కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిషేధాజ్ఞల క్రింద బైబిలు సాహిత్యాన్ని ముద్రించుట

నిషేధాజ్ఞల క్రింద బైబిలు సాహిత్యాన్ని ముద్రించుట

నిషేధాజ్ఞల క్రింద బైబిలు సాహిత్యాన్ని ముద్రించుట

మాల్కం జి. వేల్‌ చెప్పినది

“చిల్డ్రన్‌ పుస్తకాన్ని ముద్రించండి.” ఆగస్టు 10, 1941వ తేదిన అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌, మిస్సోరి నందు జరిగిన సమావేశములో ఆ పుస్తకము విడుదలైన కొద్ది కాలానికే, రెండవ ప్రపంచ యుద్ధకాలమందు ఆస్ట్రేలియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి ఓవర్‌సీర్‌ నుండి నేను అట్టి విస్మయమొందించు ఆదేశాన్ని పొందాను. ఎందుకది విస్మయమైన ఆదేశం?

ఎందుకంటే, జనవరి 1941లో మా ప్రచారపు పని నిషేధించబడింది, కనుక కొద్దిగానైనా ముద్రించాలంటే సవాలుతోకూడిన పనే. దానికితోడు, చిల్డ్రన్‌ అనే ఈ పుస్తకం 384 పేజీలు కల్గి పూర్తిగా రంగుల చిత్రాలతో కూడినది. మా ముద్రణాయంత్ర పరికరాలను అభివృద్ధి పర్చాల్సియుంటుంది, పేపరు కొరతగా ఉంది, బౌండు పుస్తకాలను తయారుచేసేంతటి నైపుణ్యం మా సిబ్బందికి లేదు.

నిషేధాజ్ఞలక్రింద ముద్రించడంలో మేమెలా విజయం సాధించగల్గామో వివరించేముందు, ముద్రణా యంత్రాలుగల ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయమందు ముద్రణా కార్యకలాపాలపై నేను ఓవర్‌సీర్‌గా ఎలా సేవచేయ మొదలుపెట్టానో నన్ను చెప్పనివ్వండి.

తొలి చరిత్ర

బల్లారాట్‌, విక్టోరియానందలి సంపన్నమైన నగరంలో నా తండ్రికి ముద్రణా వ్యాపారముండేది, అక్కడే నేను 1914లో జన్మించాను. ఆవిధంగా నేను నా తండ్రి ముద్రణాలయమందు ముద్రణా రంగమును గూర్చి నేర్చుకున్నాను. చర్చి ఆఫ్‌ ఇంగ్లండ్‌ కార్యకలాపాలలో చర్చి క్వయర్‌నందు పాడడం, చర్చిగంటలు మ్రోగించడంలో కూడ నేను పాల్గొనేవాడిని. సండే స్కూలునందు బోధించే ఆధిక్యతను పొందే అవకాశమొచ్చింది కాని నేను దాన్ని గూర్చి సంశయించాను.

ఎందుకంటే కొన్ని చర్చి బోధల విషయంలో నాకు సందేహాలుండేవి. వాటిలో త్రిత్వము, నరకాగ్ని, మానవాత్మ అమర్త్యమైనది అనేవి ఉన్నాయి. వాటినిగూర్చి నాకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఎవ్వరూ యివ్వలేదు. యెహోసాక్షులనబడే చిన్న మతగుంపును గూర్చి మా మతబోధకుడు పదేపదే కోపోద్రేకంతో మాట్లాడడంకూడా నన్ను ఆశ్చర్యపర్చేది. ఏమంత గుర్తింపులేని ఆ గుంపునుగూర్చి, 40,000 మంది ఉన్న నగరానికి ఎందుకంతటి చింత అని నేను అనుకొనేవాడిని.

ఒకానొక ఆదివారమున, సాయంత్ర ఆరాధన ముగిసిన తరువాత నేను చర్చి వెలుపల నిలుచున్నాను, సమీపమునున్న మెథడిస్టు చర్చినుండి కొంతమంది అమ్మాయిలు నడిచి వెళ్లారు. వారిలో ఒకరితో నేను స్నేహం పెంచుకున్నాను. ఆమె పేరు లూసీ, తరువాత కొంతకాలానికి తన తలిదండ్రులను కలవడానికి నన్ను తన యింటికి రమ్మని ఆహ్వానించింది. ఆమె తల్లి విరా క్లోజెన్‌ యెహోవాసాక్షియని నేను విన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో ఊహించండి. ఉజ్జీవమైన బైబిలు చర్చలెన్నో చేశాము, ఆమె చెప్పింది అర్థవంతంగా ఉందనిపించింది.

అనతికాలంలో, లూసీ నేను వివాహం చేసుకున్నాము. 1939 నాటికి విక్టోరియా ముఖ్యపట్టణమైన మెల్‌బోర్న్‌లో జీవించసాగాము. లూసీ యెహోవాసాక్షి అయ్యినప్పటికిని నేనప్పటికింకా నిర్ణయించుకోలేదు. అయితే అదే సంవత్సరం సెప్టెంబరులో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేసరికి, నేను లేఖనముల నుండి నేర్చుకున్న వాటిని గూర్చి తీవ్రంగా ఆలోచించుట మొదలుపెట్టాను. జనవరి 1941లో యెహోవాసాక్షుల పని నిర్బంధించబడటం నేను ఒక నిర్ణయం తీసుకొనడానికి సహాయపడింది. యెహోవా దేవునికి సమర్పించుకొని పిమ్మట త్వరలోనే నేను బాప్తిస్మము తీసుకున్నాను.

మా జీవితాలలో అనుకోని మార్పులు

అప్పటికి, మేము మెల్‌బోర్న్‌లో ఒక సౌకర్యవంతమైన యింటిలో అద్దెకుంటున్నాము. అయితే, కొద్దికాలంలోనే అనేకమంది యితర సాక్షులుంటున్న యింటిలోనికి మారమని మమ్మల్ని కోరారు. పడక సామాగ్రిని తప్ప మిగతా సామాగ్రినంతటిని మేము అమ్మివేసి, పయినీరు గృహమని పిలువబడే యింటిలోనికి తరలివెళ్లాము. నేను ముద్రణా పనివానిగా పనిచేస్తూ ఆ గృహ ఖర్చులను భరించుటకు దోహదపడ్డాను. మిగతావారి భర్తలు కూడా అలానే చేశారు. తత్ఫలితంగా, మా భార్యలు పూర్తికాల ప్రకటనా కార్యక్రమంలో పాల్గొనేవారు, పురుషులమైన మేము సాయంత్రవేళల్లోను వారాంతములలోను సువార్త పనియందు క్రైస్తవకూటములందు వారితో కలిసేవారము.

కొద్దికాలం పిమ్మట నాకు, నా భార్యకు సిడ్నీకి రమ్మని ఆహ్వానించే ఒక ఉత్తరం వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచి కార్యాలయమునుండి వచ్చింది. మా పడక గది సామాగ్రిని అమ్మి మాకున్న కొన్ని అప్పులను తీర్చేసాము, కాని సిడ్నీ వెళ్లేందుకు రైలు చార్జీల నిమిత్తం లూసీకి ప్రధానం సమయంలో పెట్టిన ఉంగరాన్ని అమ్మివేయాల్సి వచ్చింది!

యుద్ధకాలమందలి నిర్బంధముల మూలంగాను, యిటీవల విధించిన నిషేధాజ్ఞల మూలంగాను బైబిళ్లనుగాని, బైబిలు సాహిత్యాలనుగాని విదేశాలనుండి దిగుమతి చేసుకొన వీలులేదు. అందుకే ఆస్ట్రేలియా బ్రాంచి ఆత్మీయాహారాన్ని అందజేసే నిమిత్తం దానిని ముద్రించే కార్యక్రమాన్ని రహస్యంగా చేపట్టాలని నిర్ణయించింది. ఆ పనిని పర్యవేక్షించేందుకు నేను ఆహ్వానించబడ్డాను. ఆస్ట్రేలియా బ్రాంచి ముద్రణాలయంలో దాదాపు 60 సంవత్సరాలు పనిచేసిన స్కాట్‌ దేశస్థుడైన జార్జి గిబ్‌తో పాటు పనిచేసే ఆధిక్యత నాకు లభించింది. * అప్పుడే నేను “చిల్డ్రన్‌ పుస్తకాన్ని ముద్రించండి” అన్న ఆదేశాన్ని పొందాను.

ముద్రణా యంత్రపరికరాలను పునరుద్దరించుట

యుద్ధము చేలరేగుతున్న ఆ సంవత్సరాలలో మాకు ఉత్తేజితమైన, కొన్నిసార్లు గగుర్పాటు గొల్పే అనుభవాలెన్నో సంభవించాయి. ఉదాహరణకు, ముద్రించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలంటే, మాకు యంత్రపరికరాలు అవసరం. యుద్ధ కాలానికి ముందు పరిమితంగా ముద్రించుటకు మేము ఉపయోగించిన యంత్ర పరికరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది, సొసైటికున్న చిన్న ముద్రణాలయానికి తాళంవేసి కాపలాదారులను పెట్టారు. రహస్యంగా ముద్రించగల అనువైన ప్రదేశానికి ఆ సామాగ్రిని తరలించేదెలా?

సాయుధ కాపలదారులు షిప్టుల ప్రకారం పనిచేస్తూ సొసైటి ఆస్థినంతటిని 24 గంటలూ కాపలా కాస్తున్నారు. అయితే, దానివెనుక గోడలలో ఒకటి బహు అరుదుగా ఉపయోగించబడే రైల్వేలైనును ఆనుకొనియున్నది. కనుక రాత్రివేళ కొంతమంది బేతేలు కార్యకర్తలు యెహెజ్కేలు 12:5-7 నందు సూచించబడిన పద్ధతులనుపయోగించి, గోడ యిటుకలను తొలగించి లోనికి ప్రవేశించారు. ఒకసారి లోనికి ప్రవేశించిన తరువాత యిటుకలను మరలపేర్చి అనుమానం రాకుండా చూసుకొనేవారు. దాదాపు రెండు వారాలు యిలా రాత్రివేళ దాడిచేసిన తరువాత, ముద్రించుటకు చిన్న లైనోటైప్‌ ముద్రణాయంత్రాన్ని మరికొన్ని యితర యంత్రాలను జాగ్రత్తగా విడదీశారు. అటుతరువాత ఆ యంత్ర భాగాలను డ్యూటీలో కాపలాదారులు వుండగానే, వాటిని మెల్లగా బయటకు తరలించారు.

సకాలంలో అదనపు సామాగ్రిని యితరులనుండి సంపాదించగల్గాము, వెంటనే సిడ్నీయంతటా వివిధ ప్రదేశాలలో రహస్య ముద్రణా కార్యక్రమాలను చురుకుగా కొనసాగించాము. ఆ విధంగా మేము చిల్డ్రన్‌ పుస్తకాన్ని మాత్రమే కాదు, ది న్యూ వరల్డ్‌, “ది ట్రూత్‌ షల్‌ మేక్‌ యు ఫ్రీ, ది కింగ్‌డం ఈజ్‌ ఎట్‌ హ్యాండ్‌ వంటి పెద్ద సైజు పుస్తకాలను 1942, 1943, 1944, 1945 కొరకు యెహోవాసాక్షుల వార్షిక పుస్తకాలను ముద్రించగల్గాము. దానికి తోడు ఆ నిషేధాజ్ఞల కాలంలో ఆస్ట్రేలియాలోనున్న యెహోవాసాక్షులు ది వాచ్‌టవర్‌ యొక్క ఒక్క సంచికను కూడా ఎన్నడు కోల్పోలేదు. యెహోవా హస్తము ఎన్నడు కురుచకాలేదన్న వాస్తవాన్ని యిది పునరుద్ఘాటించింది.—యెషయా 59:1.

అకస్మాత్తు సందర్శనలను తాళుట

యుద్ధకాలంలో నిషేధాజ్ఞలు ముమ్మరంగా ఉన్న రోజుల్లో, వ్యాపార ముద్రణాలయాలు ఏమేమి ముద్రిస్తున్నవో చూచేందుకు ప్రభుత్వాధికారులు వాటిని తరచు అకస్మాత్తుగా సందర్శించేవారు. కనుక భూగర్భంలో ఉండే మా ముద్రణాలయాలకు హెచ్చరికా సంకేతము ఏర్పాటుచేసాము. పై అంతస్థుపై రిసెప్షనిస్టుకు అందుబాటులో ఒక బటన్‌ ఉంచబడింది. మెట్లవరకు వచ్చిన ఎవరైనా తాను గుర్తించకపోయినా లేదా తనిఖీ అధికారియని అనుమానించిన ఆమె బటన్‌ నొక్కుతుంది.

బటన్‌ నొక్కగానే, సహోదరులు నలుప్రక్కల ఉన్న కిటికీలగుండా తప్పించుకొనడం చూడదగిన దృశ్యం. ఉద్యోగులుగా నియమితులైనవారు ముద్రించబడిన వాచ్‌టవర్‌ పత్రిక కాగితాలను లేదా యితర బైబిలు సాహిత్యాల కాగితాలను వెంటనే కప్పివేయడానికి ఉండిపోయేవారు. అందుకుగాను వాణిజ్యపరంగా యితర వినియోగదారుల కొరకు తయారుచేసే సాహిత్యాలలో అంతే పరిమాణములో నున్న కాగితాలను వారు వాడేవారు.

అలాంటి ఒక సందర్శనలో, ఇద్దరు తనిఖీ అధికారులు పెద్ద సైజులోనున్న హాస్యకథల కాగితాలపై కూర్చున్నారు. వాటిక్రింద అంతకుముందు రాత్రి ముద్రించిన వాచ్‌టవర్‌ పత్రికకు సంబంధించిన కాగితాలుండెను. నగరంలోని మరో ప్రాంతమందున్న ఒక ముద్రణాలయములో మేము పగటి పూట వాణిజ్యపరమైన ముద్రణను చేపట్టి రాత్రివేళ వారాంతములోను వాచ్‌టవర్‌ ప్రచురణలను ముద్రించేవారము.

కాగితాల అవసరతను తీర్చుకొనుట

ముద్రించడానికి కాగితాన్ని సంపాదించడం మరో ప్రధాన సమస్య. అయితే, యుద్ధకాలంలో వ్యాపారం పడిపోయినందున పూర్తి కాగితపు కోటా అవసరంలేని పెద్దపెద్ద ముద్రణా సంస్థలు తమ దగ్గరున్న వాటిని అమ్మడానికి సిద్ధపడేవారు, అయితే ఎప్పుడూ ఎక్కువ ధరకే అమ్ముతుండేవారు. ఒక సందర్భములోనైతే మరో మూలంనుండి మేము కాగితాన్ని పొందగల్గాము.

బ్రౌన్‌ పేపరును అధికంగా వేసుకొని ఒక వర్తకపు ఓడ ఆస్ట్రేలియా వస్తున్నది, కాని సముద్రములోనుండగా ఓడచెడిపోయింది, పేపరులో ఎక్కువ భాగం తడిసిపోయింది. ఆ మొత్తం సరుకును వేలం వేయడానికి సన్నద్ధమయ్యారు. వేలం పాడడానికి వచ్చింది మేమొక్కరమేనని చూచి మాకాశ్చర్యమయ్యింది. దానిని అతి తక్కువ ధరకు కొనే అవకాశాన్ని అది మాకు కల్పించింది. ఆ కాగితాన్ని మేము ఎండలో ఆరబెట్టాము, ఆవిధంగా దానిలో అధికభాగాన్ని కాపాడుకోగల్గాము, ఆ పిదప మా ముద్రణాయంత్రాలకు అనువుగా ఉండే రీతిగా వాటిని కత్తిరించాము.

మరి ఈ బ్రౌన్‌ పేపరును మేము ఎలా ఉపయోగిస్తాము? హాస్యకథలను చదివేవారు రంగు కాగితంపై ముద్రించినవి కూడా చదివి ఆనందిస్తారని మేము సరిగానే అంచనా వేశాము. ఆ విధంగా హాస్యకథల పుస్తకాలకొరకు కేటాయించిన తెల్లకాగితాన్ని ది వాచ్‌టవర్‌ మరితర సొసైటి ప్రచురణలను ముద్రించుటకు మేము వాడాము.

స్త్రీల ప్రముఖ పాత్ర

యుద్ధకాలంలో ఆస్ట్రేలియాలోని అనేకమంది క్రైస్తవ స్త్రీలు బైండింగు చేయడం నేర్చుకున్నారు. విపరీతమైన తాపమున్న ఒకానొక వేసవి మధ్యాహ్నమందు సిడ్నీ శివారు ప్రాంతములో మేము అద్దెకు తీసుకున్న చిన్న గేరెజ్‌లో కొంతమంది ఏకాంతముగా పనిచేస్తున్నారు. భద్రతకోసం, ప్రతి కిటికీని, తలుపును మూసివేశారు. జిగురు పాత్రలు వేడిని వెదజల్లాయి, వాసనతో కూడిన సెగలు వెళ్లగ్రక్కాయి, వేడి భరించజాలనంతగా ఉండింది. కనుక తమపై వస్త్రాలను తీసివేసి పనిచేయనారంభించారు.

అకస్మాత్తుగా, తలుపు తట్టిన శబ్దమయ్యింది. ఎవరది, అని ఆ క్రైస్తవ సహోదరీలు అడిగారు, ప్రభుత్వ శ్రామికాధికారిని అని సమాధానమొచ్చింది. శ్రామికులు అవసరమగు ఏ ప్రాంతానికైనా మనుష్యులను పంపించే అధికారముగల ఒక యుద్ధకాల విభాగానికి చెందిన వ్యక్తి. అతడు లోపల ఉన్న వేడిమూలంగా తాము లోబట్టలతో పనిచేస్తున్నందున యిప్పుడు వెంటనే అతనిని లోనికి అనుమతించ లేకపోతున్నామని ఆ సహోదరీలు బిగ్గరగా సమాధానమిచ్చారు.

ఆ అధికారి ఒక క్షణం ఆగి, ఆ ప్రాంతములో తనకు వేరే పని ఉందని చెప్పాడు. మరుసటిరోజున వచ్చి, తనిఖీచేస్తానని అన్నాడు. వెంటనే ఈ క్రైస్తవ సహోదరీలు మాకు టెలిఫోన్‌ చేశారు, బైండింగ్‌ విభాగం చేపట్టిన వాటినంతటిని తీసుకొని వేరే ప్రాంతానికి తరలించడానికి మేమొక ట్రక్కును పంపాము.

రహస్యంగా ముద్రించడంలో పాలుపంచుకొన్న మాలో అనేకమందికి ముద్రణాపనియందు అనుభవములేదు కనుక, సాధించిన దానినిబట్టి అవసరమగు సహాయాన్ని నడిపింపును యెహోవా ఆత్మ దయచేసిందని మాకు రూఢిగా తెలిసింది. దీనియంతటిలో పాలుపంచుకున్న నాకు బైండింగ్‌ విభాగంలో పనిచేసిన నా భార్యకు యిదెంతో గొప్ప ఆధిక్యత.

ఆ శోధన సమయాలలో మాపని ఎలా నిర్వహించబడింది? యెహోవాసాక్షుల బ్రాంచి తాత్కాలిక ఓవర్‌సీర్‌ను సిడ్నీ వెలుపల 60 మైళ్ల దూరమున ఉన్న ఒక పట్టణములో నివసించుమని ప్రభుత్వమునుండి నిర్బంధపు ఆజ్ఞ జారీ చేయబడింది. పట్టణానికి కేంద్రస్థానమునుండి ఐదుమైళ్ల వ్యాసము వెళ్లకూడదని ఆ శాసనం ఆదేశించింది. ఒక కారుకు నెలకు ఒక గ్యాలను చొప్పున పెట్రోలు రేషన్‌లో యివ్వబడేది. గ్యాస్‌ ప్రొడ్యూసర్‌ అనే అద్భుతమైన సాధనాన్ని సహోదరులు కనిపెట్టారు. అదేమంటే అరటన్ను బరువున్న స్థూపాకార ఇనుప పాత్రను కారువెనుక భాగాన బిగించారు. దీనిలో బొగ్గును దహించేవారు. దానినుండి కార్భన్‌ మోనాక్సైడును ఇంధనంగా ఉత్పత్తిచేసేవారు. బాధ్యతాయుతులైన యితర సహోదరులు, నేను ప్రతివారము అనేక రాత్రులు దీనియందు ప్రయాణించి ఓవర్‌సీర్‌ బంధీగావున్న పట్టణానికి దగ్గర్లోవున్న ఎండిన కాలువలో ఆయనను కలవడానికి వెళ్లేవారము. ఆ విధంగా మేము ఆ గ్యాస్‌ మరలా ఉత్పత్తయ్యే లోపల ఎన్నో విషయాలు మాట్లాడుకొని, తెల్లవారే సరికి మరలా సిడ్నీలో ఉండేవాళ్లము.

ఎట్టకేలకు, యెహోవాసాక్షులపై విధించిన నిషేధమునుగూర్చి ఆస్ట్రేలియా హైకోర్టులో తీర్పుకు తేబడింది. వారిపై విధించిన నిషేధం “నిరంకుశమైనది, చపల చిత్తమైనది, అణచివేత చర్య అని” న్యాయాధీశుడు పేర్కొని, యెహోవాసాక్షులకు దేశద్రోహ కార్యకలాపాలలో పాలులేదని వారు నిర్దోషులని తీర్పుచెప్పాడు. హైకోర్టు వారంతా ఈ నిర్ణయాన్ని బలపర్చారు. తత్ఫలితంగా మేము చట్టబద్ధమైన రాజ్య కార్యకలాపాలలో ఇప్పుడు బాహాటంగా కొనసాగగల్గాము.

మరితర నియామకాలు, ఆశీర్వాదాలు

యుద్ధం ముగిసిన తరువాత మా అజ్ఞాతవాస ముద్రణాలయములందు పనిచేసిన అనేకులు పయినీరు పరిచర్యను ప్రారంభించారు. వారిలో కొందరు అటుపిమ్మట వాచ్‌టవర్‌ బైబిలు స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు వెళ్లారు. లూసీ, నేను కూడా దానిని మా ధ్యేయంగా పెట్టుకున్నాం, కాని మా పాప రంగంలో ప్రవేశించింది. అప్పుడు నేనిక ముద్రణా వ్యాపారానికి తిరిగివెళ్లిపోవాలని నిర్ణయించుకొన్నాను. మేము రాజ్యాసక్తులను ఎల్లప్పుడు ముందుంచుకొనేలా యెహోవా సహాయపడగలడని ప్రార్థించాము. ఆయన సహాయపడ్డాడు కూడ. ఇప్పుడు చెప్పబోయే విధంగా నేను మరొక పరిచర్యా బాధ్యతలో పాలుపొందాను.

ప్రస్తుతము బ్లూక్లిన్‌, న్యూయార్క్‌లో యెహోవాసాక్షుల పరిపాలక సభనందొక సభ్యునిగా సేవచేస్తున్న లాయడ్‌ బేరీ నుండి నాకు ఫోను వచ్చింది. అప్పట్లో ఆయన సిడ్నీనందు ప్రయాణకాపరి. తదుపరి జరగబోయే అసెంబ్లీ తారీఖు నీకు తెలుసా అని ఆయన నన్నడిగాడు. నాకు తెలుసునని నేను సమాధానమివ్వగా ఆయనిట్లన్నాడు: “భోజన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా నిన్ను కోరుతున్నాము.”

ఒక్క క్షణం విస్తుపోయి, నీరసంగా యిలా అన్నాను: “కాని నా జీవితంలో అలాంటి పనినేనెప్పుడూ చేయలేదు.”

“అయితే, సహోదరుడా నీవు నేర్చుకునే తరుణమిదే!” అని ఆయన ఖండితంగా చెప్పాడు. నేను నేర్చుకున్నాను, 40 సంవత్సరాలకంటే ఎక్కువ కాలంనుండి పెద్దపెద్ద సమావేశాలందుకూడా నేను ఆహార సేవా విభాగాన్ని పర్యవేక్షిస్తున్నాను.

ఈ మధ్యకాలంలో మా వాణిజ్య ముద్రణా సంస్థ విస్తరించింది, అందుమూలంగా విదేశాలకు వాణిజ్య సంబంధ ప్రయాణాలనేకం చేయాల్సి వచ్చింది. న్యూయార్కులోను, అమెరికాలో యితర ప్రాంతాలలో జరిగే అంతర్జాతీయ సమావేశాలతో అవి సరిపడేటట్లు వాటిని నేనెల్లప్పుడు ఏర్పాటుచేసుకొనేవాడిని. వివిధ సమావేశ డిపార్టుమెంట్లను పర్యవేక్షించే వారితో, ముఖ్యంగా ఆహార సేవా విభాగంతో సమయాన్ని గడిపే అవకాశాన్నది నాకు కల్పించింది. ఆ విధంగా నేను ఆస్ట్రేలియాలో మా సమావేశాలందు మరింత సమర్థవంతంగా పనిచేసేవాడిని.

మా వయస్సు మళ్లేకొలది, మేము యింకా కొంచెం ఆలస్యంగా పుట్టివుంటే యింకా ఎంతో సాధించి ఉండేవాళ్లము కదా అని నేను లూసీ అప్పుడప్పుడు తలంచుకొనేవాళ్లము. కాని నేను 1914, ఆమె 1916లో జన్మించినందువలన, బైబిలు ప్రవచనాలు మా కళ్లెదుటే నెరవేరుటను చూడటం మాకు లభించిన ఆధిక్యతయని పరిగణించాము. మేము అనేకులతో బైబిలు పఠనములను చేస్తూ, వారు సత్యాన్ని నేర్చుకొని బాప్తిస్మము తీసుకున్న పరిచారకులుగా నేడు ఆయనకు సేవచేయడం చూచే ఆధిక్యతను మాకిచ్చి నందుకు మేము యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆయనను విశ్వానికి మహోన్నత సర్వాధిపతిగా నిరంతరం గుర్తించి, ఆయనను అనునిత్యము సేవించుటలో కొనసాగగలమని ప్రార్థిస్తున్నాము.

[Footnotes]

^ పేరా 14 దివాచ్‌టవర్‌ సెప్టెంబరు 15, 1978 పేజీలు 24-7 చూడండి.

[Pictures on page 29]

స్ట్రాత్‌ఫీల్డ్‌ బేతేలునందు స్థాపించిన ముద్రణా విభాగం, 1929-73

ముద్రణాలయం వెనుక గోడనుండి తీసుకొని వెళ్లిపోయిన ఒకానొక ముద్రణాయంత్రం ప్రక్కన నిల్చొనియున్న జార్జ్‌ గిబ్‌