వినయం—బలహీనతా లేక బలమా?
బైబిలు ఉద్దేశము
వినయం—బలహీనతా లేక బలమా?
గర్విష్ఠులను, గట్టిగా వాదించేవారిని ఈ లోకం అనుకరించదగినవారిగా చిత్రీకరిస్తుంది. వినయం, నమ్రత ఉన్న వ్యక్తులు తరచూ బలహీనులుగా, బిడియస్థులుగా, దాస్యప్రవృత్తి గలవారిగా పరిగణించబడతారు. యథార్థ వినయం నిజంగా బలహీనతేనా? లేక అహంకారంతో ఉండడం బలమా? బైబిలు వీటి విషయంలో ఏమి చెబుతోంది?
ముందుగా, బైబిలు కొన్ని విషయాల్లో గర్వించడాన్ని ఆమోదిస్తుందనే చెప్పాలి. ఉదాహరణకు, యెహోవా తమ దేవుడైనందుకు, ఆయన తమను తన సాక్షులుగా గుర్తిస్తున్నందుకు క్రైస్తవులు గర్వించాలి. (కీర్తన 47:4; యిర్మీయా 9:24; 2 థెస్సలొనీకయులు 1:3, 4) తమ పిల్లలు క్రైస్తవ నడవడిలో మంచి మాదిరినుంచుతూ సత్యారాధన పక్షాన ధైర్యంగా నిలబడినప్పుడు తల్లిదండ్రులు గర్వించవచ్చు. (సామెతలు 27:11) అయితే, గర్వానికి హానికరమైన మరో రూపం ఉంది.
అహంకారాన్ని, వినయాన్ని లోతుగా పరిశీలించడం
అహంకారానికి మితిమీరిన ఆత్మాభిమానం అనేది ఒక నిర్వచనం. అలాంటి అహంకారంవల్ల ఒక వ్యక్తిలో తన అందం, జాతి, సామాజిక స్థితి, సామర్థ్యాలు, లేదా సంపత్తి విషయంలో తానే అందరికన్నా ప్రాముఖ్యమైనవాడిననే, ఉన్నతుడిననే తప్పుడు భావన కలుగుతుంది. (యాకోబు 4:13-16) బైబిలు “గర్వాంధుల” గురించి మాట్లాడుతోంది. (2 తిమోతి 3:4) మరోవిధంగా చెప్పాలంటే, సరైన కారణం లేకుండానే తామెంతో ఉన్నతులమని వారు అభిప్రాయపడతారు.
మరోవైపు, వినయస్థులు తమ అపరిపూర్ణతలను, దేవుని ముందు తమ దైన్యస్థితిని అంగీకరిస్తూ, తమనుతాము నిజాయితీగా, నిజానిజాల ఆధారంగా బేరీజు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. (1 పేతురు 5:6) అంతేకాదు, వారు ఇతరుల్లోని ఉన్నత లక్షణాలను గుర్తించడమేకాక, వాటి విషయంలో సంతోషిస్తారు కూడా. (ఫిలిప్పీయులు 2:3) అందుకే అసూయ వారిపై చెడు ప్రభావం చూపదు. (గలతీయులు 5:26) ఆ కారణాలవల్లే నిజమైన వినయం ఇతరులతో మంచి సంబంధాలను కలిగివుండడానికి, మానసిక శాంతికి, స్థిరత్వానికి నడిపిస్తుందనడంలో సందేహం లేదు.
యేసు ఉదాహరణను పరిశీలించండి. భూమ్మీదికి రాకముందు ఆయన పరలోకంలో శక్తిమంతుడైన ఆత్మప్రాణిగా ఉన్నాడు. భూమ్మీద ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణంగా, పాపరహితుడిగా ఉన్నాడు. (యోహాను 17:5; 1 పేతురు 2:21, 22) ఆయనకు సాటిలేని సామర్థ్యాలు, తెలివి, జ్ఞానం ఉన్నాయి. అయినా, ఆయన ఎన్నడూ అతిశయపడకపోగా అన్నివేళలా వినయాన్ని ప్రదర్శించాడు. (ఫిలిప్పీయులు 2:6) ఆయన ఒక సందర్భంలో తన అపొస్తలుల కాళ్లు కూడా కడిగాడు; చిన్నపిల్లలపట్ల నిజమైన ఆసక్తిని చూపించాడు. (లూకా 18:15, 16; యోహాను 13:4, 5) నిజానికి, ఒక పిల్లవాడిని తన ప్రక్కన నిలబెట్టుకుని యేసు ఇలా అన్నాడు: “ఈ బిడ్డవలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.” (మత్తయి 18:2-4) అవును, యేసు దృష్టిలో, ఆయన తండ్రి దృష్టిలో నిజమైన గొప్పతనం వినయం నుండి వస్తుంది కానీ అహంకారం నుండి కాదు.—యాకోబు 4:10.
వినయం ఒక బలం
వినయానికి నిదర్శనగా ఉన్నా యేసు దాస్యప్రవృత్తిగలవానిగా, బలహీనునిగా లేదా బిడియస్థునిగా లేడు. ఆయన ధైర్యంగా నిజమే మాట్లాడాడు, ఆయన మనుష్యులకు ఏ మాత్రం భయపడలేదు. (మత్తయి 23:1-33; యోహాను 8:13, 44-47; 19:10, 11) అందుకే, ఆయన తన వ్యతిరేకుల్లో కొందరి గౌరవాన్ని కూడా చూరగొన్నాడు. (మార్కు 12:13, 17; 15:5) కానీ యేసు ఎప్పుడూ ఇతరులపై అధికారం చెలాయించలేదు. బదులుగా, ఆయన వినయంతో, దయతో, ప్రేమతో ప్రజలపట్ల ఆత్మీయంగా వ్యవహరించేవాడు కాబట్టే ఒక అహంకారి ఎన్నడూ సంపాదించుకోలేని విధంగా ఆయన ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకోగలిగాడు. (మత్తయి 11:28-30; యోహాను 13:1; 2 కొరింథీయులు 5:14, 15) నేడుకూడా లక్షలాదిమంది క్రీస్తుపట్ల తమకున్న యథార్థమైన ప్రేమ, ప్రగాఢ గౌరవాన్నిబట్టి ఆయనకు నమ్మకంగా లోబడుతున్నారు.—ప్రకటన 7:9, 10.
దీన హృదయులు ఉపదేశాన్ని అంగీకరించడానికి సుముఖంగా ఉంటారు, వారికి బోధించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి, బైబిలు వినయాన్ని ప్రోత్సహిస్తోంది. (లూకా 10:21; కొలొస్సయులు 3:9-12) మొదటి శతాబ్దానికి చెందిన సమర్థవంతమైన క్రైస్తవ బోధకుడైన అపొల్లోలాగే, వినయస్థులు కూడా ఖచ్చితమైన కొత్త సమాచారాన్ని తెలుసుకున్నప్పుడు తమ దృక్కోణాన్ని సవరించుకోవడానికి సంతోషిస్తారు. (అపొస్తలుల కార్యములు 18:24-26) వినయస్థులు ప్రశ్నలు అడగడానికి భయపడరు, కానీ అహంకారులైతే ఎక్కడ తమ అజ్ఞానం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ప్రశ్నలు అడగడం మానేస్తారు.
మొదటి శతాబ్దానికి చెందిన ఐతియోపీయుడైన నపుంసకుని ఉదాహరణను గమనించండి, ఆయనకు లేఖనంలోని ఒక భాగం అర్థం కాలేదు. క్రీస్తు శిష్యుడైన ఫిలిప్పు “నీవు చదువునది గ్రహించుచున్నావా” అని ఆయనను అడిగాడు. దానికి ఆ ఐతియోపీయుడు “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను” అని జవాబిచ్చాడు. ఆయన స్వదేశంలో ఉన్నత పదవికి చెందినవాడనే విషయాన్నిబట్టి చూస్తే ఆ నపుంసకుడు ఎంతటి వినయాన్ని కనబరిచాడో కదా! ఆయన వినయాన్ని చూపించిన కారణంగానే ఆయనకు లేఖనాల గురించిన లోతైన అంతర్దృష్టి లభించింది.—అపొస్తలుల కార్యములు 8:26-38.
తమ కాలంలోని మతనాయకుల్లో తాము ఉన్నతవర్గానికి చెందినవారమని భావించే యూదా శాస్త్రులకు, పరిసయ్యులకు ఐతియోపీయుడు పూర్తి భిన్నమైన మాదిరినుంచాడు. (మత్తయి 23:5-7) యేసు, ఆయన సహచరులు చెప్పినదాన్ని ఆ మతనాయకులు వినయంగా వినే బదులు, వారిని హేళన చేసి, వారిలో తప్పులు పట్టడానికి ప్రయత్నించారు. వారి అహంకారం వారిని ఆధ్యాత్మిక అంధకారంలో ఉంచింది.—యోహాను 7:32, 47-49; అపొస్తలుల కార్యములు 5:29-33.
మీరు మెత్తని జిగటమన్నులా ఉన్నారా లేక గట్టి మట్టిపెల్లల్లా ఉన్నారా?
బైబిలు యెహోవాను కుమ్మరితో, మానవులను జిగటమన్నుతో పోలుస్తోంది. (యెషయా 64:8) మనం యెహోవా చేతిలో మెత్తటి జిగటమన్నులా ఉండి, ఆయన మనల్ని రమ్యమైన పాత్రల్లా చేయడానికి అనుమతించేందుకు మనకు వినయం సహాయం చేస్తుంది; కానీ అహంకారులు పొడిగా, గట్టిగా కేవలం కాలిక్రింద నలుగగొట్టబడే మట్టిపెల్లల్లా ఉంటారు. అలాంటి వారికి ఒక ఉదాహరణ అపఖ్యాతి చెందిన ప్రాచీన ఐగుప్తు దేశపు ఫరో, ఆయన యెహోవాను ఎదిరించి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. (నిర్గమకాండము 5:2; 9:17; కీర్తన 136:15) ఫరో మరణం ఈ సామెత నిజమని నిరూపిస్తోంది: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.”—సామెతలు 16:18.
అంటే దేవుని సేవకుల్లో అహంకారపు భావాలే కలుగవని దాని భావం కాదు. ఉదాహరణకు, యేసు అపొస్తలులు తమలో ఎవరు గొప్ప అనే విషయం గురించి తరచూ వాదులాడుకున్నారు. (లూకా 22:24-27) అయితే, వారు గర్వంతో అంధులు కాకుండా యేసు చెప్పింది విని చివరికి తమ వైఖరిని మార్చుకున్నారు.
“యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును” అని సొలొమోను వ్రాశాడు. (సామెతలు 22:4) వినయాన్ని అలవర్చుకోవడానికి మనకు ఎన్ని మంచి కారణాలు ఉన్నాయో కదా! అది శక్తివంతమైన, ప్రియమైన లక్షణం మాత్రమే కాదు, మనం దేవుని ఆమోదాన్ని, నిత్య జీవమనే ప్రతిఫలాన్ని పొందడానికి సహాయం చేసే లక్షణం.—2 సమూయేలు 22:28; యాకోబు 4:10. (g 3/07)
మీరెప్పుడైనా ఆలోచించారా?
◼ అన్ని విషయాల్లో గర్వం అభ్యంతరకరమైనదేనా?—2 థెస్సలొనీకయులు 1:3, 4.
◼ నేర్చుకోవడాన్ని వినయం ఎలా ప్రోత్సహిస్తుంది?—అపొస్తలుల కార్యములు 8:26-38.
◼ దేవుని సేవకులు వినయాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందా?—లూకా 22:24-27.
◼ వినయస్థులకు ఎలాంటి భవిష్యత్తు వేచివుంది?—సామెతలు 22:4.
[20, 21వ పేజీలోని చిత్రం]
యేసు వినయస్థుడు కాబట్టే పిల్లలు ఆయనవైపు ఆకర్షితులయ్యారు