కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇతరులు ఎప్పుడూ నన్నెందుకు పట్టించుకోరు?

ఇతరులు ఎప్పుడూ నన్నెందుకు పట్టించుకోరు?

యువత ఇలా అడుగుతోంది . . .

ఇతరులు ఎప్పుడూ నన్నెందుకు పట్టించుకోరు?

“నేను తప్ప ప్రపంచంలో అందరూ వారాంతంలో సరదాగా గడుపుతున్నట్లు నాకనిపిస్తుంది.”​—⁠రానే.

“యౌవనస్థులందరూ ఒక దగ్గర చేరి సరదాగా గడుపుతారు కానీ నన్ను మాత్రం వారి గుంపులో చేర్చుకోరు!”​—⁠జెరామీ.

అదొక ఆహ్లాదకరమైన రోజు, ఆ రోజు కోసం మీరెలాంటి ప్రణాళికా వేసుకోలేదు. ఇతరులైతే, ప్రణాళికలు వేసుకున్నారు. మీ స్నేహితులందరూ సరదాగా గడుపుతున్నారు. ఈసారి కూడా, వారు మిమ్మల్ని పట్టించుకోలేదు!

ఒక కార్యక్రమానికి ఎవరైనా మిమ్మల్ని పిలవకపోతే మీరు బాధపడతారు, గానీ దానికిగల కారణాలను ఊహించుకున్నప్పుడు మరింత బాధేస్తుంది. ‘నాలో ఏదో లోపం ఉండేవుంటుంది’ అనో, ‘ఇతరులు నా సహచర్యాన్ని ఎందుకు కోరుకోరు’ అనో మీరనుకుంటారు.

అదెందుకు బాధపెడుతుంది?

గుంపులో ఒకరిగా ఉండాలని, వారి గుర్తింపు పొందాలని కోరుకోవడం సహజమే. నిజానికి సంఘ జీవులుగా మనం ఇతరులతో సమయం గడపడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతాం. హవ్వను సృష్టించక ముందు యెహోవా ఆదాము గురించి ఇలా అన్నాడు: “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు.” (ఆదికాండము 2:18) స్పష్టంగా, మనుష్యులకు మనుష్యులు అవసరం, మనం ఆ అవసరంతోనే సృష్టించబడ్డాం. అందుకే ఇతరులు మనల్ని పట్టించుకోనప్పుడు మనం బాధపడతాం.

ఇతరులు మిమ్మల్ని పదేపదే పట్టించుకోనప్పుడు లేదా మీరు స్నేహం చేయాలని కోరుకునే వారి ప్రమాణాలకు మీరు సరితూగలేరని మీకు అనిపించేలా వారు ప్రవర్తించినప్పుడు మీరు మరింతగా నిరాశపడవచ్చు. “గొప్ప కార్యాలను సాధిస్తున్న యౌవనస్థుల గుంపులున్నాయి, అయితే మీరు వారితో ఉండడానికి తగినవారుకారని వారనుకుంటున్నట్లు మీకు స్పష్టంగా తెలుస్తుంది” అని మారీ చెబుతోంది. ఇతరులు మిమ్మల్ని తమ గుంపులో చేర్చుకోకపోతే మీరు నిర్లక్ష్యం చేయబడుతున్నారని, ఒంటరివారయ్యారని మీకనిపిస్తుంది.

కొన్నిసార్లు మీరు ఒక గుంపులో ఉన్నా ఒంటరితనం మిమ్మల్ని వేధించవచ్చు. నికోల్‌ ఇలా అంటోంది: “నేను చెప్పేది మీకు వింతగానే అనిపించవచ్చు, ఓ పార్టీలో నేనెంతో ఒంటరితనాన్ని అనుభవించడం నాకింకా గుర్తుంది. నా చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారిలో ఎవరితో కూడా నాకు సన్నిహిత సంబంధమున్నట్లు అనిపించలేదు, బహుశా అందుకే నాకలా అనిపించివుండవచ్చని అనుకుంటున్నాను.” క్రైస్తవ సమావేశాల్లో ఉన్నప్పుడు కూడా కొందరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. మాగన్‌ ఇలా చెబుతోంది: “ఇక్కడున్నవారందరికీ ఒకరితో ఒకరికి పరిచయముందనీ, నాకే ఎవరి పరిచయమూ లేదనీ అనిపిస్తోంది!” మారియా అనే మరో యువతికి కూడా అలాగే అనిపిస్తోంది. ఆమె ఇలా అంటోంది, “స్నేహితులు నా చుట్టూ ఉన్నట్లే అనిపిస్తుంది, గానీ నాకంటూ స్నేహితులే లేరు.”

ఒంటరితనాన్ని చవిచూడనివారంటూ ఎవరూ లేరు, ప్రఖ్యాతిగాంచినట్లు లేదా సంతోషంగావున్నట్లు కనిపించేవారు కూడా దానికి అతీతులేమీ కారు. “ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును” అని బైబిల్లోని ఒక సామెత చెబుతోంది. (సామెతలు 14:13) ఒంటరితనం ఎంతో కాలంగా మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నట్లయితే అది మిమ్మల్ని బలహీనపర్చగలదు. బైబిలు ఇలా చెబుతోంది: “మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.” మరో అనువాదం ఆ వచనాన్ని ఇలా అనువదించింది: “దుఃఖం మిమ్మల్ని కృంగదీయగలదు.” (సామెతలు 15:13; కంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌) ఇతరులు మిమ్మల్ని పట్టించుకోనందువల్ల మీరు కృంగిపోయినట్లు అనిపిస్తే, మీరేమి చేయవచ్చు?

ఒంటరితనంతో పోరాడడం

ఒంటరితనంతో పోరాడేందుకు ఈ కింది చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించండి:

మీకున్న బలాల గురించి ఆలోచించండి. (2 కొరింథీయులు 11:6) మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నాకెలాంటి బలాలున్నాయి?’ మీకున్న నైపుణ్యాల గురించి లేదా మంచి గుణాల గురించి ఆలోచించి వాటిని కింద రాసుకోండి.

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

మిమ్మల్ని ఇతరులు పట్టించుకోనట్లు మీకనిపిస్తే, మీరు పైన రాసుకున్నలాంటి మీ బలాలను గుర్తుతెచ్చుకోండి. నిజమే, మీకు బలహీనతలున్నాయి, వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. అయినా, మీరు చేసే పొరపాట్లనుబట్టి ఆందోళనపడకుండా ఉండేందుకు ప్రయత్నించండి. బదులుగా, బాగుచేయబడుతున్న మంచి ఇల్లులాగే మిమ్మల్ని మీరు దృష్టించుకోండి. అన్నీ సక్రమంగా ఉండకపోవచ్చు, కానీ కొన్ని ఉన్నాయి. వాటిమీద దృష్టి నిలపండి!

హృదయాలను విశాలపరచుకోండి. (2 కొరింథీయులు 6:11-13) ఇతరులతో మాట్లాడేందుకు చొరవ తీసుకోండి. నిజమే, అది కష్టంగా అనిపించవచ్చు. 19 ఏళ్ల లిజ్‌ ఇలా అంటోంది: “గుంపులను చూస్తే ఎంతో భయమేయవచ్చు, కానీ మీరు ఆ గుంపులోని ఒకరి దగ్గరికి వెళ్లి హాయ్‌ అని చెబితే చాలు మీరు వెంటనే ఆ గుంపులో ఒకరైపోతారు.” (“సంభాషణ ప్రారంభించేందుకు చిట్కాలు” అనే బాక్సు చూడండి.) ఈ విషయానికి సంబంధించి మీరు వృద్ధులతోసహా అందరినీ పలకరించండి. కోరి అనే యౌవనస్థురాలు ఇలా గుర్తుచేసుకుంటోంది: “నాకు 10, 11 ఏళ్లున్నప్పుడు నాకన్నా ఎంతో పెద్దదైన ఒక స్నేహితురాలు ఉండేది. మా ఇద్దరికీ వయస్సులో తేడావున్నా మేము నిజంగా సన్నిహితంగా మెలిగేవాళ్లం.”

మీ సంఘంలో మీరు సుపరిచితులు కావాలనుకుంటున్న ఇద్దరు పెద్దవారి గురించి ఆలోచించండి.

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

ఈసారి సంఘ కూటంలో మీరు పైన రాసుకున్నవారిలో ఒకరితో మాట్లాడేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు. వారితో మాట్లాడడం మొదలుపెట్టండి. ఆయనకు లేదా ఆమెకు బైబిలుపట్ల ఆసక్తి ఎలా కలిగిందో అడగండి. “సహోదరులతో” మాట్లాడేందుకు మీరు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే, అంత తక్కువగా, ఇతరులు మిమ్మల్ని పట్టించుకోవడంలేదు, మీరు ఒంటరివారు అనే భావనలుంటాయి.—1 పేతురు 2:17.

మీ ఆందోళన గురించి ఇతరులతో మాట్లాడండి. (సామెతలు 17:17) మీ ఆందోళనను మీ తల్లిదండ్రులతో లేదా మరో వయోజనునితో పంచుకోవడం ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి సహాయం చేయవచ్చు. ఆ విషయాన్నే 16 ఏళ్ల యువతి గ్రహించింది. మొదట్లో, ఇతరులు తనను పట్టించుకోవడంలేదని ఆమె ఆందోళనపడేది. ఆమె ఇలా అంటోంది: “ఇతరులు నన్ను పట్టించుకోవడంలేదని నాకనిపించిన సందర్భాల గురించి ఆలోచించి, పదేపదే వాటినే నెమరువేసుకునేదాన్ని. అయితే ఆ తర్వాత నేను మా అమ్మతో దాని గురించి మాట్లాడేదాన్ని, ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలో మా అమ్మ నాకు సలహా ఇచ్చేది. ఆందోళన గురించి ఇతరులతో మాట్లాడడంవల్ల ఎంతో మేలు జరుగుతుంది!”

మిమ్మల్ని పదేపదే వేధిస్తున్న ఒంటరితనం గురించి ఎవరితోనైనా మాట్లాడాల్సివస్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్లొచ్చు?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

ఇతరుల గురించి ఆలోచించండి. (1 కొరింథీయులు 10:24) మనం “సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” అని బైబిలు చెబుతోంది. (ఫిలిప్పీయులు 2:4) నిజమే, ఇతరులు మిమ్మల్ని పట్టించుకోవడంలేదని అనిపిస్తే మీరు సులభంగా మానసిక కృంగుదలకు గురికావచ్చు లేదా బాధపడవచ్చు. అయితే మరింత నిరాశానిస్పృహలకు లోనయ్యే బదులు అవసరంలోవున్నవారికి ఏదో ఒక సహాయం ఎందుకు చేయకూడదు? ఆ విధంగా మీరు క్రొత్త స్నేహాలను కూడా సంపాదించుకోవచ్చు!

మీ కుటుంబంలో లేక సంఘంలో మీ సహచర్యం లేదా ఏదో ఒక విధంగా మీ సహాయం అవసరమైన వ్యక్తి గురించి ఆలోచించండి. ఆ వ్యక్తి పేరు కింద రాసి, ఆయనకు లేదా ఆమెకు మీరెలా సహాయం చేయగలరో వివరించండి.

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

మీరు మీ గురించి కాక ఇతరుల గురించి ఆలోచించి వారికి పనులు చేసిపెట్టినప్పుడు ఇక ఒంటరితనంతో బాధపడేంత తీరిక మీకుండదు. అది మిమ్మల్ని మరింత ఆశావహ దృక్పథం, వ్యక్తిత్వంగలవారిగా మలచడమేకాక, ఇతరులు మిమ్మల్ని స్నేహితులుగా చేసుకునేందుకు ఎంతో కోరుకునేలా కూడా చేయవచ్చు. సామెతలు 11:25 ఇలా చెబుతోంది: “నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.”

జాగ్రత్తగా ఎంపికచేసుకోండి. (సామెతలు 13:20) కేవలం పేరుకే స్నేహితులుగా ఉంటూ, మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టివేయగల అనేకమంది స్నేహితులకన్నా మీపట్ల శ్రద్ధవహించే కొద్దిమంది నిజస్నేహితులు ఉండడమే మంచిది. (1 కొరింథీయులు 15:33) బైబిల్లోని చిన్నారి సమూయేలు గురించి ఆలోచించండి. ఆయన ఆలయ గుడారంలో ఒంటరిగా ఉండివుండవచ్చు. ఆయనతోపాటు హొఫ్నీ ఫీనెహాసులు పనిచేశారు, వారు ప్రధాన యాజకుని కుమారులే అయినా వారి చెడు పనులవల్ల వారిని సహవాసులుగా చేసుకోవడం సమూయేలుకు శ్రేయస్కరంకాదు. వారిలో ఒకరిగా ఉండడానికి ఆయన ప్రయత్నించివుంటే అది ఆయన ఆధ్యాత్మిక పతనానికి దారితీసివుండేది! అయితే సమూయేలు ఖచ్చితంగా అలా కోరుకోలేదు! బైబిలు ఇలా చెబుతోంది: “బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.” (1 సమూయేలు 2:26) ఏ మనుష్యుల దయలో వర్ధిల్లాడు? ఖచ్చితంగా హొఫ్నీ ఫీనెహాసుల దయలోనైతే కాదు, వారు సమూయేలు సత్క్రియలనుబట్టి అతనికి దూరంగానే ఉండివుండవచ్చు. బదులుగా, ఆయనకున్న మెచ్చుకోదగిన గుణాలు, దేవుని ప్రమాణాలను సమర్థించేవారు ఆయనను ఇష్టపడేలా చేశాయి. యెహోవాను ప్రేమించే స్నేహితులే మీకు అవసరం!

ఆశావహ దృక్పథంతో ఉండండి. (సామెతలు 15:15) ఇతరులు తమను పట్టించుకోవడంలేదని ప్రతీ ఒక్కరికీ అప్పుడప్పుడు కొంతవరకైనా అనిపిస్తుంటుంది. ఈ విషయంలో ఏది సహాయం చేయగలదు? ప్రతికూల అంశాల గురించే ఆలోచించే బదులు జీవితంలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి కృషిచేయండి. మీ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను మీరు నియంత్రించలేకపోయినా వివిధ సందర్భాల్లో మీరు స్పందించే తీరును నియంత్రించుకోగలరు.

ఇతరులు మిమ్మల్ని పట్టించుకోవడంలేదని మీకనిపిస్తే పరిస్థితిని మార్చడానికి లేదా దాని విషయంలో మీ దృక్పథాన్నైనా మార్చుకోవడానికి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోండి. మీరు సృష్టించబడిన తీరు యెహోవాకు తెలుసు కాబట్టి మీ అవసరాలేమిటో, వాటినెలా చక్కగా తీర్చాలో ఆయనకు తెలుసు. మిమ్మల్ని పదేపదే వేధిస్తున్న ఒంటరితనం గురించి యెహోవాకు ప్రార్థించండి. ‘ఆయనే మిమ్మల్ని ఆదుకొంటాడు’ అనే నమ్మకంతో ఉండండి.—కీర్తన 55:22. (g 7/07)

“యువత ఇలా అడుగుతోంది . . . ” శీర్షికా పరంపరలోని మరిన్ని ఆర్టికల్స్‌ను www.watchtower.org/ype వెబ్‌సైట్‌లో చూడవచ్చు

మీరు ఆలోచించాల్సిన అంశాలు

◼ ఇతరులు నన్ను పట్టించుకోవడంలేదని నాకనిపిస్తే నేనెలాంటి ప్రోత్సాహకరమైన చర్యలు తీసుకోవచ్చు?

◼ ప్రతికూల ఆలోచనల్లో మునిగిపోయే బదులు నన్ను నేను సమతుల్యంగా దృష్టించుకోవడానికి ఏ లేఖనాలు నాకు సహాయం చేస్తాయి?

[14వ పేజీలోని బాక్సు/చిత్రం]

సంభాషణ ప్రారంభించేందుకు చిట్కాలు

చిరునవ్వు చిందించండి. మీరు చూపించే ఆప్యాయత ఇతరులు మీతో మాట్లాడేందుకు ప్రోత్సహిస్తుంది.

మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీ ఊరు, పేరు చెప్పండి.

ప్రశ్నలు అడగండి. వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకుండా, ఆ వ్యక్తి నేపథ్యం గురించి సరైన ప్రశ్నలు అడగండి.

వినండి. తర్వాత ఏమి చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండకండి. ఎక్కువగా వారు చెప్పేదే వినండి. మీ తర్వాతి ప్రశ్న లేదా మాట దానంతటదే వస్తుంది.

ప్రశాంతంగా ఉండండి! సంభాషణ క్రొత్త స్నేహాలను ప్రారంభించడానికి అవకాశమివ్వగలదు. కాబట్టి ఆ అనుభవాన్ని ఆస్వాదించండి!