కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బట్టలకు రంగులు అద్దడం ప్రాచీన, ఆధునిక పద్ధతులు

బట్టలకు రంగులు అద్దడం ప్రాచీన, ఆధునిక పద్ధతులు

బట్టలకు రంగులు అద్దడం ప్రాచీన, ఆధునిక పద్ధతులు

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

మన భావోద్రేకాలమీద రంగులు చూపించే ప్రభావాన్ని మీరెప్పుడైనా గమనించారా? చరిత్రంతటిలో మానవులు రంగుల దుస్తులు వేసుకునేందుకు ఇష్టపడ్డారు, దాని కోసం వారు రంగులు అద్దడం అనే ప్రక్రియను ఉపయోగించారు.

మనం దుస్తులను, గృహోపకరణాలను కొంటున్నప్పుడు లేక వాటిని తయారుచేయడానికి ఉపయోగించే బట్టలను కొంటున్నప్పుడు వాటి రంగులు పోవాలనో లేక రంగులు వెలిసిపోవాలనో మనం కోరుకోం. బట్టల రంగులు వెలిసిపోని విధంగా తయారుచేయడానికి ఎలాంటి ప్రక్రియలు ఉపయోగించబడుతున్నాయో అనేగాక, రంగులు అద్దడానికి ఉపయోగించే సంప్రదాయ నైపుణ్యాలు ఎలా వృద్ధిలోకివచ్చాయో తెలుసుకోవడానికి మేము ఇంగ్లాండ్‌కు ఉత్తరాన ఉన్న బ్రాడ్‌ఫర్డ్‌లోని ఎస్‌డిసి కలర్‌ మ్యూజియమ్‌కు వెళ్లాం. * మేమక్కడ శతాబ్దాలుగా అద్దకపురంగులుగా ఉపయోగించబడుతున్న కొన్ని అసాధారణ పదార్థాల నమూనాలను చూశాం.

ప్రాచీనకాలంలో ఉపయోగించబడిన అద్దకపురంగులు

19వ శతాబ్దపు మధ్య భాగం వరకు మొక్కలు, పురుగులు, గుల్లచేపల వంటి ప్రకృతి వనరుల నుండి సేకరించబడిన పదార్థాలనే బట్టలకు రంగులు వేయడానికి ఉపయోగించేవారు. ఉదాహరణకు, వోడ్‌ అనే మొక్క నుండి నీలివర్ణపు రంగు (1), వెల్డ్‌ అనే మొక్క నుండి పసుపు పచ్చని రంగు (2), మంజిష్ఠ అనే మొక్క నుండి ఎరుపు రంగు సేకరించబడేది. లాగ్‌వుడ్‌ అనే చెట్టు నుండి నల్లటి రంగు, ఆర్చల్‌ అనే ప్రాకుడుజాతి మొక్క నుండి ఊదా రంగు సేకరించబడేది. మ్యూరెక్స్‌ గుల్లచేప నుండి తూరు లేదా సామ్రాజ్య ధూమ్రవర్ణంగా పేరుగాంచిన అతి ఖరీదైన ధూమ్రవర్ణపు రంగు తయారుచేయబడేది (3). ఈ అద్దకపురంగు రోమా చక్రవర్తుల దుస్తులను అలంకరించేది.

రోమా చక్రవర్తులకన్నా ఎంతోకాలం ముందు ప్రముఖులు, ధనికులు సహజ పదార్థాలతో అద్దకం వేయబడిన దుస్తులను ధరించేవారు. (ఎస్తేరు 8:​15) ఉదాహరణకు, ఎరుపు రంగులు ఆడ కెర్‌మెజ్‌ పురుగుల నుండి తయారుచేయబడేవి (4). ప్రాచీన ఇశ్రాయేలీయుల మందిర సామగ్రితోపాటు వారి ప్రధానయాజకుని దుస్తుల కోసం ఉపయోగించబడిన ధూమ్రరక్తవర్ణముగల రంగు వాటినుండే సేకరించబడివుండవచ్చు.​—నిర్గమకాండము 28:5; 36:8.

బట్టలకు రంగువేసే ప్రక్రియ

రంగు వేయడానికి ఉపయోగించే అనేక ప్రక్రియల్లో నూలును లేక బట్టను అద్దకపు ద్రావకంలో ముంచడం కన్నా మరింత సంక్లిష్టమైన ప్రక్రియలు చేరివున్నాయని కలర్‌ మ్యూజియమ్‌లో ప్రదర్శించబడిన వస్తువులు చూపిస్తున్నాయి. అనేక సందర్భాల్లో, అద్దకంవేసే ప్రక్రియల్లో, అద్దకపురంగుకూ బట్టకూ అంటిపెట్టుకొని వాటినుండి వేరవకుండా ఉండే మోర్డెంట్‌ అనే పదార్థాన్ని ఉపయోగించే ఒక దశ కూడా ఉంటుంది. ఆ పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా అద్దకపురంగు బట్టకు అంటిపెట్టుకొనే ఉంటుంది, దానిని నీటిలో పెట్టినా రంగు వెలిసిపోదు. అనేక రసాయనాలను మోర్డెంట్లుగా ఉపయోగిస్తారు, వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి కూడా.

కొన్ని రంగులు అద్దే ప్రక్రియలు దుర్వాసనలు పుట్టిస్తాయి. అలాంటి వాటిలో టర్కీ ఎరుపు రంగు ఒకటి. దానిని తయారుచేయడానికి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియ నూలువస్త్రాలకు ఉపయోగించబడేది, దానివల్ల వస్త్రాలు ఎర్రగా మెరిసేవి. ఆ రంగు ఎండవల్ల, ఉతకడంవల్ల లేక బ్లీచ్‌ వేయడంవల్ల వెలిసిపోయేది కాదు. ఒకప్పుడు ఆ ప్రక్రియలో 38 దశలు ఉండేవి, అవి పూర్తవడానికి నాలుగు నెలల వరకు పట్టేది! మ్యూజియమ్‌లో ప్రదర్శించబడుతున్న అతి సుందరమైన వస్త్రాల్లో కొన్ని టర్కీ ఎరుపు రంగుతో అద్దబడినవి ఉన్నాయి (5).

సింథటిక్‌ అద్దకపురంగుల రాక

విలియమ్‌ హెన్రీ పర్కెన్‌ 1856లో కృత్రిమంగా మొదటి అద్దకపురంగు తయారుచేశాడని పేరుగాంచాడు. మౌ అనే ప్రకాశవంతమైన ధూమ్రవర్ణపు అద్దకపురంగును పర్కెన్‌ కనిపెట్టాడని మ్యూజియమ్‌లోని ఒక ప్రదర్శన చూపిస్తుంది. 19వ శతాబ్దాంతానికల్లా ప్రకాశవంతమైన వర్ణాల్లో ఉన్న అనేక ఇతర సింథటిక్‌ అద్దకపురంగులు రూపొందించబడ్డాయి. నేడు 8,000 కన్నా ఎక్కువ సింథటిక్‌ అద్దకపురంగులు ఉత్పత్తిచేయబడుతున్నాయి (6). ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించబడుతున్న సహజ ఉత్పత్తుల్లో లాగ్‌వుడ్‌, కచానెల్‌ మాత్రమే ఉన్నాయి.

కలర్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ గ్యాలరీ ఆఫ్‌ ద కలర్‌ మ్యూజియమ్‌, రేయాన్‌ వంటి సింథటిక్‌ వస్త్రాలకు రంగులద్దడానికి నేడు అవసరమైన ప్రత్యేక ప్రక్రియల గురించి వివరిస్తోంది. నేడు వాడుకలో ఉన్న రేయాన్‌ వస్త్రాల్లో విస్కోస్‌ రేయాన్‌ రకం ప్రజాదరణ పొందింది, అది వాణిజ్యపరంగా 1905లో మొదటిసారిగా తయారుచేయబడింది. విస్కోస్‌ రేయాన్‌ రసాయనికపరంగా నూలు లాంటిదే కాబట్టి ఆ కాలంలో అందుబాటులో ఉన్న అనేక అద్దకపురంగులు విస్కోస్‌ రేయాన్‌కూ ఇమిడాయి. అయితే, అసిటేట్‌ రేయాన్‌, పాలిస్టర్‌, నైలాన్‌తోపాటు ఆక్రిలిక్‌ ఫైబర్‌ వంటి అత్యాధునిక సింథటిక్‌ వస్త్రాల కోసం చాలా క్రొత్త అద్దకపురంగులను రూపొందించాల్సి వచ్చింది.

రంగులు వెలిసిపోని అద్దకపురంగులను రూపొందించడానికి ప్రయత్నాలు

మనం వస్త్రాలను లేక బట్టలను కొనుగోలు చేస్తున్నప్పుడు అవి రంగులు వెలిసిపోకూడదని కోరుకుంటాం. అయినా, ఎన్నో దుస్తులు ఎండవల్ల లేక పదేపదే ఉతకడంవల్ల, ప్రత్యేకంగా డిటర్జెంట్లు ఉపయోగించి పదేపదే ఉతకడంవల్ల రంగులు పోతాయి. చెమటవల్ల లేక ఇతర బట్టలతో కలిపి ఉతకడంవల్ల కొన్నిసార్లు బట్టల రంగులు మారతాయి. బట్టలు ఉతుకుతున్నప్పుడు రంగులు పోకుండా ఉండడమనేది అద్దకపురంగు పరమాణువులు నారపోగులకు ఎంత బలంగా అంటిపెట్టుకొని ఉంటాయనే దానిమీద ఆధారపడుతుంది. పదేపదే ఉతకడంవల్ల, మరకలను తొలగించేందుకు రూపొందించబడిన డిటర్జెంట్ల ప్రభావంవల్ల అద్దకపురంగు బట్టలనుండి వేరవుతుంది, అది రంగు వెలిసిపోవడానికి దారితీస్తుంది. అద్దకపురంగు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులు ఎండవల్ల, ఉతకడంవల్ల, డిటర్జెంట్లవల్ల, చెమటవల్ల ఆమోదయోగ్యమైన పరిమితుల్లోనే రంగులువెలిసిపోతున్నాయో లేవో పరీక్షిస్తారు.

ఆ మ్యూజియమ్‌ను చూసిన తర్వాత మా దుస్తులు ఏ రకాల వస్త్రాలతో తయారుచేయబడ్డాయో తెలుసుకునేందుకు మేము ప్రోత్సహించబడ్డాం. అయితే అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, మా బట్టలను పదేపదే ఉతికినా అవి రంగులు వెలిసిపోకుండా ఉండేందుకు నేర్పుగా ఉపయోగించబడిన ప్రక్రియల గురించి మేము తెలుసుకున్నాం. (g 4/07)

[అధస్సూచి]

^ ఎస్‌డిసి​—సొసైటీ ఆఫ్‌ డయర్స్‌ అండ్‌ కలరిస్ట్స్‌​—రంగులకు సంబంధించిన విజ్ఞానశాస్త్రాభివృద్ధికి పాటుపడుతుంది.

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

1-4 ఫొటోలు: Courtesy of the Colour Museum, Bradford (www.colour-experience.org)

[27వ పేజీలోని చిత్రసౌజన్యం]

5వ ఫొటో: Courtesy of the Colour Museum, Bradford (www.colour-experience.org); 6వ ఫొటో: Clariant International Ltd., Switzerland