పరిమళద్రవ్యాల తయారీదారులు ఇష్టపడే పండు
పరిమళద్రవ్యాల తయారీదారులు ఇష్టపడే పండు
ఇటలీలోని తేజరిల్లు! రచయిత
పరిమళద్రవ్యాలకు ఎంతో చరిత్ర ఉంది. బైబిలు కాలాల్లో పరిమళద్రవ్యాలు వాటిని కొనే స్తోమతవున్నవారి శరీరాలను, ఇళ్లను, బట్టలను, పరుపులను సువాసనతో నింపేవి. అగరు, సాంబ్రాణి తైలం, లవంగపట్టతోపాటు ఇతర సుగంధద్రవ్యాలను పరిమళద్రవ్యాల్లో ఉపయోగించేవారు.—సామెతలు 7:17; పరమగీతము 4:10, 14.
మొక్కల నుండి తీయబడిన ఎస్సెన్స్, పరిమళద్రవ్యాల తయారీలో ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి. అలాంటి ఒక ఎస్సెన్స్‌ను ఎలా తయారుచేస్తారో చూడడానికి మేము ఇటలీ ద్వీపకల్పానికి దక్షిణాన చివర్లోవున్న కలాబ్రీయా ప్రాంతానికి వెళ్లాం. మీరు బర్గమాట్ అనే పండు గురించి వినుండకపోవచ్చు, అయితే మార్కెట్లో అమ్ముడవుతున్న మహిళలకు సంబంధించిన పరిమళద్రవ్యాల ఉత్పత్తుల్లో, దాదాపు మూడింట ఒక వంతు పరిమళద్రవ్యాల్లో ఈ పండ్ల సువాసన ఉంటుందని, అలాగే పురుషులకు సంబంధించిన పరిమళద్రవ్యాల ఉత్పత్తుల్లో సగం పరిమళద్రవ్యాల్లో ఈ పండ్ల సువాసన ఉంటుందని అంటారు. ఆ బర్గమాట్ పండ్లను మీకు పరిచయం చేయనివ్వండి.
బర్గమాట్ నారింజజాతికి చెందిన సతతహరిత చెట్టు. అది వసంత రుతువులో పూలు పూస్తుంది, నారింజకాయ పరిమాణంలో ఉండే నున్నని తొనలుగల పసుపు పచ్చని పండ్లు శరదృతువు చివర్లో లేక శీతాకాలపు ప్రారంభంలో పక్వానికి వస్తాయి. అనేకమంది నిపుణులు బర్గమాట్‌ను సంకరజాతి చెట్టుగా పరిగణిస్తారు, దాని మూలం కొంతవరకు మర్మంగానే ఉండిపోయింది. ఆ చెట్లు ఏ ప్రాంతంలోనైనా సరే అడవుల్లో పెరగవు, అలాగే విత్తనం నాటి వాటిని పెంచలేం. వాటిని రైతులు సాగుచేయాలంటే వారు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మల్ని అదే జాతికి చెందిన నిమ్మ లేక నారింజ వంటి చెట్లకు అంటుకట్టాలి.
పరిమళద్రవ్యాల తయారీదారులు బర్గమాట్‌ను ప్రత్యేక గుణాలున్న పండ్లగా పరిగణిస్తారు. ఆ పండ్ల నుండి సేకరించబడిన ఎస్సెన్స్‌కు ఉన్న అరుదైన సామర్థ్యాన్ని గురించి ఒక పుస్తకం ఇలా వివరిస్తోంది: “అది వివిధ సుగంధాలతో కలిసిపోయి, వాటిని ఒక విశిష్టమైన పరిమళద్రవ్యంగా స్థిరపరుస్తుంది, అలాగే అది చేర్చబడిన ప్రతీ పరిమళద్రవ్యానికి ఒక ప్రత్యేకమైన తాజాదనాన్ని చేకూరుస్తుంది.” *
కలాబ్రీయాలో సాగు
దాదాపు 18వ శతాబ్దపు ప్రారంభంలోనే బర్గమాట్ చెట్లు కలాబ్రీయా ప్రాంతంలో పెరిగేవని, స్థానికులు అప్పుడప్పుడూ దాని ఎస్సెన్స్‌ను బాటసారులకు అమ్మేవారని చారిత్రక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే బర్గమాట్ చెట్లను వాణిజ్య దృష్టితో సాగుచేయడం కొలొన్ సెంట్ల అభివృద్ధి, ఉత్పత్తి, అమ్మకంమీద ఆధారపడింది. 1704లో జర్మనీకి వలసవెళ్లిన ఇటలీ దేశస్థుడైన జాన్ పవోలో ఫెమీనీస్ అనే వ్యక్తి ఒక సెంటును తయారుచేశాడు, దానికి ఆక్వా అడ్మీరాబిలిస్ లేక “అద్భుత జలం” అనే పేరుపెట్టాడు. అది ప్రధానంగా బర్గమాట్ ఎస్సెన్స్‌తో తయారుచేయబడింది. ఆ పరిమళద్రవ్యం ఒడాకాలోన్‌గా, “కొలొన్ జలం”గా లేక అది ఉత్పత్తి చేయబడిన నగరం పేరుతో కొలొన్‌గా పేరుపొందింది.
దాదాపు 1750లో మొదటిసారిగా బర్గమాట్ తోట రెగ్గియో అనే ప్రాంతంలో నాటబడింది, బర్గమాట్ ఎస్సెన్స్ అమ్మకం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు గడించిన తర్వాత దాని సాగు పెరిగింది. ఆ చెట్ల సాగుకు సమశీతోష్ణ వాతావరణంతోపాటు ఉత్తర దిశ నుండి వీచే చలిగాలుల
నుండి రక్షణ కల్పించే దక్షిణ ప్రాంతాలు అవసరం, అయితే బలమైన గాలులు, ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు, దీర్ఘకాలం తేమ ఉంటే అవి సరిగ్గా పెరగవు. వాటికి అనువైన సమశీతోష్ణ వాతావరణం, 150 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక చిన్న భూభాగం మాత్రమే కల్పిస్తోంది, అది ఇటలీ ద్వీపకల్పంలో దక్షిణాన చివర్లోవున్న తీరానికి సమీపంలో ఉంది. ఇతర ప్రాంతాల్లో బర్గమాట్ చెట్లను సాగుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా ప్రపంచంలోని అధికశాతం ఉత్పత్తి రెగ్గియో ప్రాంతం నుండే వస్తుంది. ఈ ఫలాన్ని ఉత్పత్తి చేసే మరో ప్రాముఖ్యమైన దేశం ఆఫ్రికాలోని కోటె డి ఐవరీ మాత్రమే.బర్గమాట్ సుగంధతైలం ఆకుపచ్చ పసుపువర్ణంలో ఉంటుంది, ఆ తైలం దాని పండ్ల తొక్కల నుండి వస్తుంది. ఈ తైలాన్ని సేకరించడానికి ఉపయోగించే సంప్రదాయ విధానంలో, బర్గమాట్ పండ్లను సగానికి కోసి పండులోని తొనల్ని తొలగించి, రంగుబారిన పైతొక్కల్లోని ఎస్సెన్స్‌ను సేకరించేందుకు వాటిని స్పాంజిలపై పిండుతారు. కేవలం అరకిలో ఎస్సెన్స్ సేకరించడానికి దాదాపు 90 కిలోల బర్గమాట్ పండ్లు అవసరమౌతాయి. నేడు దాదాపు ఎస్సెన్స్‌లన్నీ యంత్రాల సహాయంతో సేకరించబడుతున్నాయి, పండ్లమీదున్న తొక్కల్ని సన్నని ముక్కలుగా తరగడానికి గరుకైన చక్రాలు లేక రోలర్లు ఆ యంత్రాలకు ఉంటాయి.
విస్తృతంగా వాడుకలో ఉన్నా అంతగా పేరుపొందలేదు
కలాబ్రీయా ప్రాంతం వెలుపల ఈ పండు అంతగా పేరుపొంది ఉండకపోవచ్చు గానీ ఒక గ్రంథం ప్రకారం, “నిపుణులు బర్గమాట్‌ను ఎంతో విలువైనదిగా పరిగణిస్తారు.” దాని పండ్ల సువాసనను పరిమళద్రవ్యాలలోనే కాక, సబ్బులు, డియోడరెంట్లు, టూత్‌పేస్టులు, క్రీముల వంటి ఉత్పత్తుల్లో కూడా కనుగొనవచ్చు. ఐస్‌క్రీమ్‌లు, టీ, స్వీట్లు, పానీయాలు ప్రత్యేక రుచుల్లో ఉండడానికి బర్గమాట్ ఎస్సెన్స్‌ను ఉపయోగిస్తారు. దానికి మేనిఛాయను మార్చే గుణం ఉంది కాబట్టి సన్-కేర్ ఉత్పత్తులో దానిని ఉపయోగిస్తారు. దానిలో యాంటిసెప్టిక్, బాక్టీరియాను నాశనం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి, ఆ పండు నుండి ఔషధ పరిశ్రమలు శస్త్రచికిత్సలో, నేత్రరోగ శాస్త్రంలో, చర్మవ్యాధుల విజ్ఞానంలో ఉపయోగించే రోగక్రిమినాశిని (డిస్‌ఇన్ఫెక్టెంట్)ని తయారుచేసి లాభాలు గడించగలుగుతున్నాయి. జిగట స్వభావాన్ని కలుగజేసే బర్గమాట్ పెక్టిన్ అనే శక్తివంతమైన పదార్థాన్ని రక్తస్రావాన్ని, విరోచనాలను నిరోధించే మందుల్లో కూడా ఉపయోగిస్తారు.
విశ్లేషకులు బర్గమాట్ ఎస్సెన్స్ నుండి దాదాపు 350 భాగాలను వేరుచేశారు, దాని ప్రత్యేక సువాసనకు, అనేక ఇతర గుణాలకు ఆ భాగాలన్నీ తోడ్పడతాయి. ఈ ప్రత్యేకతలన్నీ కేవలం ఒక్క పండులోనే ఉన్నాయి!
బైబిలు రచయితలకు బర్గమాట్ పండు గురించి తెలిసుండకపోవచ్చు. అయితే నారింజలాంటి ఈ పండుకున్న గుణాలను, దాన్ని సృష్టించిన సృష్టికర్తకున్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడేవారు కీర్తనకర్త పలికిన ఈ మాటలనే పలకడానికి ప్రోత్సహించబడవచ్చు: ‘ఫలవృక్షములారా యెహోవాను స్తుతించుడి.’—కీర్తన 148:1, 9. (g 6/07)
[అధస్సూచి]
^ కొంతమందికి గడ్డి పుప్పొడి లేక పూలు పడనట్లే మరికొందరికి పరిమళద్రవ్యాలు పడవు. తేజరిల్లు! ఫలానా ఉత్పత్తిని ఉపయోగించమని ప్రోత్సహించదు.
[25వ పేజీలోని చిత్రం]
బర్గమాట్ పండ్ల తొక్కలను సన్నని ముక్కలుగా తరిగి బర్గమాట్ ఎస్సెన్స్‌ను సేకరిస్తారు
[చిత్రసౌజన్యం]
© Danilo Donadoni/Marka/age fotostock