కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచవ్యాప్తంగా 2005వ సంవత్సరంలో, 28 పూర్తిస్థాయి యుద్ధాలు, 11 ఇతర సాయుధ పోరాటాలు జరిగాయి.​—⁠వైటల్‌ సైన్స్‌ 2006-2007, వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌. (g 4/07)

వెబ్‌కామ్‌ ఉపయోగిస్తూ “ప్రొఫైల్‌ సైట్స్‌”గా పిలవబడే కొన్ని సైట్స్‌ను చూసిన 12 నుండి 20 ఏళ్ల మధ్య వయసున్న డచ్‌ ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో “40 శాతం అబ్బాయిలు, 57 శాతం అమ్మాయిలు వెబ్‌కామ్‌ ముందు వివస్త్రలు కావాల్సిందిగా లేక ఏదైనా ఒక లైంగిక క్రియ చేయాల్సిందిగా కోరబడినట్లు ఫిర్యాదు చేశారు.”​—⁠RUTGERS NISSO GROEP, నెదర్లాండ్స్‌. (g 4/07)

“ఒక శతాబ్దానికి పైగా అమెరికాలో, సాంకేతిక విజ్ఞానంవల్ల వారపు పని దాదాపు 38 శాతం వరకు తగ్గిపోయినా, రానూపోనూ ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టడంవల్ల, ఎక్కువమంది వయోజనులు పైచదువులకు వెళ్ళడంవల్ల, ఇంటిపనులు పెరగడంవల్ల ఉద్యోగస్థులకు ఇప్పుడు తీరికే దొరకడంలేదు.”​—⁠పోర్బ్స్‌, అమెరికా. (g 5/07)

స్టీఫెన్‌ హోకింగ్‌ అనే శాస్త్రజ్ఞుడు ఇంటర్నెట్‌లో ఈ బహిరంగ ప్రశ్న అడిగాడు: “రాజకీయంగా, సామాజికంగా, వాతావరణపరంగా గందరగోళస్థితిలో ఉన్న ప్రపంచంలో మానవజాతి మనుగడ మరో 100 ఏళ్ల వరకు ఎలా కొనసాగగలదు?” ఒక నెల తర్వాత ఆయనిలా ఒప్పుకున్నాడు: “దానికి జవాబు నాకు తెలియదు. ప్రజలు దాని గురించి ఆలోచించి, మనం ఎదుర్కొంటున్న అపాయాల గురించి తెలుసుకోవాలనే నేను ఆ ప్రశ్న అడిగాను.”​—⁠ద గార్డియన్‌, బ్రిటన్‌. (g 6/07)

మానసిక రోగుల ఆరోగ్యానికి పొలంపని మంచిది

పొలంపని, బోధన, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల కలయిక అయిన గ్రీన్‌ కేర్‌ (ఆరోగ్యం కోసం పొలంపని) అనే విషయం గురించి తెలుసుకోవడానికి నార్వేలోని స్టావెంజర్‌లో 14 దేశాలకు చెందిన 100 కన్నా ఎక్కువమంది నిపుణులు సమకూడారు. ఎన్‌ఆర్‌కే అనే ప్రసార కంపెనీ ప్రకారం, ఎన్నో ఏళ్లుగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న కొందరు పొలంపని చేయడం మొదలుపెడితే ప్రత్యేక ఆసుపత్రుల్లో గడపాల్సిన అవసరం వారికి రాదు. అది “మనసుకు, శరీరానికి ఆరోగ్యకరం.” నార్వేలోని 600 కన్నా ఎక్కువ సాంప్రదాయ వ్యవసాయ క్షేత్రాలు గ్రీన్‌ కేర్‌ విధానాన్ని అమలుచేసేందుకు సహకరిస్తున్నాయి, అలా చేసినందుకు వాటికి అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. (g 4/07)

చైనా నీటి సంక్షోభం

చైనాను “నీటి కాలుష్యం, మంచినీటి కొరత” పట్టిపీడిస్తున్నాయి. దాదాపు అన్ని నగరాల్లో వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ ఉన్నా అనేక నగరాల్లో వాటిని నడిపించడానికి అవసరమైన నిధులు అందుబాటులో లేవు. “దేశంలోని అనేక నదులు, సరస్సులు, కాలువలు శుభ్రపరచబడని పారిశ్రామిక, గృహసంబంధ వ్యర్థాలతోపాటు, వ్యవసాయ క్షేత్రాల నుండి కొట్టుకొనివచ్చే క్రిమిసంహారకాలతో కూడిన వ్యర్థ పదార్థాలతో కలుషితమైపోయాయి” అని ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిస్తోంది. అంతేకాక “దాదాపు 30 కోట్లమందికి మంచి నీళ్లు అందుబాటులో లేవు.” పరిస్థితి “ఆశాజనకంగా లేదు” అని జర్నల్‌ అనే పత్రిక నివేదిస్తోంది, అంతేకాక పరిస్థితి విషమిస్తోంది. (g 5/07)

“మీరెవరు? యెహోవాసాక్షులా?”

గత సంవత్సరం, ఇటలీలోని ఎల్బా ద్వీప సముద్ర తీరాల్లో యువ క్యాథలిక్కులు పర్యాటకులకు ప్రకటించడానికి వెళ్లారు, మాసా మారిట్టీమా ప్యామ్బీనో ప్రాంతపు బిషప్పు ఆహ్వానాన్ని స్వీకరించి వారలా వెళ్ళారు. వారు క్రైస్తవులుగా ఉండాలన్నా, అలా కొనసాగాలన్నా తమ విశ్వాసం గురించి ప్రకటించాలని ఆయన వారికి చెప్పాడు. వారలా ప్రకటించడం, సెలవులకు వచ్చిన పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. “మీరెవరు? యెహోవాసాక్షులా?” అని చాలామంది పర్యాటకులు ఆ యౌవనస్థులను అడిగారని ఈల్‌ టెంపో అనే వార్తాపత్రిక నివేదించింది. (g 5/07)

సంగీతానికి లైంగిక కార్యాలతో ఉన్న సంబంధం

“అశ్లీలమైన, లైంగికంగా ఉద్రేకపరిచే పదాలున్న” సంగీతాన్ని వినే యౌవనస్థులు “ఇతర పాటలను ఇష్టపడేవారికన్నా త్వరగా లైంగిక కార్యాల్లో పాల్గొనడాన్ని ఆరంభించే” అవకాశం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైందని అసోసియేటెడ్‌ ప్రెస్‌లో వెలువడిన ఒక నివేదిక తెలియజేసింది. “లైంగిక సంబంధమైన విషయాలు మరింత పరోక్షంగా, లైంగిక సంబంధాలు నిబద్ధతతో కూడుకొన్నవిగా ఉన్నట్లు అనిపించే పాటల కన్నా పురుషులను, ‘బలమైన లైంగిక కోరికతో విచ్చలవిడిగా సెక్సులో పాల్గొనేవారిగా,’ స్త్రీలను లైంగిక వస్తువులుగా చిత్రీకరించే పాటలు, లైంగిక కార్యాల గురించి యథేచ్చగా వివరించే పాటలు, త్వరగా లైంగిక కార్యాల్లో పాల్గొనేలా ప్రేరేపించగలవు” అని ఆ నివేదిక వెల్లడిచేసింది. “తల్లిదండ్రులు, బోధకులతోపాటు యౌవనస్థులు స్వయంగా సంగీతంలోని సాహిత్యం అందజేస్తున్న సందేశాల గురించి మరింత జాగ్రత్తగా ఆలోచించాలి” అని అది పేర్కొన్నది. (g 5/07)