కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లోకముయెడల జ్ఞానముతో నడుచుకొనుట

లోకముయెడల జ్ఞానముతో నడుచుకొనుట

లోకముయెడల జ్ఞానముతో నడుచుకొనుట

“వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి”—కొలొస్సయులు 4:5

రోమా ఆధిపత్యము క్రింద పట్టణాలలో నివసించే తొలి క్రైస్తవులంతా విగ్రహారాధన, అవినీతికర సుఖభోగము, అన్యాచారాలు, పద్ధతులు మొదలగు సమస్యలను అనునిత్యము ఎదుర్కోవలసి ఉండెను. ఆసియా మైనరు పశ్చిమ మధ్య ప్రాంతములోనున్న కొలొస్సయలో జీవించినవారు అక్కడ ఆరాధించబడే మాతృ దేవత ఆరాధన, ఆ ప్రాంతపు ప్రిజియనుల అభిచార క్రియలు, అక్కడ వాసమేర్పరచుకొన్న గ్రీకుల అన్యసంబంధమైన వేదాంతము, వలసవచ్చిన యూదుల యూదా మత విధానమును ఎదుర్కోవలసిన స్థితి ఉండేది. అందుకే అపొస్తలుడైన పౌలు అక్కడున్న క్రైస్తవ సంఘమును మీరు “వెలుపటి వారియెడల” “జ్ఞానముకలిగి నడుచుకొనుడి” అని హెచ్చరించెను.—కొలొస్సయులు 4:5.

2 ఈనాడు కూడా యెహోవాసాక్షులు అలాంటివాటినే లేక అంతకంటే ఎక్కువైన తప్పుడు ఆచారాలనే ఎదుర్కొంటుంటారు. అందువల్ల నిజమైన క్రైస్తవ సంఘమునకు వెలుపట ఉన్నవారియెడల వారికుండే సంబంధం విషయంలో జ్ఞానముతో నడవవలసి ఉన్నారు. మతము, రాజకీయము, అలాగే ప్రచారసాధనాలలో పనిచేసే అనేకమంది వారిని వ్యతిరేకిస్తుంటారు. ఈ వ్యతిరేకులలో కొందరు ప్రత్యక్షంగా వారిపై దాడి జరపడమో, లేక కపటముతో వారి మంచి పేరును చెడగొడుతూ వారిపై దురభిమానాన్ని పెంచేందుకో పనిచేస్తుంటారు. తొలి క్రైస్తవులు ఉన్మాదులని, చివరకు అపాయకర ‘మత గుంపు’ అని అన్యాయంగా ఎలా నిందించబడ్డారో అలాగే ఈనాడు కూడా యెహోవాసాక్షులు తరచు దురభిమానానికి, చెడు అభిప్రాయాలకు గురౌతున్నారు.—అపొస్తలుల కార్యములు 24:14; 1 పేతురు 4:4.

దురభిమానాన్ని అధిగమించుట

3 అపొస్తలుడైన యోహాను వర్ణించినట్లు నేడు “దుష్టునియందున్న లోకము” తమను ప్రేమిస్తుందని క్రైస్తవులు ఆశించరు. (1 యోహాను 5:19) అయినా ఆయా మనుష్యులను యెహోవావైపు, ఆయన సత్యారాధనవైపు మళ్లించడానికి వారిని ఆకట్టుకునేలా కృషిచేయాలని బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తుంది. దీనిని మనము మన మంచి ప్రవర్తనద్వారా, ప్రత్యక్షంగా సాక్ష్యమివ్వడం ద్వారా చేస్తాము. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌ క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.”—1 పేతురు 2:12.

4 ఫర్‌గివ్‌బట్‌ డు నాట్‌ ఫర్‌గెట్‌ అనే తన పుస్తకంలో రచయిత్రి సిల్వియా సల్‌వేసన్‌, నాజీ కాన్‌సెంట్రేషన్‌ క్యాంపులో తనతో పాటువున్న స్త్రీ సాక్షులను గూర్చి ఇలా చెప్పింది: “ఆ ఇద్దరు కాథీ, మార్గరేటా, వారితోపాటు అనేకమంది ఇతరసాక్షులు వారి విశ్వాసం ద్వారానేగాక, అనేక ఆచరణాత్మక విషయాలలోను నాకు ఎంతో సహాయం చేశారు. మాకు కలిగిన గాయాలకు కట్టుగట్టుటకు పరిశుభ్రమైన బట్టలను అందించేవారు. . . క్లుప్తంగా చెప్పాలంటే స్నేహపూర్వకమైన భావాలు, క్రియలతో మా మేలుకోరే ప్రజలమధ్య మేముంటిమి.” “వెలుపటి వారినుండి” ఇది ఎంత మంచి సాక్ష్యము.

5 వెలుపటి వారియెడల మనము జ్ఞానయుక్తంగా ప్రవర్తించే విధానమునుబట్టి, దురభిమానమును తీసివేసేందుకు మనము ఎంతో చేయవచ్చును. నిజమే, ఇప్పుడు పరిపాలిస్తున్న మన రాజైన క్రీస్తుయేసు జనములందరిని గొల్లవాడు “మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు” వేరుచేస్తున్న సమయంలో మనము జీవిస్తున్నాము. (మత్తయి 25:32) అయితే, న్యాయాధిపతి క్రీస్తే అనే విషయాన్ని మరచిపోవద్దు. ఎవరు ‘గొర్రెలో’ లేక ఎవరు ‘మేకలో’ నిర్ణయించేవాడు ఆయనే.—యోహాను 5:22.

6 ఈ విషయము యెహోవా సంస్థలో భాగం కానివారియెడల మనము కలిగియుండే మన స్వభావంపై ప్రభావం చూపాలి. మనము వారిని లోకసంబంధులు అని అనుకోవచ్చుగాని, “దేవుడు . . . ఎంతో ప్రేమించెను. కాగా అయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని ఏ లోకాన్ని గూర్చి చెప్పబడిందో ఆ లోకంలో వారు భాగమైయున్నారు. (యోహాను 3:16) మనము అహంభావముతో ప్రజలను వారు మేకలే అని నిర్ణయించే బదులు వారు భవిష్యత్తులో గొర్రెలుకావచ్చేమో అని దృష్టించుట చాలా మంచిది. గతంలో ఎంతో కఠినంగా సత్యాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు, ఇప్పుడు సమర్పించుకొన్న సాక్షులైయున్నారు. ప్రత్యక్షంగా ఇవ్వబడిన సాక్ష్యమునకు వారు స్పందించకముందు వీరిలో అనేకమంది దయగల క్రియలనుబట్టి ఆకట్టుకొనబడ్డారు. ఉదాహరణకు 18వ పేజీలోని చిత్రమును చూడండి.

ఆసక్తిగలవారేగాని, ఉద్రిక్త స్వభావం గలవారు కారు

7 సాధారణంగా ఇతర మత గుంపులను, ప్రత్యేకంగా యెహోవాసాక్షులను విమర్శిస్తూ, పోప్‌ జాన్‌పాల్‌ II ఇలా అన్నాడు: “క్రొత్తవాళ్లను మార్చాలని, ఇంటింటికి వెళ్తూ, వీధులలో పోయేవారిని ఆపుతూ వుండేవారి ఆసక్తి ఉద్రిక్తమైనది. ఇది అపొస్తలులు మరియు మిషనరీలు చూపిన ఆసక్తికి విరుద్ధముగా నకిలీ ఆసక్తియైయున్నది.” అయితే మనము ఇలా అడగవచ్చును, “మనది మాయ వేషము వేసుకొన్న నకీలి అపొస్తలుల, మిషనరీల స్వభావమైయుంటే,” మరి సువార్త ప్రకటనయెడల నిజమైన ఆసక్తిని ఎక్కడ కనుగొంటాము? ఆ విషయానికొస్తే అది మనకు కాథోలిక్కులలోనేగాని, లేక ప్రొటెస్టెంటులు, ఆర్థడక్స్‌ చర్చి సభ్యులలోనే గాని కనబడదు.

8 అయినా ఉద్రిక్త స్వభావం గలవారనే ఆరోపణను తప్పని నిరూపించేందుకు మనము ప్రజలను సమీపించేటప్పుడెల్లా దయ, గౌరవము, మర్యాదను చూపేవారమైయుండాలి. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.” (యాకోబు 3:13) అపొస్తలుడైన పౌలు మనము ‘జగడమాడనివారిగా’ ఉండాలని హెచ్చరిస్తున్నాడు. (తీతు 3:2) ఉదాహరణకు, మనము సాక్ష్యమిస్తుండే వ్యక్తియొక్క నమ్మకాలను ఒక్కధాటిన ఖండించేబదులు అతని లేక ఆమె అభిప్రాయములందు ఎందుకు నిజమైన శ్రద్ధ కనపరచకూడదు? తరువాత ఆ వ్యక్తికి బైబిలులోని సువార్తను చెప్పండి. ఇతర నమ్మకాలుగల వ్యక్తులను అనుకూల స్వభావంతో సమీపించి వారికి తగిన గౌరవాన్నివ్వడం ద్వారా వారు తమ మనస్సును సరైన స్థితిలో ఉంచుకొని బైబిలు వర్తమానాన్ని విని, దాని విలువను గ్రహించవచ్చునేమో. తత్ఫలితంగా కొందరు “దేవుని మహిమ పరచెదరు.”—1 పేతురు 2:12.

9 అపొస్తలుడైన పౌలు హెచ్చరిక ఇలా ఉంది: “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.” (కొలొస్సయులకు 4:5) సమయము పోనియ్యక అనే మాటను వివరిస్తూ, జె. బి. లైట్‌ఫుట్‌ ఇలా వ్రాశాడు: “దేవునికి సంబంధించిన దానిని చెప్పేదానిలో, చేసేదానిలో ఏ అవకాశాన్ని జారవిడువవద్దు.” (ఇటాలిక్కులు మావి.) అవును, సరైన మాటలతో, క్రియలతో మనమెల్లప్పుడు సిద్ధంగా ఉండాలి. అయితే అందులో దినములోని సరైన సమయంలో దర్శించడంలోను జ్ఞానం చూపడం ఇమిడివుంది. మన వర్తమానమును తిరస్కరిస్తే, ప్రజలు దానిని గుణగ్రహించక తిరస్కరించారా, లేక బహుశా వారికి అననుకూలమైన సమయంలో వారిని దర్శించినందున దానిని తిరస్కరించారా? పౌలు ఇంకా ఇలా వ్రాశాడు: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొస్సయులు 4:6) ఇలా చెయ్యడానికి ముందు ఆలోచన, పొరుగువారియెడల నిజమైన ప్రేమ అవసరము. మనమెల్లప్పుడు రాజ్యవర్తమానమును కృపాసహితంగా అందించుటకు ప్రయత్నిద్దాము.

గౌరవమును ప్రదర్శిస్తూ, ‘ప్రతి సత్కార్యమునకు సిద్ధంగా ఉండండి’

10 బైబిలు సూత్రముల విషయంలో మనము రాజీపడలేము. అయితే, అనవసరంగా క్రైస్తవ యథార్థతకు సంబంధంలేని ప్రశ్నలను ప్రస్తావిస్తూ వివాదమును రేకెత్తించకూడదు. అపొస్తలుడై పౌలు వ్రాసినది ఇలా ఉంది: “అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి యుండవలెననియు, మనుష్యులందరి యెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.” (తీతు 3:1, 2) ఈ వాక్యమును గూర్చి బైబిలు విద్వాంసుడైన ఇ. యఫ్‌. స్కాట్‌ ఇలా వ్రాశాడు: “క్రైస్తవులు అధికారానికి లోబడటమేగాక, వారు ప్రతి సత్కార్యానికి సిద్ధంగా ఉండాలి. అంటే . . . అవసరమైనప్పుడు ప్రజా సంక్షేమమును గూర్చి తలంచేవారిలో క్రైస్తవులు మొదటివారైయుండాలి. మంచి పౌరులందరూ తమ పొరుగువారికి సహాయము చేయనిష్టపడేందుకు అవకాశమిచ్చే అగ్ని ప్రమాదములు, అంటువ్యాధులు, నానావిధాల విపత్తులు జరుగుతునే ఉంటాయి.” ప్రపంచవ్యాప్తంగా విపత్తులు సంభవించిన అనేక సందర్భాలున్నాయి. ఈ సమయాల్లో సహాయక చర్యలందించడంలో యెహోవాసాక్షులు మొదటివారైయుండిరి. వారు తమ సహోదరులకేగాక వెలుపటివారికిని సహాయము చేశారు.

11 పౌలు తీతుకు వ్రాసిన ఉత్తరములోని ఇదే వాక్యము అధికారులయెడల కలిగియుండవలసిన గౌరవనీయమైన స్వభావముయొక్క ప్రాముఖ్యతను నొక్కితెల్పుతుంది. తటస్థ వైఖరినిబట్టి న్యాయాధిపతుల ముందు నిలబెట్టబడిన యౌవనులు ప్రత్యేకంగా వెలుపటివారియెడల జ్ఞానముతో నడుచుకొనే విషయంలో మనస్సుగలవారై యుండాలి. వారు కనిపించే విధానముద్వారా, వారు నడచుకొనే ప్రవర్తనద్వారా, అధికారులతో వారు మాట్లాడే విధానంద్వారా యెహోవా ప్రజల పేరును భంగపరచుటకైనా, లేక ఉన్నతపర్చడానికైనా తోడ్పడగలరు. “ఎవనికి సన్మానమో వానికి సన్మానము” నివ్వడంలోనూ, అదే సమయంలో ప్రగాఢ గౌరవంతో సమాధానమివ్వాలి.—రోమీయులు 13:1-7; 1 పేతురు 2:17; 3:15.

12 ఈ “అధికారులలో” స్థానిక ప్రభుత్వ అధికారులూ ఇమిడివున్నారు. అంతకంతకూ అనేక రాజ్యమందిరాలను నిర్మిస్తున్న ఈ తరుణంలో మనకు స్థానిక అధికారులతో సంప్రదింపులు తప్పవు. కొన్నిసార్లు పెద్దలు దురభిమానాన్ని ఎదుర్కోవలసివుంటుంది. అయితే తేటతెల్లమైన సంగతేమంటే, సంఘ ప్రతినిధులు అధికారులతో మంచి సంబంధమేర్పరచుకొని, టౌన్‌ ప్లానింగ్‌ కమీషన్‌తో సహకరిస్తే, దురభిమానం తొలగిపోగలదు. అనేకమార్లు గతంలో యెహోవాసాక్షులను గూర్చి బహుకొంచెం లేక ఏమీ తెలియనివారికి మంచి సాక్ష్యమివ్వబడటం జరిగింది.

‘శక్యమైనంతమట్టుకు, సమస్తమనుష్యులతో సమాధానముగా ఉండండి’

13 అన్యసంబంధమైన రోమాలో నివసించే క్రైస్తవులను పౌలు ఇలా హెచ్చరించాడు: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలుచేత కీడును జయించుము.”—రోమీయులు 12:17-21.

14 వెలుపటివారితోగల సంబంధాలలో నిజక్రైస్తవులుగా మనము నిశ్చయంగా వ్యతిరేకులను ఎదుర్కొంటాము. పై వాక్యములో పౌలు చూపేదాన్నిబట్టి వ్యతిరేకతను దయాపూర్వక కార్యాలతో అధిగమించడానికి ప్రయత్నించడమే జ్ఞానయుక్తమైన మార్గము. పైనపోయబడిన నిప్పుకణుకలవలె ఈ దయాపూర్వక కార్యాలు శత్రుత్వమును కరిగించి యెహోవా ప్రజలయెడల ఆ దయాపూర్వక మనోభావాన్ని పెంచుకొనునట్లు చేయవచ్చును. లేక సువార్తయందు అతనిలో ఆసక్తిని కలిగించవచ్చును. ఇలా జరిగినప్పుడు కీడు మేలుచేత జయించబడినదై యుంటుంది.

15 వెలుపటివారి యెడల జ్ఞానముతో నడుచుకోవడం ప్రత్యేకంగా, వివాహ దంపతులలో ఒకరు ఇంకా సత్యమును అంగీకరించని గృహములలో ముఖ్యము. బైబిలు సూత్రములను ఆచరించడం అనేది ఉత్తమమైన భర్తలను, ఉత్తమమైన భార్యలను, ఉత్తమమైన తండ్రులను, ఉత్తమమైన తల్లులను, పాఠశాలలో బాగా విధేయతచూపుతూ, కష్టపడి చదివే పిల్లలను ఉత్పత్తిచేస్తుంది. బైబిలు సూత్రములు విశ్వాసిపై ఎలాంటి మంచి ఫలితాన్నిస్తున్నాయో అవిశ్వాసి చూడగల్గాలి. ఆవిధంగా, “కుటుంబములో సమర్పించుకొన్నవారి ప్రవర్తన మూలంగా కొందరిని వాక్యము లేకుండానే రాబట్టవచ్చును.”—1 పేతురు 3:1, 2.

‘అందరియెడల మేలుచేయుట’

16 మన పొరుగువారికి మనము చేయగల అత్యంత మేలు ఏమనగా యేసుక్రీస్తుద్వారా వారు యెహోవాతో సమాధానపడునట్లు వారికి జీవ వర్తమానము అందించి బోధించుట. (రోమీయులు 5:8-11) అందుకొరకే అపొస్తలుడైన పౌలు మనకిలా చెబుతున్నాడు: “కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీయులు 13:15) ఇంకా పౌలు ఇలా అంటున్నాడు: “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టియాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీయులు 13:16) మనము బహిరంగంగా సాక్ష్యమిచ్చుటకు తోడు “ఉపకారమును” చేయ మరచిపోకూడదు. దేవునిని సంతోషపరచే అర్పణలలో అది అంతర్భాగము.

17 సహజంగా మనము భావోద్రేకపరంగా, ఆత్మీయంగా, భౌతికంగా, వస్తుపరంగా మన ఆత్మీయ సహోదరులకు మేలుచేస్తుంటాము. దీనిని పౌలు ఈ మాటలలో సూచించాడు: “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:10; యాకోబు 2:15, 16) అయితే ఇచ్చట “మనము . . . అందరి యెడలను మేలుచేయుదము” అను మాటలను మరువ కూడదు. బంధువుయెడల, పొరుగువారు, తోటిపనివారియెడల దయాపూర్వకమైన ఒక క్రియచేయడం, వారిలోని దురభిమానమును పెకలించి వారి హృదయమును సత్యమువైపు మల్లించుటకు సహాయపడగలదు.

18 ఇలా చేయడానికి, వెలుపటివారిని మనము సన్నిహిత స్నేహితులనుగా చేసుకొన నవసరంలేదు. అలాంటి స్నేహాలు అపాయకరము. (1 కొరింథీయులు 15:33) లోకముతో స్నేహముచేయాలను భావము ఇక్కడలేదు. (యాకోబు 4:4) అయితే మన క్రైస్తవ మంచితనము మన ప్రకటన పనికి బలమునివ్వగలదు. కొన్ని దేశాలలో ప్రజలతో ఇండ్లయొద్ద మాట్లాడుట అంతకంతకు కష్టమౌతుంది. కొన్ని అపార్టుమెంటు బిల్డింగులలో వాటిలో నివసించే వారితో కలవకుండా నిరోధించే యంత్ర సామాగ్రి అమర్చబడివుంది. అభివృద్ధిచెందిన దేశాలలో ప్రకటించడానికి టెలిఫోను మంచి అవకాశాన్ని కల్గిస్తుంది. అయితే చాలా దేశాలలో వీధి సాక్ష్యము ఇవ్వగల అవకాశములున్నాయి. అనేక దేశాలలో వీధిసాక్ష్యమియ్యవచ్చును. అయినా అన్ని దేశాలలో ఇతరులకు ప్రీతికరంగా ఉండి, వారిపట్ల దయగా, మర్యాదగా, సహాయకరంగావుంటే అది వారిలోని దురభిమానాన్ని పోగొట్టి సత్యమున గూర్చి మంచి సాక్ష్యమివ్వడానికి అవకాశము కల్గించగలదు.

వ్యతిరేకుల నోరుమూయించుట

19 యెహోవాసాక్షులు మనుష్యులను ప్రీతిపరచేవారు కాదు. మనుష్యులకు భయపడేవారు కాదు. (సామెతలు 29:25; ఎఫెసీయులు 6:6) వారు పన్నులు చెల్లించడంలో, మంచి పౌరులుగా ఉండడంలో మంచి మాదిరికరంగా ఉండటానికి సకల ప్రయత్నాలు చేసినప్పటికి, వ్యతిరేకులు వారి విషయంలో అబద్ధాలను వ్యాప్తిచేసి, వారినిగూర్చి వక్రమాటలు పలుకుతారు. (1 పేతురు 3:16) దీన్ని ఎరిగినవారై వారు దానియేలును అనుకరిస్తారు. ఆయనను గూర్చి ఆయన శత్రువులు ఇలా అన్నారు: “అందుకా మనుష్యులు—అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి.” (దానియేలు 6:5) మనుష్యులను ప్రీతిపర్చడానికి మనమెన్నటికి బైబిలు సూత్రములతో రాజీపడము. అదే సమయంలో మనము హతసాక్షులము కావాలని కోరుకొనము. మనము మనుష్యులందరితో సమాధానముగా జీవించగోరుతూ, అపొస్తలుని హెచ్చరికను గైకొందుము: “ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తనగలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.”—1 పేతురు 2:15.

20 లోకమునుండి మనము వేరైయుండటమనేది బైబిలుకు పూర్తి అనుగుణ్యమైనదని మనము ఒప్పించబడియున్నాము. తొలి క్రైస్తవుల చరిత్ర దానిని బలపరచుచున్నది. యేసుయొక్క ఈ మాటలు మన హృదయమునకు ఆదరణ కలిగిస్తున్నాయి: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.” (యోహాను 16:33) మనము భయపడము. “మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు? మీరొకవేళ నీతినిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి; నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ ప్రవర్తనమీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.” (1 పేతురు 3:13-15) ఈ విధంగా నడవడంద్వారా మనము వెలుపటివారియెడల జ్ఞానముతో నడుచుకొందుము.

పునఃసమీక్ష ద్వారా

▫ వెలుపటివారియెడల యెహోవాసాక్షులు ఎందుకు జ్ఞానముతో నడుచుకొనవలసియున్నారు?

▫ లోకమువలన ప్రేమించబడతామని నిజక్రైస్తవులు ఎందుకు ఆశించలేరు, అయితే వారు ఏమిచేయను ప్రయత్నించాలి?

▫ లోకములోని ప్రజలయెడల మన స్వభావమేమైయుండాలి, ఎందుకు?

▫ మన సహోదరులయెడలేగాక వెలుపటివారియెడలను మనమెందుకు మేలుచేయడానికి ప్రవర్తించగలము?

▫ వెలుపటివారియెడల జ్ఞానముగా ప్రవర్తించడమనేది మన బహిరంగపు సాక్ష్యపు పనిలో మనకెలా సహాయము చేయగలదు?

[Study Questions]

1. తొలి క్రైస్తవులు ఏ పరిస్థితిని ఎదుర్కొన్నారు, కొలొస్సయలోనున్న సంఘానికి పౌలు ఏ హెచ్చరికనిచ్చాడు?

2. యెహోవాసాక్షులు వెలుపటివారియెడల ఎందుకు జ్ఞానముతో నడువవలసియున్నారు?

3, 4. (ఎ) నిజ క్రైస్తవులను లోకమెన్నటికి ఎందుకు ప్రేమించదు, అయితే మనమేమి చేయడానికి ప్రయత్నించాలి? (బి) ఒక రచయిత్రి నాజి కాన్‌సెంట్రేషన్‌ క్యాంపులోవుంచబడిన యెహోవాసాక్షులను గూర్చి ఏమి వ్రాసింది?

5, 6. (ఎ) ప్రస్తుతము క్రీస్తు ఏపనిని నెరవేరుస్తున్నాడు, మనము దేనిని మరచిపోకూడదు? (బి) లోకములోని ప్రజలయెడల మనమెటువంటి స్వభావమును కలిగియుండాలి, ఎందుకు?

7. పోప్‌ ఏ విమర్శను చేశాడు, అయితే మనమే ప్రశ్నను అడగవలసియున్నాము?

8. ఇంటింటికి సాక్ష్యమిచ్చుపనిని మనమెలా నిర్వహించాలి, ఏ ఫలితాన్ని ఆశించవచ్చును??

9. ఈ వాక్యాలలో పౌలు ఇచ్చిన హెచ్చరికను మనమెట్లు అన్వయించగలము (ఎ) కొలొస్సయులు 4:5? (బి) కొలొస్సయులు 4:6?

10. (ఎ) క్రేతులో నివసించు క్రైస్తవులకు పౌలు ఏ హెచ్చరిక నిచ్చాడు? (బి) పౌలు హెచ్చరికను గైకొనుటలో యెహోవాసాక్షులు ఎలా మాదిరికరంగా ఉన్నారు?

11, 12. (ఎ) అధికారులయెడల క్రైస్తవులు ఎలా నడుచుకోవాలి? (బి) రాజ్యమందిరాల నిర్మాణ విషయానికొస్తే అధికారులకు లోబడుటలో ఏమి ఇమిడివుంది?

13, 14. రోమాలో నున్న క్రైస్తవులకు పౌలు ఏ సలహా ఇచ్చాడు, వెలుపటి వారియెడలగల మన సంబంధంలో దానిని మనమెలా అన్వయించగలము?

15. వెలుపటి వారియెడల క్రైస్తవులు ప్రత్యేకంగా ఎప్పుడు జ్ఞానముతో నడుచుటలో జాగ్రత్తపడాలి?

16, 17. (ఎ) ఎటువంటి అర్పణలతో దేవుడు ఎక్కువగా సంతోషించును? (బి) మన సహోదరులయెడల, అలాగే బయటివారియెడల మనమెలా “మేలుచేయుదుము”?

18. (ఎ) ఏ అపాయములను మనము నిరోధించాలి? (బి) మన క్రైస్తవ మంచితనమును మన బహిరంగ సాక్ష్యాన్ని బలపరచేదిగా ఎలా ఉపయోగించగలము?

19. (ఎ) మనము మనుష్యులను ప్రీతిపర్చువారము కాదు గనుక, మనము దేనిని ఎదురుచూడగలము? (బి) దానియేలు మాదిరిని ఎట్లు అనుసరించ ప్రయత్నిస్తూ, పేతురు హెచ్చరికను మనము అన్వయించుకోవాలి?

20. (ఎ) ఏవిషయంలో మనము ఒప్పించబడియున్నాము, మరియు యేసు మనకు ఏ ప్రోత్సాహమునిచ్చాడు? (బి) వెలుపటివారియెడల మనమెలా జ్ఞానముతో నడుచుకొనగలము?

[Picture on page 18]

ఎడమ: వరదలొచ్చిన తర్వాత ఫ్రాన్సులోని తమ పొరుగువారికి నిజక్రైస్తవులు సహాయంచేయుట

[Picture on page 20]

క్రైస్తవుల దయాపూర్వకమైన క్రియలు దురభిమానమును తొలగించుటకు ఎంతగానో దోహదపడును

[Picture on page 23]

క్రైస్తవులు “ప్రతిసత్కార్యమునకు సిద్ధముగా” ఉండాలి