కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేనెందుకు స్పృహ కోల్పోతాను?

నేనెందుకు స్పృహ కోల్పోతాను?

నేనెందుకు స్పృహ కోల్పోతాను?

డాక్టరు నా కంటి ఒత్తిడిని పరీక్షించాలన్నారు, దానిలో భాగంగా ఆయన ఒక పరికరంతో నా కనుగుడ్డును తాకాల్సివుంటుంది. నాకేమి జరగబోతోందో నాకు తెలుసు. ఎప్పుడూ అలాగే జరుగుతుంది. నర్సు సూదితో రక్తం తీస్తున్నప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కొన్నిసార్లు దుర్ఘటనల గురించి కేవలం మాట్లాడినా అలాగే జరుగుతుంది​—⁠నేను స్పృహ కోల్పోతాను.

బ్రిటన్‌కు చెందిన ఒక నివేదిక ప్రకారం, మనలో 3 శాతం మందిమి తరచూ పైన పేర్కొనబడిన ఏదోక సందర్భంలో స్పృహ కోల్పోతుంటాం. మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నట్లైతే, మీరు స్పృహ కోల్పోకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై ఉండవచ్చు. అందరి ముందు స్పృహ కోల్పోకుండా ఉండడానికి మీరు బాత్‌రూములోకి వెళ్లాలని ప్రయత్నించివుండచ్చు. అయితే, అలా చేయడం మంచిది కాదు. మీరు నడుస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోతే దెబ్బలు తగిలే అవకాశం ఉంది. నేను ఎన్నోసార్లు అలా స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడిన తర్వాత, అసలు ఎందుకలా జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను.

సానుభూతిగల ఒక డాక్టరుతో మాట్లాడి, కొన్ని పుస్తకాలు పరిశీలించిన తర్వాత, అలా స్పృహ కోల్పోవడాన్ని వాసోవేగల్‌ ప్రతిచర్య (రక్తనాళాలకు, వేగస్‌ నాడికి సంబంధించిన ప్రతిచర్య) అంటారని తెలుసుకున్నాను. * మీరు కూర్చొనివున్న స్థితి నుండి నిలబడిన స్థితికి మారడం వంటి సందర్భాల్లో రక్తప్రసరణను నియంత్రించవలసిన శరీర వ్యవస్థ సరిగా పనిచేయకపోవడాన్ని అలా అంటారని భావించబడుతోంది.

కొన్ని సందర్భాల్లో అంటే మీరు రక్తాన్ని చూసినప్పుడు లేదా కంటి పరీక్ష చేయించుకుంటున్నప్పుడు మీరు నిజానికి నిలబడివున్నా లేక కూర్చొనివున్నా, మీ స్వయంచోదిత నాడీ వ్యవస్థ మీరు పడుకుని ఉన్నప్పుడు పనిచేసినట్లుగా పనిచేస్తుంది. మొదట, సాధారణంగా భయం వల్ల మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత మీ నాడీస్పందన క్రమంగా తగ్గిపోతుంది, మీ కాళ్లలోని రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. తత్ఫలితంగా, మీ కాళ్లకు రక్తప్రసరణ అధికమై, మీ తలకు రక్తప్రసరణ అంతగా జరగదు. దానితో మీ మెదడుకు సరిగా ప్రాణవాయువు అందకపోవడంతో మీరు స్పృహ కోల్పోతారు. అలా జరగకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు?

మీ నుండి రక్తాన్ని తీస్తున్నప్పుడు మీరు పక్కకి చూడవచ్చు లేదా పడుకోవచ్చు. పైన ప్రస్తావించబడినట్లుగా, వాసోవేగల్‌ ప్రతిచర్య మొదలౌతున్నప్పుడు మీరు తరచూ దానికి సంబంధించిన హెచ్చరికా సూచనల్ని గుర్తించవచ్చు. కాబట్టి మీరు స్పృహ కోల్పోయే ముందు చర్య తీసుకునేందుకు సమయం ఉంటుంది. మీరు పడుకుని మీ కాళ్లను పైకి లేపి కుర్చీపై పెట్టడమో లేక గోడకు ఆనించడమో చేయాలని చాలామంది వైద్యులు సిఫారసు చేస్తారు. దానివల్ల మీ రక్తమంతా కాళ్లలోకి ప్రసరించకుండా ఉంటుంది, అలా చేసినప్పుడు మీరు పూర్తిగా స్పృహ కోల్పోకుండా తప్పించుకోవచ్చు. బహుశా కొన్ని నిమిషాల్లోనే మీరు కుదుటపడవచ్చు.

ఈ సమాచారం నాకు సహాయపడినట్లుగానే మీకు కూడా సహాయపడితే, మీరు వాసోవేగల్‌ ప్రతిచర్య జరుగబోతోందనే సూచనలను గుర్తించగల్గుతారు. అప్పుడు మీరు వెంటనే చర్య తీసుకుని, స్పృహ కోల్పోకుండా ఉండవచ్చు.​—⁠సమర్పిత వ్యాసం. (g 4/07)

[అధస్సూచి]

^ “వాసోవేగల్‌” అంటే వేగస్‌ లేదా సంచారక నాడి అనే పొడవైన నాడికి సంబంధించిన రక్తనాళాలపై పడే ప్రభావం. వాగస్‌ అనే లాటిన్‌ పదానికి “సంచరించే” అని అర్థం.

[14వ పేజీలోని బ్లర్బ్‌]

వైద్య పరీక్ష సమయంలో పడుకోవడం సహాయకరంగా ఉండవచ్చు