కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మెలకువగా నుండుడి”

“మెలకువగా నుండుడి”

“మెలకువగా నుండుడి”

“కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.”—మత్తయి 24:42.

1. దీర్ఘకాలంగా యెహోవా సేవ చేస్తున్నవారు తాము అనేక సంవత్సరాలపాటు చేసిన సమర్పితసేవ గురించి ఎలా భావిస్తారు? ఒక ఉదాహరణ ఇవ్వండి.

దీర్ఘకాలంగా సేవచేస్తున్న ఎంతోమంది యెహోవా సేవకులు తాము యౌవనస్థులుగా ఉండగానే సత్యాన్ని తెలుసుకున్నారు. అమూల్యమైన ఒక ముత్యాన్ని చూసి దాన్ని కొనడానికి తనకు కలిగినదంతా అమ్మివేసిన ఒక వర్తకుడిలా, ఆసక్తిగల ఆ బైబిలు విద్యార్థులు తమను తాము పరిత్యజించుకుని తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నారు. (మత్తయి 13:45, 46; మార్కు 8:34) ఈ భూమిపట్ల దేవునికున్న సంకల్పాలు నెరవేరతాయని తాము అనుకున్న దానికన్నా ఎక్కువకాలం వేచిచూడవలసి వస్తున్నందుకు వీరు ఎలా భావిస్తున్నారు? వారేమీ విచారించడం లేదు! సహోదరుడు ఎ.హెచ్‌. మాక్‌మిలన్‌ దాదాపు 60 సంవత్సరాలపాటు దేవునికి సమర్పితసేవ చేసిన తర్వాత చెప్పిన ఈ మాటలతో వారు ఏకీభవిస్తారు: “నేను నా విశ్వాసంలో కొనసాగాలని మునుపెన్నటికన్నా ఎక్కువగా తీర్మానించుకున్నాను. దానివల్ల నా జీవితం ధన్యమైంది. నేను భవిష్యత్తును నిర్భయంగా ఎదుర్కునేందుకు అది ఇప్పటికీ నాకు సహాయం చేస్తోంది.”

2. (ఎ) యేసు తన అనుచరులకు ఏ సమయానుకూలమైన సలహాను ఇచ్చాడు? (బి) ఈ శీర్షికలో మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాము?

2 మీ విషయమేమిటి? మీ వయస్సును మనస్సులో పెట్టుకోకుండా, యేసు పలికిన ఈ మాటలను పరిశీలించండి: “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.” (మత్తయి 24:42) సరళమైన ఆ వ్యాఖ్యానంలో అపారమైన సత్యం దాగి ఉంది. ఈ దుష్టవిధానానికి తీర్పుతీర్చటానికి ప్రభువు ఏ రోజున వస్తాడో మనకు తెలియదు, తెలుసుకోవల్సిన అవసరమూ మనకు లేదు. కానీ ఆయన వచ్చినప్పుడు, మనం విచారించాల్సిన అవసరం ఏర్పడని విధంగా మనం జీవించాలి. దీనికి సంబంధించి, మనం మెలకువగా ఉండటానికి సహాయం చేసే ఏ మాదిరులను బైబిల్లో చూస్తాము? ఈ ఆవశ్యకతను యేసు ఎలా ఉదాహరించి చెప్పాడు? ఈ భక్తిహీన లోకపు అంత్య దినాల్లో మనం జీవిస్తున్నామనటానికి ఈనాడు ఏ నిదర్శనం ఉంది?

ఒక హెచ్చరికా మాదిరి

3. ఈనాడు అనేకమంది, నోవహు కాలంనాటి ప్రజలను ఎలా పోలి ఉన్నారు?

3 అనేక విషయాల్లో ఈనాటి ప్రజలు నోవహు కాలంనాటి స్త్రీ పురుషులను పోలివున్నారు. ఆ కాలంలో భూమి దౌర్జన్యంతో నిండిపోయివుంది, మానవ హృదయాంతరంగం ‘ఎల్లప్పుడు కేవలము చెడ్డదిగా’ ఉంది. (ఆదికాండము 6:5) చాలామంది అనుదిన జీవిత వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నారు. అయితే, యెహోవా ఆ మహా జలప్రళయాన్ని తీసుకురాకముందు మారుమనస్సు పొందటానికి ప్రజలకు అవకాశమిచ్చాడు. ఆయన నోవహుకు ప్రకటించే నియామకాన్ని ఇచ్చాడు, దాదాపు 40, 50 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు “నీతిని ప్రకటించి,” విధేయతతో సేవచేసి, నోవహు దాన్ని నిర్వర్తించాడు. (2 పేతురు 2:5) అయితే, ప్రజలు నోవహు ప్రకటించిన హెచ్చరికా సందేశాన్ని అలక్ష్యం చేశారు. వారు మెలకువగా లేరు. కాబట్టి, చివరికి యెహోవా తీర్పు తీర్చినప్పుడు కేవలం నోవహు, ఆయన కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు.—మత్తయి 24:37-39.

4. ఏ భావంలో నోవహు పరిచర్య విజయవంతమైనదని చెప్పవచ్చు, మీ ప్రకటనాపని గురించి కూడా అలాగే ఎలా చెప్పవచ్చు?

4 నోవహు పరిచర్య విజయవంతమైందా? ప్రతిస్పందించిన స్వల్పసంఖ్యనుబట్టి నిర్ణయానికి రావద్దు. నిజానికి, ప్రతిస్పందన ఎలా ఉన్నప్పటికీ, నోవహు ప్రకటనాపని దాని ఉద్దేశాన్ని నెరవేర్చింది. ఎలా? ఎలాగంటే ప్రజలు తాము యెహోవాను సేవించాలా వద్దా అనేది నిర్ణయించుకోవటానికి అది తగినంత అవకాశాన్నిచ్చింది. మీరు ప్రకటనాపని చేసే ప్రాంతం విషయమేంటి? కేవలం కొంతమంది అనుకూలంగా ప్రతిస్పందించినప్పటికీ, మీరు గొప్ప విజయం పొందినట్లే. ఎలా? ఎలాగంటే, ప్రకటనపని చేయడం ద్వారా మీరు దేవుని హెచ్చరికను ప్రకటిస్తున్నారు, తద్వారా యేసు తన అనుచరులకు ఇచ్చిన నియామకాన్ని మీరు నెరవేరుస్తున్నారు.—మత్తయి 24:14; 28:19, 20.

దేవుని ప్రవక్తలను అలక్ష్యం చేయడం

5. (ఎ) హబక్కూకు కాలంలో యూదాలో ఏ పరిస్థితులు ప్రబలంగా ఉన్నాయి, ఆయన ప్రవచనార్థక సందేశానికి ప్రజలెలా ప్రతిస్పందించారు? (బి) యెహోవా ప్రవక్తలపట్ల యూదా ప్రజలెలా శత్రుభావంతో వ్యవహరించారు?

5 జలప్రళయం వచ్చిన శతాబ్దాల తర్వాత, యూదా రాజ్యం గంభీరమైన ఉపద్రవాలను ఎదుర్కొంది. విగ్రహారాధన, అన్యాయం, అణచివేత, చివరికి హత్యలు కూడా సాధారణమైపోయాయి. వారు గనుక పశ్చాత్తాపపడకపోతే వారు కల్దీయుల అంటే బబులోనీయుల చేతుల్లో నాశనమౌతారని ప్రజలను హెచ్చరించడానికి యెహోవా హబక్కూకును ప్రేరేపించాడు. (హబక్కూకు 1:5-7) కానీ ప్రజలు దాన్ని వినడానికి నిరాకరించారు. బహుశ వాళ్లు ఇలా తర్కించుకుని ఉండవచ్చు, ‘అంతెందుకు, దాదాపు వందేళ్ల క్రితం ప్రవక్తయైన యెషయా కూడా ఇలాంటి హెచ్చరికనే చేశాడు, అయినా ఇంతవరకూ ఏమీ జరగనేలేదు!’ (యెషయా 39: 6, 7) యూదా అధికారుల్లో అనేకులు సందేశంపట్ల ఉదాసీనంగా ఉండటమేగాక, సందేశకులపట్ల శత్రుభావంతో వ్యవహరించారు. ఒక సందర్భంలో, వారు యిర్మీయా ప్రవక్తను చంపటానికి ప్రయత్నించారు, అహీకాము గనుక జోక్యం చేసుకుని ఉండకపోతే వారు చంపేసేవారే. మరొక ప్రవచన సందేశాన్నిబట్టి ఉగ్రుడై, రాజైన యెహోయాకీము ఊరియా ప్రవక్తను చంపాడు.—యిర్మీయా 26:21-24.

6. హబక్కూకును యెహోవా ఎలా బలపర్చాడు?

6 హబక్కూకు తన సందేశాన్ని ప్రకటించడానికి కూడా అంతే ధైర్యం కావలసి వచ్చింది. యూదా 70 సంవత్సరాలపాటు నిర్జనముగా ఉంటుందని దేవునిచేత ప్రేరేపించబడి ప్రవచించిన యిర్మీయా సందేశానికి ఎంతటి వ్యతిరేకత ఎదురైందో హబక్కూకు సందేశానికి కూడా అంతే వ్యతిరేకత ఎదురైంది. (యిర్మీయా 25:8-11) కాబట్టి, ఎలుగెత్తి ఇలా పలికిన హబక్కూకు ఆవేదనను మనం అర్థం చేసుకోవచ్చు: “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపకయున్నావు.” (హబక్కూకు 1:2) యెహోవా దయాపూర్వకంగా, విశ్వాసాన్ని బలపర్చే ఈ మాటలతో హబక్కూకునకు సమాధానమిచ్చాడు: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:3) కాబట్టి, అన్యాయాన్ని అణచివేతను అంతం చేయటానికి యెహోవాకు ఒక “నిర్ణయకాలము” ఉంది. ఆలస్యమౌతున్నట్లు అన్పించినా హబక్కూకు నిరుత్సాహపడకూడదు, వెనక్కి తగ్గకూడదు. బదులుగా, ప్రతిరోజూ అత్యవసర భావంతో జీవిస్తూ “దానికొరకు కనిపెట్టు”కొని ఉండాలి. యెహోవా దినము జాగు చేయదు!

7. సా.శ. మొదటి శతాబ్దంలో యెరూషలేముపైకి మరో నాశనం ఎందుకు నిర్ణయించబడింది?

7 యెహోవా హబక్కూకుతో మాట్లాడిన 20 ఏండ్ల తర్వాత, యూదా రాజధానియైన యెరూషలేము నాశనం చేయబడింది. ఆ తర్వాత అది పునర్నిర్మించబడింది, హబక్కూకును ఎంతగానో కలవరపర్చిన అనేక తప్పిదాలు చక్కదిద్దబడ్డాయి. అయితే, సా.శ. మొదటి శతాబ్దంలో, ఆ పట్టణం దాని నివాసుల అవిశ్వాస్యతనుబట్టి మరోసారి నాశనానికి నిర్ణయించబడింది. కనికరంతో, యెహోవా నీతి హృదయులైన వారు తప్పించుకోవటానికి ఏర్పాటు చేశాడు. ఈసారి, ఆయన సందేశాన్ని ప్రకటించటానికి అతి గొప్ప ప్రవక్త అయిన యేసుక్రీస్తునే ఉపయోగించాడు. సా.శ. 33 లో, యేసు తన అనుచరులకిలా చెప్పాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.”—లూకా 21:20, 21.

8. (ఎ) యేసు మరణం తర్వాత, కాలం గడుస్తున్న కొద్దీ కొంతమంది క్రైస్తవులకు ఏమి సంభవించి ఉండవచ్చు? (బి) యెరూషలేమును గురించిన యేసు ప్రవచనార్థక మాటలు ఎలా నెరవేరాయి?

8 సంవత్సరాలు గడుస్తుండగా, యెరూషలేములోని కొందరు క్రైస్తవులు యేసు చెప్పిన ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందా అని అనుకుని ఉండవచ్చు. ఎంతైనా, వారిలో కొందరు నిస్సందేహంగా త్యాగాలను చేసే ఉంటారు కదా, వాటిని గురించి ఆలోచించండి. మెలకువగా ఉండాలన్న తమ నిశ్చయత మూలంగా వారు బహుశ ఆకర్షణీయమైన వ్యాపార అవకాశాలను వదులుకుని ఉండవచ్చు. కాలం గడుస్తుండగా, వారు నీరసపడిపోయారా? యేసు మాటలు భావి తరానికి అన్వయిస్తాయి గానీ తమకు కాదని తర్కించుకుంటూ, తమ కాలాన్ని వృధా చేసుకుంటున్నామనే ముగింపుకు వచ్చారా? సా.శ. 66 లో, రోమా సైన్యాలు యెరూషలేమును చుట్టిముట్టినప్పుడు యేసు ప్రవచనం నెరవేరటం ప్రారంభించింది. మెలకువగా ఉన్నవారు సూచనను గుర్తించి, నగరాన్ని విడిచి పారిపోయి, యెరూషలేముతోపాటు నాశనం కాకుండా తప్పించుకున్నారు.

మెలకువగా ఉండాల్సిన అగత్యాన్ని ఉదహరించటం

9, 10. (ఎ) తమ యజమాని తన వివాహం నుంచి తిరిగి రావడం కోసం ఎదురు చూస్తున్న దాసుల ఉపమానాన్ని మీరెలా సంక్షిప్తంగా చెప్తారు? (బి) తమ యజమాని కోసం ఎదురు చూడటమనేది దాసులకు ఎందుకు కష్టమై ఉండవచ్చు? (సి) ఓర్పుతో ఉండటం దాసులకు ఎందుకు ప్రయోజనకరమైనది?

9 మెలకువగా ఉండాల్సిన అగత్యాన్ని నొక్కిచెప్తూ, తన వివాహానంతరం ఇంటికి తిరిగివచ్చే తమ యజమాని కోసం వేచి చూస్తూన్న సేవకులతో యేసు తన శిష్యులను పోల్చాడు. ఆయన ఫలాని రాత్రినాడు వస్తాడని వారికి తెలుసు—కానీ ఏ గడియలో? మొదటి జాములోనా? రెండవ జాములోనా? మూడవ జాములోనా? వారికి తెలియదు. యేసు ఇలా చెప్పాడు: “అతడు [యజమాని] రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.” (లూకా 12:35-38) ఈ దాసుల ఆత్రాన్ని ఊహించండి. వినిపించే ప్రతి సవ్వడీ, కదలుతున్న ప్రతి నీడా ‘మా యజమాని వచ్చాడా?’ అని అనుకునేలా వారి నిరీక్షణను తీవ్రతరం చేసి ఉంటుంది.

10 ఒకవేళ యజమాని రెండవ జాములో, అంటే రాత్రి తొమ్మిదినుంచి మధ్యరాత్రి వరకూ ఉన్న సమయంలో వస్తే అప్పుడేమిటి? దాసులందరూ అంటే, తొలి పొద్దునుంచి ఎంతో కష్టపడి పనిచేసిన వారితో సహా అందరూ ఆయనను ఆహ్వానించటానికి సిద్ధంగా ఉంటారా లేక ఎవరైనా నిద్రలోకి జారుకొని ఉంటారా? యజమాని మధ్యరాత్రి నుంచి ఉదయం మూడు గంటల వరకూ ఉండే మూడవ జాములో వస్తే అప్పుడేమిటి? వారి యజమాని ఆలస్యం చేస్తున్నాడని ఆయన దాసులలో కొందరు నిరుత్సాహపడతారా, చివరికి అసంతృప్తికి లోనవుతారా? * యజమాని వచ్చినప్పుడు మెలకువగా ఉన్నవారు మాత్రమే ధన్యులని ప్రకటించబడుతుంది. వారికి సామెతలు 13:12 లోని ఈ మాటలు నిశ్చయంగా వర్తిస్తాయి: “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.”

11. మెలకువగా ఉండటానికి ప్రార్థన మనకెలా సహాయం చేయగలదు?

11 ఆలస్యం అవుతున్నట్లు అనిపించే సమయంలో, మెలకువగా ఉండటానికి యేసు అనుచరులకు ఏది సహాయం చేస్తుంది? యేసు తాను బందీ కావటానికి కాస్త ముందు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు, తన అపొస్తలులలో ముగ్గురితో ఇలా చెప్పాడు: “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి.” (మత్తయి 26:41) ఆ సందర్భంలో అక్కడే ఉన్న పేతురు, సంవత్సరాల తర్వాత, తన తోటి క్రైస్తవులకు అలాంటి సలహానే ఇచ్చాడు. ఆయనిలా వ్రాశాడు: “అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.” (1 పేతురు 4:7) స్పష్టంగా, ప్రదీప్తమైన ప్రార్థనలు మన క్రైస్తవ దినచర్యలో ఒక భాగంగా ఉండాలి. నిజానికి, మనం మెలకువగా ఉండటానికి సహాయం చేయమని యెహోవాను అహర్నిశలూ అర్థించాల్సిన అవసరం ఉంది.—రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:17.

12. ఊహాకల్పనలు చేయటానికీ, మెలకువగా ఉండటానికీ మధ్యనున్న వ్యత్యాసమేమిటి?

12 పేతురు, “అన్నిటి అంతము సమీపమైయున్నది” అని కూడా అన్నాడని గమనించండి. ఎంత సమీపమైంది? మానవులు ఖచ్చితంగా ఆ దినాన్నీ, గడియనూ తెలుసుకొనే మార్గమేదీ లేదు. (మత్తయి 24:36) అయితే, ఊహాకల్పనలు చేయటానికీ, అంతం కోసం నిరీక్షిస్తూ ఉండటానికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది, మొదటిదాన్ని బైబిలు ప్రోత్సహించడం లేదుగానీ రెండవదాన్ని అది ప్రోత్సహిస్తోంది. (పోల్చండి 2 తిమోతి 4:3, 4; తీతు 3:9.) అంతాన్ని గూర్చి మనం నిరీక్షిస్తూ ఉండగల ఒక మార్గమేమిటి? అంతం ఆసన్నమైనదన్న నిదర్శనంపై సునిశితమైన అవధానాన్ని ఉంచటమే ఒక మార్గం. ఈ భక్తిహీన లోకపు అంత్యదినాల్లో మనం జీవిస్తున్నామని ఋజువుచేసే ఆరు నిదర్శనాలను మనం సమీక్షిద్దాము.

ఒప్పించే ఆరు నిదర్శనాలు

13. రెండవ తిమోతి 3వ అధ్యాయంలో వ్రాయబడివున్న పౌలు ప్రవచనం, మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామని మిమ్మల్ని ఎలా ఒప్పిస్తుంది?

13మొదటిగా, ‘అంత్యదినాల్ని’ గూర్చిన అపొస్తలుడైన పౌలు ప్రవచన నెరవేర్పును మనం స్పష్టంగా చూస్తున్నాము. పౌలు ఇలా వ్రాశాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయంచనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. అయతే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.” (2 తిమోతి 3:1-5, 13) ఈ ప్రవచనం మన కాలంలో నెరవేరటాన్ని చూడటంలేదా? వాస్తవాల్ని త్రోసిపుచ్చేవాళ్లు మాత్రమే దాన్ని కాదనగలరు! *

14. అపవాదిని గురించిన, ప్రకటన 12:9 లోని మాటలు నేడు ఎలా నెరవేరుతున్నాయి, త్వరలోనే అతనికి ఏమి జరుగుతుంది?

14రెండవదిగా, ప్రకటన 12:9 నెరవేర్పుగా సాతానూ అతని దయ్యాలూ పరలోకం నుంచి పడద్రోయబడినందువల్ల కల్గుతున్న పరిణామాలను మనం చూస్తున్నాము. అక్కడ మనం ఇలా చదువుతాము: “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.” దాని ఫలితం, భూమికి గొప్ప శ్రమ. ప్రాముఖ్యంగా 1914 నుంచి, మానవజాతి నిజంగా ఎంతో శ్రమను అనుభవిస్తోంది. కానీ, అపవాది భూమిపైకి పడద్రోయబడినప్పుడు, “తనకు సమయము కొంచెమే అని” అతడికి తెలుసునని కూడా ప్రకటనలోని ప్రవచనం తెలియజేస్తుంది. (ప్రకటన 12:12) ఆ సమయంలో, సాతాను క్రీస్తు అభిషిక్త అనుచరులతో యుద్ధం చేస్తాడు. (ప్రకటన 12:17) నిశ్చయంగా అతడి దాడి ప్రభావాలను మనకాలంలో మనం చూస్తున్నాము. * అయితే, త్వరలోనే, సాతాను “ఇక జనములను మోసపరచకుండునట్లు” అగాధములో బంధించబడతాడు.—ప్రకటన 20:1-3.

15. మనం అంత్యకాలంలో జీవిస్తున్నామనటానికి ప్రకటన 17:9-11 ఎలా నిదర్శనాన్ని ఇస్తుంది?

15మూడవదిగా, ప్రకటన 17:9-11 నందు వ్రాయబడివున్న ప్రవచనంలో ప్రస్తావించబడిన చివరి, ఎనిమిదవ “రాజు” కాలంలో మనం జీవిస్తున్నాము. ఇక్కడ అపొస్తలుడైన యోహాను ఏడు ప్రపంచ శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు రాజులను ప్రస్తావిస్తున్నాడు. అవి ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదీయ-పారసీక దేశాలు, గ్రీసు, రోము, ఆంగ్లో-అమెరికన్‌ ద్వంద్వ ప్రపంచ శక్తి. ‘యేడవ రాజునుండి ఉద్భవించే ఎనిమిదవ రాజును’ కూడా ఆయన చూశాడు. యోహాను దర్శనంలో చివరివాడైన ఈ ఎనిమిదవ రాజు, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని సూచిస్తున్నాడు. ఈ ‘యెనిమిదవ రాజు నాశనమునకు పోవును’ అని యోహాను చెప్తున్నాడు, ఆ తర్వాత ఏ భూరాజులూ ప్రస్తావించబడలేదు. *

16. నెబుకద్నెజరు స్వప్నంలో చూసిన ప్రతిమ యొక్క నెరవేర్పులోని వాస్తవాలు, మనం అంత్యదినములలో జీవిస్తున్నామని ఎలా సూచిస్తున్నాయి?

16నాల్గవదిగా, నెబుకద్నెజరు స్వప్నంలో చూసిన ప్రతిమ పాదాలు సూచించే కాలంలో మనం జీవిస్తున్నాము. దానియేలు ప్రవక్త ఈ మర్మగర్భమైన స్వప్నంలోని అసాధారణ మానవరూప ప్రతిమ అంతరార్థాన్ని చెప్పాడు. (దానియేలు 2:36-43) ప్రతిమలోని నాలుగు లోహ భాగాలు వివిధ ప్రపంచ శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తాయి; శిరస్సు (బబులోను సామ్రాజ్యం)తో ప్రారంభమై, పాదాలు వ్రేళ్లు (ఈనాడు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు) వరకు నాలుగు విభాగాలున్నాయి. ఆ ప్రతిమలో ప్రాతినిధ్యం వహించబడిన ప్రపంచ శక్తులన్నీ కనిపించాయి. మనం ఆ ప్రతిమలోని పాదాలు సూచించే కాలంలో జీవిస్తున్నాము. ఇతర ప్రపంచ శక్తుల రాకను గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. *

17. మన రాజ్య ప్రకటనా పని, మనం అంత్యకాలంలో జీవిస్తున్నామనడానికి మరింత నిదర్శనాన్ని ఎలా అందజేస్తుంది?

17ఐదవదిగా, ఈ విధానాంతం రాకముందు జరుగుతుందని యేసు చెప్పిన భూగోళ వ్యాప్త ప్రకటనాపని నెరవేర్చబడటాన్ని మనం చూస్తున్నాము. యేసు ఇలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) ఈనాడు, ఆ ప్రవచనం ఎన్నడూ లేనంత విస్తృతంగా నెరవేరుతోంది. నిజమే, ప్రకటించబడని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి, యెహోవా నియమిత సమయంలో, గొప్ప కార్యానికి నడిపించే పెద్ద ద్వారము తెరువబడవచ్చు. (1 కొరింథీయులు 16:9) అయినప్పటికీ, భూమిపైనున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సాక్ష్యాన్ని వినేంతవరకూ యెహోవా వేచి ఉంటాడని బైబిలు చెప్పటం లేదు. బదులుగా, సువార్త యెహోవాకు సంతృప్తి కలిగించేంత వరకూ ప్రకటించబడాలి. అప్పుడు, అంతం వస్తుంది.—పోల్చండి మత్తయి 10:23.

18. మహాశ్రమ ప్రారంభమైనప్పుడు కొంతమంది అభిషిక్తుల విషయంలో ఏమి నిజమై ఉంటుందని స్పష్టమౌతుంది, దీన్ని ఎలా నిర్ణయించవచ్చు?

18ఆరవదిగా, క్రీస్తు నిజమైన అభిషిక్త శిష్యుల సంఖ్య తగ్గిపోతూ ఉంది, అయితే మహాశ్రమ మొదలైనప్పుడు వారిలో కొందరు ఇంకా ఈ భూమిపై ఉంటారని స్పష్టమౌతుంది. శేషంలో అధికభాగం వయోః వృద్ధులైనవారే, సంవత్సరాలు గడుస్తుండగా నిజంగా అభిషిక్తులైనవారి సంఖ్య చాలా తగ్గిపోతూవుంది. అయినా, మహాశ్రమను గూర్చి చెప్తూ యేసు ఇలా అన్నాడు: “ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.” (మత్తయి 24:21, 22) కాబట్టి, మహాశ్రమ ప్రారంభమైనప్పుడు క్రీస్తు “ఏర్పరచబడిన” వారిలో కొందరు ఇంకా ఈ భూమిపై మిగిలి ఉంటారని స్పష్టమౌతుంది. *

ముందు ఏముంది?

19, 20. మెలకువగా ఉండి, ఎదురుచూస్తూ ఉండవలసిన అవసరం మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు ఎందుకు ఉంది?

19 భవిష్యత్తులో మనకోసం ఏముంది? ఉత్తేజభరితమైన సమయాలు ఇంకా రానైవున్నాయి. “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని” పౌలు హెచ్చరించాడు. లోకంలో జ్ఞానులవలే కనిపించే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పౌలు ఇలా అంటున్నాడు: “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, . . . వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.” అందుకని, పౌలు తన పాఠకులకు ఇలా ఉద్బోధిస్తున్నాడు: “కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.” (1 థెస్సలొనీకయులు 5:2, 3, 6) నిజంగా, శాంతి భద్రతలను తీసుకురావటానికి మానవ సంస్థల వైపుకు చూసేవారు వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. అలాంటివారు గాఢనిద్రలో ఉన్నారు!

20 ఈ విధాన నాశనం అకస్మాత్తుగా జరుగుతుంది. కాబట్టి, యెహోవా దినం కోసమై నిరీక్షిస్తూ ఉండండి. దేవుడే స్వయంగా హబక్కూకునకు ఇలా చెప్పాడు: “అది జాగుచేయక వచ్చును”! వాస్తవానికి, మనం మెలకువగా ఉండవలసిన అవసరం మునుపెన్నటి కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది.

[అధస్సూచీలు]

^ పేరా 10 యజమాని ఫలాని సమయానికి వస్తానని తన దాసులతో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదు. కాబట్టి, తన రాకపోకలను గురించి ఆయన వారికి లెక్క ఒప్పచెప్పవలసిన అవసరమూ లేదు, ఆయన ఆలస్యంగా వస్తున్నట్టు అన్పించినా ఆయన తన దాసులకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరమూ లేదు.

^ పేరా 13 ఈ ప్రవచనాన్ని గూర్చిన వివరమైన చర్చకోసం, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోని 11వ అధ్యాయాన్ని చూడండి.

^ పేరా 14 మరింత సమాచారంకోసం వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలోని 180-6 పేజీలను చూడండి.

^ పేరా 16 వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే పుస్తకంలోని 4వ అధ్యాయాన్ని చూడండి.

^ పేరా 18 గొర్రెలు, మేకల దృష్టాంతంలో, మనుష్యకుమారుడు మహాశ్రమ సమయంలో తన మహిమతో వచ్చి తీర్పుతీర్చటానికి కూర్చుంటాడు. క్రీస్తు అభిషిక్త సహోదరులకు ప్రజలు మద్దతు ఇచ్చారా లేదా అన్నదాని ఆధారంగా ఆయన వారికి తీర్పుతీరుస్తాడు. తీర్పు సమయానికల్లా, క్రీస్తు సహోదరులందరూ ఈ భూమిపై నుంచి ఎప్పుడో వెళ్లిపోయి ఉన్నట్లయితే తీర్పు కోసమైన ఈ ప్రమాణం అర్థరహితమైనదై ఉంటుంది.—మత్తయి 25:31-46.

మీకు జ్ఞాపకమున్నాయా?

• మెలకువగా ఉండటానికి ఏ లేఖనాధార మాదిరులు మనకు సహాయం చేయగలవు?

• మెలకువగా ఉండవలసిన అగత్యాన్ని యేసు ఎలా ఉదహరించాడు?

• మనం అంత్యదినములలో జీవిస్తున్నామని ఏ ఆరు నిదర్శనాలు ఋజువు చేస్తున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రాలు]

ఎ.హెచ్‌. మాక్‌మిలన్‌ దాదాపు ఆరు దశాబ్దాలపాటు విశ్వాసంగా యెహోవా సేవచేశాడు

[10వ పేజీలోని చిత్రం]

యేసు తన శిష్యులను మెలకువగా ఉండే దాసులకు పోల్చాడు