కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దినచర్యను ఏర్పాటు చేసుకుని, దానిని క్రమంగా పాటించండి

దినచర్యను ఏర్పాటు చేసుకుని, దానిని క్రమంగా పాటించండి

చర్య 5

దినచర్యను ఏర్పాటు చేసుకుని, దానిని క్రమంగా పాటించండి

ఈ చర్య ఎందుకు తీసుకోవాలి? పెద్దవారి జీవితంలో దినచర్యకు ప్రముఖ పాత్రే ఉంది. పని, ఆరాధన, ఉల్లాస కార్యకలాపాలు సాధారణంగా ఏర్పాటు చేసుకున్న దినచర్యగా సాగిపోతాయి. పిల్లలు తమ సమయాన్ని క్రమబద్ధం చేసుకొని ఒక సమయ పట్టికకు అంటిపెట్టుకునేలా తల్లిదండ్రులు వారికి నేర్పించకపోతే తామే వారిని పాడుచేసినవారవుతారు. మరోవైపు, “నియమ నిబద్ధతలు పిల్లవాడు తాను సురక్షితంగా, భద్రంగా ఉన్నానని భావించేలా చేసి వాడికి ఆశానిగ్రహాన్ని, స్వావలంబనను నేర్పిస్తున్నట్లు అధ్యయనాలు చూపిస్తున్నాయి” అని మానసికశాస్త్ర పండితుడైన డాక్టర్‌ లారెన్స్‌ స్టీన్‌బెర్గ్‌ చెబుతున్నాడు.

అది ఎందుకు కష్టం? జీవితం ఉరుకులు పరుగులుగా సాగుతోంది. చాలామంది తల్లిదండ్రులు గంటలతరబడి పనిచేస్తున్నారు కాబట్టి, తమ పిల్లలతో ప్రతీరోజు గడిపేందుకు వారికి సమయమే ఉండకపోవచ్చు. దినచర్య ప్రకారం నడుచుకునేందుకు పిల్లలు మొదట్లో ఇష్టపడకపోవచ్చు ఆ సమస్యను అధిగమించేలా దినచర్యను ఏర్పాటు చేసుకుని, దానిని క్రమంగా పాటించడానికి స్వీయ క్రమశిక్షణ, దృఢసంకల్పం అవసరం.

పరిష్కారం: “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి” అనే బైబిలు ఉపదేశాన్ని సూత్రప్రాయంగా అన్వయించుకోండి. (1 కొరింథీయులు 14:39) ఉదాహరణకు, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పటినుండే ప్రతీరోజు పడుకునే నిర్దిష్ట సమయాన్ని జ్ఞానయుక్తంగా నిర్ణయిస్తారు. అయితే, పడుకునే సమయం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. గ్రీసులో నివసిస్తున్న టాట్యానకు ఇద్దరమ్మాయిలు, ఆమె ఇలా చెబుతోంది: “పిల్లలు పడుకునే ముందు వారిదగ్గరికెళ్ళి అనునయంగా వారితో మాట్లాడుతూ, వాళ్ళు స్కూలుకు వెళ్ళిన తర్వాత నేను ఆ రోజు ఇంటిదగ్గర ఏమేమి చేశానో చెప్పేదాన్ని. అలాగే వాళ్ళు కూడా ఆ రోజు చేసిన కొన్ని పనులను నాకు చెప్పాలనుకుంటున్నారా అని అడిగేదాన్ని. అప్పుడు వారు నిర్భయంగా మనసు విప్పి తాము చేసిన పనుల గురించి నాకు చెప్పేవారు.”

టాట్యాన భర్త కోస్టాస్‌ వాళ్లమ్మాయిలకు కథలు చదివి వినిపించేవాడు. “మా అమ్మాయిలు కథల గురించి మాట్లాడేవారు, తరచూ వాటి గురించిన చర్చ వారి వ్యక్తిగత విషయాలవైపు మళ్ళేది. వాళ్లను బాధిస్తున్న విషయం గురించి చెప్పమని ఒకవేళ మా అమ్మాయిలను గట్టిగా అడిగితే చెప్పేందుకు వారు జంకేవారు” అని ఆయన చెబుతున్నాడు. అయితే, పిల్లలు పెద్దవారవుతుండగా వారికి తగ్గట్టుగా పడుకునే సమయాన్ని సవరించడం సముచితంగా ఉంటుంది. దినచర్యను మీరు క్రమంగా కొనసాగిస్తే, ఆ సమయాన్ని మీ పిల్లలు మీతో మాట్లాడేందుకు క్రమంగా ఉపయోగించుకుంటారు.

దాంతోపాటు, ప్రతీరోజు కనీసం ఒక్కపూటైన కలిసి భోజనం చేయడాన్ని కుటుంబాలు ఒక అలవాటుగా చేసుకోవడం జ్ఞానయుక్తం. ఈ అలవాటును ఏర్పాటు చేసుకునేందుకు భోజన సమయాలు కొంతమేరకు సరిపెట్టుకోదగినట్లుగా ఉండాలి. “నేను ఉద్యోగం నుండి ఇంటికి రావడం కొన్నిసార్లు ఆలస్యమైతే, నేను ఇంటికి వచ్చేంతవరకు పిల్లలు నాకోసం ఎదురుచూస్తున్నప్పుడు వారికి ఆకలేయకుండా ఉండడానికి నా భార్య కాస్త తినడానికి ఏదైనా వారికి ఇచ్చేది, అయితే ఆమె ఎప్పుడు మేమందరం కుటుంబంగా కలిసి భోంచేసేలా ప్రతీ ఒక్కరినీ ఆపేది. మేము ఆ రోజు చేసిన పనులను గురించి మాట్లాడుకునేవాళ్ళం దినవచనాన్ని సమీక్షించేవాళ్ళం, సమస్యల గురించి మాట్లాడుకునేవాళ్ళం, అందరం కలిసి సమయాన్ని సరదాగా గడిపేవాళ్ళం. మా కుటుంబ సంతోషానికి ఈ దినచర్య ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉందో నేను నొక్కిచెప్పాల్సిన అవసరం లేదు.”

ఈ చర్యను సమర్థవంతంగా అమలుచేసేందుకు, కుటుంబ దినచర్యను ఏర్పాటుచేసి, దానిని కొనసాగించకుండా వస్తు సంపదల ఆర్జన మిమ్మల్ని అడ్డుకునేందుకు అనుమతించకండి. “శ్రేష్ఠమైన కార్యములను వివేచించగలవారిగా” ఉండండి అని బైబిలిస్తున్న సలహాను అన్వయించుకోండి.—ఫిలిప్పీయులు 1:9.

తమ పిల్లలతో ఎక్కువగా మాట్లాడేందుకు తల్లిదండ్రులు ఇంకా ఏమిచేయవచ్చు? (g 8/07)

[7వ పేజీలోని బ్లర్బ్‌]

“సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.” —1 కొరింథీయులు 14:39