కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రవచన వాక్యం భవిష్యత్తుపై ఆశనిస్తుంది

దేవుని ప్రవచన వాక్యం భవిష్యత్తుపై ఆశనిస్తుంది

దేవుని ప్రవచన వాక్యం భవిష్యత్తుపై ఆశనిస్తుంది

నిజ క్రైస్తవులు దేవుని వాక్యమైన బైబిలు మూలంగా, భవిష్యత్తును విశ్వాసంతో, నిరీక్షణతో, ఆశాభావంతో చూస్తారు. యెహోవా దేవునితో తమకు మంచి సంబంధం ఉన్నందువల్ల, వాళ్ళు రేపటి కోసం ఎదురు చూస్తారు. “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశాల్లోని మొదటి ప్రసంగం వివరించినట్లు, యెహోవాసాక్షులు అనేక సంవత్సరాలుగా బైబిలు ప్రవచనాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తున్న విద్యార్థులుగా ఉన్నారు. అయితే, యెహోవా తన ప్రజల కోసం ఈ సమావేశాల్లో ఏం సిద్ధం చేసి ఉంచాడు? హాజరైన వాళ్ళంతా తమ చేతుల్లో బైబిళ్లు ఉంచుకుని, ఆయన ఏమి సిద్ధం చేసి ఉంచాడో తెలుసుకోవాలనే ఆతురతతో ఉన్నారు. ఒక్కోరోజు అంశాన్ని ఒక్కో సబ్‌హెడ్డింగ్‌ క్రింద పరిశీలించుదాం.

మొదటి రోజు: దేవుని వాక్యపు వెలుగులో నడవడం

యెహోవా ప్రజలు, చీకటిలో ప్రయాణం మొదలుపెట్టిన వ్యక్తిని పోలి ఉన్నారు అని “దేవుని వాక్యం మనల్ని నడిపించింది” అనే ప్రసంగం వివరించింది. సూర్యుడు ఉదయిస్తుండగా, ఆ వ్యక్తి అన్నింటిని లీలగా చూడడం మొదలుపెడతాడు, సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తున్నప్పుడు, అతడు అన్నింటిని స్పష్టంగా చూడగలుగుతాడు. సామెతలు 4:18 లో ముందుగా తెలియజేయబడినట్లు, యెహోవా ప్రజలు, దేవుని ప్రవచన వాక్యం నుండి వచ్చే ప్రకాశవంతమైన సత్యపు సూర్యకాంతిలో తమ మార్గాన్ని స్పష్టంగా చూడగల్గుతున్నారు. వాళ్ళు ఆధ్యాత్మిక అంధకారంలో తొట్రుపడేలా విడిచిపెట్టబడలేదు.

అబద్ధ మెస్సీయలను, అబద్ధ ప్రవక్తలను అనుసరించేవారు అనుభవించే నిరాశనిస్పృహలను యెహోవా వైపుకు చూసేవారు అనుభవించవలసిన అవసరం ఉండదని “దేవుని ప్రవచన వాక్యానికి అవధానమివ్వండి” అనే ముఖ్యాంశ ప్రసంగం ప్రేక్షకులకు గుర్తు చేసింది. దానికి పూర్తి భిన్నంగా, యేసుక్రీస్తే నిజమైన మెస్సీయ అనేదానికి నమ్మదగిన కారణాలు అనేకం ఉన్నాయి! ఉదాహరణకు, యేసు అద్భుతమైన రీతిలో రూపాంతరం చెందడం, ఆయన దేవుని రాజ్యానికి సింహాసనాసీనుడైన రాజు అనేదానికి ముంగుర్తుగా ఉంది. ఆయన 1914 లో రాజ్యాధికారంలోకి వచ్చినది మొదలుకొని, 2 పేతురు 1:19 లో పేర్కొన్నట్లు ఆయన “వేకువచుక్క”గా కూడా ఉన్నాడు. “మెస్సీయ అనే వేకువచుక్కగా ఆయన, విధేయతగల సకల మానవుల కోసం ఉదయించే ఒక క్రొత్త రోజును, లేదా యుగాన్ని ప్రకటిస్తున్నాడు” అని ప్రసంగీకుడు చెప్పాడు.

మధ్యాహ్న కార్యక్రమ ఆరంభంలో, “జ్యోతులవలె ప్రకాశించడం” అనే ప్రసంగం, ఎఫెసీయులు 5:10 గురించి విస్తృతంగా చర్చించింది. ఆ వచనంలో, “వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి” అని పౌలు మనకు ఉపదేశిస్తున్నాడు. క్రైస్తవులు, దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మాత్రమే కాక, యేసును అనుకరిస్తూ బైబిలును తమ జీవితాల్లో అన్వర్తింపజేసుకోవడం ద్వారా కూడా జ్యోతులవలె ఉన్నారు.

ఈ విధమైన జ్యోతుల్లా ఉండేందుకు, మనం తప్పనిసరిగా ‘దేవుని వాక్యాన్ని చదవడంలో ఆనందాన్ని పొందాలి.’ ఈ అంశం, మూడు భాగాలు గల గోష్ఠిలో చర్చించబడింది. ఈ గోష్ఠిలోని మొదటి ప్రసంగీకుడు, బైబిలు “దేవుడు మానవునికిచ్చిన బహుమతుల్లోకెల్లా అతి శ్రేష్ఠమైన బహుమతి” అని అబ్రహాం లింకన్‌ చెప్పిన మాటలను ఉటంకించిన తర్వాత, బైబిలును చదివే విషయంలో మీ అలవాట్లు, యెహోవా వాక్యమంటే మీకున్న మెప్పుదల గురించి ఏమి బయల్పరుస్తున్నాయి అని ప్రేక్షకులను అడిగారు. లేఖనాల్లో ఉన్న వృత్తాంతాలను మనోనేత్రాలతో దర్శిస్తూ, క్రొత్తగా తెలుసుకుంటున్న విషయాలను తమకు అప్పటికే తెలిసి ఉన్న విషయాలతో జోడించుకుంటూ బైబిలును జాగ్రత్తగా చదవాలని ప్రేక్షకులను ప్రోత్సహించారు.

ఈ గోష్ఠిలోని రెండవ భాగం, “బలమైన ఆహారము”ను జీర్ణించుకోవాలంటే మనం యథాలాపంగా చదవడం కాకుండా, అధ్యయనం చేయవలసిన అవసరముంది అని నొక్కి చెప్పింది. (హెబ్రీయులు 5:13, 14) ముఖ్యంగా, ఇశ్రాయేలీయుల యాజకుడైన ఎజ్రాలా మనం ముందుగానే ‘మన హృదయాలను సిద్ధం’ చేసుకుంటే, అధ్యయనం నిర్మాణాత్మకమైనదిగా ఉంటుంది అని ప్రసంగీకుడు అన్నారు. (ఎజ్రా 7:10, NW) కానీ అధ్యయనం ఎందుకంత ప్రాముఖ్యం? ఎందుకంటే, యెహోవాతో మనకు ఉండే సంబంధానికీ అధ్యయనానికీ సూటైన సంబంధం ఉంటుంది. కనుక, బైబిలు అధ్యయనం మనకు అమూల్యమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా, నవోత్తేజాన్ని కలిగించేదిగా ఉండి తీరాలి. అయితే, బైబిలు అధ్యయనానికి మానసిక క్రమశిక్షణా, ప్రయత్నమూ అవసరం. అర్థవంతమైన అధ్యయనానికి మనం సమయాన్ని ఎలా కనుగొనగలం? ఏమంత ప్రాముఖ్యం కాని కార్యకలాపాల నుండి “అనుకూలమైన సమయాన్ని కనుగొనడం” ద్వారా మనమలా చేయవచ్చని ఈ గోష్ఠిలోని చివరి ప్రసంగీకుడు అన్నాడు. (ఎఫెసీయులు 5:16, NW) అవును, సమయాన్ని కనుగొనేందుకు కీలకం, మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే.

“అలసినవారికి దేవుడు శక్తినిస్తాడు” అనే ప్రసంగంలో, నేడు చాలా మంది వ్యక్తులు అలసిపోతున్నారన్న విషయాన్ని అంగీకరించడం జరిగింది. కనుక, క్రైస్తవ పరిచర్యలో మనకు “అసాధారణమైన బలం” ఉండేందుకుగాను, “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు” అయిన యెహోవాపై మనం ఆధారపడవలసిన అవసరం ఉంది. (2 కొరింథీయులు 4:7, NW; యెషయా 40:29) బలపరచే సహాయకాలు: దేవుని వాక్యం, ప్రార్థన, క్రైస్తవ సంఘం, పరిచర్యలో క్రమంగా పాల్గొనడం, క్రైస్తవ పైవిచారణకర్తలు, నమ్మకస్థులుగా ఉంటున్న ఇతరుల మాదిరులు. “కాలాన్ని బట్టి బోధకులుగా ఉండవలసినవారు” అనే అంశం, క్రైస్తవులు బోధకులుగా అలాగే ప్రకటించేవారిగా ఉండాల్సిన అవసరాన్నీ, “బోధించే కళ”ను వృద్ధి చేసుకునేందుకు శ్రమించవలసిన అవసరాన్నీ నొక్కిచెప్పింది.—2 తిమోతి 4:2, NW.

“దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు నిలువరు” అన్నది ఆ రోజటి చివరి ప్రసంగాంశం. యెహోవాసాక్షులను ఒక ప్రమాదకరమైన తెగగా ముద్రవేయాలనే ఉద్దేశంతో కొన్ని దేశాల్లో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఇటీవల జరిగాయి అని ఆ ప్రసంగంలో ప్రస్తావించబడింది. కానీ మనం భయపడనవసరం లేదు, ఎందుకంటే, యెషయా 54:17 ఇలా చెబుతుంది: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.”

రెండవ రోజు: ప్రవచన లేఖనాల ద్వారా తెలియజేయబడిన విషయాలు

దినవచన చర్చ తర్వాత, “వెలుగు ప్రకాశకులుగా యెహోవాను ఘనపరచడం” అనే రెండవ గోష్ఠిని ప్రేక్షకులు ఆస్వాదించారు. ప్రతిచోటా ప్రకటించడం ద్వారా యెహోవాను మహిమపరచాలన్నదే క్రైస్తవుని లక్ష్యమని ఈ గోష్ఠిలోని మొదటి ప్రసంగం చూపించింది. సువార్తకు ప్రతిస్పందించేవారిని దేవుని సంస్థలోకి నడిపించవలసిన అవసరాన్ని తర్వాతి భాగం పేర్కొంది. వారిని ఎలా నడిపించవచ్చు? బైబిలు పఠనం జరిపే ప్రతిసారీ ప్రారంభంలో గానీ చివరన గానీ ఐదో పదో నిమిషాలు తీసుకుని, దేవుని సంస్థ ఎలా పనిచేస్తుందో వారికి చూపించడం ద్వారా నడిపించవచ్చు. సత్క్రియల ద్వారా దేవుడ్ని మహిమపరచవలసిన అవసరముందని ఈ గోష్ఠిలోని మూడవ ప్రసంగం నొక్కి చెప్పింది.

“యెహోవా జ్ఞాపికల్ని అధికంగా ప్రేమించండి” అనే ప్రసంగంలో 119వ కీర్తనలోని ఎంపిక చేయబడిన లేఖనాలు చర్చించబడ్డాయి. మనమందరమూ విషయాలను మరిచిపోతూ ఉంటాం కనుక, నిశ్చయంగా, మనకందరికీ జ్ఞాపికలు అవసరం. కనుక, కీర్తన రచయితలాగే, మనం కూడా యెహోవా జ్ఞాపికలపై మక్కువను పెంచుకోవడం ఎంత ప్రాముఖ్యం!

సమావేశంలోని విశిష్టమైన అంశం బాప్తిస్మ ప్రసంగం. “ప్రవచనవాక్యాన్ని లక్ష్యపెట్టడం బాప్తిస్మానికి నడిపిస్తుంది” అన్నదే ఆ ప్రసంగాంశం. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మాత్రమే కాక, క్రీస్తు అడుగుజాడలను దగ్గరగా అనుసరించడం ద్వారా క్రీస్తును అనుకరించాలని బాప్తిస్మ అభ్యర్థులకు గుర్తు చేయబడింది. (1 పేతురు 2:21) ఆత్మాభిషిక్తులైన తన శిష్యులతో కలిసి సేవచేసేందుకు తాను “వేరే గొఱ్ఱెల”ను తోడుకొని వస్తానని యోహాను 10:16 లో యేసు ముందే చెప్పాడు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగస్థులయ్యేంతటి ఆధిక్యత ఈ క్రొత్తవారికి లభించింది!

మధ్యాహ్న కార్యక్రమ ఆరంభంలో, “ఆత్మ చెప్తున్నదాన్ని వినండి” అనే ప్రసంగం, యెహోవా ఆత్మ బైబిలు ద్వారా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా, బైబిలు శిక్షణ పొందిన మన మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడుతుంది అని వివరించింది. (మత్తయి 24:45) కనుక, క్రైస్తవులు దేవుడ్ని ఎలా ప్రీతిపరచాలన్నది తెలుసుకునేందుకు పరలోకం నుండి అక్షరార్థంగా ఒక స్వరాన్ని వినవలసిన అవసరం లేదు. “దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను స్థిరంగా అంటిపెట్టుకోవడం” అన్న తర్వాతి ప్రసంగం, ఈ లోకం ప్రచారం చేసే నైతికంగా దిగజార్చే తలంపుల గురించి పరిశోధించవద్దని క్రైస్తవులకు సలహా ఇచ్చింది. నిజానికి, జిజ్ఞాసను అదుపుచేసుకోకపోతే, విశ్వాసభ్రష్టులూ, సాతాను తాలూకు ఇతర ఏజెంట్లూ ప్రజల మనసుల్లో నాటుతున్న హానికరమైన సమాచారం మన మనసులో కూడా నాటుకుపోతుంది. బైబిలునూ అలాగే, కావలికోట మరియు తేజరిల్లు!లలోని శీర్షికలన్నింటినీ క్రమంగా చదవడం ఎంత శ్రేయస్కరం!

లేఖనాధారమైన సత్యపు “నమూనా”ను లేదా చట్రాన్ని బాగా పరిచయం చేసుకుని ఉండడం ప్రాముఖ్యమని “ఆరోగ్యకరమైన మాటలకు అంటిపెట్టుకుని ఉండండి” అనే తర్వాతి ప్రసంగం నొక్కి చెప్పింది. (2 తిమోతి 1:13, NW) ఈ నమూనాను ఆకళింపు చేసుకోవడం దైవ భక్తితో ఉండడానికి మాత్రమే కీలకం కాదు, సత్యంతో పొందిక లేనిది ఏమిటన్నది గ్రహించడానికి కూడా కీలకమే.

యెహోవా మనలను కోరదగినవారిగా దృష్టించడాన్ని ఊహించండి. ఎంతటి ఘనత అది ! హగ్గయి ప్రవచనంపై ఆధారపడిన, “‘యిష్టవస్తువులు’ యెహోవా మందిరంలోనికి వస్తున్నాయి” అనే ప్రసంగం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అది “గొప్ప సమూహము”లోని ప్రతి ఒక్కరు యెహోవా దృష్టిలో నిజంగా కోరదగినవారేనని హామీ ఇచ్చింది. (ప్రకటన 7:9) కనుక, యెహోవా, రానున్న “మహా శ్రమ”ల కాలంలో చివరిసారిగా జనాంగములను ‘కదిలించేటప్పుడు’ వాళ్ళను కాపాడతాడు. (మత్తయి 24:20, 21; హగ్గయి 2:7, 21, 22) అయితే, యెహోవా ప్రజలు “మెలకువగా ఉండేలా ప్రవచన లేఖనాలు మనల్ని అప్రమత్తుల్ని చేస్తాయి” అనే ప్రసంగంలో వివరించబడినట్లు, ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడం తప్పనిసరి. “కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి” అని యేసు అన్న మాటలను ప్రసంగీకుడు ఉటంకించాడు. (మత్తయి 24:42) మనం ఆధ్యాత్మికంగా ఎలా మెలకువగా ఉండవచ్చు? యెహోవా సేవలో బిజీగా ఉండడం ద్వారా, ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా, యెహోవా దినము గురించి నిరీక్షిస్తూ ఉండడం ద్వారా మెలకువగా ఉండవచ్చు.

“అంత్యకాలములో ప్రవచన వాక్యము” అన్నది ఆ రోజటి చివరి ప్రసంగాంశం. ఆ ప్రసంగాన్ని రానున్న సంవత్సరాల్లో కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకని? దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే క్రొత్తపుస్తకం విడుదలను ప్రసంగీకుడు ప్రకటించాడు. “సుందర చిత్రాలున్న 320 పేజీల ఈ పుస్తకంలో దానియేలు పుస్తకంలోని ప్రతి భాగమూ చర్చించబడింది” అని ప్రసంగీకుడు చెప్పాడు. యెహోవా తన ప్రవచన వాక్యంపై వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు అనేందుకు, విశ్వాసాన్ని బలపరచే ఎంతటి రుజువు!

మూడవ రోజు: దేవుని ప్రవచన వాక్యం ఎన్నడూ విఫలం కాదు

“నియమిత కాలం కొరకైన ప్రవచన వాక్యాలు” అనే గోష్ఠితో ఈ సమావేశపు చివరి రోజు ప్రారంభమైంది. యెహోవా తీర్పులను ప్రకటిస్తూ హబక్కూకు చేసిన మూడు ప్రకటనలను ఈ గోష్ఠిలోని మూడు భాగాల్లో పరిశీలించారు. మొదటి ప్రకటన యథేచ్ఛగా ప్రవర్తించిన యూదా జనాంగానికి వ్యతిరేకమైనది, రెండవది వారిని అణచివేస్తున్న బబులోనుకు వ్యతిరేకమైనది. చివరిది దుష్టులైన మానవులందరికీ త్వరలో రాబోయే నాశనాన్ని గురించినది. అది ఇంకా నెరవేరవలసి ఉంది. మూడవ భాగాన్ని నిర్వహించిన సహోదరుడు, అర్మగిద్దోను గురించి మాట్లాడుతూ, “నిజంగా, యెహోవా తన గొప్ప శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించినప్పుడు, భక్తిపూర్వక భయాన్ని పుట్టిస్తుంది” అని అంటూ ఆరోగ్యకరమైన దైవిక భయాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు.

“మన ఆధ్యాత్మిక వారసత్వంపట్ల మెప్పుదల” అన్నది ఈ సమావేశంలో జరిగిన ప్రేరణాత్మక బైబిలు నాటకం పేరు. ఈ నాటకం, ఆధ్యాత్మిక విషయాల పట్ల యాకోబు ఏశావులకున్న దృక్పథాలు ఎంత విరుద్ధంగా ఉన్నాయో చూపిస్తూ, ప్రేక్షకులు ఆత్మ పరిశీలన చేసుకునేలా పురికొల్పింది. ఏశావు తన ఆధ్యాత్మిక వారసత్వాన్ని అలక్ష్యం చేశాడు కనుక, అది యాకోబుకు ఇవ్వబడింది, ఆయన దాన్ని ఎంతో అమూల్యమైనదిగా ఎంచాడు. “యెహోవా మనకు ఏమి [ఆధ్యాత్మిక వారసత్వాన్ని] ఇచ్చాడు?” అని సమావేశానికి వచ్చిన ప్రేక్షకులను ప్రసంగీకుడు అడిగాడు. “తన వాక్యమైన బైబిలు సత్యం; సదాకాలం జీవించే నిరీక్షణ; సువార్తను ప్రకటించేవారిగా ఆయనకు ప్రాతినిధ్యం వహించే ఘనత” అన్నవే ఆ వారసత్వం అని ఆయనే జవాబిచ్చాడు.

“మన ప్రశస్తమైన వారసత్వం మీకు ఎలాంటి అర్థాన్ని కలిగివుంది?” అన్నది తర్వాతి ప్రసంగాంశం. వ్యక్తిగత ఆసక్తుల కన్నా, భౌతిక ఆసక్తుల కన్నా యెహోవా సేవకూ, ఆధ్యాత్మిక ఆధిక్యతలకూ మొదటి స్థానాన్ని ఇవ్వడం ద్వారా మనం మన ఆధ్యాత్మిక వారసత్వం విషయంలో సరైన దృక్పథాన్ని కనబరుస్తాము. ఈ విధంగా చేయడం ద్వారా, మనం ఆదాముకూ, ఏశావుకూ, నమ్మకంగా ఉండని ఇశ్రాయేలీయులకూ భిన్నంగా, మన జీవితాన్ని యెహోవాతో మనకున్న సంబంధం చుట్టూ నిర్మించుకుంటాం.

“ప్రవచించిన ప్రకారమే సమస్తమూ నూతనమైనవిగా చేయటం” అనే బహిరంగ ప్రసంగం, “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” గురించిన నాలుగు ముఖ్య ప్రవచనాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని వివరించింది. (యెషయా 65:17-25; 66:22-24; 2 పేతురు 3:13; ప్రకటన 21:1, 3-5) స్పష్టంగా, సా.శ.పూ. 537 లో పునఃస్థాపించబడిన తన ప్రజలపై నెరవేరిన వాటి కన్నా గొప్ప నెరవేర్పులే యెహోవా మనస్సులో ఉన్నాయి. అవును, ఆయన మనస్సులో తన రాజ్య ప్రభుత్వం (“క్రొత్త ఆకాశము”) ఉంది, మహిమాన్వితమైన భూగోళవ్యాప్త పరదైసుపై నివసించే భూమిమీద ఉండే దాని ప్రజలు (“క్రొత్త భూమి”) ఉన్నారు.

“దేవుని వాక్యం మనల్ని నిర్దేశిస్తుండగా మన నిరీక్షణలు” అనే ప్రసంగం, సమావేశాన్ని ఉత్తేజకరమైన విధంగా పురికొల్పే విధంగా ముగింపుకు తీసుకువచ్చింది. రాజ్య ప్రకటనా పనిని పూర్తి చేసేందుకు మిగిలివున్న “కాలము సంకుచితమై యున్నది” అని అది అందరికీ గుర్తు చేసింది. (1 కొరింథీయులు 7:29) అవును, సాతానుకూ, అతని దుష్ట విధానానికంతటికీ వ్యతిరేకంగా యెహోవా విధించిన తీర్పు అమలు చేయబడే కాలం ఆసన్నమైంది. “మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు” అని పాడిన కీర్తన రచయితకున్న అవే భావోద్వేగాలూ మనకూ ఉండును గాక. (కీర్తన 33:21) దేవుని ప్రవచన వాక్యం ఆధారంగా కనిపెట్టుకుని ఉంటున్నవారికి ఎంతటి మహిమాన్వితమైన భవిష్యత్‌ ముందుంది!

[7వ పేజీలోని చిత్రం]

ప్రేరణాత్మకమైన ఆ నాటకం ఆధ్యాత్మిక వారసత్వాన్ని గురించి యెహోవా సేవకులకున్న మెప్పుదలను అధికం చేసింది

[7వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రవచన వాక్యాన్ని అనుసరించిన అనేకులు బాప్తిస్మం పొందారు