నేను ఇక మద్యానికి బానిసను కాదు
నేను ఇక మద్యానికి బానిసను కాదు
భోజనంతోపాటు కాస్త మద్యం సేవించడం ఆహ్లాదకరంగా ఉండవచ్చు లేదా ఏదైనా వేడుకలో దాన్ని సేవించడం ఆనందాన్ని అధికం చేయవచ్చు. అయితే, మద్యం సేవించడం వల్ల కొంతమంది తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటారు. త్రాగుడుకు బానిసైన ఒక వ్యక్తి ఆ వ్యసనం నుండి బయటపడడాన్ని తెలియజేసే ఈ క్రింది అనుభవాన్ని పరిశీలించండి.
మా ఇంట్లో ఒకప్పుడున్న ఉద్రిక్త వాతావరణాన్ని వివరించడం నాకు ఇప్పటికీ కష్టంగానే ఉంది. మా అమ్మానాన్నలిద్దరూ త్రాగేవారు. త్రాగిన తర్వాత నాన్న అమ్మను కొట్టేవాడు. తరచూ, నన్ను కూడా కొట్టేవాడు. వారు విడిపోవాలని నిర్ణయించుకునేటప్పటికి నాకు నాలుగేళ్లు. నన్ను మా అమ్మమ్మ వాళ్లింటికి తీసుకువెళ్ళడం నాకింకా గుర్తుంది.
నేనంటే అసలెవరికీ ఇష్టం లేదనిపించేది. నాకు ఏడేళ్లున్నప్పుడు, నేను దొంగతనంగా నేలమాళిగలోకి వెళ్లి, ఇంట్లో తయారుచేసిన ద్రాక్షారసాన్ని త్రాగేవాడిని, అది నా బాధను తగ్గిస్తున్నట్లుగా అనిపించేది. నాకు 12 ఏళ్లున్నప్పుడు, మా అమ్మ, అమ్మమ్మ నా గురించి పెద్దగా గొడవపడ్డారు. మా అమ్మకు నా మీద ఎంత కోపం వచ్చిందంటే, ఆమె ఒక పదునైన వస్తువును నాపైకి విసిరింది. నేను తృటిలో తప్పించుకున్నాను! అలా నా జీవితం ప్రమాదంలో పడింది ఆ ఒక్కసారి మాత్రమే కాదు. అయితే, నా ఒంటికి తగిలిన గాయాలకన్నా మరింత తీవ్రమైన గాయాలు నా మనసుకి తగిలాయి.
నాకు 14 ఏళ్లు వచ్చేసరికి నేను విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాను. నాకు 17 ఏళ్ల వయసొచ్చాక, నేను చివరకు ఇంటినుండి పారిపోయాను. త్రాగడం నాకు స్వేచ్ఛనిచ్చినట్లు అనిపించేది, నేను కోపోద్రిక్తుణ్ణై స్థానిక బార్లలో గొడవలు చేసేవాణ్ణి. త్రాగుడే నాకు సుఖాన్నిచ్చేది. నేను రోజుకి ఐదు లీటర్ల ద్రాక్షారసం, కొన్ని సీసాల బీరు, మద్యం కూడా త్రాగేవాడిని.
నా పెళ్లైన తర్వాత, త్రాగే అలవాటు వల్ల మా కుటుంబంలో పెద్ద సమస్యలు తలెత్తాయి. నాకు కోపం, కసి ఎక్కువై నా భార్యా పిల్లల్ని కొట్టేవాడిని, నేను పెరిగిన వాతావరణాన్నే నా ఇంట్లోనూ సృష్టించేవాడిని. నా సంపాదనంతా త్రాగుడుకే ఖర్చుపెట్టేవాడిని. మా ఇంట్లో ఏ వస్తువులు ఉండేవి కావు, అందుకే నేను, నా భార్య నేలపైనే పడుకునేవాళ్లం. నా జీవితానికి ఎలాంటి సంకల్పం లేదనిపించింది, నా పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
ఒకరోజు నేను ఒక యెహోవాసాక్షితో మాట్లాడాను. ఈ లోకంలో ఎందుకిన్ని బాధలు ఉన్నాయని నేను అడిగినప్పుడు, ఆయన సమస్యల్లేని లోకం గురించిన దేవుని వాగ్దానాన్ని బైబిలు నుండి చూపించాడు. ఆయన చెప్పినదానిపై నమ్మకం కలిగి, నేను సాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించాను. నేను బైబిలు సూత్రాలను అన్వయించుకుంటూ త్రాగడం తగ్గించాక మా కుటుంబ జీవితం ఎంతో మెరుగైంది. అయినా, నేను యెహోవా దేవుణ్ణి ఆమోదయోగ్యంగా సేవించాలంటే నాకున్న
త్రాగుడు అలవాటు మానుకోవాలని గ్రహించాను. మూడు నెలల సంఘర్షణ తర్వాత చివరకు ఆ అలవాటు మానుకోగలిగాను. ఆరు నెలల తర్వాత దేవునికి నా జీవితాన్ని సమర్పించుకుని, దానికి సూచనగా బాప్తిస్మం తీసుకున్నాను.నేనిక మద్యానికి బానిసగా ఉండడం మానేసిన తర్వాత నా అప్పులన్నీ తీర్చగలిగాను. కొంతకాలం తర్వాత నేను ఒక ఇల్లు, కారు కూడా కొన్నాను, ఆ కారును మేము క్రైస్తవ కూటాలకు, ఇంటింటి పరిచర్యకు వెళ్లడానికి ఉపయోగిస్తున్నాం. చివరకు నేను ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్నాను.
కొన్నిసార్లు పార్టీలో నాకు మద్యం ఇస్తారు. నేను పడుతున్న సంఘర్షణ గురించిగానీ, ఒక్కసారి త్రాగినా మళ్లీ నేను మద్యానికి బానిసనైపోగలననే విషయం గురించిగానీ చాలామందికి తెలీదు. ఇప్పటికీ నాలో మద్యం త్రాగాలనే కోరిక కొంత ఉంది. వద్దు అని ఖచ్చితంగా చెప్పడానికి నేను తీవ్రంగా ప్రార్థన చేసుకుని, తీర్మానించుకోవాల్సి వస్తుంది. నాకు దాహంగా అనిపించినప్పుడు, మద్యం కలవని వేరే ఏ పానీయాన్నైనా త్రాగగలిగినంత త్రాగుతాను. గత పది సంవత్సరాల్లో నేను ఒక్కసారైనా మద్యాన్ని ముట్టుకోలేదు.
మనుష్యులు చేయలేనిది యెహోవా చేయగలడు. నేను అసాధ్యం అనుకున్న స్వేచ్ఛను పొందేలా ఆయన నాకు సహాయం చేశాడు! నా బాల్యంలో ఎదుర్కొన్న మానసిక వేదనను బట్టి నేనింకా బాధపడుతూనే ఉన్నాను, నిరాశకు లోనవకుండా నేను నిరంతరం పోరాడాల్సివస్తుంది. అయితే, మరోవైపు నేను పొందిన కొన్ని ఆశీర్వాదాలు ఏమిటంటే, దేవునితో నాకు మంచి సంబంధం ఉంది, సంఘంలో నిజమైన స్నేహితులున్నారు, నా విశ్వాసాన్ని పంచుకునే కుటుంబం నాకుంది. నేను మద్యానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో నా భార్యా పిల్లలు మనస్ఫూర్తిగా నాకు మద్దతునిస్తున్నారు. నా భార్య ఇలా అంటోంది: “నా జీవితం, ఇంతకుముందు భయంకరంగా ఉండేది. ఇప్పుడు నేను నా భర్తతో, ఇద్దరు పిల్లలతో కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడపగల్గుతున్నందుకు యెహోవాకు ఎంతో ఋణపడివున్నాను.”—సమర్పిత వ్యాసం. (g 5/07)
[11వ పేజీలోని బ్లర్బ్]
నాకు 14 ఏళ్లు వచ్చేసరికి నేను విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాను
[12వ పేజీలోని బ్లర్బ్]
మనుష్యులు చేయలేనిది యెహోవా చేయగలడు
[12వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
మద్యం విషయంలో బైబిలు దృక్కోణం?
◼ మద్యం సేవించడాన్ని బైబిలు ఖండించడంలేదు. “నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును” దేవుడిచ్చిన బహుమానమని బైబిలు వర్ణిస్తోంది. (కీర్తన 104:14, 15) బైబిలు ద్రాక్షావల్లిని సమృద్ధికి, భద్రతకు సూచనగా పేర్కొంటుంది. (మీకా 4:4) నిజానికి, పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చడమే యేసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతం. (యోహాను 2:7-9) తిమోతికి ‘తరచుగా వచ్చే బలహీనతల’ గురించి అపొస్తలుడైన పౌలు విన్నప్పుడు, “ద్రాక్షారసము కొంచెముగా” త్రాగమని ఆయనకు చెప్పాడు.—1 తిమోతి 5:23.
◼ మద్యం అతిగా సేవించడాన్ని బైబిలు ఖండిస్తోంది:
“త్రాగుబోతులు . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.”—1 కొరింథీయులు 6:9-11.
“మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు.”—ఎఫెసీయులు 5:18.
“ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పమువలె కరచును, కట్లపామువలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు.”—సామెతలు 23:29-33.
ఈ ఆర్టికల్లో చూపించబడినట్లుగా, మద్యం విషయంలో సమస్యల్ని ఎదుర్కొన్న కొందరు, దాన్ని పూర్తిగా మానుకోవాలని జ్ఞానయుక్తంగా నిర్ణయించుకున్నారు.—మత్తయి 5:29.