కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కాస్త మార్పు కావాలా? వనౌటుకురండి!

కాస్త మార్పు కావాలా? వనౌటుకురండి!

కాస్త మార్పు కావాలా? వనౌటుకురండి!

న్యూకలెడోనియాలోని తేజరిల్లు! రచయిత

పని ఒత్తిడి ఎక్కువైందా? మార్పు కావాలనిపిస్తుందా? అయితే సూర్యరశ్మితో నిండిన ఉష్ణమండల ద్వీపంపై సేదదీరుతున్నట్లు ఊహించుకోండి. మీరు నీలిరంగు నీటిలో జలకాలాడుతున్నట్లు, పచ్చని వర్షాధార అడవుల్లో హాయిగా సంచరిస్తున్నట్లు లేదా ఆ ద్వీపానికి చెందిన వివిధ జాతుల ప్రజలతో కలిసిపోయి సమయం గడుపుతున్నట్లు ఊహించుకోండి. అలాంటి మనోహర ఉద్యానవనమేదైనా భూమ్మీద ఇంకా ఉందా? ఈ విషయంలో సందేహపడనవసరం లేదు! సుదూరాన ఉన్న వనౌటు ద్వీపాలకు వస్తే మీకే తెలుస్తుంది.

వ నౌటు ద్వీపాలు, ఆస్ట్రేలియాకు ఫిజీకి మధ్య పసిఫిక్‌ మహాసముద్రంలో నైరుతి దిశలో ఉన్నాయి, అవి Y ఆకారంలో ఉన్న 80 వరుస ద్వీపాలు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం, భూమి ఉపరిత పొరల్లోని పెద్దపెద్ద ఫలకలు ఈ ప్రాంతంలో ఢీకొని ఎత్తైన పర్వతాలుగా ఏర్పడ్డాయి, ఈ పర్వతాలు ముఖ్యంగా నీటిక్రిందే ఉన్నాయి. వీటిలో కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలు మహాసముద్రపు ఉపరితలంపైకి చేరి, ఎగుడుదిగుడైన వనౌటు ద్వీపాలుగా ఏర్పడ్డాయి. నేడు కూడా భూగర్భ ఫలకాల్లో జరిగే మార్పులవల్ల వనౌటులో భూప్రకంపనలు సంభవిస్తుంటాయి, అంతేకాక అక్కడి తొమ్మిది అగ్నిపర్వతాలు అప్పుడప్పుడూ విస్ఫోటమవుతూ ఉంటాయి. సాహస సందర్శకులు లావాను దగ్గర నుండి చూడవచ్చు.

ఈ ద్వీపాల్లో దట్టమైన వర్షాధార అడవులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ద్వీపం పెద్దపెద్ద మర్రిచెట్లకు నిలయం, వీటి కొమ్మలు చాలా దూరం విస్తరించేంత పెద్దవిగా ఉంటాయి. వాటి నీడలో 150 కన్నా ఎక్కువ జాతుల ఆర్కిడ్‌ పువ్వులు, 250 జాతుల ఫెర్న్‌ మొక్కలు చిక్కగా పెరిగి, అందాన్ని విస్తరింపజేస్తాయి. స్పష్టమైన సముద్రపు నీటిలో రంగురంగుల చేపలు, పగడాలు పుష్కలంగా ఉన్నాయి, చుట్టూరా మనోహరమైన సముద్ర తీరాలు, ఎగుడుదిగుడైన పర్వతాలు ఉన్నాయి. ఎపీ ద్వీపంలోని స్నేహపూరిత డ్యూగాంగ్‌ అనే సముద్రపు ప్రాణితో కలిసి సరదాగా ఈతకొట్టడానికి ప్రపంచ నలుమూలలనుండి పర్యావరణప్రియులు వస్తుంటారు. *

నరమాంస భక్షకులు, కార్గో మతగుంపులు

యూరప్‌కు చెందిన అన్వేషకులు మొదటిసారిగా 1606లో వనౌటులో అడుగుపెట్టారు. * ఈ ద్వీపాల్లో భయంకరమైన జాతుల ప్రజలు జీవించేవారు, వారిలో చాలామంది నరమాంస భక్షకులు. అప్పట్లో, ఆసియాలో ఎంతో ప్రియమైనదిగా ఎంచబడే సుగంధభరిత చందనపు చెట్లు అడవుల్లో కోకొల్లలుగా ఉండేవి. లాభాలకు ఆశపడిన యూరప్‌ వర్తకులు క్రమంగా వాటిని నరికేశారు. ఆ తర్వాత వారు స్థానికులను కార్మికులుగా మార్చడం మొదలుపెట్టారు.

వారు స్థానిక ద్వీపవాసులను సమోవ, ఫిజీ, ఆస్ట్రేలియాలోని చెరుకు, పత్తి పండించే స్థలాల్లో కార్మికులుగా పని చేయడానికి కుదిర్చి ఆయా దేశాలకు పంపించేవారు. పైకి మాత్రం ఆ పనివాళ్లు మూడు సంవత్సరాలు పనిచేయడానికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నట్లు సంతకం చేసేవారు. కానీ నిజానికి వారిలో చాలామందిని బలవంతంగా ఎక్కడికో తీసుకెళ్లేవారు. అలా కార్మికులను పంపించే వ్యాపారం 1800వ పడిలో జోరుగా సాగే సమయానికి వనౌటుకు చెందిన ద్వీపాల్లోని సగానికి సగంమంది మగవాళ్లు విదేశాల్లో పనిచేస్తున్నారు. వారిలో చాలామంది మళ్లీ ఇంటిముఖం చూడనేలేదు. పసిఫిక్‌ మహాసముద్ర ద్వీపవాసుల్లోని దాదాపు 10,000 మంది అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాలోనే మరణించారు.

వనౌటు ద్వీపాలను ఐరోపా ఖండానికి సంబంధించిన వ్యాధులు పట్టిపీడించాయి. పొంగు వ్యాధి, కలరా, స్పోటక వ్యాధి, లేదా ఇతర వ్యాధులను తట్టుకునే రోగనిరోధక శక్తి ఆ ద్వీపవాసులకు బొత్తిగా లేకపోయింది. “సాధారణ జలుబు ఎంతోమందిని పొట్టనబెట్టుకునే ప్రాణాంతక వ్యాధిగా మారింది” అని ఒక పుస్తకం చెబుతోంది.

క్రైస్తవ మిషనరీలు మొదటిసారిగా 1839లో వనౌటుకు వచ్చారు. అయితే విచారకరంగా అక్కడి ప్రజలు ఆ ఇద్దరు మిషనరీలను చంపి తినేశారు! వారి తర్వాత వచ్చిన చాలామందికి కూడా అదే దుర్గతిపట్టింది. కాని అనతికాలంలో ప్రొటస్టెంట్‌, క్యాథలిక్‌ చర్చీలు ఆ ద్వీపాల్లో గట్టిగా నిలదొక్కుకున్నాయి. నేడు వనౌటు వాసుల్లో 80 శాతంకన్నా ఎక్కువ మంది చర్చీ సభ్యులుగా ఉన్నారు. అయినా, పౌల్‌ రఫాయెల్‌ అనే గ్రంథకర్త ఇలా చెబుతున్నాడు: “ఆత్మలు ఆవహించిన రాళ్లను ఉపయోగించే ఊరి మంత్రగాళ్లను అనేకమంది ఇప్పటికీ ఎంతో భక్తిశ్రద్ధలతో చూస్తారు, ఆ మంత్రగాళ్లు ఆ రాళ్లను ప్రేమికుణ్ణి లేదా ప్రేయసిని ఆకర్షించే, పందిని లావు చేసే లేదా శత్రువును చంపే మంత్రవిద్యల్లో ఉపయోగిస్తారు.”

వనౌటులో ప్రపంచంలోని అత్యంత ప్రాచీన కార్గో మతగుంపుల్లోని ఒక గుంపు ప్రజలు కూడా నివసిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 5,00,000 మంది అమెరికా సైనికులు పసిఫిక్‌ సముద్ర ప్రాంత యుద్ధభూములకు చేరుకోవడానికి వనౌటు గుండా ప్రయాణించి వెళ్లారు. సైనికులు మోసుకొచ్చిన అపార సంపదను లేదా “కార్గోను” ద్వీపవాసులు చూసి ఆశ్చర్యపోయారు. యుద్ధం ముగిసిన తర్వాత అమెరికన్లు ఎక్కడివక్కడ వదిలేసి తిరిగి వెళ్లిపోయారు. లక్షలు ఖరీదు చేసే అదనపు యుద్ధ సామగ్రి, నిత్యావసర వస్తువులు సముద్రంలో పడవేయబడ్డాయి. ఆ సందర్శకుల్ని తిరిగి రప్పించడానికి కార్గో కల్ట్‌లు అనబడే మతగుంపులు నౌకలు నిలపడానికి స్థలాలను, విమానం దిగడానికి దారులను నిర్మించి, మిలిటరీ సామగ్రిని పోలిన వస్తువులతో సైనిక కవాతులు నిర్వహించేవారు. నేటికీ టాన్నా అనే ద్వీపంలోని వందలాది గ్రామస్థులు “అమెరికా క్రీస్తు అనబడే అజ్ఞాత” వ్యక్తియైన జాన్‌ ఫ్రమ్‌కు ప్రార్థనలు చేస్తుంటారు, ఆయన ఏదో ఒక రోజు తిరిగి వస్తాడనీ, వారికి గొప్ప సిరిసంపదలు తెస్తాడనీ వారి నమ్మకం.

సాంస్కృతిక వైవిధ్యం

ఈ ద్వీపవాసుల భాషల్లో, ఆచారాల్లో గొప్ప వైవిధ్యం ఉంది. ఒక గైడ్‌బుక్‌ ఇలా చెబుతోంది: “సగటున ఎక్కువ భాషలు మాట్లాడగల ప్రజలు ప్రపంచంలోకెల్లా వనౌటులోనే అత్యధికంగా ఉన్నారని అది చెప్పుకుంటోంది.” ఆ ద్వీపాల్లో కనీసం 105 వివిధ భాషలు, అనేక మాండలికాలు వాడుకలో ఉన్నాయి. అక్కడ సాధారణంగా వాడబడే బిస్లామాతోపాటు ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషలు కూడా అధికారిక భాషలుగా ఉన్నాయి.

అయితే ఆ ద్వీపాలన్నింటిలో ఒక విషయం మాత్రం సామ్యంగావుంది, అదేమిటంటే, జీవితంలోని ప్రతీ అంశానికి వారు ఆచారాలను పాటిస్తారు. పెంటెకోస్ట్‌ ద్వీపంపై ప్రాచీన ఫలసాఫల్య ఆచారం ప్రపంచవ్యాప్తంగా బంగీ జంపింగ్‌ అనబడే వెర్రి దూకుడుకు నాంది పలికింది. ప్రతీ ఏడాది కందపంటకు సంబంధించి జరిగే వేడుకలో చిన్నా, పెద్దా తేడాలేకుండా మగవాళ్ళందరూ 20, 30 మీటర్ల ఎత్తుండేలా కర్రలతో నిర్మించిన కట్టడంపై నుండి క్రిందకు దూకుతారు. వాళ్ల కాళ్లకు కట్టబడే చెట్ల తీగలే వారిని మృత్యుకోరల నుండి తప్పిస్తాయి. వారి తలలను ఓ క్షణంపాటు నేలకు తాకించడం ద్వారా వారు తమ భూమిని మరుసటి సంవత్సరం కోసం “ఫలప్రదం” చేయాలని ఆశిస్తారు.

మాలెకులా ద్వీపంలో ఇటీవలే కొన్ని గ్రామాల ప్రజలు బయటివారితో కలవడం మొదలుపెట్టారు. బిగ్‌ నమ్బాస్‌, స్మాల్‌ నమ్బాస్‌ అనబడే జాతి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ఒకప్పుడు నరమాంస భక్షకులైన వీళ్లు 1974లో చివరిసారిగా నరమాంసాన్ని తిన్నారని నివేదించబడుతోంది. అలాగే, మగ పిల్లలకు “ఆకర్షణీయమైన” పొడవైన తలలు ఉండాలని తలను గుడ్డలతో గట్టిగా చుట్టివుంచే ఆచారం కూడా సంవత్సరాల క్రితమే కనుమరుగైంది. నేటి నమ్బాస్‌ చాలా స్నేహపూరిత ప్రజలు, వారు తమ సాంస్కృతిక సంపదను సందర్శకులతో పంచుకోవడానికి సంతోషిస్తారు.

పరదైసులో ప్రజలు

అనేక సందర్శకులు మార్పుకోసం సెలవు తీసుకుని వనౌటుకు వస్తుంటారు. కానీ యెహోవాసాక్షులు 70 సంవత్సరాల క్రితం ప్రజలకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చారు. “భూదిగంతము”లో ఉన్న ఈ ప్రదేశంలో సాక్షులు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను తెచ్చాయి. (అపొస్తలుల కార్యములు 1:8) (“కావా త్రాగడం మాని క్రైస్తవునిగా మారడం” అనే బాక్సును చూడండి.) ఆ దేశంలోని సాక్షుల ఐదు సంఘాలు 2006లో భూపరదైసు గురించిన బైబిలు సందేశాన్ని ఇతరులకు అందించడంలో 80,000 కన్నా ఎక్కువ గంటలు గడిపాయి. (యెషయా 65:17-25) సంతోషకరంగా ఆ భవిష్యత్‌ పరదైసు నేటి ఆధునిక జీవితంలోని చింతలను, ఒత్తిళ్లను పూర్తిగా రూపుమాపుతుంది!—ప్రకటన 21:4. (g 9/07)

[అధస్సూచీలు]

^ సముద్రంలో జీవించే డ్యూగాంగ్‌ అనే సస్తనజీవి శాఖాహారి, అది 3.4 మీటర్ల పొడవు పెరగడమేకాక దాదాపు 400 కేజీల బరువు తూగుతుంది.

^ వనౌటుకు 1980లో జాతీయ స్వాత్యంత్రం రాకముందు అది న్యూ హెబ్రిడెస్‌గా పిలువబడేది.

[17వ పేజీలోని బాక్సు/చిత్రం]

సంతోషంగావున్న ప్రజలుండే ద్వీపాలు

వనౌటు 2006లో హాపీ ప్లానెట్‌ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. బ్రిటీష్‌ పరిశోధనా సంస్థయైన న్యూ ఎకనామిక్స్‌ ఫౌండేషన్‌ వారు ఉత్పత్తిచేసిన ఆ ఇండెక్స్‌ సంతోషంగా ఉన్న, ఎక్కువకాలం జీవించే ప్రజలున్న, పర్యావరణాన్ని సంరక్షించే దేశాలు 178 ఉన్నాయని అంచనా వేసింది. వాటిలో [వనౌటు] మొదటి స్థానంలో నిలించింది ఎందుకంటే అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు, సగటున 70 సంవత్సరాలపాటు జీవిస్తున్నారు, మన గ్రహానికి హాని కలిగించే ఏ పనీ చేయకుండా జాగ్రత్తపడుతున్నారు” అని వనౌటు డైలీ పోస్ట్‌ వార్తాపత్రిక రాసింది.

[చిత్రం]

సాంప్రదాయ దుస్తులు

[చిత్రసౌజన్యం]

© Kirklandphotos.com

[17వ పేజీలోని బాక్సు/చిత్రం]

కావా త్రాగడం మాని క్రైస్తవునిగా మారడం

పెంటెకోస్ట్‌ ద్వీప నివాసియైన విల్లీ తన చిన్నతనం నుండే కావా అనే మద్యాన్ని ఎక్కువగా తాగేవాడు. ఘాటైన ఆ మద్యాన్ని దంచిన మిరియాల మొక్కల వేళ్లను కాచి తయారుచేస్తారు. ఆయన ప్రతీరాత్రి కావా మద్యశాలలో చిత్తుగా తాగి తూలుతూ ఇంటికి చేరేవాడు. ఆయన అప్పులు తలకు మించిపోయాయి. ఆయన క్రూరంగా మారి తన భార్య ఇడాను కొట్టేవాడు. ఆ తర్వాత, తన తోటి ఉద్యోగస్థుల్లో ఒకరైన యెహోవాసాక్షి విల్లీని బైబిలు అధ్యయనం చేయమని ప్రోత్సహించాడు. విల్లీ దానికి ఒప్పుకున్నాడు. మొదట్లో ఇడా దానికి అభ్యంతరం చెప్పింది. అయితే తన భర్త ప్రవర్తనలో మార్పులు వస్తుండగా ఆమె తన మనసు మార్చుకుని తాను కూడా అధ్యయనం చేయడం ప్రారంభించింది. వారిద్దరూ కలిసి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతి సాధించారు. అనతికాలంలో విల్లీ తన దురలవాట్లు మానుకున్నాడు. ఆయన, ఇడా ఇద్దరూ 1999లో యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకున్నారు.

[15వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

న్యూజీలాండ్‌

ఆస్ట్రేలియా

పసిఫిక్‌ మహాసముద్రం

ఫిజీ

[16వ పేజీలోని చిత్రం]

అత్యంత ప్రమాదకరమైన ఫలసాఫల్య ఆచారంలో భాగంగా కొందరు పైనుండి క్రిందికి దూకుతారు

[చిత్రసౌజన్యం]

© Kirklandphotos.com

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Kirklandphotos.com

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Kirklandphotos.com

[16వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Kirklandphotos.com