కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇటలీలో ఆదరణనిచ్చే సందేశాన్ని అందించడం

ఇటలీలో ఆదరణనిచ్చే సందేశాన్ని అందించడం

మనము విశ్వాసము గలవారము

ఇటలీలో ఆదరణనిచ్చే సందేశాన్ని అందించడం

యెహోవా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు.” ఆయన్ని అనుకరించడం నేర్చుకోవడం ద్వారా, ఆయన సేవకులు కూడా ‘ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించగలుగుతున్నారు.’ (2 కొరింథీయులు 1:3, 4; ఎఫెసీయులు 5:1) యెహోవాసాక్షులు చేసే ప్రకటనా పనిలో ఇది ఒక ముఖ్య లక్ష్యం.

అవసరంలో ఉన్న స్త్రీకి సహాయం

పేదరికం, యుద్ధం వంటివాటివల్ల, మంచి జీవితం కోసమైన అన్వేషణవల్ల ప్రత్యేకంగా ఇటీవలి సంవత్సరాల్లో చాలామంది సంపన్నదేశాలకు వలస వెళ్ళారు. కానీ కొత్త పరిసరాలకు అలవాటుపడటం అన్నది అంత తేలికైన విషయం కాదు. మాన్యోల తోటి అల్బేనియన్లతో బోర్గోమనేరో నందు నివసించేది. ఆమె ఇటలీలో చట్టవ్యతిరేకంగా ఉంటున్నందువల్ల, యెహోవాసాక్షి అయిన వాండాతో మాట్లాడటానికి సంకోచించేది. అయినప్పటికీ, వాండా ఎలాగోలా చివరికి మాన్యోలతో మాట్లాడటానికి సమయాన్ని ఏర్పాటు చేసుకుంది. భాషాపరమైన అడ్డంకి ఉన్నప్పటికీ ఆమె త్వరలోనే దేవుని వాక్య పఠనంలో గొప్ప ఆసక్తిని చూపించింది. అయితే, కొన్ని సందర్శనాల తర్వాత వాండా వాళ్లింట్లో ఎవరినీ కలువలేకపోయింది. ఏమి జరిగింది? ఆ ఇంట్లో ఉండే ఒకర్ని—మాన్యోల బోయ్‌ఫ్రెండ్‌—హత్యాకేసులో నిందితునిగా వెతుకుతుండడంతో ఆ ఇంట్లోవాళ్లందరూ పారిపోయారనీ వాండా తెలుసుకుంది.

నాలుగు నెలల తర్వాత, వాండా మళ్లీ మాన్యోలను కలుసుకుంది. “ఆమె ముఖం పాలిపోయి, శరీరం బక్కచిక్కిపోయి ఉంది, ఎన్నో కష్టాలను అనుభవించిన వారు ఎలా ఉంటారో అలా ఉంది” అని వాండా గుర్తు చేసుకుంటుంది. తన బోయ్‌ఫ్రెండ్‌గా ఉన్నవ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడనీ, సహాయం కోసం ఆమె ఏ స్నేహితులనైతే అడిగిందో వాళ్ళు ఆమెను పూర్తిగా నిరుత్సాహపరిచారనీ మాన్యోల వివరించింది. ఆ అసహాయస్థితిలో ఆమె సహాయంకోసం దేవునికి ప్రార్థించింది. అప్పుడు బైబిలు గురించి మాట్లాడిన వాండా ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఆమెను మళ్లీ కలిసినందుకు మాన్యోల ఎంత సంతోషించింది!

తిరిగి బైబిలు పఠనం ప్రారంభమైంది, త్వరలోనే మాన్యోల క్రైస్తవ కూటాలకు హాజరవడం మొదలుపెట్టింది. ఇటలీలో ఉండేందుకు ఆమె చట్టబద్ధ అనుమతి సంపాదించగలిగింది. సంవత్సరం తర్వాత, మాన్యోల బాప్తిస్మం పొందిన సాక్షి అయింది. దైవిక వాగ్దానాలతో ఆదరణ పొందినదై, బైబిలులోని ఆదరణకరమైన సందేశాన్ని తన తోటి దేశస్థులతో పంచుకోవడానికి ఆమె అల్బేనియాకు తిరిగి వచ్చింది.

వలసవచ్చిన వారి క్యాంపులో సాక్ష్యం ఇవ్వడం

ఇటలీలోని చాలా సంఘాలు మాన్యోల లాంటి వలసవచ్చిన వారికి సాక్ష్యమిచ్చేందుకు కొన్ని ఏర్పాట్లు చేశాయి. ఉదాహరణకు, ఫ్లోరెన్స్‌లోని ఒక సంఘం వలస వచ్చిన వారి క్యాంపులను క్రమంగా సందర్శించే ఏర్పాటును చేసింది. ఆ క్యాంపులో ఉండే అనేకమంది రకరకాల కష్టాలను అనుభవిస్తున్నారు. వాళ్ళు తూర్పు ఐరోపా, మాసిదోనియా, కాసోవోల నుండి వచ్చినవారు. కొంతమంది మాదకద్రవ్యాలకూ లేదా మత్తుపానీయాలకూ అలవాటు పడ్డారు. చాలామంది చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగించారు.

ఇలాంటి సమాజంలో ప్రకటించడం సవాలుతో కూడినది. అయినప్పటికీ, పావోలా అనే ఒక పూర్తికాల పరిచారకురాలు చివరికి జెక్‌లినా అనే మాసిదోనియా స్త్రీని కలిసింది. కొన్ని చర్చల అనంతరం, జెక్‌లినా తన స్నేహితురాలు సుజన్నాను బైబిలు పరిశీలించమని ప్రోత్సహించింది. అటుతర్వాత, సుజన్నా తన బంధువులతో మాట్లాడింది. త్వరలోనే, ఆ కుటుంబంలోని ఐదుగురు క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తూ, క్రైస్తవ కూటాలకు హాజరవుతూ, వాళ్ళు ఏమైతే నేర్చుకుంటున్నారో వాటిని అమలులో పెడుతూవున్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉన్నప్పటికీ, వాళ్ళు యెహోవా నుండి ఆయన వాక్యాన్నుండి ఆదరణ పొందుతున్నారు.

ఒక నన్‌ యెహోవా నుంచి ఆదరణను పొందింది

ఫోర్మీయ అనే పట్టణంలో, ఆస్సంటా అనే పూర్తికాల సువార్తికురాలు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్న ఒక స్త్రీతో మాట్లాడింది. ఆసుపత్రుల్లోను, వ్యక్తుల ఇండ్లల్లోను అనారోగ్యంతో, బలహీనస్థితిలో ఉన్న వారికి సహాయాన్ని అందించే ఒక మత శాఖలో ఆమె ఒక నన్‌గా ఉంది.

ఆస్సంటా నన్‌తో ఇలా చెప్పింది: “నువ్వు కూడా బాధపడుతున్నట్లున్నావు, కాదా? విచారకరంగా, మనమందరమూ బాధలను ఎదుర్కోవలసివుంది.” దానికి ఆ నన్‌ ఏడ్చి, తనకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలియజేసింది. బైబిలు ఎవరైతే దేవుడు అని చెప్తుందో ఆ దేవుడు ఆమెకు ఆదరణనిస్తాడని చెప్పి, ఆస్సంటా ఆమెను ప్రోత్సహించింది. ఆస్సంటా అందించిన బైబిలు ఆధారిత పత్రికలను ఆ నన్‌ తీసుకుంది.

వారి తర్వాతి సంభాషణలో, పాల్మీరా అనే ఆ నన్‌ తాను చాలా బాధపడుతున్నానని చెప్పింది. ఆమె నన్‌లచే నడిపించబడుతున్న ఇన్‌స్టిట్యూట్‌లో ఎంతోకాలంపాటు ఉంది. ఆమె ఆరోగ్యకారణాల్ని బట్టి తాత్కాలికంగా దాన్ని విడిచిపెట్టాక, ఆమె తిరిగి చేరడానికి అనుమతించబడలేదు. అయినప్పటికీ, పాల్మీరా నన్‌గా తాను దేవునికి చేసిన ప్రమాణాలకు బద్ధురాలినని భావించింది. ఆమె “స్వస్థత” కోసం స్వస్థతచేసే వారివద్దకు వెళ్లింది, కానీ మానసిక క్షోభ మాత్రమే ఆమెకు మిగిలింది. పాల్మీరా బైబిలు పఠనాన్ని అంగీకరించి సంవత్సరంపాటు క్రైస్తవ కూటాలకు హాజరైంది. తర్వాత ఆమె మరో స్థలానికి మారిపోవడంతో ఆ సాక్షి ఆమెను కలువలేకపోయింది. మళ్లీ ఆస్సంటా ఆమెను కలిసేసరికి రెండేళ్లు గడిచిపోయాయి. పాల్మీరా తన కుటుంబాన్నుంచీ, పాదిరీల నుంచీ గొప్ప వ్యతిరేకతను ఎదుర్కొంది. అయినప్పటికీ, ఆమె తన బైబిలు పఠనాన్ని తిరిగి ప్రారంభించి ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించి యెహోవాసాక్షిగా బాప్తిస్మం పొందింది.

అవును, అనేకమంది ‘ఆదరణను అనుగ్రహించు దేవుని’ సందేశంతో ప్రోత్సహించబడ్డారు. (రోమీయులు 15:4, 5) అందుకని ఇటలీలోని యెహోవాసాక్షులు దేవుని అద్భుతమైన ఆదరణ సందేశాన్ని ఇతరులకు అందజేస్తూ ఆయన్ని అనుకరిస్తూనే ఉండాలని నిశ్చయించుకున్నారు.