కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వ్యాధులు ఇక ఉండని కాలం!

వ్యాధులు ఇక ఉండని కాలం!

వ్యాధులు ఇక ఉండని కాలం!

మరణానంతర పరలోక జీవితంలో బాధనుండి, వ్యాధులనుండి ఉపశమనం పొందుతామని చాలామంది నమ్ముతారు. అయితే చాలామంది విశ్వసించే ఆ నమ్మకానికి విరుద్ధంగా మానవులందరూ భూ పరదైసులో జీవిస్తారనే భావినిరీక్షణ గురించే బైబిలు నిజంగా బోధిస్తోంది. (కీర్తన 37:​11; 115:​16) భవిష్యత్తులో మానవులు పరిపూర్ణ ఆరోగ్యం, సంతోషం, నిత్యజీవం అనుభవిస్తారని దానిలో వాగ్దానం చేయబడింది.

అయితే మనం వ్యాధిగ్రస్థులమై ఎందుకు మరణిస్తున్నాం? వ్యాధుల్లేని లోకం ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలకు బైబిలు జవాబిస్తోంది.

వ్యాధులకు నిజమైన కారణం: మన మొదటి మానవ తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు ఆరోగ్యవంతమైన పరిపూర్ణ శరీరాలతో సృష్టించబడ్డారు. (ఆదికాండము 1:​31; ద్వితీయోపదేశకాండము 32:4) వారు భూమ్మీద నిరంతరం జీవించడానికి రూపొందించబడ్డారు. వారు దేవునికి వ్యతిరేకంగా ఇష్టపూర్వకంగా తిరుగుబాటు చేసిన తర్వాతే వారి శరీరాలు వ్యాధులకు గురయ్యే ప్రమాదంలో పడ్డాయి. (ఆదికాండము 3:​17-19) దేవుని అధికారాన్ని తిరస్కరించడం ద్వారా వారు తమకు పరిపూర్ణ జీవితాన్నిచ్చిన సృష్టికర్తతో తమకున్న సంబంధాలను తెగతెంపులు చేసుకొన్నారు. వారు లోపంగలవారిగా తయారయ్యారు. దానివల్ల దేవుడు వారిని హెచ్చరించినట్లే వారు వ్యాధిగ్రస్థులై మరణించారు.​—ఆదికాండము 2:​16, 17; 5:5.

ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసిన తర్వాత, వారు తమ పిల్లలకు అపరిపూర్ణతను మాత్రమే సంక్రమింపజేయగలిగారు. (రోమీయులు 5:​12) ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడినట్లు, వారసత్వంగా వచ్చిన లోపాలవల్ల మానవులు వ్యాధుల్ని, మరణాన్ని అనుభవిస్తున్నారని నేడు శాస్త్రజ్ఞులు గుర్తించారు. విస్తృతంగా పరిశోధన చేసిన తర్వాత ఒక శాస్త్రజ్ఞుల గుంపు ఇటీవల ఈ నిర్ధారణకు వచ్చింది: “జీవం ప్రారంభమైన వెంటనే శరీరం స్వనాశనానికి దారితీసే ప్రక్రియను తప్పక ప్రారంభిస్తుందనే విషయం జీవశాస్త్రానికి సంబంధించిన తిరుగులేని వాస్తవం.”

మానవ ప్రయత్నంవల్ల కాదు: విజ్ఞానశాస్త్రం వ్యాధులపై చేస్తున్న పోరులో గొప్ప విజయాలను సాధిస్తోంది. అయితే వ్యాధులు ఎందుకు వస్తున్నాయనేది పూర్తిగా గ్రహించడం విజ్ఞానశాస్త్రానికి చిక్కుముడిగా తయారైంది. దేవుని ప్రేరేపిత మాటలతో సుపరిచితులైన బైబిలు విద్యార్థులకు అది ఆశ్చర్యం కలిగించదు: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి.”​—కీర్తన 146:3.

అయితే బైబిలు చెబుతున్నట్లు, “మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము.” (లూకా 18:​27) యెహోవా దేవుడు వ్యాధులకున్న కారణాన్ని తొలగిస్తాడు, ఆయన మన వ్యాధులన్నిటినీ నయం చేస్తాడు. (కీర్తన 103:3) ఆయన ప్రేరేపిత వాక్యం ఇలా వాగ్దానం చేస్తోంది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”​—ప్రకటన 21:​3, 4.

మీరేమి చేయాలి: మనం వ్యాధుల్లేని భావి లోకంలో జీవించడానికి మనమేమి చేయాలో యేసుక్రీస్తు స్పష్టంగా వివరించాడు. ఆయనిలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”​—యోహాను 17:3.

దేవుని గురించిన జ్ఞానంతోపాటు, ఆయన కుమారుడైన యేసు బోధలు బైబిల్లో ఉన్నాయి. ఆ జ్ఞానంలో మన ప్రస్తుత జీవితాన్ని మెరుగుపరచగల ఆచరణసాధ్యమైన సలహా కూడా ఇమిడివుంది. అయితే అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, దేవుడు విధేయులైన తన ఆరాధకుల కోసం వేదనలేని లోకాన్ని వాగ్దానం చేస్తున్నాడు. అవును, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అన[ని]” భవిష్యత్తును దేవుడు మీకు అందిస్తున్నాడు.​—యెషయా 33:​24. (g 1/07)

[11వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఆరోగ్యం విషయంలో సమతుల్యమైన దృక్పథం

బైబిలు జీవంపట్ల గౌరవాన్ని ప్రోత్సహిస్తోంది. యెహోవాసాక్షులు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ధతీసుకోవడానికి కృషిచేయడం ద్వారా అలాంటి గౌరవాన్ని కనబరుస్తారు. వారు మాదకద్రవ్యాలను, పొగాకును ఉపయోగించడం వంటి హానికరమైన అలవాట్లను అలవర్చుకోరు. ఆహారం విషయంలో, మద్యపానాలు సేవించే విషయంలో మితంగా ఉండాలని దేవుడు తన ఆరాధకుల నుండి కోరుతున్నాడు. (సామెతలు 23:​20; తీతు 2:​2, 3) ఆచరణసాధ్యమైన అలాంటి చర్యలతోపాటు తగిన విశ్రాంతి, వ్యాయామం అనేక రుగ్మతలను వాయిదావేస్తుంది లేక నిరోధిస్తుంది. వ్యాధులతో బాధపడుతున్నవారికి నమ్మదగిన ఆరోగ్య నిపుణుల సహాయం అవసరంకావచ్చు.

బైబిలు సహనంతో లేదా సముచితత్వంతో, “స్వస్థబుద్ధితో” ప్రవర్తించడాన్ని ప్రోత్సహిస్తోంది. (తీతు 2:​12, 13; ఫిలిప్పీయులు 4:5) నేడు చాలామంది సమతుల్యాన్ని కనబరచకుండా, చికిత్సల కోసం వెదకడంలో తలమునకలౌతూ తమ ఆధ్యాత్మికతను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు హాని కలిగించగల సంశయాత్మక చికిత్సలను కూడా ఆశ్రయిస్తున్నారు. మరికొందరు వ్యర్థమైన లేక హానిని కూడా కలిగించే చికిత్సలమీద, రోగనివారణోపాయాలమీద డబ్బును, సమయాన్ని వృథా చేస్తున్నారు.

వాస్తవమేమిటంటే, పరిపూర్ణ ఆరోగ్యం ప్రస్తుతం సాధ్యంకాదు. వ్యాధులు ఇక ఉండని భవిష్యత్తు కోసం మీరు ఎదురుచూస్తుండగా మంచి ఆరోగ్యం కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో సమతుల్యంగా ఉండేందుకు బైబిల్లోని జ్ఞానం, సముచితత్వం మీకు సహాయం చేస్తాయి.