సృష్టిలో అద్భుతాలు
గుర్రం కాలు
గుర్రాలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. అందుకు ఎంతో శక్తి అవసరం కానీ గుర్రాలు చాలా తక్కువ శక్తినే ఉపయోగిస్తాయి. ఎలానో ఇప్పుడు చూద్దాం.
పరుగెత్తడానికి కాలు నేలమీద వేసినప్పుడు శక్తంతా కాలుపై పడుతుంది. సాగే గుణం ఉన్న కండరం, టెండాన్ (కండను ఎముకకు పట్టి ఉంచే నరం లాంటి పదార్థం లేదా స్నాయుబంధకం) కలిసిన భాగం ఆ శక్తిని తీసుకుంటుంది. తీసుకున్న శక్తిని స్ప్రింగ్‌లా తిరిగి ఇస్తూ గుర్రాన్ని ముందుకు నెడుతుంది.
గుర్రం వేగంగా పరుగెత్తుతున్నప్పుడు కాళ్లు గట్టిగా ఊగిపోతాయి. అలాంటప్పుడు టెండాన్లు దెబ్బతినవచ్చు. కానీ కాళ్లలో ఉన్న కండరాలు మెత్తదనాన్నిచ్చి టెండాన్లను కాపాడుతాయి. టెండాన్లు కండరాలు కలిసి గుర్రం బలంగా వేగంగా పరుగెత్తడానికి సహాయం చేస్తాయి. ఈ రెండిటి పనితీరు అద్భుతంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
ఇంజనీర్లు గుర్రం కాళ్లను చూసి నాలుగు కాళ్ల రోబోలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడున్న వస్తువులతో, ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో అంత బాగా పనిచేసే కాళ్లను చేయడం చాలా కష్టమని మాసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని బయోమిమెటిక్స్ రోబోటిక్స్ లాబొరేటరీ అభిప్రాయం.
మీరేమంటారు? అంత బాగా పనిచేసే గుర్రం కాలు ఎవరూ చేయకుండా, దానంతటదే వచ్చిందా? ◼ (g14-E 10)