డబ్బు విషయంలో జ్ఞానయుక్తమైన దృక్పథమేమిటి?
బైబిలు ఉద్దేశము
డబ్బు విషయంలో జ్ఞానయుక్తమైన దృక్పథమేమిటి?
డబ్బు “ఆశ్రయాస్పదము” అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 7:12) ఎందుకంటే డబ్బుంటే ఆహారం, వస్త్రాలు, వసతి వంటివి లభిస్తాయి, అది పేదరికంతోపాటు వచ్చే కష్టాలు లేకుండా చేస్తుంది. నిజానికి, వస్తుపరంగా అవసరమైన వాటన్నిటినీ డబ్బు సమకూర్చగలదు. అది “అన్నిటికి అక్కరకు వచ్చును” అని ప్రసంగి 10:19 చెబుతోంది.
మన అవసరాలను, మన కుటుంబాల అవసరాలను తీర్చుకునే విధంగా కష్టపడి పనిచేయమని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. (1 తిమోతి 5:8) అందుకే, నిజాయితీగా కష్టపడి పనిచేస్తే సంతృప్తి, గౌరవం, భద్రత లభిస్తాయి.—ప్రసంగి 3:12, 13.
అంతేకాక, మనం కష్టపడి పనిచేయడంవల్ల ఉదారంగా డబ్బు ఇవ్వగలుగుతాం. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:35) అవసరంలోవున్నవారికి, ప్రత్యేకంగా తోటి క్రైస్తవులకు సహాయం చేయడానికి, లేక మనకు ప్రియమైనవారికి ఒక బహుమానం కొనడానికి మన డబ్బును ఉత్సాహంగా వెచ్చించినట్లయితే అలాంటి సంతోషం మనకు కలుగుతుంది.—2 కొరింథీయులు 9:7; 1 తిమోతి 6:17-19.
ఉదార స్వభావాన్ని అరుదైన సందర్భాల్లోనే కాక అన్ని సందర్భాల్లోనూ కనబరచమని, దానిని జీవన విధానంగా చేసుకోమని యేసు తన అనుచరులను ప్రోత్సహించాడు. “ఇయ్యుడి” అని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. (లూకా 6:38) దేవుని రాజ్య ప్రకటనా పని కోసం విరాళాలిచ్చే విషయంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. (సామెతలు 3:9) నిజానికి, మనం ఈ విధంగా ఉదారస్వభావాన్ని కనబరచడం యెహోవాకు, ఆయన కుమారునికి ‘స్నేహితులుగా’ మారడానికి సహాయం చేస్తుంది.—లూకా 16:9.
“ధనాపేక్ష” విషయంలో జాగ్రత్తగా ఉండండి
స్వార్థపరులు అరుదుగా ఇస్తారు, ఒకవేళ ఇచ్చినా స్వార్థపూరిత ఉద్దేశంతో ఇస్తారు. వారికి ధనాపేక్ష ఉంటుంది కాబట్టి ఇవ్వడానికి వెనుకాడతారు, అది వారు ఆశించినట్లు సంతోషాన్నిచ్చే బదులు దుఃఖాన్నే మిగులుస్తుంది. “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” అని 1 తిమోతి 6:10 చెబుతోంది. ధనాపేక్ష ఎంతో అసంతృప్తినే కాక హానిని కూడా ఎందుకు కలిగిస్తుంది?
ఒక కారణమేమిటంటే, దురాశాపరులకు తృప్తిపరచలేనంత ధనాపేక్ష ఉంటుంది. “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు” అని ప్రసంగి 5:10 చెబుతోంది. కాబట్టి ధనాపేక్షగలవారు అంతులేని నిరాశతో ‘తమను తాము పొడుచుకుంటారు.’ అంతేకాక వారి అత్యాశవల్ల ఇతరులతో వారికి మంచి సంబంధాలుండవు, వారి కుటుంబ జీవితంలో సంతోషం ఉండదు, అంతేకాక వారికి సరైన విశ్రాంతి కూడా కరువౌతుంది. “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.” (ప్రసంగి 5:12) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, ధనాపేక్ష దేవుని అనుగ్రహం కోల్పోయేలా చేస్తుంది.—యోబు 31:24, 27, 28.
కేవలం డబ్బు కోసం దొంగతనం చేసిన, న్యాయాన్ని వక్రీకరించిన, వేశ్యావృత్తి చేసిన, హత్య చేసిన, ఇతరులను మోసగించిన, అబద్ధమాడిన వ్యక్తుల ఉదాహరణలు బైబిల్లో, లౌకిక చరిత్రలో కోకొల్లలు. (యెహోషువ 7:1, 20-26; మీకా 3:11; మార్కు 14:10, 11; యోహాను 12:6) యేసు తన భూపరిచర్యలో, తనను అనుసరించమని “మిక్కిలి ధనవంతుడు” అయిన ఒక యువ అధికారిని ఆహ్వానించాడు. విచారకరంగా ఆ వ్యక్తి ఆ అద్భుతమైన ఆహ్వానాన్ని తిరస్కరించాడు, ఎందుకంటే అలా చేస్తే ఆయన ఆర్థికంగా ఎంతో దెబ్బతింటాడు. దానికి యేసు ఇలా చెప్పాడు: “ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.”—లూకా 18:23, 24.
ముందుగా చెప్పబడినట్లు ఈ “అంత్యదినములలో” చాలామంది “ధనాపేక్షులు” ఉన్నారు కాబట్టి క్రైస్తవులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. (2 తిమోతి 3:1, 2) తమ ఆధ్యాత్మిక అవసరాన్ని ఎల్లప్పుడూ గుర్తించే నిజక్రైస్తవులు, ధనం కన్నా ఎంతో శ్రేష్ఠమైనది తమ దగ్గర ఉంది కాబట్టి అత్యాశతో కూడిన ఆ పోకడనుబట్టి ప్రభావితులుకారు.
ధనం కన్నా శ్రేష్ఠమైన విషయం
రాజైన సొలొమోను ధనం ఆశ్రయాస్పదమని చెప్పడంతోపాటు, జ్ఞానం “దాని పొందినవారి ప్రాణమును రక్షించును” కాబట్టి “జ్ఞానము ఆశ్రయాస్పదము” అని చెప్పాడు. (ప్రసంగి 7:12) ఆయన మాటల భావమేమిటి? లేఖనాల్లోని ఖచ్చితమైన జ్ఞానంమీద, దేవునిపట్ల ఆరోగ్యకరమైన భయంమీద ఆధారపడిన జ్ఞానం గురించి సొలొమోను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ధనంకన్నా శ్రేష్ఠమైన అలాంటి దైవిక జ్ఞానం జీవితంలోని లెక్కలేనన్ని ఉరుల నుండి, అకాల మరణం నుండి కూడా ఒక వ్యక్తిని కాపాడగలదు. అంతేకాక, ఒక కిరీటంలాగే నిజమైన జ్ఞానం, దానిని సంపాదించుకున్నవారిని ఘనపర్చి వారు ఇతరుల గౌరవాన్ని పొందేలా చేస్తుంది. (సామెతలు 2:10-22; 4:5-9) అంతేకాక, ఒక వ్యక్తి దేవుని అనుగ్రహాన్ని పొందడానికి అది దోహదపడుతుంది కాబట్టి అది “జీవవృక్షము” అని పిలవబడింది.—సామెతలు 3:18.
అలాంటి జ్ఞానం సంపాదించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకునేవారు మరియు దానిని సంపాదించుకోవడానికి ఇష్టపడేవారు అది సులభంగా లభిస్తుందని గ్రహిస్తారు. “నా కుమారుడా, నీవు . . . తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు; తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.”—సామెతలు 2:1-6.
నిజక్రైస్తవులు ధనంకన్నా జ్ఞానానికి అధిక విలువనిస్తారు కాబట్టి వారు ధనాపేక్షులకు కరువయ్యే శాంతిని, సంతోషాన్ని, భద్రతను కొంతమేరకు అనుభవిస్తారు. హెబ్రీయులు 13:5లో ఇలా ఉంది: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని [దేవుడే] చెప్పెను గదా.” ధనంవల్ల అలాంటి భద్రత లభించదు. (g 6/07)
మీరు ఈ విషయాల గురించి ఆలోచించారా?
◼ ధనం ఆశ్రయాస్పదంగా ఎలా పనిచేస్తుంది?—ప్రసంగి 7:12.
◼ దైవిక జ్ఞానం ధనంకన్నా ఎందుకు శ్రేష్ఠమైనది?—సామెతలు 2:10-22; 3:13-18.
◼ మనకు ఎందుకు ధనాపేక్ష ఉండకూడదు?—మార్కు 10:23, 25; లూకా 18:23, 24; 1 తిమోతి 6:9, 10.