మిమ్మల్ని మీరు ఎలా దృష్టించుకుంటారు?
మిమ్మల్ని మీరు ఎలా దృష్టించుకుంటారు?
అతడు గర్విష్ఠి. సంస్థానంలో ఉన్నత స్థానానికి చేరుకునేసరికి, తనపై కురిపించబడిన ప్రశంసా వర్షాలకు, అభినందనలకు అతడు అతిశయించాడు. అయితే మరొక అధికారి తనకు అంత గౌరవం ఇవ్వడానికి నిరాకరించే సరికి అతనికి కోపం వచ్చింది. ప్రతీకార దాహంతో, అహంకారియైన ఆ ఉన్నతాధికారి తనకు కోపం కలిగించిన ఆ అధికారినీ, సామ్రాజ్యంలో ఉన్న అతని జాతివారినందరినీ సమూలంగా నాశనం చేయడానికి పథకం వేశాడు. సొంత ప్రాముఖ్యతను గురించి ఎంత వక్రంగా ఆలోచించాడు!
అలా పథకం వేసింది హామాను, అతడు పారసీక రాజైన అహష్వేరోషు ఆస్థానంలో ఉన్నతాధికారి. అతనికి ఎవరు శత్రువు అయ్యారు? మొర్దెకై అనే పేరుగల ఒక యూదుడు. ఒక జాతిని సమూలంగా నాశనం చేయాలన్న హామాను ప్రతిస్పందన కాస్త అతిగానే ఉన్నప్పటికీ, అది, అహంకారం వల్ల కలిగే, ప్రమాదకరమైన తీవ్రమైన పర్యవసానాలను సోదాహరణగా తెలియజేస్తోంది. అతని అహంభావం ఇతరులకు సంకట పరిస్థితిని కలిగించడమే కాక, తానే బహిరంగంగా అవమానానికి గురయ్యేందుకు, చివరికి మరణించడానికీ కారణమయ్యింది.—ఎస్తేరు 3:1-9; 5:8-14; 6:4-10; 7:1-10.
సత్యారాధకులు అహంకారానికి అతీతులేమీ కాదు
మనం “మన దేవునితో నడవడంలో వినయం” గలవారమై ఉండాలని యెహోవా కోరుతున్నాడు. (మీకా 6:8, NW) తమను తాము తక్కువగా ఎంచుకోవడంలో విఫలులైన వ్యక్తులను గురించిన వివిధ వృత్తాంతాలు బైబిలులో ఉన్నాయి. వాళ్ళు తమను తాము ఎక్కువగా ఎంచుకోవడం వారికి సమస్యలనూ బాధలనూ తీసుకువచ్చింది. ఆ ఉదాహరణల్లో కొన్నింటిని పరిశీలించడం, సమతుల్యత లేకుండా ఆలోచించడంలోని అవివేకాన్నీ దాని వల్ల కలిగే ప్రమాదాన్నీ గ్రహించడానికి సహాయం చేస్తుంది.
యెహోవా తీర్పును గురించి నీనెవె పట్టణంలో ఉన్న దుష్ట ప్రజలను హెచ్చరించమన్న దైవిక ఆదేశం దేవుని ప్రవక్తయైన యోనాకు ఇవ్వబడినప్పుడు, ఆయన ఆలోచనా సరళి సమతుల్యాన్ని కోల్పోవడంతో, ఆయన పారిపోవడానికి ప్రయత్నించాడు. (యోనా 1:1-3) తర్వాత, తన ప్రకటనా పని ఫలితంగా, నీనెవె పట్టణస్థులు పశ్చాత్తాపపడగా, ఆయన చిన్నబుచ్చుకున్నాడు. ఆయన ప్రవక్తగా తన పేరు ప్రతిష్ఠలకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడంటే వేలాదిమంది నీనెవె పట్టణస్థుల జీవితాలను గురించి ఆయన ఏ మాత్రం చింతించ లేదు. (యోనా 4:1-3) మనం వినయం లేకుండా మన గురించే అతిగా ఆలోచిస్తే, మన చుట్టూ ఉన్న ప్రజల గురించి, మన చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి నిష్పాక్షికమైన సరైన దృక్కోణాన్ని నిలుపుకోవడం కష్టమని మనం కనుగొనవచ్చు.
యూదాకు మంచి రాజుగా ఉండిన ఉజ్జియా విషయం కూడా తీసుకోండి. ఆయన తన ఆలోచనా సరళిలో సమతుల్యతను కోల్పోయి, అహంభావియై నిర్దిష్ట యాజక విధులను చేజిక్కించుకోవాలని ప్రయత్నించాడు. ఆయన, హద్దుమీరుతూ వినయంలేకుండా చేసిన చర్యలు ఆయన రోగగ్రస్థుడవ్వడానికీ, దైవిక ఆమోదాన్ని కోల్పోవడానికీ కారణమయ్యాయి.—2 దినవృత్తాంతములు 26:3, 16-21.
సమతుల్యత లేని ఆలోచనా సరళి మూలంగా యేసు అపొస్తలులు దాదాపు చిక్కులో పడబోయారు. వాళ్ళు వ్యక్తిగత ఘనతను గురించీ, అధికారాన్ని గురించీ అతిగా చింతించారు. పెద్ద పరీక్షా సమయం వచ్చినప్పుడు, వాళ్ళు యేసును వదిలిపెట్టి పారిపోయారు. (మత్తయి 18:1; 20:20-28; 26:56; మార్కు 9:33, 34; లూకా 22:24) వాళ్ళకు వినయం లేకపోవడం వల్ల, సొంత ప్రాముఖ్యతను గురించిన ఆలోచనలు ఉండడం వల్ల, వాళ్ళు యెహోవా ఉద్దేశం మీదా ఆయన చిత్తానికి సంబంధించి తమ పాత్ర మీదా తమకున్న దృష్టిని దాదాపుగా కోల్పోయారు.
సొంత ప్రాముఖ్యత వల్ల కలిగే హానికరమైన ఫలితాలు
మన గురించి మనం సమతుల్యత లేనివిధంగా దృష్టించుకోవడం, మనోవేదనకూ మనకు ఇతరులతో ఉన్న సంబంధం దెబ్బతినడానికీ కారణమౌతుంది. ఉదాహరణకు, మనం ఒక గదిలో కూర్చుని ఉండగా, ఒక జంట తగ్గు స్వరంలో మాట్లాడుకోవడమూ, నవ్వుకోవడమూ మనం గమనించవచ్చు. మనం అస్తమానం మన గురించే ఆలోచించేవాళ్ళమైతే, వాళ్ళు అంత నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారంటే మన గురించే మాట్లాడుకుంటున్నారని మనం అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం వేరే ఏదన్నా అయ్యుంటుందని అనుకోవడానికి మన మనస్సు అంగీకరించకపోవచ్చు. వాళ్ళు మన గురించి కాక, ఇంకెవరి గురించి మాట్లాడుకుంటారు అని అనుకోవచ్చు. మనం కలతచెంది, ఇకెన్నడూ వాళ్ళతో మాట్లాడకూడదని నిర్ణయించుకోవచ్చు.
మన సొంత ప్రాముఖ్యతను గురించి సమతుల్యత లేకుండా ఆలోచించడం, అపార్థాలు చేసుకోవడానికి కారణం కావచ్చు, స్నేహితులతోను కుటుంబ సభ్యులతోను మరితరులతోను ఉన్న సంబంధాలు చెడిపోవడానికీ కారణం కావచ్చు.తమ గురించి తాము అతిగా ఆలోచించేవారు, గొప్పలు చెప్పుకునేవారిగా మారవచ్చు. అలా వాళ్ళు అస్తమానం, తమకున్నాయని తాము భావిస్తున్న గొప్ప సామర్థ్యాలను గురించి, తాము చేసే కార్యాలను గురించి, లేక తమ వస్తుసంపదల గురించి చెప్పుకుంటూ ఉండవచ్చు. లేదా వాళ్ళు ఎల్లప్పుడూ ఏదో ఒకటి తమ గురించి తాము చెప్పుకుంటూ, సంభాషణల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తుండవచ్చు. అలాంటి మాటలు నిజమైన ప్రేమకు తావివ్వవు, అవి చాలా కోపాన్ని కలిగించగలవు. కనుక అహంభావులు తరచూ తమను తాము ఇతరుల నుండి దూరం చేసుకుంటారు.—1 కొరింథీయులు 13:4.
యెహోవాసాక్షులముగా, బహిరంగ పరిచర్యలో మనకు పరిహాసమూ, తిరస్కారమూ ఎదురు కావచ్చు. నిజానికి వారు వ్యతిరేకిస్తున్నది మనలను కాదు, ఈ సందేశానికి మూలకర్తయైన యెహోవానే అని మనం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. అయితే, మన సొంత ప్రాముఖ్యతను గురించిన తప్పుదోవ పట్టిన మన దృక్కోణం, తీవ్రమైన పర్యవసానాలకు దారితీయగలదు. సంవత్సరాల క్రితం, ఒక సహోదరుడు ఇంటింటి పరిచర్యలో ఉండగా, ఒక గృహస్థుడు తనతో కఠినంగా మాట్లాడినప్పుడు, ఆయన దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని, ఆ గృహస్థునితో దుర్భాషలాడాడు. (ఎఫెసీయులు 4:29) ఆ తర్వాత, ఆ సహోదరుడు మళ్ళీ ఎప్పుడూ ఇంటింటి సేవలో పాల్గొనలేదు. అవును, అహంకారం, మనం ప్రకటనా పనిలో ఉన్నప్పుడు నిగ్రహాన్ని కోల్పోయేలా చేయగలదు. ఎన్నడూ అలా జరగకుండా ఉండేందుకు శ్రమించుదాం. బదులుగా, క్రైస్తవ పరిచర్యలో పాల్గొనే ఆధిక్యత విషయమై మనకున్న సముచితమైన మెప్పుదలను కాపాడుకునేందుకు యెహోవా సహాయం కోసం వినయంగా ప్రయత్నించుదాం.—2 కొరింథీయులు 4:1, 7; 10:4, 5.
సొంత ప్రాముఖ్యతను చూసుకునే వైఖరి మనకు ఎంతో అవసరమైన ఉపదేశాన్ని స్వీకరించకుండా చేస్తుంది. సంవత్సరాల క్రితం, దక్షిణ అమెరికాలోని ఒక దేశంలో, కౌమారప్రాయంలో ఉన్న ఒక అబ్బాయి, క్రైస్తవ సంఘంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఒక ప్రసంగం ఇచ్చాడు. పాఠశాల పైవిచారణకర్త ఆయనకు కాస్త సూటిగా ఉపదేశమిచ్చే సరికి, అతడు కోపగించుకుని, తన బైబిలును నేలమీదికి విసిరి కొట్టి, మరెన్నడూ తిరిగిరాకూడదనే ఉద్దేశంతో పెద్ద అంగలు వేసుకుంటూ రాజ్య మందిరంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత, తన అహంకారాన్ని అణుచుకుని, ఆ పాఠశాల పైవిచారణకర్తతో సమాధానపడి, ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని వినయంగా స్వీకరించాడు. చివరికి, ఆ యౌవనస్థుడు క్రైస్తవ పరిపక్వతకు ఎదిగాడు.
వినయం లేకపోవడమూ, మనకు మనం అతి ప్రాముఖ్యతను ఇచ్చుకోవడమూ దేవునితో మనకున్న సంబంధం దెబ్బతినడానికి కూడా కారణమౌతాయి. “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు” అని సామెతలు 16:5 హెచ్చరిస్తోంది.
మన గురించిన సమతుల్యమైన దృక్కోణం
మన గురించి మనం అతిగా ఎంచుకోకూడదన్నది స్పష్టం. దానర్థం, మనం ఏం చేస్తున్నా, లేదా ఏం మాట్లాడుతున్నా సాలోచనగా చేయనవసరం లేదని కాదు. పైవిచారణకర్తలూ, పరిచర్య సేవకులూ—వాస్తవానికి, సంఘంలోని అందరూ—ఏదైనా సాలోచనతోనే చేసేవారై ఉండాలని బైబిలు సూచిస్తుంది. (1 తిమోతి 3:4, 8, 11; తీతు 2:2) అయితే, క్రైస్తవులు, తమ గురించి తాము వినయపూర్వకమైన, సమతుల్యమైన, సాలోచనతో కూడిన దృక్కోణాన్ని ఎలా అలవర్చుకోగలరు, ఎలా కాపాడుకోగలరు?
తమ గురించి తాము సమతుల్యమైన దృక్కోణాన్ని కాపాడుకోగలిగిన వ్యక్తులను గురించిన అనేక ప్రోత్సాహకరమైన మాదిరులు బైబిలులో ఉన్నాయి. అణకువ విషయంలో యేసు చూపిన మాదిరి ఎంతో ఉత్కృష్టమైనదిగా ఉంది. తన తండ్రి చిత్తాన్ని చేసేందుకు, మానవజాతికి రక్షణను తీసుకు వచ్చేందుకు, దేవుని కుమారుడు పరలోకంలో తనకున్న మహిమాన్వితమైన స్థానాన్ని ఇష్టపూర్వకంగా వదిలిపెట్టి, దీనుడైన మానవునిగా భూమి మీదికి వచ్చాడు. అవమానాలనూ, దుర్భాషలనూ, అవమానకరమైన మరణాన్నీ అనుభవించవలసి వచ్చినప్పటికీ, ఆయన ఆత్మనియంత్రణనూ, హుందాతనాన్నీ విడువలేదు. (మత్తయి 20:28; ఫిలిప్పీయులు 2:5-8; 1 పేతురు 2:23, 24) యేసు అలా ఎలా ఉండగల్గాడు? ఆయన పూర్తిగా యెహోవాపైన ఆధారపడ్డాడు, దైవిక చిత్తాన్ని చేయడానికి కృతనిశ్చయం చేసుకున్నాడు. యేసు శ్రద్ధాపూర్వకంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేశాడు, పట్టుదలగా ప్రార్థించాడు, పరిచర్యలో తీవ్రంగా కృషి సల్పాడు. (మత్తయి 4:1-10; 26:36-44; లూకా 8:1; యోహాను 4:34; 8:28; హెబ్రీయులు 5:7) యేసు మాదిరిని అనుసరించడం మన గురించి మనం సమతుల్యమైన దృక్కోణాన్ని పెంపొందించుకోవడానికీ, దాన్ని కాపాడుకోవడానికీ సహాయపడగలదు.—1 పేతురు 2:21.
రాజైన సౌలు కుమారుడైన యోనాతాను ఉంచిన చక్కని మాదిరిని కూడా పరిగణనలోకి తీసుకోండి. తన తండ్రి చూపించిన అవిధేయత మూలంగా, తన తండ్రి తర్వాత రాజయ్యే అవకాశాన్ని యోనాతాను కోల్పోయాడు. (1 సమూయేలు 15:10-29) యోనాతాను తను కోల్పోయిన దానినిబట్టి కోపగించుకున్నాడా? తన స్థానంలోకి వచ్చి పరిపాలించబోయే దావీదు అనే యౌవనస్థుడిపై అసూయ పెంచుకున్నాడా? యోనాతాను దావీదు కన్నా వయసులో చాలా పెద్దవాడూ, బహుశా ఎక్కువ జీవితానుభవం గలవాడూ అయినప్పటికీ, యెహోవా ఏర్పాటుకు వినయంతో అణకువతో తలవొగ్గాడు, దావీదుకు నమ్మకంగా మద్దతునిచ్చాడు. (1 సమూయేలు 23:16-18) దేవుని చిత్తాన్ని గురించి స్పష్టమైన దృక్కోణం కలిగి ఉండి, దానికి ఇష్టపూర్వకంగా లోబడడం ‘మనలను మనం ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనకుండా ఉండేందుకు’ సహాయపడుతుంది.—రోమీయులు 12:3.
నమ్రతనూ, అణకువనూ చూపించడంలో ఉన్న విలువను యేసు నేర్పించాడు. తన శిష్యులు పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు, “అగ్రపీఠము”ను చూసుకొనవద్దనీ, ఎందుకంటే వాళ్ళకన్నా ప్రముఖులైనవారు వస్తే, వాళ్ళు అక్కడి నుండి తక్కువ చోటికి వెళ్ళవలసి వచ్చి, అవమానానికి గురికావలసి వస్తుందనీ అంటూ సోదాహరణంగా చెప్పాడు. నేర్చుకోవలసిన పాఠాన్ని మరింత స్పష్టం చేస్తూ, “తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని” కూడా ఆయన చెప్పాడు. (లూకా 14:7-11) మనం ఆయన ఉపదేశాన్ని అనుసరించి, ‘వినయమును ధరించుకోవడం’ వివేకం.—కొలొస్సయులు 3:12; 1 కొరింథీయులు 1:31.
సమతుల్యమైన దృక్కోణం వల్ల కలిగే ఆశీర్వాదాలు
వినయము అణకువలతో కూడిన స్ఫూర్తి యెహోవా సేవకులు పరిచర్యలో నిజమైన ఆనందాన్ని కనుగొనేందుకు సహాయపడుతుంది. పెద్దలు అణకువగా ఉంటూ, “మందను కనికరిం”చినప్పుడు [“మందతో మృదువుగా వ్యవహరించినప్పుడు,” NW] మందలోనివారు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళగల్గుతారు. (అపొస్తలుల కార్యములు 20:28, 29) సంఘంలోని వారందరూ ఆ పెద్దలతో మాట్లాడాలన్నా, వాళ్ళ సహాయాన్ని అడగాలన్నా సంకోచించరు. ఆ విధంగా, ప్రేమ, ఆప్యాయత, నమ్మకముల స్ఫూర్తితో సంఘంలోనివారు ఒకరికొకరు సన్నిహితులవుతారు.
మనకు మనం అమిత ప్రాముఖ్యత ఇచ్చుకోకపోవడం వల్ల మంచి స్నేహితులను సంపాదించుకోగల్గుతాం. పోటీ స్ఫూర్తిని వృద్ధి చేసుకోకుండా ఉండేందుకూ, మనం చేసే పనుల్లోనూ, మనకున్న వస్తుసంపదల విషయంలోనూ మనం ఇతరులకన్నా ఎక్కువన్నట్లు చూపించుకోవాలని ప్రయత్నించకుండా ఉండేందుకూ నమ్రతా, అణకువా మనకు సహాయపడతాయి. ఈ దైవిక గుణాలు మనం ఇతరుల క్షేమాన్ని గురించి మరెక్కువగా ఆలోచించేవారిగా అయ్యేందుకూ, తద్వారా, అవసరాల్లో ఉన్నవారికి సాంత్వననూ మద్దతునూ ఇచ్చే స్థితిలో ఉండేందుకూ మనకు సహాయం చేస్తాయి. (ఫిలిప్పీయులు 2:3, 4) ప్రేమా, దయా వ్యక్తుల హృదయాలను స్పృశించినప్పుడు, సాధారణంగా వాళ్ళు చక్కగా ప్రతిస్పందిస్తారు. అలాంటి నిస్వార్థంతో కూడిన సంబంధం బలమైన స్నేహాలకు పునాది అవ్వదా? వినయ రహితంగా ఉండకుండా, మనకు మనం అమిత ప్రాముఖ్యతనిచ్చుకోకుండా ఉండడం వల్ల ఎంతటి ఆశీర్వాదం కలుగుతుందో కదా!—రోమీయులు 12:10.
మనలను గురించిన సమతుల్యమైన దృక్కోణం, మనం ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టినప్పుడు మన తప్పును ఒప్పుకోవడాన్ని సులభతరం చేస్తుంది. (మత్తయి 5:23, 24) అది మంచి సంబంధాలకు తావిస్తుంది, సమాధానపడడానికీ, పరస్పర గౌరవానికి దారితీస్తుంది. పైవిచారణ చేసే స్థానాల్లో ఉన్న క్రైస్తవ పెద్దలు మొదలైనవారు అణకువా, వినయమూ గలవారైతే, ఇతరులకు మేలు చేసే అవకాశాలు వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఉంటాయి. (సామెతలు 3:27; మత్తయి 11:29) అణకువగల ఒక వ్యక్తికి, తనకు వ్యతిరేకంగా పాపం చేసినవారిని క్షమించడం కూడా సులభంగా ఉంటుంది. (మత్తయి 6:12-15) తనను ఎవరైనా అవమానపరుస్తున్నట్లున్నా, అతడు దానికి అతిగా ప్రతిస్పందించకుండా, మరే విధంగాను సరిచేయలేని కార్యాలను యెహోవాయే సరిచేస్తాడని యెహోవా మీద నమ్మకముంచుతాడు.—కీర్తన 37:5; సామెతలు 3:5, 6.
మనలను మనం వినయంతో అణకువతో దృష్టించుకోవడం వల్ల యెహోవా ప్రీతినీ ఆమోదాన్ని పొందడమనే అత్యంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు [“అణకువగలవారికి,” NW] కృప అనుగ్రహించును.” (1 పేతురు 5:5) మనం వాస్తవంగా ఉన్నదాని కన్నా, మన గురించి మనం అతిగా ఎంచుకునే ఉచ్చులో ఎన్నడూ పడకుండా ఉందుము గాక. అలా పడకుండా, యెహోవా ఏర్పాటులో మనకున్న స్థానాన్ని మనం వినయంతో గుర్తించుదాం. మనం “మన దేవునితో నడవడంలో వినయం” గలవారమై ఉండాలని యెహోవా కోరుతున్నదాని ప్రకారం చేసేవారందరికీ చాలా గొప్ప ఆశీర్వాదాలు వేచివున్నాయి.
[22వ పేజీలోని చిత్రం]
యోనాతాను దావీదుకు వినయంగా మద్దతు ఇచ్చాడు