అద్భుతమైన ఏకశిల
అద్భుతమైన ఏకశిల
కెనడాలోని తేజరిల్లు! రచయిత
చాలా శతాబ్దాలపాటు జాలర్లు, నావికులు దానిని నమ్మకమైన మార్గసూచిగా ఉపయోగించారు. కవులు, రచయితలు, చిత్రకారులు దానిని ఘనతకెక్కించారు. ఒక సర్వసంగ్రహ నిఘంటువు ఆ ఏకశిలను “అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది” అని వర్ణించింది. అదే, సెయింట్ లారెన్స్ సింధుశాఖలోని గాస్పే ద్వీపకల్పానికి తూర్పువైపున, అట్లాంటిక్ మహాసముద్రపు మెరిసే నీలిరంగు నీటిలో ఠీవిగా నిలబడివున్న పెర్సే శిల. అది దాదాపు 430 మీటర్ల పొడవు, సుమారు 90 మీటర్ల వెడల్పు, 88 మీటర్లకన్నా ఎక్కువ ఎత్తు ఉంటుంది.
ఒకప్పుడు, సాహసప్రియులైన స్థానికులు ఆ శిల ఏటవాలుగా ఉన్నవైపునుండి దానిపైకెక్కి అక్కడున్న పక్షిగూళ్ల నుండి గ్రుడ్లు తెచ్చుకునేవారు. అయితే, ఆ ఏకశిలను, దానిమీద ఆశ్రయం పొందే పక్షులను సంరక్షించేందుకు క్విబెక్ ప్రభుత్వం 1985లో పెర్సే శిలను, దాని పక్కనే ఉన్న బోనావెంచర్ ద్వీపాన్ని పక్షుల సాంక్చరీలుగా ప్రకటించింది. గాన్నెట్ పక్షులు సంతానోత్పత్తి కాలంలో బోనావెంచర్ ద్వీపానికి గుంపులు గుంపులుగా వస్తాయి, ప్రపంచంలో అవి అలా ఎక్కువగా వచ్చే స్థలాల్లో అది రెండవది.
చాలాకాలం క్రితం పెర్సే శిల నేలకు సమీపంగా ఉండేదనీ, దానికి నాలుగు కమానువంటి ద్వారాలు ఉండేవనీ కొందరంటారు. అయితే ఇప్పుడక్కడ 30 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న ఒక ద్వారం మాత్రమే ఉంది, అది ఆ శిలకు సముద్రం వైపున్న చివరిభాగంలో ఉంది. నీటిమట్టం తగ్గినప్పుడు నేలనుండి ఆ శిల దగ్గరకు ఇసుక మీద నడిచి వెళ్ళవచ్చు. అలా నీటిమట్టం తక్కువగా ఉండే దాదాపు నాలుగు గంటల వ్యవధిలో ధైర్యవంతులైన సందర్శకులు ఆ శిల దగ్గరకు చేరుకుని, అలల తాకిడికి గురవుతున్న ఆ శిల వెంబడి మెల్లగా నడిచి వెళ్ళగలిగితే దాదాపు 15 నిమిషాల్లో ఆ ద్వారాన్ని చేరుకోవచ్చు.
అలాంటి సాహసప్రియులకు ఒక హెచ్చరిక! పడిపోయిన రాళ్ల మీదుగా అలా ద్వారం దగ్గరికి నడిచి వెళ్లిన ఒక సందర్శకుడు ఇలా చెబుతున్నాడు: “కొన్ని నిమిషాలకొకసారి రాళ్లు చిన్నచిన్న బాంబుల్లా నీళ్లలోకి పడుతున్నప్పుడు వణుకుపుట్టించేంత పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. కొన్ని రాళ్లైతే ఒకదాని మీద మరొకటి పడినప్పుడు తుపాకీ పేల్చినట్లు శబ్దం వినిపిస్తుంది.”
చాలామంది సందర్శకులు గమనించినట్లుగా, పెర్సే శిల సౌందర్యం వర్ణనాతీతమైంది. అయితే, మన అద్భుతమైన భూమిపై కనిపించే అనేక రమణీయ దృశ్యాల్లో అది మచ్చుకు ఒకటి మాత్రమే. అలాంటి రమణీయ దృశ్యాలు ఎన్ని రకాలో, ఎన్నెన్ని ఉన్నాయో! వాటిని చూసేటప్పుడు బహుశా మీరు కూడా ‘ఊరకుండి, దేవుని అద్భుతక్రియలను ఆలోచించడానికి’ కదిలింపబడి ఉండవచ్చు.—యోబు 37:14. (g 4/07)
[15వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Mike Grandmaison Photography