కుటుంబ నియమాలను వివరించి, వాటిని ఖచ్చితంగా అమలుచేయండి
చర్య 4
కుటుంబ నియమాలను వివరించి, వాటిని ఖచ్చితంగా అమలుచేయండి
ఈ చర్య ఎందుకు తీసుకోవాలి? జార్జియా విశ్వవిద్యాలయంలో సమాజ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రొనాల్డ్ సైమన్స్ ఇలా చెబుతున్నాడు: “వాస్తవేమిటంటే, పిల్లలకు నియమాలను స్పష్టంగా వివరించడమే కాక, వాటిని మీరినప్పుడల్లా ఏకరీతిగా క్రమశిక్షణను అమలుచేసినప్పుడు చక్కగా ఎదుగుతారు. అలా చేయకపోతే పిల్లలు తమ గురించే ఆలోచిస్తూ, స్వార్థపరులుగా, ముభావంగా ఉంటూ తమ చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బందిపెడతారు.” దేవుని వాక్యం స్పష్టంగా ఇలా చెబుతోంది: “కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.”—సామెతలు 13:24.
అది ఎందుకు కష్టం? మీ పిల్లల ప్రవర్తననుబట్టి సముచితమైన హద్దులేర్పరచి, వాటిని అమలుచేసేందుకు సమయం, కృషి, పట్టుదల అవసరం. అయితే పిల్లలు సహజంగానే అలాంటి హద్దుల్ని మీరేందుకు ప్రయత్నిస్తారు. అది ఎందుకు కష్టమో ఇద్దరి పిల్లలను పెంచుతున్న మిక్, సోనియా క్లుప్తంగా ఇలా చెబుతున్నారు: “పిల్లలు చిన్నవారైనా వారికి కూడా సొంత ఆలోచనలు, కోరికలు ఉంటాయి, వారిలో కూడా జన్మతః తప్పుచేయాలనే లక్షణం ఉంటుంది.” ఈ తల్లిదండ్రులకు తమ అమ్మాయిలంటే చాలా ప్రేమ. అయితే, వారిలా ఒప్పుకుంటున్నారు: “కొన్నిసార్లు పిల్లలు మొండిగా, స్వార్థపరులుగా ఉండొచ్చు.”
పరిష్కారం: యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో వ్యవహరించిన విధానాన్ని అనుసరించండి. తన ప్రజలపట్ల తన ప్రేమను వ్యక్తపర్చిన ఒక విధానమేమిటంటే, వారు పాటించాలని తాను కోరిన కట్టడలను ఆయన వారికి స్పష్టంగా వివరించాడు. (నిర్గమకాండము 20:2-17) ఆ కట్టడలను మీరితే ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆయన వివరించాడు.—నిర్గమకాండము 22:1-9.
కాబట్టి, మీ పిల్లలు ఖచ్చితంగా లోబడాలని మీరనుకునే కుటుంబ నియమాల రాతపూర్వక పట్టికను ఎందుకు తయారు చేసుకోకూడదు. ఆ పట్టికను కొన్ని నియమాలకు మాత్రమే పరిమితం చేయాలని, అంటే దానిలో కేవలం కొన్ని నియమాలను అంటే బహుశా ఐదు నియమాలను చేరిస్తే చాలని, కొందరు తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. చక్కగా ఎంపిక చేసుకున్న ఆ చిన్న పట్టికలోని నియమాలను అమలుచేయడం కష్టంగా ఉండదు, అంతేగాక వాటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. ఆ నియమాల ప్రక్కనే వాటిని మీరితే ఏ శిక్షపడుతుందో రాసిపెట్టండి. శిక్ష సహేతుకమైనదిగా ఉండి, దాన్ని అమలుచేసేందుకు మీరు సుముఖంగా ఉండాలి. పిల్లల నుండి ఖచ్చితంగా ఏమి ఆశించబడుతుందో గుర్తుంచుకునేలా అమ్మానాన్నలతో సహా అందరూ ఆ నియమాలను క్రమంగా పునఃసమీక్షించాలి.
నియమాలను మీరితే వెంటనే శిక్షించండి, అలా శిక్ష విధించేటప్పుడు మీరు నిశ్చలంగా, స్థిరంగా, మార్పులేనివారిగా ఉండండి. గమనిక: మీకు కోపమొస్తే, కోపం తగ్గిన తర్వాతే ఎలాంటి శిక్షణైనా ఇవ్వండి. (సామెతలు 29:22) అయితే, వాయిదా వేయకండి. రాజీపడకండి. మీరొకవేళ అలా చేస్తే, మీ పిల్లలు నియమాలను గంభీరంగా తీసుకోవలసిన అవసరం లేదనుకుంటారు. ఇది బైబిలు చెప్పేదానికి పొందికగా ఉంది: “దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.”—ప్రసంగి 8:11.
మీ పిల్లల ప్రయోజనార్థం మీరు మీ అధికారాన్ని ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చు? (g 8/07)
[6వ పేజీలోని బ్లర్బ్]
“మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను.”—మత్తయి 5:37