కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వైద్యశాస్త్రానికి ప్రాముఖ్యమైన రీతిలో తోడ్పడ్డారు”

“వైద్యశాస్త్రానికి ప్రాముఖ్యమైన రీతిలో తోడ్పడ్డారు”

“వైద్యశాస్త్రానికి ప్రాముఖ్యమైన రీతిలో తోడ్పడ్డారు”

మెక్సికోలోని తేజరిల్లు! రచయిత

యెహోవాసాక్షులు రక్తరహిత చికిత్సా విధానాన్ని ఎన్నుకుంటారనే విషయం ప్రపంచవ్యాప్తంగా అందిరికీ తెలిసినదే. అయితే వారి బైబిలు ఆధారిత నిర్ణయాన్ని కొందరు విమర్శిస్తారు. అయినా, మెక్సికో నగరంలో అత్యధికంగా పంచిపెట్టబడుతున్న రిఫోర్మా అనే వార్తాపత్రికలో, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీలో చీఫ్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆంకల్‌ హెర్రీరా ఇలా వ్యాఖ్యానించారు: “సాక్షులు అజ్ఞానులు కాదు. అలాగని ఛాందసులూ కాదు. . . . వైద్య వృత్తిలో ఉన్నవారు రక్తాన్ని ఆదాచేయాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేయడం ద్వారా [వారు] వైద్యశాస్త్రానికి ప్రాముఖ్యమైన రీతిలో తోడ్పడ్డారు.”

పదిహేను సంవత్సరాల క్రితం డాక్టర్‌ హెర్రీరా, ఆనస్తీసియాలజిస్టులను (మత్తుమందు ఎక్కించే వైద్యులు), శస్త్రచికిత్స చేసే వైద్యులను ఒక జట్టుగా తయారుచేసి, వారంతా రక్తరహిత శస్త్రచికిత్సలు చేసేలా ఏర్పాటు చేశాడు. ఆ జట్టులోని ఒక ఆనస్తీసియాలజిస్ట్‌ డాక్టర్‌ ఇసిడ్రో మార్టినజ్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “సరైనవిధంగా మత్తుమందు ఎక్కిస్తే, రక్తాన్ని ఆదా చేసే పద్ధతులన్నింటినీ ఉపయోగించవచ్చు. కాబట్టి, యెహోవాసాక్షుల మతనమ్మకాలను గౌరవిస్తూ మనం వారికి నిజంగా సహాయం చేయవచ్చు.”

రక్తమార్పిడికి 30 కన్నా ఎక్కువ ప్రత్యామ్నాయాలున్నాయని రిఫోర్మా పత్రిక 2006 అక్టోబరులో నివేదించింది. వాటిలో రక్తనాళాలను కాటరైజ్‌ చేయడం (దహణీకరణ), రక్తస్రావాన్ని అరికట్టే రసాయనాలను వదిలే ప్రత్యేక గాజుగుడ్డతో అవయవాలను కప్పడం, వాల్యూమ్‌ ఎక్స్‌పాండర్స్‌ను (రక్తాన్ని పలచన చేసి రక్తప్రసరణను మెరుగుపర్చే ద్రావకాలు) ఉపయోగించడం కొన్ని మాత్రమే. *

మెక్సికోలోని లారాజా జనరల్‌ హాస్పిటల్‌లో చీఫ్‌ హార్ట్‌ సర్జియన్‌గా (హృద్రోగ శస్త్రచికిత్సా నిపుణుడు) పనిచేస్తున్న డాక్టర్‌ మోయ్‌సెస్‌ కాల్డెరాన్‌ ఎప్పుడూ రక్తరహిత శస్త్రచికిత్స చేయడానికే ప్రయత్నిస్తాడు. ఆయన రిఫోర్మా పత్రికలో ఇలా తెలియజేశాడు: “రక్తమార్పిడి సురక్షితమైన పద్ధతి కాదు. అందులో రోగకారక వైరస్‌లను, సూక్ష్మక్రిములను, పరాన్నజీవులను సంక్రమింపజేసే ప్రమాదముంది. అంతేకాక, రక్తమార్పిడివల్ల మూత్రపిండాల, ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపించగల ఎలర్జీ సంబంధిత ప్రతిచర్యలు సంభవించవచ్చు.” ఆ ప్రమాదాలున్నాయి కాబట్టే డాక్టర్‌ కాల్డెరాన్‌ ఇలా అన్నాడు: “రోగులందరూ యెహోవాసాక్షులన్నట్లే మేము శస్త్రచికిత్స చేస్తాం. రక్తస్రావాన్ని అరికట్టేందుకు, కోల్పోయిన రక్త పరిమాణాన్ని తిరిగి పెంచేందుకు, రక్తస్రావం తక్కువగా ఉండేందుకు సహాయపడే మందులు వాడడానికి మేము శాయశక్తులా ప్రయత్నిస్తాం.”

యెహోవాసాక్షుల నిర్ణయానికి ఆధారమైన అపొస్తలుల కార్యములు 15:28, 29 వచనాలను ఆ వార్తాపత్రిక ఉదాహరించింది. ఆ వచనాల్లో అపొస్తలులు ఈ క్రింది ఆదేశాన్ని జారీచేశారు: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను.”

మెక్సికోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో ఉండే హాస్పిటల్‌ ఇన్‌ఫర్మేషన్‌ డెస్క్‌ (HIS) ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆ దేశంలో ఉన్న 75 ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లోని 950 మంది స్వయం సేవకులు వైద్యులను సందర్శించి రక్తానికి ప్రత్యామ్నాయాల గురించిన సమాచారం అందజేస్తూ ఉంటారు. మెక్సికోలో దాదాపు 2,000 మంది వైద్యులు యెహోవాసాక్షులకు రక్తరహిత చికిత్స చేయడానికి సుముఖంగా ఉన్నారు. వైద్యులు ఇప్పుడు సాక్షులు కాని వారికి కూడా మరింత మెరుగైన చికిత్స చేసే స్థితిలో ఉన్నారు. సాక్షులు ఆ వైద్యుల సహకారానికి నిజంగా కృతజ్ఞత కలిగివున్నారు. (g 9/07)

[అధస్సూచి]

^ వైద్యాన్ని ఎంచుకోవడం ప్రతీఒక్కరి వ్యక్తిగత నిర్ణయం అనే విషయాన్ని గుర్తిస్తూ తేజరిల్లు! పత్రిక, రక్తరహిత వైద్యవిధానాల్లో దేనినీ ప్రత్యేకంగా సిఫారసు చేయడం లేదు.

[30వ పేజీలోని చిత్రం]

డాక్టర్‌ ఆంకల్‌ హెర్రీరా

[30వ పేజీలోని చిత్రం]

డాక్టర్‌ ఇసిడ్రో మార్టినజ్‌

[30వ పేజీలోని చిత్రం]

డాక్టర్‌ మోయ్‌సెస్‌ కాల్డెరాన్‌