాశాలను పెంచే నిర్దిష్ట జన్యువులను త్వరలో గుర్తించగలుగుతామని శాస్త్రజ్ఞులు ఆశిస్తున్నారు. అలా గుర్తించడంవల్ల కొందరికి ఎందుకు ఇతరుల కన్నా ఎక్కువగా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది లేక ఒక రకమైన క్యాన్సర్‌ కొందరిలో ఇతరుల కన్నా ఎందుకు అధిక ప్రభావం చూపిస్తోంది వంటి అంశాలను వైద్యులు గ్రహించగలుగుతారు. ఒక మందు కొంతమంది రోగులమీద సమర్థవంతంగా పనిచేసి ఇతరులమీద సరిగ్గా పనిచేయకపోవడానికిగల కారణాలను కూడా జినోమిక్స్‌ వెలుగులోకి తీసుకురావచ్చు.

అలాంటి నిర్దిష్ట జన్యు సమాచారం దొరికితే వ్యక్తికి తగిన చికిత్సగా పిలవబడుతున్న వైద్యం అభివృద్ధి చెందవచ్చు. మీరు ఈ సాంకేతిక విజ్ఞానం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు? వ్యక్తికి తగిన చికిత్స అనే సిద్ధాంతం, ప్రత్యేకమైన మీ జన్యు లక్షణాలకు అనుగుణంగా మీకు వైద్యసేవలను అందించవచ్చనే అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. ఉదాహరణకు, మీ జన్యువులను పరిశోధించిన తర్వాత మీకు ఫలానా వ్యాధి వచ్చే అవకాశముందని వెల్లడైతే మీలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకముందే, ఆ వ్యాధిని పసిగట్టగలుగుతారు. కొన్ని సందర్భాల్లో, వ్యాధిరాకముందే సరైన చికిత్స, ఆహారం తీసుకోవడంవల్ల, ప్రవర్తనలో మార్పులు చేసుకోవడంవల్ల ఆ వ్యాధి అసలు రాకుండా కూడా చేయవచ్చని ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేవారు వాదిస్తున్నారు.

మీ జన్యువుల గురించిన సమాచారం తెలిస్తే ఫలానా మందు మీకు పడకపోయే అవకాశముందని కూడా వైద్యులు తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకోగలిగితే మీకు అవసరమైన సరైన మందును, మోతాదును నిర్దేశించగలుగుతారు. బోస్టన్‌ గ్లోబ్‌ ఇలా నివేదిస్తోంది: “2020వ సంవత్సరానికల్లా [వ్యక్తికి తగిన చికిత్సా] ప్రభావం నేడు మన ఊహకందనంత విస్తృతంగా ఉండవచ్చు. మన సమాజాన్ని బలిగొంటున్న మధుమేహం, హృద్రోగం, అల్జీమర్‌, మనోవైకల్యం వంటి వ్యాధులతోపాటు అనేక ఇతర వ్యాధులకు వ్యక్తి అవసరానికి తగ్గట్టు ప్రత్యేకంగా రూపొందించబడిన మందులు అభివృద్ధి చెందుతాయి.”

భవిష్యత్తు గురించి విజ్ఞానశాస్త్రం చేస్తున్న సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన వాగ్దానాల్లో పైన పేర్కొనబడినవి కొన్ని మాత్రమే. వైద్య పరిజ్ఞానం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే శాస్త్రజ్ఞులు, త్వరలో వ్యాధులను పూర్తిగా నిర్మూలిస్తామని మాత్రం అనుకోవడంలేదు. ఇప్పటికీ దుర్బేధ్యంగా కనిపించే అనేక అడ్డంకులు ఉన్నాయి.

దుర్బేధ్యంగా కనిపించే అడ్డంకులు

వ్యాధి నిర్మూలనలో జరుగుతున్న ప్రగతిని మానవ ప్రవర్తన మందగించేలా చేయవచ్చు. ఉదాహరణకు, కొన్ని పర్యావరణ వ్యవస్థలకు మానవులు చేసిన హాని, అపాయకరమైన క్రొత్త వ్యాధులు పుట్టుకురావడానికి దారితీసిందని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. న్యూస్‌వీక్‌ పత్రికలో వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ అధ్యక్షురాలైన మేరీ పర్ల్‌ ఇలా వివరించారు: “1970ల మధ్యకాలం నుండి ఎయిడ్స్‌, ఇబోలా, లైమ్‌, సార్స్‌ వంటి 30 క్రొత్త వ్యాధులు పుట్టుకొచ్చాయి. వాటిలో అనేక వ్యాధులు వన్యప్రాణుల నుండి మానవులకు సంక్రమించాయని నమ్ముతున్నారు.”

అంతేకాక, ప్రజలు తాజా పండ్లను, కూరగాయలను తినడం తగ్గించి, చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగావున్న పదార్థాలను ఆరగిస్తున్నారు. శారీరక శ్రమ తగ్గడంతోపాటు, అనారోగ్యకరమైన ఇతర అలవాట్లు వాటికి తోడవ్వడం అనేక గుండె, రక్తనాళాల వ్యాధులకు దారితీస్తోంది. పొగత్రాగడం పెరిగిపోతోంది, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, మరణిస్తున్నారు. ప్రతీ ఏడాది దాదాపు 2 కోట్లమంది రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయాలపాలౌతున్నారు లేక మరణిస్తున్నారు. యుద్ధంతోపాటు ఇతర రకాల హింస ఎంతోమందిని పొట్టనబెట్టుకుంటోంది లేక వికలాంగులను చేస్తోంది. మద్యపాన దుర్వినియోగంవల్ల లేక మాదకద్రవ్యాల ఉపయోగంవల్ల లక్షలాదిమంది అనారోగ్యం పాలౌతున్నారు.

కొన్ని వ్యాధులకు కారణమేదైనా, వైద్య సాంకేతిక విజ్ఞానంలో ఎంతో పురోభివృద్ధి జరుగుతున్నా అవి ఇప్పటికీ ఎంతో వేదనను కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ‘15 కోట్ల కన్నా ఎక్కువమంది ఏదో ఒక సమయంలో మానసిక కృంగుదలతో బాధపడుతున్నారు, దాదాపు 2.5 కోట్లమంది మనోవైకల్యంతో, 3.8 కోట్లమంది మూర్ఛరోగంతో బాధపడుతున్నారు.’ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌, అతిసార వ్యాధులు, మలేరియా, తట్టువ్యాధి, నిమోనియా, క్షయ వంటి వ్యాధులు లక్షలాదిమందికి సోకి, ఎంతోమంది పిల్లలను, యౌవనస్థులను బలిగొంటున్నాయి.

వ్యాధినిర్మూలకు చేస్తున్న ప్రయత్నాలకు, దుర్బేధ్యంగా కనిపించే ఇతర ఆటంకాలు కూడా ఎదురౌతున్నాయి. పేదరికం, అసమర్థ పాలన రెండు పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. ప్రభుత్వం విఫలం కానట్లయితే, సరిపోయేంత నిధులు అందుబాటులో ఉన్నట్లయితే అంటువ్యాధులతో మరణించే లక్షణాదిమందిని రక్షించవచ్చని ఇటీవల నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానం, వైద్య సాంకేతిక విజ్ఞానంలో జరుగుతున్న గణనీయమైన అభివృద్ధి ఆ అటంకాలను అధిగమించేందుకు సహాయం చేయగలవా? త్వరలో మనం వ్యాధుల్లేని లోకాన్ని చూస్తామా? అవును, పైన వివరించబడిన విషయాలు మనకు స్పష్టమైన జవాబు ఇవ్వడంలేదు. అయితే ఆ ప్రశ్నకు బైబిలు జవాబిస్తోంది. వ్యాధులు ఇక ఉండని భవిష్యత్‌ నిరీక్షణ గురించి బైబిలు ఏమి చెబుతుందో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తోంది. (g 1/07)

[అధస్సూచి]

^ “నానో” అనే ఉపసర్గం, గ్రీకులో అతిచిన్న వస్తువును సూచించేందుకు ఉపయోగించే పదం నుండి వచ్చింది, దానికి “నూరుకోట్ల వంతు” అని అర్థం.

[7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఎక్స్‌రే చిత్రాలు

మానవ శరీరంలోని అవయవాల స్పష్టమైన, మరింత ఖచ్చితమైన చిత్రాలు వ్యాధిని ఆరంభ దశలోనే పసిగట్టేందుకు సహాయం చేయవచ్చు

[చిత్రసౌజన్యం]

© Philips

Siemens AG

రొబొటిక్‌ సర్జరీ వైద్యులు అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను నమ్మశక్యం కానంత ఖచ్చితంగా నిర్వహించడానికి శస్త్రచికిత్సకు సంబంధించిన సాధనాలు అమర్చబడిన రోబోలు సహాయం చేస్తున్నాయి

[చిత్రసౌజన్యం]

© 2006 Intuitive Surgical, Inc.

నానోమెడిసిన్‌

మానవ నిర్మిత సూక్ష్మాతిసూక్ష్మమైన పరికరాల సహాయంతో వైద్యులు జీవకణాల స్థాయిలోనే వ్యాధికి చికిత్స చేయగలగవచ్చు. పైనున్న ఒక చిత్రకారుడి ఊహాచిత్రం, రక్తకణాలు చేసే పనిని అనుకరించే నానోమెషీన్‌లను చూపిస్తోంది

[చిత్రసౌజన్యం]

కళాకారుడు: Vik Olliver (vik@diamondage.co.nz)/ డిజైనర్‌: Robert Freitas

జినోమిక్స్‌

ఒక వ్యక్తి జన్యు నిర్మాణాన్ని అధ్యయనం చేయడం ద్వారా రోగిలో ఎలాంటి రోగలక్షణాలు కనబడకముందే వాటిని పసిగట్టి చికిత్స చేయగలమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు

[చిత్రసౌజన్యం]

క్రోమోజోములు: © Phanie/ Photo Researchers, Inc.

[8, 9వ పేజీలోని బాక్సు]

ఆరు మొండి వ్యాధులు

వైద్య పరిజ్ఞానం, దానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానం ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో పురోభివృద్ధి సాధిస్తోంది. అయినా అంటువ్యాధుల తెగుళ్లు లోకంలో ఇప్పటికీ వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. క్రింద పేర్కొనబడిన ప్రాణాంతకమైన వ్యాధులు ఇప్పటికీ అజేయంగా ఉన్నాయి.

హెచ్‌ఐవి/ఎయిడ్స్‌

దాదాపు 6 కోట్లమంది హెచ్‌ఐవి బారినపడ్డారు, దాదాపు 2 కోట్లమంది ఎయిడ్స్‌తో మరణించారు. 2005వ సంవత్సరంలో క్రొత్తగా యాభైలక్షలమందికి ఆ వ్యాధి సోకింది, ముప్ఫై లక్షలకన్నా ఎక్కువమంది మరణించారు. దానికి బలైనవారిలో 5,00,000 కన్నా ఎక్కువమంది పిల్లలు ఉన్నారు. హెచ్‌ఐవి బాధితుల్లో చాలామందికి సరైన చికిత్స అందుబాటులో లేదు.

అతిసారవ్యాధి

చాలామంది పేదవారిని ఈ వ్యాధి పొట్టనబెట్టుకుంటోందని, ప్రతీ ఏడాది 400 కోట్లమంది దాని బారినపడుతున్నారని చెప్పబడుతోంది. కలుషిత నీరు లేక ఆహారం కారణంగా లేదా సరైన ఆరోగ్యసూత్రాలను పాటించని కారణంగా వ్యాప్తిచెందే అనేక అంటువ్యాధుల మూలంగా అది వస్తుంది. ఈ అంటువ్యాధుల కారణంగా ప్రతీ ఏడాది, 20 లక్షలకన్నా ఎక్కువమంది మరణిస్తున్నారు.

మలేరియా

ప్రతీ ఏడాది, దాదాపు 30 కోట్లమంది మలేరియా బారినపడుతున్నారు. దాదాపు ప్రతీ ఏడాది ఇంచుమించు 10 లక్షలమంది మరణిస్తున్నారు, వారిలో చాలామట్టుకు పిల్లలే. ఆఫ్రికాలో దాదాపు ప్రతీ 30 సెకండ్లకు ఒక శిశువు మలేరియాతో మరణిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, “మలేరియాను త్వరగా, సమూలంగా నయం చేసే మందును విజ్ఞానశాస్త్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది, చాలామంది అలాంటి మందు ఎప్పటికైనా అందుబాటులోకి వస్తుందని కూడా నమ్మడంలేదు.”

తట్టువ్యాధి

2003వ సంవత్సరంలో తట్టువ్యాధి 5,00,000 కన్నా ఎక్కువమందిని బలిగొంది. తీవ్రంగా సంక్రమించే ఈ వ్యాధితో పిల్లలు ఎక్కువగా మరణిస్తున్నారు. ప్రతీ ఏడాది, దాదాపు 3 కోట్లమందికి తట్టువ్యాధి సోకుతుంది. ఆశ్చర్యకరంగా తట్టువ్యాధి కోసం సమర్థవంతమైన, చౌకగా దొరికే టీకా గత 40 సంవత్సరాలుగా అందుబాటులో ఉంది.

నిమోనియా

ఇతర అంటురోగాల కన్నా ఎక్కువగా నిమోనియాతోనే చాలామంది పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రతీ ఏడాది, ఐదేళ్లలోపున్న ఇరవై లక్షలమంది పిల్లలు నిమోనియాతో మరణిస్తున్నారు. ఆ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో సంభవిస్తున్నాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు అంతగా అందుబాటులో లేకపోవడంవల్ల బాధితులు ప్రాణరక్షక వైద్యచికిత్సను పొందలేకపోతున్నారు.

క్షయ

2003వ సంవత్సరంలో, క్షయ (టీబీ) 17,00,000 కన్నా ఎక్కువమందిని పొట్టనబెట్టుకుంది. మందులకు తట్టుకునే టీబీ క్రిములు పుట్టుకురావడం ఆరోగ్య అధికారులను ఎంతో కలవరపెడుతోంది. కొన్ని క్రిములు టీబీని నివారించే ప్రధాన మందులన్నిటినీ తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. సరైన పర్యవేక్షణ లేకుండా మందులను తీసుకునే లేక పూర్తిగా వైద్యచికిత్స తీసుకోని రోగుల్లో టీబీ మందులను తట్టుకునే క్రిములు వృద్ధి చెందుతాయి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రం]

పెరుగుతున్న ప్రత్యామ్నాయ వైద్య విధానాలు

సాంప్రదాయ వైద్యాన్ని ప్రాక్టీసు చేసేవారు సాధారణంగా ఆమోదించని వ్యాధులను నయం చేసే అనేక విధానాలు ఉన్నాయి. ఆ విధానాలను సాధారణంగా ఆచారబద్ధ వైద్యం, ప్రత్యామ్నాయ వైద్యం అని పిలుస్తారు. వర్ధమాన దేశాల్లో చాలామంది ఆరోగ్య సమస్యలకు ఆచారబద్ధ వైద్యాన్ని ఆశ్రయిస్తారు. అనేక పేద దేశాల్లో చాలామందికి సాంప్రదాయ వైద్యచికిత్సలు చేయించుకునే స్తోమత ఉండదు, మరితరులు ఆచారబద్ధ వైద్య విధానాలను ఆశ్రయించడానికే ఇష్టపడతారు.

ధనిక దేశాల్లో కూడా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు వర్ధిల్లుతున్నాయి. ప్రత్యామ్నాయ చికిత్సలో ఆక్యుపంక్చర్‌, కిరాప్రాక్టిక్‌, హోమియోపతి, ప్రకృతివైద్యం, మూలికావైద్యం వంటివెన్నో ప్రజాదరణ పొందాయి. ఈ చికిత్స విధానాలు కొన్ని శాస్త్రపరంగా పరిశోధన చేయబడిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో వాటివల్ల ఫలితం లభిస్తుందని తేలింది. అయితే, కొన్ని విధానాలు సమర్థంగా పనిచేస్తాయో లేదో అనేది పూర్తిగా నిరూపించబడలేదు. ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలకు ప్రజాదరణ పెరగడంతో అవి ఎంతవరకు సురక్షితమైనవనే అనుమానాలు కలుగుతున్నాయి. అనేక దేశాల్లో అలాంటి చికిత్సా విధానాలు క్రమబద్ధం చేయబడలేదు. దీనివల్ల హానికరమైన సొంత వైద్యాలు, నకిలీ ఉత్పత్తులు, బూటకపు వైద్యాలు వర్ధిల్లే వాతావరణం ఏర్పడుతోంది. స్నేహితులకు, బంధువులకు సదుద్దేశమున్నా వారికి ఆ వైద్యంలో తగిన శిక్షణ ఉండదు, అయినా తరచూ వారే స్వయం నియమిత ఆరోగ్య సలహాదారులుగా అవతారమెత్తుతారు. ఇవన్నీ హానికరమైన ప్రతిచర్యలకు, ఇతర ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

చికిత్సా విధానాలు క్రమబద్ధం చేయబడిన అనేక దేశాల్లో, ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు సాంప్రదాయ వైద్య సమాజపు ఆమోదాన్ని పొందుతున్నాయి, వైద్యులు వాటిని అందిస్తున్నారు. అయినా ఈ విధానాలు ఎప్పటికైనా వ్యాధుల్లేని లోకాన్ని తీసుకువస్తాయని నమ్మడానికి హేతుబద్ధమైన వాదన ఉన్నట్లు కనిపించడంలేదు.