కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవమత సామ్రాజ్యం ఎలా ఈ లోకంలో భాగమయ్యింది

క్రైస్తవమత సామ్రాజ్యం ఎలా ఈ లోకంలో భాగమయ్యింది

క్రైస్తవమత సామ్రాజ్యం ఎలా ఈ లోకంలో భాగమయ్యింది

ఏ రోమా సామ్రాజ్యంలో తొలి క్రైస్తవత్వం ప్రారంభమయ్యిందో ఆ రోమా సామ్రాజ్యం చివరికి పతనమయ్యింది. అనేకమంది చరిత్రకారులు దాని పతనాన్ని అన్యమతముపై క్రైస్తవత్వంయొక్క తుది విజయమనికూడా చెబుతుంటారు. అయితే అందుకు భిన్నమైన దృక్పథాన్ని వ్యక్తపరస్తూ ఆంగ్లికన్‌ బిషప్‌ ఇ. డబ్లు. బార్న్స్‌ ఇలా వ్రాశాడు: “మెరుగైన సంస్కృతి పతనముకాగా క్రైస్తవత్వము క్రీస్తుయేసుయొక్క శ్రేష్ట విశ్వాసమునుండి వైదొలగింది: చెల్లాచెదురవుతున్న లోకాన్ని బిగించివుంచే సాంఘిక బంధంగా అది తయారయ్యింది.”—ది రైజ్‌ ఆఫ్‌ క్రిష్టియానిటి.

అలా పతనము కాకముందు, సామాన్య శకము రెండు, మూడు, నాల్గవ శతాబ్దములందు యేసును అనుసరిస్తున్నామని చెప్పుకొన్నవారు అనేక రీతులలో లోకానికి వేరైయున్నట్లు చరిత్ర తెలుపుతుంది. అయితే యేసు ఆయన అపొస్తలులు చెప్పినట్లు సిద్ధాంతములోను, ప్రవర్తనలోను, సంస్థలోను మతభ్రష్టత్వముకూడా చోటుచేసుకుందని అది తెల్పుతుంది. (మత్తయి 13:36-43; అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 థెస్సలొనీకయులు 2:3-12; 2 తిమోతి 2:16-18; 2 పేతురు 2:1-3, 10-22) క్రమక్రమంగా గ్రీకు రోమను లోకంతో రాజీపడుతూ, క్రైస్తవులమని చెప్పుకొన్న కొందరు లోక అన్యమతమును, (దాని పండుగలు, మాతృ దేవతారాధన, త్రిత్వ దేవారాధన) దాని వేదాంతాన్ని, (ఆత్మ అమర్త్యమైనదను నమ్మకాలు మొదలగునవి) దాని పరిపాలనా పద్ధతులను (మతగురువుల తరగతి కనపడే తీరు) అవలంబించ మొదలు పెట్టారు. కలుషితమైన ఈ క్రైస్తవ విధానమే అన్యమతములలోని సామాన్య జనసందోహాన్ని ఆకర్షించింది. శక్తివంతంగా తయారైన దీనిని మొదట రోమా చక్రవర్తులు నిర్మూలించ ప్రయత్నించారు. అయితే చివరకు దానిద్వారా వారి గమ్యాలను నెరవేర్చుకోడానికి దానితో ఏకీభవించారు.

లోకముచే జయించబడింది

చర్చి చరిత్రకారుడు ఆగస్టస్‌ నియాండర్‌ “క్రైస్తవత్వమునకు,” లోకమునకు మధ్య ఏర్పడిన ఈ కొత్త సంబంధంలోని ప్రమాదాలను చూపించాడు. క్రైస్తవులు లోకమునకు వేరైయుండు వారి ప్రత్యేకతను త్యాగము చేసినట్లయితే, “తత్ఫలితంగా చర్చి లోకముతో కలగలిసిపోయి, . . . తద్వారా దాని పవిత్రతను కోల్పోతుంది, అది లోకాన్ని జయిస్తున్నట్లు కనిపించినా, అనుకొన్నా, లోకముతో అదే జయించబడుతుంది” అని వ్రాశాడు.—జనరల్‌ హిస్టరీ ఆఫ్‌ ది క్రిష్టియన్‌ రిలీజియన్‌ అండ్‌ చర్చ్‌, వాల్యూమ్‌ 2, పేజి 161.

జరిగిన సంగతి అదే. నాలుగవ శతాబ్దపు తొలి భాగంలో రోమా చక్రవర్తియైన కాన్‌స్టంటైన్‌, చెదిరి పోతున్న తన సామ్రాజ్యమును చెదరిపోకుండా బంధించడానికి “క్రైస్తవత్వమును” ఉపయోగించ ప్రయత్నించాడు. దీనిని సాధించేందుకు ఆయన, నామకార్థ క్రైస్తవులకు మత స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. అన్యమతములోని పూజారుల ఆధిక్యతను, మతగురువులకు మార్చడాన్ని ప్రారంభించాడు. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా తెల్పుతుంది: “కాన్‌స్టంటైన్‌ లోకమునకు వేరైయున్న చర్చిని దానిలోనికి తీసుకువచ్చి, సాంఘిక బాధ్యతలను చేపట్టేలా చేసి, చర్చి అన్యమత సమాజమును జయించుటకు సహాయపడ్డాడు.”

ప్రభుత్వ మతము

కాన్‌స్టంటైన్‌ తర్వాత, జూలియన్‌ చక్రవర్తి (సా.శ 361-363) క్రైస్తవత్వమును వ్యతిరేకించి అన్యమతమును తిరిగి స్థాపించడానికి ప్రయత్నించి, దానిలో విఫలమయ్యాడు. అయితే, 20 సంవత్సరముల తర్వాత చక్రవర్తియైన థియోడొసియస్‌ I అన్యమతమును నిషేధించి, త్రిత్వసిద్ధాంతముతో కూడిన “క్రైస్తవత్వమును” ప్రభుత్వ మతంగా అమలుపరచాడు. ఫ్రెంచి చరిత్రకారుడైన ఎన్రీ మారూ నేర్పుతో ఇలా కచ్చితంగా వ్రాశాడు: “థియోడొసియస్‌ పరిపాలన ముగిసేనాటికి క్రైస్తవత్వం, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఆర్థడాక్స్‌ కాథోలికిజమ్‌ రోమా సామ్రాజ్యమంతటా ప్రభుత్వ మతంగా తయారయ్యింది.” ఆర్థడాక్స్‌ కాథోలిక్‌ మతము నిజ క్రైస్తవత్వం స్థానంలో చోటుచేసుకొన్నదై, “లోకంలో భాగమైపోయింది.” ఈ ప్రభుత్వ మతము యేసు తొలి అనుచరుల మతమునకు పూర్తిగా భిన్నమైయుండెను. యేసు వారిని గూర్చి ఇలా చెప్పాడు: “మీరు లోక సంబంధులు కారు.”—యోహాను 15:19.

ఫ్రెంచి చరిత్రకారుడు వేదాంతియైన లూయిస్‌ రూజ్యా ఇలా వ్రాశాడు: “క్రైస్తవత్వం వ్యాపించేకొలది, దానిని గుర్తించలేనంతరీతిగా అది మార్పులకు లోనైంది. పేదలతో ఏర్పడి, దాతృత్వంపై మనుగడ సాగించిన తొలి చర్చి, ఆపజాలనంతగా జయించేదై, అప్పుడున్న లౌకిక అధికారాలపై ఆధిపత్యం చేయలేనప్పుడు వారితో పూర్తి సంబంధాలను నెలకొల్పుకున్నది.”

సామాన్య శకము అయిదవ శతాబ్దం మొదటి భాగంలో రోమను కాథోలిక్‌ “సెయింట్‌” ఆగస్టీన్‌ తన ది సిటి ఆఫ్‌ గాడ్‌ అనే పుస్తకాన్ని వ్రాశాడు. దానిలో ఆయన రెండు పట్టణాలను వర్ణించాడు. అవి “ఒకటి దేవునిది, రెండవది లోకానిది.” ఆయన పుస్తకము కాథోలిక్కులకు మరియు లోకానికి మధ్యనున్న వేర్పాటును ప్రముఖంగా తెల్పిందా? నిజంగా అలా చేయలేదు. ప్రొఫెసర్‌ లాటురేట్‌ తెల్పుతున్న ప్రకారం: “ఈ రెండు పట్టణములు, భూలోక సంబంధమైనది, పరలోక సంబంధమైనది ఒకదానితోనొకటి ముడిపడియున్నవని ఆగస్టీన్‌ బాహాటంగా గుర్తించెను.” “కాథోలిక్‌ చర్చి ప్రారంభముతో దేవుని రాజ్యము అప్పటికే లోకములో ఆరంభమైనదని” ఆగస్టీన్‌ బోధించాడు. (ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా మాక్రోపీడియా, వాల్యూమ్‌ 4, పేజి 506) తద్వారా, ఆగస్టీన్‌ తొలి ఉద్దేశము ఏదైనప్పటికి, ఆయన సిద్ధాంతాలు మాత్రం కాథోలిక్‌ చర్చి పూర్తిగా లోక రాజకీయవ్యవహారాలల్లో నిమగ్నమైపోయేలా ప్రభావం చూపినవి.

విభాగించబడిన సామ్రాజ్యము

సామాన్య శకము 395లో థియోడొసియస్‌ I మరణించినప్పుడు రోమా సామ్రాజ్యము రెండుగా విడిపోయింది. తూర్పు లేక బైజాంటైన్‌ సామ్రాజ్యము కాన్‌స్టాంటినోపుల్‌ను (మునుపు బైజాంటియమ్‌; ఇప్పుడు ఇస్తానబుల్‌) దాని రాజధానిగా ఏర్పరచుకొనగా, పశ్చిమ సామ్రాజ్యం మాత్రం (సా.శ. 402 తరువాత) ఇటలీలో రావెన్నాను రాజధానిగా చేసుకొన్నది. ఫలితంగా క్రైస్తవమత సామ్రాజ్యం రాజకీయంగా, మతపరంగా కూడా విడిపోయింది. ప్రభుత్వము మరియు చర్చి సంబంధాల విషయానికొస్తే, తూర్పు సామ్రాజ్యములోని చర్చి కైసరయ వాడైన యుసేబియస్‌ (కాన్‌స్టంటైన్‌ ది గ్రేట్‌ సమకాలికుడు) సిద్ధాంతాన్ని అనుసరించింది. యుసేబియస్‌ లోకమునకు వేరై ప్రత్యేకంగా ఉండవలసిన క్రైస్తవ సూత్రమును అలక్ష్యపరుస్తూ, చక్రవర్తి, సామ్రాజ్యము క్రైస్తవులైనప్పుడు, చర్చి మరియు ప్రభుత్వము ఒకే క్రైస్తవ సామ్రాజ్యమవుతుంది, చక్రవర్తి భూమి మీద దేవుని ప్రతినిధిగా వ్యవహరిస్తాడు అని తర్కించాడు. ఎక్కువగనో తక్కువగనో చర్చి మరియు ప్రభుత్వమునకు మధ్యనున్న ఈ సంబంధము తదుపరి శతాబ్దములపాటు ఈస్టర్న్‌ ఆర్థడాక్స్‌ చర్చీలవలన అనుకరించబడింది. ది ఆర్థడాక్స్‌ చర్చ్‌ అను తన పుస్తకంలో ఆర్థడాక్స్‌ బిషప్పైన తిమోతి వేర్‌ దాని ఫలితాన్ని చూపాడు. “గత పది శతాబ్దాలుగా జాతీయతా భావము ఆర్థడాక్స్‌కి హానికరమైన విషయంగా తయారయ్యింది.”

పశ్చిమ ప్రాంతములో సా.శ. 476లో చివరి రోమను చక్రవర్తి జర్మను తెగల ముట్టడితో సింహాసన భ్రష్టుడయ్యాడు. దానితో పశ్చిమ రోమా సామ్రాజ్యము అంతమైపోయింది. ఆ రాజకీయ శూన్యతస్థానంలో చోటుచేసుకున్న దానిని వివరిస్తూ ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానిక ఇలా తెలియపరస్తుంది: “ఒక నూతన అధికారము అంకురించింది. రోమను చర్చి, రోము బిషప్పు చర్చిగా మారింది. ఈ చర్చి తనమట్టుకు తాను అంతరించిపోయిన రోమా సామ్రాజ్యమునకు వారసురాలిగా భావించిది.” ఇంకా ఈ ఎన్‌సైక్లోపీడియా తెల్పుతున్నదేమనగా: “రోమను పోపులు చర్చియొక్క లౌకిక ప్రభుత్వ అధికారమును చర్చి రాష్ట్రపు సరిహద్దువరకే పరిమితిచేయక రెండు ఖడ్గాలనే ఒక సిద్ధాంతాన్ని రూపించుకున్నారు. దాన్నిబట్టి వారు క్రీస్తు పోపుకు చర్చిపై ఆత్మీయ అధికారమేగాక, ప్రపంచ రాజ్యాలపై లౌకిక అధికారాన్ని కూడా యిచ్చాడనటం ప్రారంభించారు.”

జాతీయ ప్రొటెస్టెంటు చర్చీలు

మధ్యయుగాలన్నిటిలో, ఆర్థడాక్స్‌ మరియు రోమను కాథోలిక్‌ చర్చీలు భారీగా రాజకీయములోను, లోక పోరాటములలోను, యుద్ధాలలోను మునిగిపోవడాన్ని కొనసాగించాయి. మరి 16 శతాబ్దమునాటి ప్రొటెస్టెంటు మతోద్ధారణ లోకమునకు వేరైయుండే నిజ క్రైస్తవత్వమును మరలా ఏర్పరచగలిగిందా?

లేదు. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికాలో మనమిలా చదువుదుము: “ప్రొటెస్టెంట్‌ మతోద్ధారణకు ఏర్పరచిన లూథరన్‌, కల్వనిస్ట్‌, ఆంగ్లికన్‌ ఆచారాలు . . . స్థిరంగా ఆగస్టీన్‌ దృక్పథాలకే కట్టుబడియుండెను. వారు ఆయన వేదాంతముతో తమకు ప్రత్యేక సంబంధ సారూప్యమున్నదని భావించారు. . . . ఐరోపాలో 16వ శతాబ్దములో బయలుదేరిన ముఖ్యమూడు ప్రొటెస్టెంట్‌ సాంప్రదాయాలు సాక్సోని (మధ్య జర్మనీ), స్విట్జర్లాండు మరియు ఇంగ్లాండు నుండి మద్దతును పొందాయి. ప్రభుత్వముతో గల సంబంధంలో మధ్యయుగమునాటి చర్చి స్థానాన్నే అనుసరించాయి.”

నిజమైన క్రైస్తవత్వమునకు తిరిగివెళ్లే బదులు, ఈ ఉద్యమం రాజకీయ ప్రభుత్వాల మన్ననను కోరి, వాటికి యుద్ధాలలో చురుకుగా మద్దతునిచ్చే అనేక జాతీయ, ప్రాంతీయ చర్చీలను ఉత్పన్నము చేసింది. వాస్తవానికి కాథోలిక్‌ మరియు ప్రొటెస్టెంట్‌ చర్చీలు మతయుద్ధాలకు ఆజ్యం పోశాయి. ఆర్నాల్డ్‌ టోన్‌బీ యాన్‌ హిస్టోరియన్స్‌ అప్రోచ్‌ టు రిలిజియన్‌ అను తన పుస్తకంలో ఆలాంటి యుద్ధాల గూర్చి ఇలా వ్రాశాడు: “ఫ్రాన్సు, నెదర్‌లాండ్స్‌, జర్మనీ, ఐర్లాండులోని కాథోలిక్కు, ప్రొటెస్టెంటులను మరియు ఇంగ్లాండు, స్కాట్‌లాండ్‌ లోని ప్రొటెస్టెంటు విద్వేషపూరిత గుంపులు, ఒకరిని మరొకరు అణచివేయుటకు సాయుధములతో చేసిన క్రూర ప్రయత్నములను అవి బహిర్గతము చేసాయి.” ప్రస్తుతం ఐర్లాండు, మునుపటి యుగోస్లేవియాను విభాగింపజేసే పోరాటాలు రోమను కేథలిక్‌, ఆర్థడాక్స్‌, ప్రొటెస్టెంట్లు చర్చీలు పూర్తిగా లోక వ్యవహారాల్లో ఇప్పటికీ నిమగ్నమైయున్నాయని చూపుతున్నవి.

అయితే వీటన్నిటి భావము, లోకమునుండి వేరై ప్రత్యేకంగా వున్న నిజ క్రైస్తవత్వం భూమిపై ఏ మాత్రము లేదనా? తదుపరి శీర్షిక ఆ ప్రశ్నకు జవాబిస్తుంది.

[Box/Picture on page 10, 11]

“క్రైస్తవత్వము” ఎలా ప్రభుత్వ మతంగా మారింది

క్రైస్తవత్వము లోకంలో భాగమయ్యే ఉద్దేశ్యము ఎప్పుడూ లేదు. (మత్తయి 24:3, 9; యోహాను 17:16) అయినా, సా.శ. నాలుగవ శతాబ్దములో “క్రైస్తవత్వము” రోమా సామ్రాజ్యము యొక్క ప్రభుత్వ మతంగా మారిందని చరిత్ర పుస్తకాలు తెల్పుతున్నవి. ఇది ఎలా సంభవించింది?

నీరో చక్రవర్తి నుండి (సా.శ. 54-68) మూడవ శతాబ్దం వరకు రోమా చక్రవర్తులందరు క్రైస్తవులను హింసించడంలో చురుగ్గా పాల్గొనడం, లేక హింసను అనుమతించడం జరిగింది. వారియెడల సహనము చూపించడానికి మొదలుపెట్టినవారిలో మొదటి రోమా చక్రవర్తి గల్లీనియస్‌. (సా.శ. 253-268) అయినా అప్పటికి కూడా క్రైస్తవత్వం సామ్రాజ్యమంతటిలో బహిష్కరించబడిన మతంగానే ఉన్నది. గల్లీనియస్‌ తర్వాత మరలా హింస కొనసాగింది. ఆయన తదుపరి వచ్చిన డయోక్లేషియన్‌ (సా.శ. 284-305) మరియు తదుపరి వారిచే అది ఇంకా ఉద్రిక్తమయ్యింది కూడా.

కాని నాలుగవ శతాబ్దం తొలి భాగంలో చక్రవర్తియైన కాన్‌స్టంటైన్‌ I ఏదో నామకార్థంగా మతమార్పిడి చేసుకొన్నపుడు అందులో గొప్ప మలుపు సంభవించింది. ఈయన “మతమార్పును” గూర్చి థియో-న్యూవెల్‌ ఎన్‌సైక్లోపీడి కాథోలిక్‌ ఇలా చెబుతుంది: “కాన్‌స్టంటైన్‌ క్రైస్తవ చక్రవర్తిగా చెప్పుకున్నాడు. కాని వాస్తవానికి ఆయన మరణశయ్యమీద బాప్తిస్మము తీసుకొన్నాడు.” అయినా సా.శ. 313లో కాన్‌స్టంటయిన్‌ మరియు అతని సహచక్రవర్తి లిసినియస్‌ క్రైస్తవులకు అన్యులకు ఒకే విధమైన స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించారు. ది న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లొపీడియా ఇలా అంటుంది: “కాన్‌స్టంటయిన్‌ క్రైస్తవులకు స్వేచ్ఛారాధనను ఇవ్వడం, అన్యమతంతో పాటు ఆయన దీనిని అధికారపూర్వకంగా గుర్తించడంతో క్రైస్తవ మతమును చట్టపరంగా రిలిజియోలికిటా (చట్టపరమైన మతము) గుర్తించడం జరిగింది. నిజంగా ఇది విప్లవాత్మక చర్యే.”

ఏమైనను ది న్యూ ఎన్‌ క్లోపీడియా బ్రిటానికా ఇలా తెల్పుతుంది: “ఆయన [కాన్‌స్టంటైన్‌] క్రైస్తవత్వమును సామ్రాజ్య మతంగా చేయలేదు.” ఫ్రెంచి చరిత్రకారుడు, ఫ్రాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ సభ్యుడు జాన్‌రెమీపలాంక్‌ ఇలా వ్రాస్తున్నాడు: “రోమా ప్రభుత్వము అధికార పూర్వకంగా అన్యమతంగానే నిలిచింది. కాన్‌స్టంటైన్‌ క్రీస్తుమతమును పుచ్చుకొన్నపుడు, ఆయన అన్యమత పరిస్థితిని అంతమొనర్చలేదు.” లీగసీ ఆఫ్‌ రోమ్‌లో, ప్రొఫెసర్‌ ఎర్నెస్ట్‌ బార్కర్‌ ఇలా అన్నాడు: “కాన్‌స్టంటైన్‌ విజయము వెంటనే క్రైస్తవమతము ప్రభుత్వ మతమయ్యేలా నడపలేదు. ఆ సామ్రాజ్యములో క్రైస్తవత్వముకూడా ఒక బహిరంగ ఆరాధనగా గుర్తించుటతోనే ఆయన సంతృప్తిచెందాడు. తదుపరి 70 సంవత్సరాల వరకు పూర్వపు అన్యాచారములు అధికారపూర్వకంగానే రోమాలో కొనసాగాయి.”

ఈ సమయానికి రోమా సామ్రాజ్యములో “క్రైస్తవత్వము” చట్టసమ్మతమైన మతంగా ఉన్నది. ఎప్పుడు దాని పూర్తి భావంలో అధికార పూర్వకంగా ప్రభుత్వ మతంగా మారింది? కాథోలిక్‌ ఎన్‌ సైక్లోపీడియాలో ఇలా చదువుతాము: “[కాన్‌స్టంటైన్‌] దృక్పథం తన తదుపరి వారసులలో ఒక్క జూలియన్‌ [సా.శ. 361-363] కాలంలో తప్ప మిగతా కాలంలో కొనసాగింది. జూలియన్‌ మరణించడంతో క్రైస్తవులపై జరుగుతున్న హింసాకాండ ఒక్కసారిగా ఆగిపోయింది. చివరకు నాలుగవ శతాబ్దపు ఆకరు నాల్గవ భాగంలో థియోడిసియస్‌ దిగ్రేట్‌ [సా.శ. 379-395] క్రైస్తవమతము ప్రభుత్వ మతంగా చేసి అన్యారాధనను అణచివేశాడు.”

ఈ విషయాన్ని స్థిరపరస్తూ, ఈ ప్రభుత్వ మతమేమైయుందో వివరిస్తూ, బైబిలు విద్వాంసుడు, చరిత్రకారుడైన యఫ్‌. జె. ఫోక్స్‌ జాక్సన్‌ ఇలా వ్రాశాడు: “కాన్‌స్టంటైన్‌ కాలంలో క్రైస్తవత్వం రోమా సామ్రాజ్యము స్నేహపూర్వకంగా ఉన్నాయి. థియోడొసియస్‌ కాలంలో అవి ఐక్యమయ్యాయి. . . . అప్పటినుండి కాథోలిక్‌ అనే బిరుదు తండ్రి, కుమారుడు, పరిశుద్ధ్మాత సమానమైవని పూజించేవారికే చెందింది. ఈ చక్రవర్తి పూర్తిగా ఇదే మత విధానంపై దృష్టి కేంద్రీకరించాడు. తద్వారా కథోలిక్‌ విశ్వాసము రోమీయుల చట్టబద్ధమైన మతంగా మారింది.”

జీన్‌-రెమీ పలాంక్‌ ఇలా వ్రాశాడు: “థియోడొసియస్‌ అన్యమతముతో పోరాటము సల్పుతూనే ఆర్థడాక్స్‌ [కాథోలిక్‌] చర్చికి అనుకూలంగా మారాడు. సా.శ 380లో తన రాజ్యములోనున్నవారంతా పోప్‌ డమసస్‌, మరియు (త్రిత్వ సంబంధమైన) బిషప్‌ అలెగ్జాండ్రియా విశ్వాసంతో ఏకీభవించాలని ఆజ్ఞాపించాడు. సమ్మతించని వారికి స్వేచ్ఛారాధన లేకుండా చేశాడు. కాన్‌స్టాంటినోపుల్‌లో జరిగిన పెద్ద సభలో కూడా భిన్నమైన మతాన్ని చేపట్టడాన్ని ఖండించారు. ఏ బిషప్పుకూడా భిన్నమతస్థులను బలపరచకుండా చేశాడు. నైసియా [త్రిత్వసంబంధమైన] క్రైస్తవత్వం నిజంగా ప్రభుత్వ మతంగా తయారయ్యింది. చర్చి ప్రభుత్వముతో సన్నిహితంగా ఐక్యమై, దాని మద్దతును పూర్తిగా పొందింది.”

ఆ విధంగా అపొస్తలులనాటి స్వచ్ఛమైన క్రైస్తవత్వముగాక, కలుషితమైన క్రైస్తవత్వమే రోమా సామ్రాజ్యపు ప్రభుత్వ మతంగా తయారయ్యింది. కాబట్టి చక్రవర్తియైన థియోడొసియస్‌ I చే బలవంతముగా ప్రవేశపెట్టబడి ఆచరణలోనున్న నాలుగవ శతాబ్దపు త్రిత్వ సంబంధమైన కాథోలిక్కు మతమే అనగా, ఈనాటివలెనే ఆనాడే రోమను కాథోలిక్కు చర్చి నిజంగా లోకములో భాగమైయుంది.

[Credit Line]

Emperor Theodosius I: Real Academia de la Historia, Madrid (Foto Oronoz)

[Picture Credit Line on page 8]

Scala/Art Resource, N.Y.