కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముంబయిలో జరిగిన ఉగ్రవాదదాడిని వారు తప్పించుకున్నారు

ముంబయిలో జరిగిన ఉగ్రవాదదాడిని వారు తప్పించుకున్నారు

ముంబయిలో జరిగిన ఉగ్రవాదదాడిని వారు తప్పించుకున్నారు

ఇండియాలోని తేజరిల్లు! రచయిత

ముం బయి నగరపు జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది, అక్కడి జనాభా ఇప్పుడు 1.8 కోట్ల పైమాటే. వారిలో 60 లక్షల నుండి 70 లక్షలమంది, అన్నివేళల్లో అందుబాటులో ఉంటూ వేగంగా పరుగులు తీసే లోకల్‌ ట్రైన్‌లలో ఉద్యోగాలకు, పాఠశాలలకు, కాలేజీలకు, షాపింగ్‌కి, అందమైన ప్రదేశాలను వీక్షించడానికి ప్రతీరోజు ప్రయాణం చేస్తుంటారు. రద్దీగా ఉండే వేళల్లో, సాధారణంగా 1,710 మంది పట్టే తొమ్మిది బోగీల ఒక్కో లోకల్‌ ట్రైన్‌, దాదాపు 5,000 మందితో క్రిక్కిరిసి ఉంటుంది. 2006 జూలై 11న అలా రద్దీగా ఉన్నప్పుడే ఉగ్రవాదులు ముంబయి రైళ్లపై దాడి చేశారు. 15 నిమిషాల్లోపే పశ్చిమ రైల్వే మార్గంలో నడుస్తున్న వివిధ రైళ్లలో ఏడు బాంబులు పేలి, 200 కన్నా ఎక్కువమందిని బలితీసుకున్నాయి, 800 కన్నా ఎక్కువమందిని క్షతగాత్రులను చేశాయి.

ముంబయిలో, ఆ నగర శివార్లలో ఉన్న యెహోవాసాక్షుల 22 సంఘాలకు చెందిన అనేకమంది తరచూ రైళ్లలో ప్రయాణిస్తుంటారు, వారిలో కొందరు ఉగ్రవాద దాడి జరిగిన రైళ్లలో ప్రయాణించారు. సంతోషకరంగా వారిలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు, అయితే చాలామంది క్షతగాత్రులయ్యారు. అనిత పని నుండి ఇంటికి వస్తోంది. రైలు క్రిక్కిరిసివుంది కాబట్టి సులభంగా రైలు దిగడానికి వీలుగా ఆమె ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌ తలుపు దగ్గర నిలబడివుంది. రైలు వేగంగా పరుగులు తీస్తుండగా అకస్మాత్తుగా పెద్ద పేలుడు సంభవించింది, ఆమెవున్న బోగీలో నల్లటి పొగ కమ్ముకుంది. ఆమె తలుపు బయటకు తలపెట్టి తన కుడివైపు చూస్తే తర్వాతి బోగీకున్న ఇనుపరేకు చీలి 45 డిగ్రీల కోణంలో వేలాడుతూ ఉంది. మృతదేహాలు, శరీర భాగాలు ఆ చీలిక నుండి బయటికి ఎగిరి వచ్చి రైలు పట్టాలమీద చెల్లాచెదురుగా పడడం చూసి ఆమె దిగ్భ్రాంతిచెందింది. ఆమెకు క్షణమొక యుగంగా తోచింది గానీ అవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి, ఆ తర్వాత రైలు ఆగింది. ఆమె తోటి ప్రయాణికులతో కలిసి రైలుపట్టాలమీదికి దూకి, పరుగెత్తుకుంటూ ఆ రైలు నుండి దూరంగా వెళ్ళిపోయింది. అనిత తన సెల్‌ఫోన్‌లో భర్త జాన్‌కు ఫోన్‌ చేసింది, సంతోషకరంగా ఆయన లైన్‌ దొరికింది. కొద్ది నిమిషాల్లో ఆందోళనకు గురైనవారి ఫోన్లతో నగరంలోని ఫోను వ్యవస్థంతా రద్దీగా తయారైంది. తన భర్తతో మాట్లాడేంతవరకు ఆమె కొంతమేరకు ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత ఆమె విపరీతంగా ఏడ్చింది. జరిగిన విషయం చెప్పి తనను తీసుకువెళ్లడానికి రమ్మని తన భర్తను కోరింది. ఆమె ఆయన కోసం వేచివున్నప్పుడు వర్షం మొదలైంది, దాంతో నేరపరిశోధకులకు ఉపకరించగల రుజువులెన్నో తుడిచిపెట్టుకుపోయాయి.

మరో యెహోవాసాక్షి అయిన క్లోడియస్‌ తన కార్యాలయం నుండి మిగతా రోజులకన్నా కొంచెం ముందుగా బయలుదేరాడు. ఆయన పశ్చిమ రైల్వేకు చెందిన, నగరానికి చివర్లోవుండే స్టేషన్‌ అయిన చర్చ్‌గేట్‌ దగ్గర సాయంత్రం 5:18కి ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు. అక్కడి నుండి భాయిందర్‌ స్టేషన్‌కు గంటసేపు పడుతుంది, ఆయన సీటు కోసం వెతుకుతున్నప్పుడు దగ్గర్లోవున్న యెహోవాసాక్షుల సంఘానికి చెందిన జోసెఫ్‌ ఆయనకు కనిపించాడు. వారిద్దరూ మాటల్లో పడడంతో సమయం ఇట్టే గడిచిపోయింది. ఆ తర్వాత, ఆ రోజు పని అలసటవల్ల జోసెఫ్‌ నిద్రలోకి జారుకున్నాడు. రైలు క్రిక్కిరిసివుంది కాబట్టి, క్లోడియస్‌ తాను దిగాల్సిన స్టేషన్‌ రాకముందే ముందటి స్టేషన్‌లో తలుపు దగ్గరికి వెళ్లేందుకు నిలబడ్డాడు. క్లోడియస్‌ అక్కడ నిలబడివున్నప్పుడు జోసెఫ్‌ మేల్కొని ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు తన సీట్లో వెనక్కి ఒరిగాడు. సీటుకుండే బార్‌ను పట్టుకొని ఆయనతో మాట్లాడేందుకు క్లోడియస్‌ ముందుకు వంగాడు. అదే క్లోడియస్‌ జీవితాన్ని రక్షించివుండవచ్చు. అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. ఆయనున్న బోగీ భయంకరంగా కంపించి, పొగతో నిండిపోయింది, పూర్తిగా చీకటి అలుముకుంది. ఆ పేలుడు క్లోడియస్‌ను సీట్ల వరసల మధ్యన క్రింద పడిపోయేలా చేసింది, ఆయనకు గింగురుమనే శబ్దం తప్ప మరేమీ వినిపించడంలేదు, ఆయన తన వినికిడి శక్తి కోల్పోయినట్లున్నాడు. ఆయన మునుపు నిలబడిన చోట ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. తన ప్రక్కనున్న తోటి ప్రయాణికులు రైలుపట్టాలమీద పడవేయబడ్డారు లేదా చనిపోయి క్రింద పడివున్నారు. వినాశకరమైన ఆ మంగళవారం రైల్వే వ్యవస్థను కుదిపేసిన ఏడు బాంబు పేలుళ్ళలో ఐదవదాన్ని ఆయన తప్పించుకున్నాడు.

క్లోడియస్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు, ఆయన బట్టలు రక్తసిక్తమయ్యాయి. అయితే, అది చాలామేరకు, నిర్భాగ్యులైన ఇతర ప్రయాణికుల రక్తమే. ఆయనకు అంతగా గాయాలు కాలేదు, ఆయన కర్ణభేరి చీలిపోయింది, ఒక చేతిమీద కాలినగాయాలయ్యాయి, వెంట్రుకలు కొద్దిగా కాలిపోయాయి. ఆయన ఆసుపత్రిలో జోసెఫ్‌ను, జోసెఫ్‌ భార్య అంజెలాను కలిశాడు, ఆమె మహిళల కోసం రిజర్వు చేయబడిన తర్వాతి కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించింది కాబట్టి ఆమెకు గాయాలేమీ కాలేదు. జోసెఫ్‌కు కుడి కన్ను కమిలిపోయింది, ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. ఆ ముగ్గురు సాక్షులు, తాము సజీవంగా ఉన్నందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలిపారు. క్లోడియస్‌ తనకు స్పృహ వచ్చిన వెంటనే ఇలా అనిపించిందని తెలియజేశాడు, ‘క్షణాల్లో జీవితం అంతమయ్యే అవకాశం ఉండగా ఈ విధానంలో డబ్బు సంపాదనలో, వస్తుసంపాదనలో పడిపోవడం ఎంత వ్యర్థమో!’ ఆయన దేవుడైన యెహోవాతో తనకున్న సంబంధాన్ని తన జీవితంలోని అతి ప్రాముఖ్యమైన అంశంగా చేసుకున్నందుకు ఆనందించాడు.

కొద్ది కాలవ్యవధిలోనే ముంబయి నగరాన్ని తీవ్ర వరదలు, అల్లర్లు, ఆ తర్వాత బాంబు పేలుళ్లు కుదిపేశాయి. అయితే, అక్కడున్న 1,700 కన్నా ఎక్కువమంది సాక్షులు చక్కని, ఉత్సాహపూరితమైన స్ఫూర్తిని కనబరుస్తున్నారు. వారు నూతనలోకం గురించిన అద్భుతమైన నిరీక్షణను తమ పొరుగువారికి క్రమంగా ప్రకటిస్తున్నారు, ఆ నూతనలోకంలో అన్నిరకాల హింసలు గతించిన విషయాలుగా మారతాయి.​—⁠ప్రకటన 21:​1-4. (g 6/07)

[23వ పేజీలోని బ్లర్బ్‌]

ఆయన మునుపు నిలబడిన చోట ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది

[23వ పేజీలోని చిత్రం]

అనిత

[23వ పేజీలోని చిత్రం]

క్లోడియస్‌

[23వ పేజీలోని చిత్రం]

జోసెఫ్‌, అంజెలా

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

Sebastian D’Souza/AFP/Getty Images