బాల్యమునుండే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం
జీవిత కథ
బాల్యమునుండే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం
డేవిడ్. జెడ్. హిబ్ష్‌మన్ చెప్పినది
“నా మరణం ఆసన్నమైంది, నేను చివరికంటా యెహోవాకు విశ్వసనీయంగా ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నాను. నా డేవిడ్‌ను చూసుకోమని నేను యెహోవాను అడుగుతున్నాను. నాకు ఆయన్నిచ్చినందుకూ, మా వివాహానికీ కూడా యెహోవా, నీకు కృతజ్ఞతలు. మా వైవాహిక జీవితం ఎంతో అన్యోన్యంగా గడిచింది, అది చాలా ఆనందకరమైనది!”
నా భార్యను 1992 మార్చిలో సమాధి చేసి వచ్చిన తర్వాత నేను ఆమె డైరీలో వ్రాసివున్న చివరి మాటలను కనుగొన్నప్పుడు నా భావాలను ఊహించండి. అప్పటికి 5నెలల క్రితమే, పూర్తికాల పరిచర్యలో హెలెన్ గడిపిన 60వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము.
అమెరికాలోని ఒహాయో నందు కొలంబస్‌లో 1931 లో జరిగిన సమావేశంలో హెలెన్, నేను ప్రక్కప్రక్కనే కూర్చున్న ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తుంది. అప్పటికి హెలెన్‌కు కనీసం 14 సంవత్సరాలైనా లేవు, కానీ ఆమెకు ఆ సమావేశంపట్ల నాకన్నా ఎక్కువ మెప్పుదల ఉంది. హెలెన్‌కు పరిచర్యపట్ల ఉన్న ఆసక్తి, ఆ తర్వాత కొద్దికాలానికి ఆమె, విధవరాలైన వాళ్ళమ్మగారు పయినీర్లు అవ్వడంలోనే ప్రదర్శితమైంది, యెహోవాసాక్షుల్లో పూర్తికాల ప్రచారకులను పయినీర్లని పిలుస్తారు. వారు సౌకర్యవంతమైన ఇంటిని విడిచిపెట్టి, అమెరికాలోని దక్షిణభాగంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రకటించేందుకు వెళ్ళారు.
నా క్రైస్తవ వారసత్వం
నా తల్లిదండ్రులు 1910 లో వారి చిన్న పిల్లలతో తూర్పు పెన్సిల్వేనియా నుండి గ్రోవ్ పట్టణానికి—రాష్ట్రంలోని పశ్చిమ భాగానికి తరలివెళ్ళారు. అక్కడ వాళ్ళు వాయిదాల రూపంలో చెల్లించేలా ఒక సాధారణ గృహాన్ని తీసుకొని రీఫామ్డ్ చర్చిలో చురుకైన సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే ఇప్పుడు యెహోవాసాక్షులని పిలువబడే బైబిలు విద్యార్థుల్లో ఒకరైన విలియమ్ ఇవాన్స్ వారిని కలిశారు. అప్పటికి సుమారు 25 సంవత్సరాలు ఉన్న మా నాన్నగారు, ఆయన కంటే ఐదు సంవత్సరాలు చిన్నదైన మా అమ్మ స్నేహపూర్వకంగా ఉన్న ఆ వేల్స్‌వాసి చెప్తున్నవి విని, ఆయనను ఒకసారి భోజనానికి
పిలిచారు. త్వరలోనే తాము నేర్చుకుంటున్న బైబిలు సత్యాలను వారు హత్తుకున్నారు.నాన్నగారు, సంఘానికి దగ్గరగా ఉండేందుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న షారోన్ అనే పట్టణానికి కుటుంబాన్ని తీసుకువెళ్ళారు. కొన్ని నెలల తర్వాత 1911 లోనో, 1912 లోనో అమ్మ, నాన్న బాప్తిస్మం పొందారు. వాచ్ టవర్ సొసైటీ మొదటి అధ్యక్షుడైన చార్ల్స్ తేజ్ రస్సెల్ బాప్తిస్మ ప్రసంగాన్ని ఇచ్చారు. నేను 1916, డిసెంబరు 4న పుట్టాను, నా తల్లిదండ్రులకు అప్పటికే నలుగురు పిల్లలు. నేను పుట్టినప్పుడు, “ప్రేమించడానికి మరో సహోదరుడు” అని ప్రకటించబడింది. అందుకనే, నాపేరు డేవిడ్ అంటే దానర్థం “ప్రియమైనవాడు” అని.
నాకు నాలుగు వారాలు వయస్సున్నప్పుడు నన్ను మొదటి సమావేశానికి తీసుకువెళ్ళారు. ఆ ప్రారంభ రోజుల్లో మా నాన్నగారు, మా అన్నయ్యలు ఎంతోదూరం నడిచి వెళ్తుంటే, మా అక్కను నన్ను మా అమ్మ స్ట్రీట్‌కారులో తీసుకువెళ్లేది. కూటాలు ఉదయం, మధ్యాహ్నం జరుగుతుండేవి. ఇంట్లో కావలికోట నుండి, గోల్డెన్ ఏజ్ అని అప్పట్లో పిలువబడిన తేజరిల్లు! నుండి చర్చలు జరుగుతుండేవి.
మంచి మాదిరుల నుండి ప్రయోజనం పొందడం
పిల్‌గ్రిమ్స్ అని పిలువబడే చాలామంది ప్రయాణ ప్రసంగీకులు మా సంఘాన్ని సందర్శిస్తూండేవారు. సాధారణంగా వాళ్ళు మాతో ఒకటి లేదా రెండు దినాలు గడుపుతూ ఉండేవాళ్లు. వాల్టర్ జె. థార్న్ అనే ప్రసంగీకుడు నా మదిలో అలా నిలిచిపోయిన ఒక వ్యక్తి. ‘ఆయన బాల్యదినములందే తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొన్న’ వ్యక్తి. (ప్రసంగి12:1) నా చిన్నప్పుడు, మానవజాతి చరిత్రను గూర్చిన “ఫోటో-డ్రామా ఆఫ్ క్రియేషన్” అనే నాలుగు భాగాల దృశ్య శ్రవణ ప్రదర్శనను చూపించడంలో నాన్నగారికి సహాయంగా ఉండేవాడిని.
సహోదరుడు ఇవాన్స్, ఆయన భార్య మిర్యాముకు పిల్లలు లేకపోయినప్పటికీ, వారు మా కుటుంబానికి ఆధ్యాత్మిక తల్లిదండ్రులు, తాతామామ్మలు అయ్యారు. విలియమ్ నాన్నగారిని ఎప్పుడూ “సన్” అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు మా కుటుంబంలో సువార్తను ప్రకటించాలనే స్ఫూర్తిని కలిగించారు. సహోదరుడు ఇవాన్స్ 20 శతాబ్దం తొలి సంవత్సరాల్లో స్వాన్సియా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బైబిలు సత్యాలను ప్రకటించేందుకు మరలా వేల్స్‌కి వెళ్ళారు. అక్కడ ఆయన అమెరికా నుండి వచ్చిన సువార్తికుడుగా పేరుపొందాడు.
1928 లో సహోదరుడు ఇవాన్స్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పశ్చిమ వర్జీనియాలోని కొండప్రాంతాలలో ప్రకటించడం మొదలుపెట్టాడు. మా అన్నలు—21 సంవత్సరాల క్లెరెన్స్, 19 సంవత్సరాల కార్ల్ ఇద్దరూ ఆయనతో పనిచేసేందుకు వెళ్ళారు. మేము నలుగురం అబ్బాయిలమూ చాలా సంవత్సరాలు పూర్తికాల పరిచర్యలో గడిపాము. వాస్తవానికి, యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్తలుగా మేమందరమూ మా యౌవన కాలంలో సేవ చేశాము. కొద్దికాలం క్రితం తన 90వ పడిలో ఉన్న మా చిన్నమ్మ నాకు ఇలా వ్రాసింది: “సహోదరుడు ఇవాన్స్ పరిచర్యపట్ల అత్యంత ఆసక్తిని కలిగివుండటం వల్ల ఆయన గ్రోవ్ పట్టణాన్ని దర్శించాడు, దానికి మనమందరమూ ఎంతో కృతజ్ఞులం!” మా చిన్నమ్మ మేరి తన బాల్యము నుండే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న మరొక వ్యక్తి.
సమావేశాలకు హాజరవడం
ఒహాయోలోని సీడార్ పాయింట్‌లో 1922 లో జరిగిన చరిత్రాత్మకమైన సమావేశానికి నాన్నగారు, క్లెరెన్స్ మాత్రమే హాజరవ్వగలిగారు. మేము 1924కల్లా ఒక వాహనం కొనుక్కున్నాము, ఒహాయోలోని కొలంబస్‌లో జరిగిన సమావేశానికి మేం అందరమూ హాజరయ్యాము. చిన్నపిల్లలమైన మేము ఆ ఎనిమిదిరోజుల సమావేశంలో తినడానికి మేము దాచుకుని ఉంచుకున్న మా స్వంత డబ్బునే ఖర్చు చేయాలని చెప్పేవారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ కాళ్ళపై తాము నిలబడటం నేర్చుకోవాలని నా తల్లిదండ్రుల ఉద్దేశ్యం. కోళ్ళను, కుందేళ్లను, తేనెటీగలను పెంచేవాళ్ళం. మగపిల్లలమందరమూ న్యూస్ పేపర్ వేసేవాళ్ళం.
1927 లో కెనడాలోని టొరంటో సమావేశం దగ్గరపడే సమయానికి ఆర్నెల్ల వయసుగల పాల్ అనే చిన్న తమ్ముడు మాకు ఉన్నాడు. అందరూ మిగిలిన పిల్లలతో సమావేశానికి వెళ్తే పెళ్లైన మా చిన్నమ్మ సహాయంతో వాడిని చూసేందుకు నేను ఉండిపోవల్సివచ్చింది. అందుకు బహుమతిగా
నాకు 10 డాలర్లు ఇచ్చారు, దానితో నేను తర్వాత నా కోసం ఒక సూట్ కొనుక్కున్నాను. కూటాలకు శుభ్రంగా తయారై వెళ్ళాలనీ, మా దుస్తులను శుభ్రంగా ఉంచుకోవాలనీ మాకు ఎల్లప్పుడూ శిక్షణ ఇవ్వబడుతూ ఉండేది.కొలంబస్‌లోని ఒహాయోలో 1931 లో జరిగిన చిరస్మరణీయమైన సమావేశం నాటికి క్లెరెన్స్, కార్ల్ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని వారి భార్యలతో సహా పయినీరింగ్ చేస్తున్నారు. సొంతంగా తయారుచేసుకున్న మొబైల్ హోమ్‌లో వాళ్ళు నివసించేవారు. కార్ల్ పశ్చిమ వర్జీనియాలోని వీలింగ్ వాస్తవ్యురాలైన క్లెయిర్ హూస్టన్‌ను పెళ్ళి చేసుకున్నాడు, కొలంబస్ సమావేశంలో హెలెన్ ప్రక్కన నేను కూర్చోవడానికి కారణం, ఈ క్లెయిర్‌కి ఆమె చెల్లి కావడమేనన్నమాట.
పూర్తికాల పరిచర్య
1932 లో నాకు 15 ఏండ్లున్నప్పుడు, హైస్కూల్ పాసయ్యాను. ఆ తర్వాత సంవత్సరంలో దక్షిణ కరోలినాలో పయినీరింగ్ చేస్తున్న క్లెరెన్స్‌కి సెకెండ్ హ్యాండ్ కారు ఇవ్వడానికి వెళ్ళాను. నేను పయినీర్ సేవకు దరఖాస్తు పెట్టి, క్లెరెన్స్‌తోనూ మా వదినతోనూ కలిసి పని ప్రారంభించాను. అప్పటికి, కెంటకీలోని హాప్‌కిన్స్‌విల్‌లో హెలెన్ పయినీరింగ్ చేస్తుంది, నేను ఆమెకు మొదటి ఉత్తరం వ్రాశాను. ఆమె జవాబులో ఆమె ఇలా అడిగింది: “నువ్వు పయినీర్‌వేనా?”
నా ఉత్తరంలో నేను ఇలా జవాబిచ్చాను, “నేను పయినీరునే, ఎప్పటికీ పయినీర్‌గానే ఉండాలనుకుంటున్నాను.” ఆ ఉత్తరాన్ని ఆమె చనిపోయేంత వరకూ అంటే 60 సంవత్సరాల వరకూ దాచుకుంది. నా ప్రకటనా నియామకంలో, ద కింగ్‌డమ్, ద హోప్ ఆఫ్ ద వరల్డ్ అన్న బుక్‌లెట్‌ను మతనాయకులకు, న్యాయస్థానంలో పని చేసే అధికారులకు ఎలా పంచిపెట్టానో హెలెన్‌కు ఆ ఉత్తరంలో వ్రాశాను.
1933 లో నాన్నగారు నాకు ఒక టెంట్ ఆన్ వీల్స్‌ని ఇచ్చారు—అది ఎనిమిది అడుగుల పొడవు ఆరున్నర అడుగుల వెడల్పుతో, ముందు వెనకల్లో రెండు కిటికీలతో ఉన్న బండి. దానికి పైకప్పుగా ఆయన కేన్వాస్‌ని కొన్ని నిలువుగా ఉన్న కర్రలమీదుగా కప్పాడు. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాల పయినీరుసేవకు అది నిరాడంబరమైన ఇల్లుగా పనిచేసింది.
1934 మార్చిలో, క్లెరెన్స్, కార్ల్, వాళ్ళ భార్యలు, హెలెన్, వాళ్ళ అమ్మగారు, క్లెరెన్స్ వాళ్ళ మరదలు, నేను మొత్తం ఎనిమిది మందిమి, పశ్చిమాన కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ సమావేశానికి హాజరయ్యాము. కొంతమంది నా ట్రెయిలర్ బండిలోనే ప్రయాణించి సమావేశం రోజుల్లో అందులోనే నిద్రపోయారు. నేను కారులో నిద్రపోతే మిగతావాళ్ళు లాడ్జిలో నిద్రపోయారు. వెళ్ళే దారిలో మాకు కారు కాస్త ఇబ్బంది కలిగించడంవల్ల ఆరు రోజుల సమావేశానికి రెండవ రోజున హాజరయ్యాము. చివరికి అక్కడ, మార్చి 26న హెలెన్, నేను మా సమర్పణకు సూచనగా నీటి బాప్తిస్మం పొందాము.
ఆ సమావేశంలో, అప్పటి వాచ్ టవర్ సొసైటీ అధ్యక్షుడైన జోసఫ్ ఎఫ్. రథర్‌ఫర్డ్ అందరు పయినీర్లను వ్యక్తిగతంగా కలిశాడు. ఆయన మమ్మల్ని ప్రోత్సహించి, మేము బైబిలు సత్యాల యోధులమని చెప్పాడు. ఆ సమయంలోనే, పయినీర్లు తమ పరిచర్యలో కొనసాగేలా వారికి ఆర్థిక సహాయం ఇవ్వడం ఆరంభమయ్యింది.
జీవితం కొరకైన విద్య
లాస్ ఏంజిల్స్ సమావేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత, దక్షిణ కరోలినా, వర్జీనియా, దక్షిణ వర్జీనియా, కెంటకి ప్రాంతాల్లో రాజ్యసందేశాన్ని అందరితోనూ పంచుకున్నాము. సంవత్సరాల తర్వాత ఆ సమయాన్ని గురించి హెలెన్ ఇలా వ్రాసింది: “ఆధారపడేందుకు అక్కడ సంఘంలేదు, సహాయం చేయడానికి స్నేహితులు లేరు, ఎందుకంటే మేము అపరిచిత ప్రదేశంలో వాస్తవానికి అపరిచితులము. కానీ నేనా కాలంలో జీవితం కొరకైన విద్యను సంపాదించుకున్నానని ఇప్పుడు గ్రహిస్తున్నాను. నేను జ్ఞానంలో ఎదుగుతున్నాను.”
ఆమె ఇంకా ఇలా వ్రాసింది: “స్నేహితుల నుండి పరిచయం ఉన్న పరిసరాల నుండి దూరంగా వెళ్ళిపోయిన ఒక యౌవనస్థురాలు తన సమయాన్ని ఎలా గడుపుతుంది? నా పరిస్థితి మరీ ఘోరంగా ఏమీ లేదు. నాకు బోరుకొట్టినట్టనిపించిన సందర్భాలు నాకు గుర్తే లేవు. నేను చాలా చదివేదాన్ని. మేము మా పట్టిక ప్రకారం బైబిలు సాహిత్యాన్ని చదవకుండా
అధ్యయనం చేయకుండా ఎప్పుడూ ఉండలేదు. మా అమ్మకి అతి సన్నిహితంగా ఉండి, మాకున్న డబ్బును ఎలా ఉపయోగించాలో, షాపింగ్ ఎలా చేయాలో, కారు టైర్లను ఎలా మార్చాలో, వంట ఎలా చేయాలో, ఎలా కుట్టాలో, ఎలా ప్రకటించాలో ఇవన్నీ నేర్చుకున్నాను. నేను విచారించడం లేదు, మరలా అలాంటి సందర్భాలు వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను.”హెలెన్ తల్లికి ఒక చక్కని స్వంత ఇల్లు ఉన్నప్పటికీ, ఆ సంవత్సరాల్లో వాళ్ళు చిన్న ట్రెయిలర్ బండితో తృప్తిపడ్డారు. 1937 ఒహాయోలోని కొలంబస్‌లో సమావేశం అయిన తర్వాత హెలెన్ తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆమెను హాస్పిటల్‌లో ఉంచాల్సివచ్చింది. ఆమె తన నియామకంలో ఉండగానే, పశ్చిమ వర్జీనియాలోని ఫిలిప్పీలో 1937 నవంబరులో ఆమె చనిపోయింది.
వివాహం, సేవలో కొనసాగడం
పశ్చిమ వర్జీనియాలోని వీలింగ్ దగ్గర ఉన్న ఎల్మ్‌గ్రోవ్‌లో హెలెన్ పుట్టిన ఇంట్లోనే 1938, జూన్ 10న చాలా నిరాడంబరంగా వివాహం చేసుకున్నాము. నేను పుట్టక మునుపు మా కుటుంబానికి సత్యాన్ని పరిచయం చేసిన, మా ప్రియ సహోదరుడైన ఇవాన్స్ వివాహ ప్రసంగాన్ని ఇచ్చాడు. వివాహం అయిన తర్వాత హెలెన్ నేను తూర్పు కెంటకీలో పయినీరు సేవను చేసేందుకు నిశ్చయించుకున్నాము, కానీ మాకు ఆశ్చర్యకరంగా జోన్ పని చేయడానికి ఆహ్వానం వచ్చింది. ఈ పనిలో దక్షిణ కెంటకీలోనూ, టెన్నెసీలోని ఇతర భాగాల్లోనూ ఉన్న యెహోవాసాక్షుల గుంపులను కలిసి వారి పరిచర్యలో వారికి సహాయం చేయడం ఇమిడివుంది. అప్పటికి అక్కడ మేము దర్శించిన ఆ ప్రాంతాలన్నింటిలో కేవలం 75 మంది రాజ్యప్రచారకులు మాత్రమే ఉన్నారు.
ఆ సమయంలో జాతీయతావాదం చాలామంది ఆలోచనా సరళిని భ్రష్టుపట్టించింది, నా క్రైస్తవ తటస్థత మూలంగా నన్ను త్వరలోనే జైల్లో పెడతారని నేను అనుకున్నాను. (యెషయా 2:4) అయితే, నా ప్రకటనా కార్యకలాపాల చరిత్ర మూలంగా, సైనిక భర్తీ బోర్డు జారీచేసిన వర్గీకరణలో ఉన్న మినహాయింపులను ఉపయోగించుకుని సైన్యంలో చేరడానికి బదులుగా నా పూర్తికాల పరిచర్యను కొనసాగించాను.
మేము మా ప్రయాణ పనిని ప్రారంభించినప్పుడు, అనేకమంది మా యౌవనంలో మేము ఆ పనిని చేస్తున్నామని గుర్తించారు. కెంటకీలోని హాప్‌కిన్స్‌విల్‌లో ఒక క్రైస్తవ సహోదరి హెలెన్‌ను గట్టిగా హత్తుకొని “నేను గుర్తున్నానా?” అని అడిగింది. ఒక చిన్నగ్రామంలో తన భర్తకు ఉన్న దుకాణంలో ఒకరోజు హెలెన్ ఆమెకు సాక్ష్యమిచ్చింది, అది 1933 లో జరిగిన విషయం. ఆమె సండేస్కూల్ టీచరు, ఆమె చదవడానికి హెలెన్ ఒక పుస్తకాన్ని ఇస్తే ఆమె దాన్ని చదివింది. తర్వాత ఆ క్లాస్ ముందు నిలబడి, ఆమె బైబిలు బోధలు కాని వాటిని బోధించినందుకు క్షమాపణలు చెప్పుకుంది. చర్చికి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఆమె తన సమాజంలో బైబిలు సత్యాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. నేను, హెలెన్ కెంటకీలో పశ్చిమ ప్రాంతంలో మూడు సంవత్సరాలు పనిచేశాము, ఆ సహోదరి ఆమె భర్త ఉంటున్న ఇంటిని మా కోసం ఇచ్చారు.
ఆ రోజుల్లో మాకు చిన్న స్థానిక సమావేశాలు ఉండేవి, వాటిలో ఒకదానికి ఎ. హెచ్. మాక్‌మిలన్ వచ్చారు. హెలెన్ చిన్నప్పుడు, ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు, అందుకని ఆ సమావేశ సమయంలో, వేరే మంచం ఉన్న 16 అడుగుల ఆ మొబైల్ హోమ్‌లో మాతో పాటు నివసించాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఆయన కూడా తన మహా గొప్ప సృష్టికర్తను తన యౌవనంలోనే స్మరణకు తెచ్చుకున్న వ్యక్తి, 1900 సంవత్సరంలో ఆయనకు 23 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నారు.
1941 నవంబరులో ప్రయాణ సహోదరుల పని తాత్కాలికంగా నిలిపివేయబడింది, కెంటకీలోని హాజార్డ్‌లో పయినీరు సేవ చేసేందుకు నాకు నియామకం అప్పగించబడింది. మేము మా అన్నయైన కార్ల్‌తోనూ, మా వదిన క్లెయిర్‌తోనూ మరొకసారి పనిచేశాము. ఇక్కడ హెలెన్ అన్న కొడుకైన జోసఫ్ హూస్టన్ మాతో పాటు కలిసి పయినీరింగ్ ప్రారంభించాడు. ఆయన 50 సంవత్సరాలు తన పూర్తికాల పరిచర్యను కొనసాగించాడు, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో నమ్మకంగా సేవచేస్తుండగానే అకస్మాత్తుగా గుండెపోటు వల్ల 1992 లో మరణించాడు.
మేము 1943 లో కనెక్టికట్‌లోని రాక్‌విల్‌లో నియమించబడ్డాము. అది మాకు క్రొత్త అనుభవం; ఎందుకంటే హెలెన్‌కు నాకు దక్షిణం వైపు ప్రకటించడమే బాగా అలవాటు. రాక్‌విల్‌లో హెలెన్ క్రమంగా వారానికి 20కిపైగా గృహ బైబిలు పఠనాలను చేసేది. చివరికి, ఒక నిరాడంబర గదిని రాజ్యమందిరం కోసం అద్దెకు తీసుకొన్నాము, అలా ఒక చిన్న సంఘానికి కేంద్రం ఏర్పడింది.
రాక్‌విల్‌లో సేవ చేస్తున్నప్పుడు, న్యూయార్క్‌లోని సౌత్ లాన్సింగ్‌లో జరిగిన వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ ఐదవ తరగతికి ఆహ్వానించబడ్డాము. పయినీర్ రోజుల నుండి మా స్నేహితులైన ఓబ్రే బైవాన్స్, బెర్తా బైవాన్స్‌లు మాకు క్లాస్‌మేట్‌లు కాబోతున్నారన్న వార్త సంతోషాన్ని కల్గించింది.
పాఠశాల, మా క్రొత్త నియామకం
మేమే చిన్నవాళ్ళమైనప్పటికీ, మాకంటే చిన్నవాళ్ళు అక్కడ ఉన్నారు. అవును, వారు తమ గొప్ప సృష్టికర్తను తమ
యౌవనంలో స్మరణకు తెచ్చుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి కాస్త ముందే—1945 జూలైలో మేము పట్టభద్రులమయ్యాము. మేము మా మిషనరీ నియామకం కోసం ఎదురు చూస్తున్న ఆ సమయంలో మేము న్యూయార్క్, బ్రూక్లిన్‌లోని ఫ్లాట్‌బుష్ సంఘంలో సేవచేశాము. చివరికి, 1946, అక్టోబరు 21న మేము, బైవాన్స్ దంపతులు, నలుగురు ఇతర క్లాస్‌మేట్‌లు కలిసి గ్వాటిమాలా దేశంలోని గ్వాటిమాలా సిటీలో మా క్రొత్త గృహానికి చేరుకున్నాము. ఆ సమయంలో మధ్య అమెరికా దేశమంతటిలో, యెహోవాకు 50 కంటే తక్కువమందే సాక్షులున్నారు.మాలో కొంతమంది మిషనరీలం 1949 ఏప్రిల్‌లో ఆ దేశంలో విస్తీర్ణతలోనూ, ప్రాముఖ్యతలోనూ, రెండవపట్టణమైన క్వెట్‌జాల్‌టినాంగో అన్న పట్టణానికి వెళ్ళాము. ఈ పట్టణం, సముద్రమట్టానికి 7,500 అడుగుల ఎగువన ఉంది, దాని గాలి వేగంగానూ, స్వచ్ఛంగానూ ఉంటుంది. హెలెన్ అక్కడి మా పనిని క్లుప్తంగా ఇలా వ్రాసింది: “డజన్ల కొలది పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ప్రకటించడం మా ఆధిక్యత. ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి, ఒక బస్‌లో (కిటికీల స్థానంలో కేన్వాస్ తెరలు ఉండేవి) ఒక దూర పట్టణానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మేము దాదాపు ఎనిమిది గంటలు పనిచేసి సాయంకాలానికి కాస్త ముందు తిరిగి వచ్చేవాళ్ళం.” ఇప్పుడు, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల సంఘాలున్నాయి, క్వెట్‌జాల్‌టినాంగోలో ఆరు సంఘాలు ఉన్నాయి.
మిషనరీలందరికీ, గ్వాటిమాలాలో మూడవ పెద్ద పట్టణం, కరీబియన్ సముద్ర తీరంలో ఉన్న ప్యూర్టో బారియోస్‌లో పని చేసేందుకు త్వరలోనే పిలుపు వచ్చింది. ఈ నియామకంలో పనిచేసేందుకు వెళ్ళిన వాళ్ళలో, గ్వాటిమాలాలో మాతో పాటు ఐదు సంవత్సరాలు పని చేసిన మాకు ప్రియమైన బైవాన్స్ దంపతులు కూడా ఉన్నారు. ఈ వీడ్కోలు చాలా బాధను కలిగించింది, వెలితిగా కూడా అనిపించింది. ఆ తర్వాత నేను, హెలెన్ ఆ మిషనరీ గృహాన్ని విడిచిపెట్టి ఒక చిన్న అపార్ట్‌మెంటులోకి వెళ్ళిపోయాము. ఉష్ణమండల పట్టణమైన మాజ్‌టేనాంగో పట్టణానికి 1955 లో హెలెన్, నేను క్రొత్త నియామకాన్ని తీసుకొని వెళ్ళాము. అక్కడికి మేము వెళ్ళకముందు 1953 గిలియడ్ తరగతి నుండి పట్టభద్రులైన మా తమ్ముడు పాల్, అతని భార్య డలోరిస్ కొంతకాలం పనిచేశారు.
గ్వాటిమాలాలో 1958వ సంవత్సరానికి అక్కడ 700 మంది సాక్షులు, 20 సంఘాలు, 3 సర్క్యూట్‌లు ఉన్నాయి. హెలెన్, నేను మరలా ప్రయాణపనిలో పాల్గొని, క్వెట్‌జాల్‌టినాంగోలో ఒకదానితో సహా అనేక సంఘాలనూ, చిన్న చిన్న సాక్షుల గుంపులను కూడా దర్శించాము. ఆ తర్వాత 1959 ఆగస్టులో గ్వాటిమాలా సిటీకి ఆహ్వానం వచ్చింది, అక్కడ మేము బ్రాంచి ఆఫీసులో నివసించాము. నేను బ్రాంచిలో పనిచేసేందుకు నియమించబడ్డాను, హెలెన్ మరో 16 సంవత్సరాల పాటు మిషనరీ సేవను కొనసాగించింది. ఆ తర్వాత ఆమె కూడా బ్రాంచి కార్యాలయంలో పనిచేయడం ప్రారంభించింది.
ఇతర ఆశీర్వాదాలు
సంవత్సరాల క్రితం యెహోవాను సేవించే వాళ్ళలో నేనే చాలా చిన్నవాడినని తలంచేవాడిని. ఇప్పుడు చూస్తే తరచు నేనే పెద్దవాడిగా కనబడతాను. 1996 లో న్యూయార్కులోని ప్యాటర్‌సన్ బ్రాంచ్ స్కూలుకి హాజరయినప్పుడు ఇది వాస్తవం. నా బాల్యంలో నేను పెద్దవాళ్ళ నుండి సహాయం పొందినట్లుగానే, ఇటీవలి దశాబ్దాల్లో తమ బాల్యంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలనుకునే యౌవనులకు సహాయం చేయడం నా ఆధిక్యత.
యెహోవా, గ్వాటిమాలాలోని తన ప్రజలపై ఆశీర్వాదాలను క్రుమ్మరిస్తూనే ఉన్నాడు. గ్వాటిమాలా సిటీలో 1999 లో 60కన్నా ఎక్కువ సంఘాలు ఉన్నాయి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలలో కూడా ఎన్నో సంఘాల్లో, దేవుని రాజ్యసువార్తను ప్రకటించే వేలాదిమంది ఉన్నారు. 53 సంవత్సరాల క్రితం మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 50 మంది మాత్రమే ఉన్న ప్రచారకులు ఇప్పుడు 19,000 వరకు అభివృద్ధి చెందారు!
కృతజ్ఞతగా ఉండేందుకు ఎన్నో కారణాలు
జీవితంలో సమస్యలు లేకుండా ఏ ఒక్కరూ ఉండరు, కానీ మనం ఎల్లప్పుడూ మన “భారము యెహోవామీద” మోపాలి. (కీర్తన 55:22) ప్రేమ పూర్వక సహచరుల మద్దతు ద్వారా ఆయన మనలను ఆదుకొంటాడు. ఉదాహరణకు, హెలెన్ మరణించడానికి కొన్ని సంవత్సరాల క్రితం నాకు బైబిలు లేఖనమైన హెబ్రీయులు 6:10వ వచనం ఉన్న ఒక ఫలకాన్ని బహుమతిగా ఇచ్చింది: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”
దానితో పాటు ఉన్న మాటలు ఇలా ఉన్నాయి: “అమూల్యమైన మీకు, నేనివ్వగలిగేది చాలా తక్కువే, నా ప్రేమ తప్పించి . . . ఈ లేఖనం మీకు తగినది, నేను దీన్ని మీ డెస్క్‌పై ఉంచుకోమని కోరుతున్నాను, నేను ఇచ్చినందుకు కాదు, అది మీ అనేక సంవత్సరాల సేవలో మీకు అన్వయిస్తుంది.” ఈ రోజు వరకు ఆ ఫలకం గ్వాటిమాలా బ్రాంచ్‌లోని నా ఆఫీసు డెస్క్‌పై ఉంది.
నేను నా బాల్యం నుండే యెహోవాను సేవిస్తున్నాను, ఇప్పుడు, నా వృద్ధాప్యంలో నాకు అప్పగించబడిన నియామకాలను నిర్వర్తించడంలో నాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు నేను యెహోవాకు కృతజ్ఞుడను. నేను క్రమంగా బైబిలు పఠనం చేస్తాను, నేను లేఖనాలను చదువుతున్నప్పుడు నా ప్రియమైన హెలెన్ దీని క్రింద గీత పెట్టుకొని ఉండి ఉంటుందని అన్పించిన లేఖనాలు తరచు కన్పిస్తుంటాయి. నేను కీర్తనలు 48:14 చదువుతున్నప్పుడు నాకలా అన్పించింది, “ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.”
ఇప్పుడున్న వివిధ దేశాలకు చెందిన ప్రజలు తమ ప్రియమైన వారిని నూతనలోకంలోనికి ఆహ్వానించే ఆ పునరుత్థాన దిన దర్శనాన్ని గూర్చి ఇతరులతో పంచుకోవడం నాకు ఆనందదాయకం. ఎంతటి గొప్ప ఉత్తరాపేక్ష! యెహోవా నిజంగా “దీనులను ఆదరించు దేవుడు” అని మనం గుర్తు చేసుకుంటుండగా ఎన్ని ఆనంద బాష్పాలు కారుస్తామో కదా!—2 కొరింథీయులు 7:6.
[25వ పేజీలోని చిత్రం]
ఎడమవైపు పై నుండి సవ్యదిశగా: అమ్మ, నాన్నగారు, ఈవా ఆంటీ, కార్ల్, క్లెరెన్స్ అన్నయ్యలు, 1910 లో
[26వ పేజీలోని చిత్రాలు]
1947 లోను 1992 లోను హెలెన్‌తో