కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ దగ్గర పెన్సిలుందా?

మీ దగ్గర పెన్సిలుందా?

మీ దగ్గర పెన్సిలుందా?

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

అది చౌకగా దొరుకుతుంది, దానిని వెంటనే ఉపయోగించవచ్చు, అది చాలా తేలికగా ఉంటుంది. అది చక్కగా జేబులో పడుతుంది. దానికి కరెంటు అవసరంలేదు, అదెప్పుడూ కారదు, దాని గుర్తులు ఇట్టే చెరిపేయవచ్చు. పిల్లలు దానితోనే రాయడం నేర్చుకుంటారు, నైపుణ్యవంతులైన కళాకారులు దానితో కళాఖండాలను సృష్టిస్తారు, మనలో చాలామంది నోట్స్‌ రాసుకోవడానికి దానిని మన దగ్గర ఉంచుకుంటాం. అదే ఒక మామూలు పెన్సిల్‌, అది ప్రపంచంలో అతి చౌకగా దొరకే, రాయడానికి విరివిగా ఉపయోగించబడే పరికరాల్లో ఒకటి. దాని ఆవిష్కరణ, వికాసానికి సంబంధించిన అద్భుతమైన కథ మారుమూల ఇంగ్లండ్‌లో దానిని యాదృచ్ఛికంగా కనుగొన్నప్పుడు మొదలైంది.

నల్ల సీసము

పదహారవ శతాబ్దంలో, ఉత్తర ఇంగ్లండ్‌లోని లేక్‌ డిస్ట్రిక్ట్‌లోవున్న బోరోడేల్‌ కొండప్రాంత దిగువ భాగానున్న లోయలో వింతైన నల్లటి పదార్థం అధిక పరిమాణంలో దొరికింది. ఆ పదార్థం బొగ్గులాగే కనిపించినా అది కాలలేదు, దానితో కాగితంలాంటి వాటిమీద గీస్తే, సులభంగా తుడిపేయగల మెరిసే నల్లటిరంగు ఏర్పడింది. ఆ ఖనిజం జిగటగా ఉంది కాబట్టి ప్రజలు దాని ముద్దల చుట్టూ గొర్రెతోలు చుట్టేవారు లేదా వాటి చిన్న చిన్న కడ్డీల చుట్టూ తాళ్లు చుట్టేవారు. నల్లగా సన్నగావుండే సీసపు కడ్డీని చెక్కలో అమర్చాలనే ఆలోచన మొదట ఎవరికి వచ్చిందో ఎవరికీ తెలియదు, అయితే 1560లలో, ఆరంభ దశలోవున్న పెన్సిళ్లు యూరప్‌ ఖండాన్ని చేరుకున్నాయి.

కళాకారుల అవసరాలను తీర్చడానికి, నల్ల సీసపు త్రవ్వకాలు, ఎగుమతి కొంతకాలానికే ప్రారంభమయ్యాయి, 17వ శతాబ్దంలో దానిని అన్నిచోట్లా వాడడం మొదలుపెట్టారు. అదే సమయంలో, పెన్సిల్‌ తయారీదారులు మెరుగ్గా రాసే పెన్సిళ్లను తయారుచేయడానికి నల్ల సీసంతో ప్రయోగాలు చేశారు. బరోడేల్‌కు చెందిన నల్ల సీసం శుద్ధమైనది, దానిని సులభంగా సేకరించవచ్చు కాబట్టి దొంగల, దొంగ వ్యాపారస్థుల దృష్టి దానిమీదపడింది. ఆ సమస్యను అరికట్టడానికి, బ్రిటీష్‌ పార్లమెంటు 1752లో ఒక చట్టాన్ని అమలులోకి తెచ్చింది, ఆ చట్టం ప్రకారం, నల్ల సీనాన్ని దొంగతనం చేసేవారు కారాగారశిక్షను అనుభవిస్తారు లేదా దేశం నుండి బహిష్కరించబడి సుదూర ప్రాంతంలో కారాగారశిక్షను అనుభవిస్తారు.

నల్ల సీసం అసలు సీసమే కాదని, అది శుద్ధ కార్బన్‌కు చెందిన మృదువైన రూపమనే ఆశ్చర్యపరిచే విషయాన్ని స్వీడన్‌ రసాయన శాస్త్రవేత్త కార్ల్‌ డబ్ల్యూ. శాలా 1779లో కనుగొన్నాడు. పదేళ్ల తర్వాత జర్మన్‌ భూగర్భశాస్త్రజ్ఞుడు, అబ్రాహామ్‌ జి. వెర్నర్‌ ఈ ఖనిజానికి గ్రాఫిట్‌ అని పేరు పెట్టాడు, అది “రాయడానికి” అనే అర్థమున్న గ్రీకు పదమైన గ్రాఫెన్‌ నుండి వచ్చింది. అవును, వాటి పేరుకు విరుద్ధంగా లెడ్‌ పెన్సిళ్లలో (సీసము పెన్సిళ్లు) అసలు సీసమే ఉండదు!

పెన్సిళ్ల వికాసం

ఇంగ్లీషు గ్రాఫైట్‌, ఎలాంటి శుద్ధీకరణ ప్రక్రియ అవసరంలేకుండానే ఉపయోగించేంత శుద్ధంగా ఉంటుంది కాబట్టి, అనేక సంవత్సరాలు పెన్సిళ్ల తయారీ పరిశ్రమ దానినే ఉపయోగించాల్సి వచ్చింది. యూరప్‌లో నాసిరకం గ్రాఫైట్‌ దొరుకుతుంది కాబట్టి, అక్కడి పెన్సిల్‌ తయారీదారులు పెన్సిల్‌లోని సీసమును మెరుగుపర్చేందుకు ఉపయోగించే పద్ధతుల విషయంలో ప్రయోగాలు చేశారు. ఫ్రెంచ్‌ ఇంజినీర్‌ నీకోలా జాక్‌ కోంటా, పొడిచేయబడిన గ్రాఫైట్‌ను మట్టితో కలిపి, ఆ మిశ్రమాన్ని సన్నని కడ్డీల రూపంలో మలిచి, ఆ తర్వాత వాటిని కొలిమిలో కాల్చాడు. గ్రాఫైట్‌, మట్టి నిష్పత్తిని మార్చడం ద్వారా పేపరులాంటి వస్తువులమీద వివిధ ఛాయల్లో నల్లని రంగులను ఏర్పర్చే సీసములను ఆయన తయారుచేయగలిగాడు, ఆ ప్రక్రియ ఇప్పటికీ వాడుకలో ఉంది. కోంటా తాను కనుగొన్న విషయానికి సంబంధించిన పెటెంట్‌ను 1795లో సొంతం చేసుకున్నాడు.

పంతొమ్మిదవ శతాబ్దంలో పెన్సిళ్ల తయారీ పెద్ద వ్యాపారమైంది. సైబీరియా, జర్మనీ, ఇప్పటి ఛెక్‌ రిపబ్లిక్‌లతోపాటు అనేక ప్రాంతాల్లో గ్రాఫైట్‌ను కనుగొన్నారు. జర్మనీలో, ఆ తర్వాత అమెరికాలో అనేక ఫ్యాక్టరీలు వెలిశాయి. యంత్రీకరణ, అధిక ఉత్పత్తివల్ల పెన్సిళ్ల ధరలు తగ్గుముఖంపట్టాయి, 20వ శతాబ్ద ఆరంభానికల్లా పాఠశాల విద్యార్థులు కూడా పెన్సిళ్లను వాడడం మొదలుపెట్టారు.

ఆధునిక పెన్సిల్‌

ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పెన్సిళ్లు ఉత్పత్తి చేయబడుతున్నాయి కాబట్టి అవి మెరుగుపర్చబడిన పరికరంగా, రాసేందుకు, చిత్రాలు గీసేందుకు అనేక విధాలుగా ఉపయోగించబడే పరికరంగా తయారైంది. ఒక సాధారణ చెక్క పెన్సిల్‌ దాదాపు 56 కిలోమీటర్ల పొడవున్న గీతను గీయగలదు, 45,000 పదాలను రాయగలదు. మెకానికల్‌ పెన్సిళ్లలో ఎప్పుడూ చెక్కాల్సిన పనిలేకుండా అనేక సన్నని సీసపు పుల్లలు ఉంటాయి. కలర్‌ పెన్సిళ్లలో, గ్రాఫైట్‌కు బదులు అనేక రంగుల్లో అందుబాటులో ఉన్న అద్దకపు రంగులు, వర్ణద్రవ్యాలు ఉపయోగించబడతాయి.

అనేక విధాలుగా ఉపయోగపడే, గట్టిదైన, నిరాడంబరమైన, సమర్థవంతమైన సామాన్య పెన్సిల్‌ తెరమరుగయ్యే సూచనలు కనిపించడంలేదు. కాబట్టి, భవిష్యత్తులో కూడా, ఇంట్లో గానీ పనిచేసే చోట గానీ మిమ్మల్ని ఎవరైనా ఇలా అడగవచ్చు, “మీ దగ్గర పెన్సిలుందా?” (g 7/07)

[19వ పేజీలోని బాక్సు/చిత్రం]

సన్నని సీసపు కడ్డీని పెన్సిళ్లలో ఎలా అమరుస్తారు?

మెత్తగా చేయబడిన గ్రాఫైట్‌, మట్టి, నీళ్లతో కూడిన మిశ్రమాన్ని సన్నని లోహపు ట్యూబులో పెడతారు, దాన్ని బయటకు తీసినప్పుడు అది బలమైన సన్నని సీసపు కడ్డీలా కనిపిస్తుంది. దానిని ఎండబెట్టి, ముక్కలుగా కోసి, కొలిమిలో కాల్చిన తర్వాత ఆ సీసపు కడ్డీని వేడి నూనెలో, మైనంలో ముంచుతారు. సాధారణంగా సులభంగా చెక్కగల దేవదారు చెక్కనే పెన్సిళ్లకు ఉపయోగిస్తారు. ఆ చెక్కను పెన్సిల్‌ మందంలో సగభాగం ఉండేలా సన్నని పలకలుగా కోస్తారు, వాటిని నున్నగా చేసి వాటికి గాళ్లు తొలుస్తారు. ఆ తర్వాత, సన్నని సీసపు కడ్డీలను ఒక పలకకున్న గాళ్లలో అమర్చి, రెండవ అర్థభాగాన్ని మొదటి పలకపై అతికిస్తారు. అది అతుకున్న తర్వాత ఆ పలకలను పెన్సిళ్లుగా కోస్తారు. వాటిని ఒక ఆకృతిలో కోసి, సాండ్‌ పేపరుతో నున్నగా చేసి, వాటికి పేయింటు వేసి వాటిమీద ఉత్పత్తిదారుని ముద్ర, మరితర వివరాలను ముద్రించిన తర్వాత రెండు పలకలు అతికించిన ఆనవాలు కనిపించని పెన్సిల్‌ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. కొన్నిసార్లు దాని పైభాగంలో ఎరేజర్‌ను కూడా అమరుస్తారు.

[చిత్రసౌజన్యం]

Faber-Castell AG

[20వ పేజీలోని బాక్సు/చిత్రం]

నేను ఏ పెన్సిల్‌ వాడాలి?

మీకు కావాల్సిన పెన్సిల్‌ను ఎంపికచేసుకోవడానికి పెన్సిల్‌మీద ముద్రించబడిన అక్షరాలను లేదా సంఖ్యలను చూడండి. అవి సీసము ఎంత గట్టిదో లేదా ఎంత మెత్తదో సూచిస్తుంది. మెత్తటి సీసముతో రాస్తే పేపరుమీద మరింత నల్లని గుర్తులు ఏర్పడతాయి.

హెచ్‌బి అనేక విధాలుగా ఉపయోగించగలిగే మధ్యశ్రేణి సీసము

బి మెత్తటి సీసమును సూచిస్తోంది. 2బి లేదా 6బి సీసము ఎంతవరకు మెత్తగా ఉందో సూచిస్తోంది. సంఖ్య పెరిగేకొద్దీ సీసము మెత్తదనం పెరుగుతుంది.

హెచ్‌ గట్టి సీసమును సూచిస్తోంది. 2హెచ్‌, 4హెచ్‌, 6హెచ్‌ ఇలా సంఖ్య పెరిగే కొద్దీ సీసము గట్టిదనం పెరుగుతుంది.

ఎఫ్‌ అతిసన్నని సీసమును సూచిస్తోంది.

కొన్నిదేశాలు భిన్న విధానాలను ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు, అమెరికాలో రెండవ నంబరు పెన్సిల్‌ హెచ్‌బితో సమానం. ఆ విధానంలో సంఖ్య పెరిగే కొద్దీ సీసము గట్టిదనం పెరుగుతుంది.