కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మాదిరి ద్వారా నేర్పించండి

మీ మాదిరి ద్వారా నేర్పించండి

చర్య 7

మీ మాదిరి ద్వారా నేర్పించండి

ఈ చర్య ఎందుకు తీసుకోవాలి? ఎలా ప్రవర్తించాలో ఒకరి ప్రవర్తన ఇతరులకు నేర్పిస్తుంది. మాటలు తరుచూ సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ పిల్లలకు మర్యాదస్థులుగా ఉండాలని, నిజమే మాట్లాడాలని చెబుతుండవచ్చు. అయితే, ఆ తల్లిదండ్రులే ఒకరిమీద ఒకరు అరుచుకుంటే లేదా పిల్లలమీద అరిచి, బాధ్యతను తప్పించుకునేందుకు అబద్దాలు చెబితే, పెద్దవారు ఇలాగే ప్రవర్తించాలని తమ పిల్లలకు నేర్పించినవారవుతారు. తల్లిదండ్రులను అనుకరించడం “పిల్లలు నేర్చుకునే శక్తివంతమైన విధానాల్లో ఒకటి” అని గ్రంథకర్తైన డాక్టర్‌ సివీర్‌ చెబుతున్నాడు.

అది ఎందుకు కష్టం? తల్లిదండ్రులు అపరిపూర్ణులు. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమీయులు 3:23) మన మాటలను అదుపులో ఉంచుకునే విషయాన్ని గురించి శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “యే నరుడును నాలుకను సాధుచేయ నేరడు.” (యాకోబు 3:8) అంతేకాక, సాధారణంగా తల్లిదండ్రుల ఓపికను పిల్లలు పూర్తిగా పరీక్షిస్తారు. స్వతహాగా మృదుస్వభావి, నిదానస్థుడు, ఇద్దరి పిల్లలకు తండ్రి అయిన లారే ఇలా చెబుతున్నాడు: “నా పిల్లలు ఎంత సులభంగా నాకు కోపం తెప్పించగలరో చూస్తే నాకే ఆశ్చర్యమేస్తుంది.”

పరిష్కారం: సంపూర్ణంగా కాకపోయినా మంచి మాదిరిగా ఉండేందుకు కృషిచేయండి. కొన్నిసార్లు మీరు చేసే తప్పులను ఒక మంచి పాఠం నేర్పించేందుకు ఉపయోగించండి. ఇద్దరి పిల్లల తండ్రి అయిన క్రిస్‌ ఇలా చెబుతున్నాడు: “నా పిల్లలమీద కోపగించుకుంటే లేదా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వారిని బాధపెడితే, నేను నా తప్పును ఒప్పుకొని, క్షమాపణను అడుగుతాను. ఇది నా పిల్లలకు, తల్లిదండ్రులు కూడా తప్పులు చేస్తారని, మన ప్రవర్తనను మెరుగుపర్చుకునేందుకు మనందరం ప్రయత్నించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేర్పించింది.” ముందు ప్రస్తావించబడిన కోటాస్‌, ఇలా చెబుతున్నాడు: “నేనేం గమనించానంటే, నేను కోపపడినప్పుడు క్షమాపణ చెబుతాను కాబట్టి తప్పులు చేసినప్పుడు మా అమ్మాయిలు కూడా తమను క్షమించమని అడగడం నేర్చుకున్నారు.”

యెహోవా దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) అధికారంలో ఉన్న వ్యక్తి ఒకటి చెప్పి మరొకటి చేస్తే, అది బహుశా పెద్దలకు ఎంతగా చికాకు తెప్పిస్తుందో పిల్లలకు కూడా అంతే చికాకు తెప్పిస్తుంది. కాబట్టి, ప్రతీరోజు చివరన మిమ్మల్ని మీరు ఎందుకిలా ప్రశ్నించుకోకూడదు: రోజంతటిలో నేను ఒక్క మాటకూడా మాట్లాడివుండకపోతే, నా పిల్లలు, నా క్రియలను చూసి ఏ పాఠాలు నేర్చుకునేవారు? వారితో మాట్లాడేటప్పుడు ఈ పాఠాలేనా నేను వారికి నేర్పాంచాలనుకుంది? (g 8/07)

[9వ పేజీలోని బ్లర్బ్‌]

“ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?” —రోమీయులు 2:21

[9వ పేజీలోని చిత్రాలు]

తల్లి లేదా తండ్రి క్షమాపణ అడిగినప్పుడు, పిల్లవాడు కూడా అలాగే క్షమాపణ అడగడం నేర్చుకుంటాడు