కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆశావాదం మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలదా?

ఆశావాదం మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలదా?

ఆశావాదం మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలదా?

“సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము” అని దాదాపు 3,000 సంవత్సరాల క్రితం జ్ఞానియైన ఇశ్రాయేలు రాజు రాశాడు. (సామెతలు 17:22) ఆ ప్రేరేపిత మాటలు ఎంత జ్ఞానయుక్తమైనవో నేటి వైద్యులు గుర్తిస్తున్నారు. అయితే మనలో చాలామందికి సహజసిద్ధంగా “సంతోషముగల మనస్సు” ఉండదు.

మనలో కొద్దిమంది మాత్రమే నిరాశతో, నిరాశాపూరిత దృక్పథంతో ఉండేందుకు దారితీయగల దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను తప్పించుకోగలుగుతున్నాం. కష్టాలున్నా ఆశావాదాన్ని పెంపొందించుకోవడంవల్ల ప్రయోజనం ఉందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఆశావాదం, “ఆశావహ దృక్కోణం లేదా దృక్పథం, అనుకూల ఫలితాల కోసం ఎదురుచూసే వైఖరి” అని వర్ణించబడింది. ఒక ఆశావాది పరాజయాన్ని చవిచూస్తే ఎలా భావిస్తాడు? ఆయన ఆ పరాజయాన్ని శాశ్వతమైనదిగా పరిగణించడు. అంటే ఆయన వాస్తవాన్ని పట్టించుకోడని దానర్థంకాదు. బదులుగా, ఆయన దానిని గుర్తించి, విషయాన్ని పరిశీలిస్తాడు. ఆ తర్వాత పరిస్థితులు అనుమతించినంతవరకు, పరిస్థితిని మార్చడానికి లేదా మెరుగుపర్చడానికి చర్యతీసుకుంటాడు.

అయితే, నిరాశావాది తాను కష్టాలను అనుభవించాల్సి వస్తున్నందుకు తరచూ తననుతాను నిందించుకుంటాడు. కష్టాలు శాశ్వతమైనవని, తన బుద్ధిహీనత, అసమర్థతవల్ల లేదా తాను ఆకర్షణీయంగా లేనందువల్ల వాటిని ఎదుర్కొంటున్నాని అనుకుంటాడు. అందువల్ల తాను నెగ్గుకురాలేననే ఉద్దేశంతో ఆయన ఆశలు వదులుకుంటాడు.

ఆశావాదం మన ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుందా? చేస్తుంది. అమెరికాలోని మిన్నెసొటాలో ఉన్న రోచెస్టర్‌కు చెందిన మయో క్లీనిక్‌ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఆశావాదులు మంచి ఆరోగ్యంతో ఉన్నారని, ఇతరులకన్నా ఎక్కువకాలం జీవించారని దాదాపు 800 మంది రోగులపై 30 ఏళ్లపాటు నిర్వహించిన ఆ అధ్యయనంలో శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఆశావాదులు ఒత్తిడిని చక్కగా ఎదుర్కొన్నారని, వారు మానసిక కృంగుదలకు లోనయ్యే అవకాశం తక్కువని కూడా ఆ పరిశోధకులు కనుగొన్నారు.

అయితే, సమస్యలు పెరుగుతూ పోతున్నట్లు అనిపించే లోకంలో ఆశావాదులుగా ఉండడం అంత సులభమేమీ కాదు. కాబట్టి, ఆశావహ దృక్పథంతో ఆలోచించడం కష్టంగా ఉన్నట్లు చాలామందికి అనిపించడంలో ఆశ్చర్యంలేదు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఏమి చేయవచ్చు? ఈ ఆర్టికల్‌తోపాటు ఇవ్వబడిన బాక్స్‌లో మీకు ఉపయోగపడగల కొన్ని సలహాలను మీరు కనుగొంటారు.

ఆశావహ దృక్పథం వ్యాధులన్నిటినీ నయం చేయకపోయినా, అది ఆరోగ్యకరమైన, మరింత సంతృప్తికరమైన జీవితానికి దోహదపడగలదు. బైబిలు ఇలా చెబుతోంది: “బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.”—సామెతలు 15:15. (g 9/07)

[22వ పేజీలోని బాక్సు/చిత్రం]

మరింత ఆశావహ దృక్పథంతో ఉండడానికి కొన్ని సూచనలు *

◼ ఒక పనిని మీరు ఆనందించలేరని లేదా చేయలేరని మీకనిపిస్తే అలాంటి ఆలోచనలను దరిచేరనివ్వకండి. మంచి విషయాలపైనే దృష్టినిలపండి.

◼ మీ పనిని ఆనందించడానికి ప్రయత్నించండి. మీ ఉద్యోగమేదైనా, దానిలో మీకు సంతృప్తినిచ్చే అంశాల కోసం చూడండి.

◼ జీవితంపట్ల ఆశావహ దృక్పథం ఉన్న స్నేహితులను సంపాదించుకోవడానికి ప్రయత్నించండి.

◼ మీరు నియంత్రించగల పరిస్థితుల విషయంలో చర్య తీసుకోండి, మీరు నియంత్రించలేనివాటిని గుర్తించడానికి ప్రయత్నించండి.

◼ ప్రతీరోజు మీకు జరిగిన మూడు మంచి విషయాలను రాసుకోండి.

[అధస్సూచి]

^ పైన ఇవ్వబడిన పట్టిక, కొంతమేరకు మయో క్లీనిక్‌ తయారుచేసిన ప్రచురణమీద ఆధారపడివుంది.