కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గర్భనిరోధకాలు నైతికంగా తప్పా?

గర్భనిరోధకాలు నైతికంగా తప్పా?

బైబిలు ఉద్దేశము

గర్భనిరోధకాలు నైతికంగా తప్పా?

ఈవిషయంలో మీ ఉద్దేశమేమిటి? వివాహితులు గర్భనిరోధకాలను ఉపయోగించడం తప్పా? మీరిచ్చే సమాధానాలు బహుశా మీ మతసంబంధ నమ్మకాలపై ఆధారపడి ఉండవచ్చు. సంతానోత్పత్తిని అడ్డుకోవడానికి రూపొందించబడిన పద్ధతులన్నీ “సహజంగానే చెడ్డవి” అని క్యాథలిక్‌ చర్చి బోధిస్తోంది. వివాహిత దంపతుల మధ్య ఉండే లైంగిక సంబంధాలన్నీ గర్భధారణ సాధ్యమయ్యే విధంగా ఉండాలనే నమ్మకాన్ని క్యాథలిక్‌ మత సిద్ధాంతం ప్రోత్సహిస్తోంది. కాబట్టి, క్యాథలిక్‌ చర్చి ప్రకారం, గర్భనిరోధకాలు “నైతికంగా ఆమోదయోగ్యమైనవి కావు.”

ఈ దృక్పథాన్ని అంగీకరించడం అనేకమందికి కష్టంగా ఉంటుంది. ఆ అంశంమీద పిట్స్‌బర్గ్‌ పోస్ట్‌-గజెట్‌ పత్రికలో వెలువడిన ఒక ఆర్టికల్‌ ఇలా నివేదించింది: “కృత్రిమ గర్భనిరోధకాలను ఉపయోగించడాన్ని చర్చి అనుమతించాలనే అభిప్రాయాన్ని అమెరికాలోని డెబ్భై ఐదుశాతం కన్నా ఎక్కువమంది క్యాథలిక్కులు వెలిబుచ్చుతున్నారు . . . అంతేకాక ప్రతీరోజు, లక్షలాదిమంది దానిమీద ఉన్న నిషేధాన్ని లెక్కచేయడం లేదు.” ముగ్గురు పిల్లల తల్లి అయిన లిండా వారిలో ఒకరు. తాను గర్భనిరోధకాలను వాడుతున్నానని ఆమె ధైర్యంగా ఒప్పుకుంటోంది, కానీ, ఆమె ఇలా అంటోంది: “నా మనస్సాక్షి ప్రకారం, నేను పాపం చేస్తున్నానని నిజంగా నాకనిపించడంలేదు.”

ఈ వివాదాంశం గురించి దేవుని వాక్యం ఏమి చెబుతోంది?

జీవితం అమూల్యమైనది

గర్భస్థ శిశువు ప్రాణాన్ని కూడా దేవుడు విలువైనదిగా పరిగణిస్తాడు. ఇశ్రాయేలు రాజైన దావీదు దైవ ప్రేరణతో ఇలా రాశాడు: “నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను . . . నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.” (కీర్తన 139:13, 16) గర్భధారణ జరిగినప్పుడు క్రొత్త జీవం ఊపిరిపోసుకుంటుంది, గర్భస్థ శిశువుకు హానిచేసినందుకు ఒక వ్యక్తి శిక్షించబడవచ్చని మోషే ధర్మశాస్త్రం సూచిస్తోంది. వాస్తవానికి, ఇద్దరు పురుషుల పోరాటం కారణంగా గర్భిణీ స్త్రీ లేదా గర్భస్థ శిశువు మరణిస్తే, ఆ విషయాన్ని నియమిత న్యాయాధిపతుల దృష్టికి తీసుకువెళ్లాలి. వారు పరిస్థితులతోపాటు అదెంతవరకు ఉద్దేశపూర్వకంగా చేయబడిందో పరిశీలించాలి, కానీ అపరాధులకు “ప్రాణమునకు ప్రాణము” అనే శిక్షపడే అవకాశముంది అని నిర్గమకాండము 21:22-25 పేర్కొంటోంది.

ఆ సూత్రాలకు గర్భనిరోధకంతో సంబంధం ఉంది ఎందుకంటే, కొన్ని గర్భనిరోధక పద్ధతులవల్ల గర్భస్రావం అవుతున్నట్లు కనిపిస్తుంది. ఆ గర్భనిరోధక పద్ధతులు జీవంపట్ల గౌరవానికి సంబంధించిన దైవిక సూత్రానికి అనుగుణంగా లేవు. అయితే, అనేక గర్భనిరోధకాలు గర్భస్రావాన్ని కలిగించవు. అలాంటి గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించే విషయమేమిటి?

పిల్లల్ని కనమని బైబిల్లో క్రైస్తవులు ఎక్కడా ఆజ్ఞాపించబడలేదు. దేవుడు మొదటి మానవ దంపతులకు, నోవహు కుటుంబానికి ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించండి.” అయితే ఆ ఆజ్ఞ తిరిగి క్రైస్తవులకు ఇవ్వబడలేదు. (ఆదికాండము 1:28; 9:1) అందుకే, వివాహిత దంపతులు తాము పిల్లలను కనాలో లేదో, ఎంతమంది పిల్లలను కనాలి, ఎప్పుడు కనాలి వంటి అనేక విషయాలను స్వయంగా నిర్ణయించుకోవచ్చు. అలాగే, లేఖనాలు గర్భనిరోధాన్ని ఖండించడంలేదు. కాబట్టి, బైబిలు దృక్కోణం ప్రకారం, భార్యాభర్తలు గర్భస్రావం కలిగించని గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించాలా వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. అయితే, క్యాథలిక్‌ చర్చి గర్భనిరోధకాలను ఎందుకు ఖండిస్తోంది?

మానవ జ్ఞానం, దైవిక జ్ఞానం

సా.శ. రెండవ శతాబ్దంలో, నామకార్థ క్రైస్తవులు స్టోయిక్‌ నియమాన్ని మొదటిసారిగా స్వీకరించారనీ, ఆ నియమం ప్రకారం, వివాహిత దంపతులు సంతానోత్పత్తి కోసమే లైంగిక సంపర్కంలో పాల్గొనడం న్యాయబద్ధమనీ క్యాథలిక్‌ గ్రంథాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ అభిప్రాయం వెనకున్న తర్కం తత్త్వసంబంధమైనదే కానీ బైబిలు సంబంధమైనది కాదు. అది దైవిక జ్ఞానంపై కాదుగానీ మానవ జ్ఞానం మీదే ఆధారపడింది. నామకార్థ క్రైస్తవులు ఈ తత్త్వజ్ఞానాన్ని ఎన్నో శతాబ్దాలుగా నమ్ముతూ వచ్చారు, వివిధ క్యాథలిక్‌ వేదాంతులు దానికి మరిన్ని నియమాలను చేర్చారు. * అయితే, లైంగికానందం కోసమే లైంగిక సంబంధాలు పెట్టుకోవడం పాపమని, అందువల్ల గర్భధారణా అవకాశాన్ని తీసివేసే అలాంటి లైంగిక సంబంధాలు అనైతికమనే నమ్మకం ఆ బోధ కారణంగా ఏర్పడింది. అయితే లేఖనాలు అలా బోధించడం లేదు.

బైబిలు పుస్తకమైన సామెతలు, భార్యాభర్తల మధ్య ఉండే సరైన లైంగిక సంబంధాలవల్ల కలిగే ఆనందాన్ని కావ్య భాషలో ఇలా వర్ణిస్తోంది: “నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.”—సామెతలు 5:15, 18, 19.

భార్యాభర్తల మధ్య ఉండే లైంగిక సంబంధాలు దేవుడిచ్చిన వరం. అయితే వాటి ఉద్దేశం సంతానోత్పత్తి మాత్రమే కాదు. భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలు కనబరిచేందుకు కూడా లైంగిక సంబంధాలు దోహదపడతాయి. కాబట్టి ఒక జంట, ఏదైనా ఒక రకమైన గర్భనిరోధకాన్ని ఉపయోగించి గర్భధారణ జరగకుండా చూసుకోవాలనుకుంటే అలా నిర్ణయించుకునే హక్కు వారికుంది, ఇతరులు ఎవరూ వారిని విమర్శించకూడదు.—రోమీయులు 14:4, 10-13. (g 9/07)

మీరు వీటి గురించి ఆలోచించారా?

◼ భార్యాభర్తలు లైంగిక సంబంధాలు కలిగివుండడం పాపమా?—సామెతలు 5:15, 18, 19.

◼ క్రైస్తవులు గర్భనిరోధకాలను ఉపయోగించాలనుకుంటే వారు దేనిని గుర్తుంచుకోవాలి?—నిర్గమకాండము 21:22, 23.

◼ గర్భనిరోధకాలను ఉపయోగించే వివాహిత దంపతులను ఇతరులు ఎలా దృష్టించాలి?—రోమీయులు 14:4, 10-13.

[అధస్సూచి]

^ “గర్భనిరోధకాలకు వ్యతిరేకంగా పోపు జారీ చేసిన మొదటి సార్వజనిక శాసనం” అని న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా పేర్కొన్న చట్టాన్ని 13వ శతాబ్దంలోనే గ్రెగరీ IX అమల్లోకి తీసుకొచ్చాడు.

[11వ పేజీలోని బ్లర్బ్‌]

దేవుడు మొదటి మానవ దంపతులకు, నోవహు కుటుంబానికి ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించండి.” అయితే ఆ ఆజ్ఞ తిరిగి క్రైస్తవులకు ఇవ్వబడలేదు