మనకు యెహోవా సంస్థ అగత్యం
మనకు యెహోవా సంస్థ అగత్యం
“నేను దేవుణ్ని నమ్ముతాను, కానీ ఒక సంస్థీకృత మతాన్ని అంటిపెట్టుకుని ఉండటం అవసరమని నేను నమ్మను.” ఇలా ఎవరన్నా అనటం మీరెప్పుడైనా విన్నారా? ఒకప్పుడు ఉత్సాహంగా చర్చికెళ్లినప్పటికీ, తమ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చలేకపోయిన తమ మతంతో నిరుత్సాహం చెందిన కొందరు వ్యక్తులు తరచూ అలాంటి దృక్కోణాలనే వ్యక్తపరుస్తుంటారు. మతసంస్థలతో నిరుత్సాహపడినప్పటికీ, అనేకులు తాము ఇప్పటికీ దేవుని ఆరాధించాలనే కోరుకుంటున్నామని చెప్తారు. అయితే, ఒక చర్చితోనో లేక ఏదో మతసంస్థతోనో కలిసి ఆరాధించటం కన్నా తమకు తోచినట్లుగానే ఆరాధించటం మంచిదని వారు నమ్ముతారు.
బైబిలు ఏమని చెబుతుంది? క్రైస్తవులు ఏదైనా సంస్థతో సహవసించాలని దేవుడు కోరుతున్నాడా?
తొలి క్రైస్తవులు సంస్థీకరించబడి ప్రయోజనం పొందారు
సా.శ. 33 పెంతెకొస్తునాడు, యెరూషలేము పట్టణంలోని మేడగదిలో “ఒకచోట” సమకూడిన స్త్రీపురుషుల సమూహంపై యెహోవా తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడే గానీ, ఏదో అక్కడక్కడా చెల్లాచెదరుగా ఒంటరిగా ఉన్న కొద్దిమంది విశ్వాసులపై కాదు. (అపొస్తలుల కార్యములు 2:1) ఆ సమయంలో, అటుతర్వాత అంతర్జాతీయ సంస్థగా ఎదిగిన ఒక క్రైస్తవసంఘం రూపొందింది. ఇది ఆ కాలంలోని తొలి శిష్యులకు ఒక నిజమైన ఆశీర్వాదంగా నిరూపించబడింది. ఎందుకని? ఒక వాస్తవం ఏమిటంటే, దేవుని రాజ్య సువార్తను చివరికి ‘లోకమంతటా ప్రకటించాలనే’ ప్రాముఖ్యమైన నియామకం వారికివ్వబడింది. (మత్తయి 24:14) సంఘంలోకి కొత్తగా ప్రవేశించినవారు ప్రచారపు పనిని ఎలా కొనసాగించాలనేది, అనుభవం ఉన్న సహవిశ్వాసులనుండి నేర్చుకోగలిగారు.
అనతికాలంలోనే రాజ్య సందేశం యెరూషలేము గోడలను దాటి సుదూరాలకు వ్యాపించింది. అపొస్తలుడైన పేతురు ఆధునిక-దిన టర్కీలోవున్న “పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ” దేశములలో చెదరివున్న క్రైస్తవులకు సా.శ. 62 నుండి సా.శ. 64 మధ్య కాలంలో తన మొదటి పత్రికను వ్రాశాడు. (1 పేతురు 1:1) పాలస్తీనా, లెబనాన్, సిరియా, కుప్ర (సైప్రస్), గ్రీసు, క్రేతు (క్రీట్), ఇటలీలలో కూడా విశ్వాసులు ఉన్నారు. పౌలు సా.శ. 60-61 లో కొలొస్సయులకు వ్రాసినట్లుగా, సువార్త ‘ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటించబడింది.’—కొలొస్సయులు 1:23.
సంస్థతో సహవసించటం వల్ల వచ్చిన రెండవ ప్రయోజనం, క్రైస్తవులు పరస్పరం అందజేసుకోగల ప్రోత్సాహం. సంఘ సహవాసంలో, క్రైస్తవులు ప్రేరణాత్మకమైన ప్రసంగాలను వినగల్గారు, పవిత్ర లేఖనాలను కలిసి అధ్యయనం చేయగల్గారు, విశ్వాసాన్ని బలపర్చే అనుభవాలను పంచుకోగల్గారు, సహవిశ్వాసులతో కలిసి ప్రార్థన చేయగల్గారు. (1 కొరింథీయులు, 14వ అధ్యాయం) అంతేగాక పరిణతి చెందిన పురుషులు “దేవుని మందను పైవిచారణ” చేయగలిగారు.—1 పేతురు 5:2.
సంఘ సభ్యులుగా క్రైస్తవులు ఒకరినొకరు తెలుసుకుని, పరస్పరం ప్రేమను ప్రదర్శించుకోగల్గారు. సంఘంతో సహవసించటం ఒక భారమన్నట్లు భావించటానికి బదులు తొలి క్రైస్తవులు దాని మూలంగా కట్టబడి, బలపర్చబడ్డారు.—అపొస్తలుల కార్యములు 2:42; 14:27; 1 కొరింథీయులు 14:26; కొలొస్సయులు 4:15, 16.
మరో కారణం, ప్రపంచవ్యాప్త సంఘంతో లేక సంస్థతో వారు ఐక్యమై ఉండటం ఐక్యతను పెంపొందింపజేస్తుంది. క్రైస్తవులు ‘ఏకభావముతో మాటలాడటం’ నేర్చుకున్నారు. (1 కొరింథీయులు 1:10) ఇది అవశ్యం. సంఘ సభ్యులు వేర్వేరు విద్యా, సాంఘిక నేపథ్యాలనుండి వచ్చారు. వారు భిన్నమైన భాషలను మాట్లాడేవారు, వారికి స్పష్టంగా వ్యక్తిత్వ విభేదాలు ఉండేవి. (అపొస్తలుల కార్యములు 2:1-11) కొన్ని సమయాల్లో నిజమైన అభిప్రాయ భేదాలే ఉండేవి. అయితే, క్రైస్తవులు అలాంటి భేదాల్ని సంఘ పరిధిలోనే పరిష్కరించుకోవటానికి సహాయాన్ని పొందారు.—అపొస్తలుల కార్యములు 15:1, 2; ఫిలిప్పీయులు 4:2, 3.
స్థానికంగా ఉన్న పెద్దలు వ్యవహరించలేని గంభీరమైన ప్రశ్నలు పౌలులాంటి పరిణతి చెందిన ప్రయాణ పైవిచారణకర్తలకు నివేదించబడేవి. ప్రాముఖ్యమైన సైద్ధాంతిక విషయాలు యెరూషలేములో ఉన్న కేంద్ర పరిపాలక సభకు నివేదించబడేవి. ఆ పరిపాలక సభ ప్రారంభంలో యేసుక్రీస్తు అపొస్తలులతో తయారైనప్పటికీ తర్వాత యెరూషలేము సంఘంలోని పెద్దలు కూడా అందులో భాగమయ్యారు. పరిచర్యను సంస్థీకరించటానికి, సేవా స్థానాలలో పురుషులను నియమించటానికి, సైద్ధాంతిక విషయాలపై నిర్ణయాలు చేయటానికి పరిపాలక సభకు దాని ప్రతినిధులకు దైవదత్తమైన అధికారం ఉన్నదన్న విషయాన్ని ప్రతి సంఘం గుర్తించింది. పరిపాలక సభ ఒక విషయాన్ని స్థిరపరచిన తర్వాత సంఘాలు ఆ నిర్ణయాన్ని అంగీకరించి, ‘ఆదరణ పొంది సంతోషించాయి.’—అపొస్తలుల కార్యములు 15:1, 2, 28, 30, 31.
అవును, యెహోవా మొదటి శతాబ్దంలో ఒక సంస్థను ఉపయోగించాడు. మరి నేటి విషయమేమిటి?
నేడు మనకు ఒక సంస్థ అవసరం
మొదటి శతాబ్దంలోని వారిలాగే యెహోవాసాక్షులు కూడా ఈనాడు రాజ్యసువార్త ప్రకటించమని ఇవ్వబడిన ఆజ్ఞను గంభీరంగా తీసుకుంటారు. అందుకు ఒక మార్గంగా బైబిళ్లను, బైబిలు పఠన సహాయకాలను వారు పంచిపెడతారు, దానికి సంస్థీకరణ అవసరం.
క్రైస్తవ ప్రచురణలను జాగ్రత్తగా తయారు చేసి, నిర్దుష్టత కోసం పరీక్షించి, ముద్రించి సంఘాలకు పంపించాలి. తర్వాత, ఆ సాహిత్యాన్ని చదువనిష్టపడే వారికి వాటిని అందజేయడానికి క్రైస్తవులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఈ విధంగా రాజ్యసందేశం కోట్లాదిమందిని చేరుకుంది. సువార్త ప్రచారకులు తమ ప్రచార కార్యకలాపం, కొన్ని ప్రాంతాల్లో అస్సలు పని జరుగకుండా కొన్ని ప్రాంతాల్లోనే అధికంగా పనిచేయడం వంటిది జరుగకుండా చూసేందుకు ఒక క్రమంలో తమ పనిని కొనసాగించేలా కృషి చేస్తారు. వీటన్నింటికీ సంస్థీకరణ అవసరం.
‘దేవుడు పక్షపాతి కాడు’ గనుక బైబిళ్లు, బైబిలు సాహిత్యం అనువాదం జరగాలి. (అపొస్తలుల కార్యములు 10:34) ప్రస్తుతం ఈ పత్రిక 132 భాషల్లోను, దీని సహపత్రిక తేజరిల్లు! 83 భాషల్లోను ప్రచురించబడుతోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా చక్కగా సంస్థీకరించబడిన అనువాదకుల బృందాలు అవసరం.
సంఘ సభ్యులు క్రైస్తవ కూటాలకు, సమావేశాలకు హాజరైనప్పుడు ప్రోత్సాహాన్ని పొందుతారు. అక్కడ వారు ప్రేరణాత్మకమైన బైబిలు ప్రసంగాలను వింటారు, లేఖనాలను కలిసి అధ్యయనం చేస్తారు, విశ్వాసాన్ని బలపర్చే అనుభవాలను పంచుకుంటారు, సహవిశ్వాసులతో కలిసి ప్రార్థన చేస్తారు. మొదటి శతాబ్దంలోని తమ సహోదరులవలే, వారు విశ్వాసాన్ని బలపరచే ప్రేమగల ప్రయాణ పైవిచారణకర్తల సందర్శనాలలో ఆనందిస్తారు. అలా, క్రైస్తవులు నేడు “మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును” అయ్యారు.—యోహాను 10:16.
నిజమే, తమ తొలి సహవాసుల్లాగే యెహోవాసాక్షులు పరిపూర్ణులేమీ కాదు. అయినా, వారు ఐక్యంగా కలిసి పనిచేస్తారు. ఫలితంగా, రాజ్య ప్రకటనా పని భూవ్యాప్తంగా ప్రకటించబడుతూ ఉంది.—అపొస్తలుల కార్యములు 15:36-40; ఎఫెసీయులు 4:13.
[31వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు నేడు “మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును” అయ్యారు