హింసకుడు గొప్ప వెలుగును చూశాడు
హింసకుడు గొప్ప వెలుగును చూశాడు
యేసు అనుచరులపట్ల సౌలు క్రోధావేశంతో ఉన్నాడు. అప్పటికే ఆయన యెరూషలేములో వారిని బాగా హింసించాడు, చివరికి స్తెఫనును రాళ్ళతో కొట్టించాడు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు అణచివేతను ఇంకా విస్తృతం చేయాలని చూస్తున్నాడు. “ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు [సౌలు] ప్రధానయాజకునియొద్దకు వెళ్లి, యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.”—అపొస్తలుల కార్యములు 9:1, 2.
సౌలు దమస్కు వైపుకు వెళ్తున్నప్పుడు, తనకు ఇవ్వబడిన ఉత్తర్వును ప్రభావవంతంగా ఎలా అమలుజరపాలి అన్న విషయాన్ని గూర్చి బహుశా బాగా ఆలోచిస్తూవుండవచ్చు. ప్రధాన యాజకుడు ఇచ్చిన అధికారం మూలంగా ఆ పట్టణంలో ఉన్న పెద్ద యూదా సమాజపు నాయకులు నిస్సందేహంగా అతనికి సహాయాన్ని అందిస్తారు. వాళ్ళనుండి సహాయంపొందుతానని కూడా అతడు తలస్తున్నాడు.
గమ్యానికి చేరే కొలది సౌలులోని ఉత్సుకత అంతకంతకూ పెరిగిపోయివుంటుంది. యెరూషలేము నుండి దమస్కుకు ప్రయాణించాలంటే అది శ్రమతో కూడిన ప్రయాణం—ఏడు లేక ఎనిమిది రోజులు పట్టే 140 మైళ్ళ నడక. అకస్మాత్తుగా మధ్యాహ్న సమయంలో సూర్యతేజస్సు కంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించింది, ఆయన నేల మీద పడిపోయాడు. “సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని” హెబ్రీ భాషలో ఒక స్వరం తనతో చెప్పడాన్ని విన్నాడు. “ప్రభువా, నీవు ఎవడవని” సౌలు అడిగాడు. “నీవు హింసించుచున్న యేసును” అన్న సమాధానం వచ్చింది. “నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము; నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను; . . . నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.” “ప్రభువా, నే నేమి చేయవలెనని” సౌలు అడిగాడు. అప్పుడు యేసు, “నీవు లేచి దమస్కులోనికి వెళ్లు; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని” అపొస్తలుల కార్యములు 9:3-6; 22:6-10; 26:13-18.
సౌలుతో అన్నాడు.—సౌలుతో ప్రయాణిస్తున్నవారు ఆ స్వరాన్ని విన్నారు గానీ, ఆయనతో మాటలాడినవానిని వాళ్ళు చూడలేదు, లేదా ఆయన చెప్తున్నది వాళ్ళకు అర్థంకాలేదు. సౌలు తిరిగి లేచేటప్పటికి ప్రకాశవంతమైన ఆ వెలుగు వల్ల ఆయన చూడలేకపోయాడు, ఆయనను చేత్తో నడిపించవలసి వచ్చింది. “అతడు మూడు దినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను.”—అపొస్తలుల కార్యములు 9:7-9; 22:11.
ధ్యానములో మూడు రోజులు
సౌలు తిన్ననిదనబడిన వీధిలో నివసిస్తున్న యూదా అనువాని నుండి ఆతిథ్యాన్ని పొందాడు. * (అపొస్తలుల కార్యములు 9:11) ఈ వీధిని అరబ్బీలో డార్బల్-ముస్తాకిమ్ అని అంటారు—అది ఇప్పటికీ డమాస్కస్‌లో ప్రజలు ఉపయోగించే రహదారి. యూదా ఇంటిలో ఉన్నప్పుడు సౌలు ఏన్నెన్ని విషయాల గురించి ఆలోచించాడో ఊహించండి. ఈ అనుభవం మూలంగా సౌలు గ్రుడ్డివానిగా మారిపోయాడు, ఆయన దిగ్భ్రాంతి చెందాడు. ఇప్పుడు ఆ అనుభవానికి అర్థం ఏమిటో ధ్యానించేందుకు సమయం ఉంది.
ఈ హింసకుడు అసంభవమని తలంచినదే అతనికి ఎదురైంది. వ్రేలాడదీయబడిన ప్రభువైన యేసుక్రీస్తు—యూదుల అత్యున్నత అధికారంచే నిందించబడి, ‘తృణీకరింపబడినవాడు, మనుష్యులవలన విసర్జింపబడినవాడు’ అయిన యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడే. అంతెందుకు, ఆయన “సమీపింపరాని తేజస్సులో” దేవుని కుడిపార్శ్వమందు అంగీకృత స్థానంలో ఉన్నాడు కూడా! చివరికి యేసే మెస్సీయా. స్తెఫనూ ఇతరులూ చెప్పింది సత్యం. (యెషయా 53:3; అపొస్తలుల కార్యములు 7:56; 1 తిమోతి 6:16) సౌలు పూర్తిగా పొరబడ్డాడు, ఎందుకంటే సౌలు హింసిస్తున్న వ్యక్తులే తనవారని యేసు చెప్పాడు! నిదర్శనాన్ని చూసిన తర్వాత సౌలు ఎలా ‘మునికోలలకు ఎదురు తన్నగలడు’? మాట వినని ఎద్దు కూడా దాని యజమాని మునికోలతో పొడిచినప్పుడు చివరికి అది ఆయన కోరుతున్న దిశవైపుకు ప్రయాణిస్తుంది. అలాగే, యేసు కోరినట్లుగా సహకరించేందుకు నిరాకరిస్తే సౌలు తనకు హాని తెచ్చుకుంటాడు.
యేసు, మెస్సీయాగా దేవునిచే దోషిగా నిర్ధారించబడి ఉండడు. అయినా, ఆయన అత్యంత అవమానకరమైన మరణాన్ని అనుభవించేందుకు, ధర్మశాస్త్రము విధించే ఈ శిక్షను అనుభవించేందుకు యెహోవా అనుమతించాడు: “వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు.” (ద్వితీయోపదేశకాండము 21:23) హింసాకొయ్యపై వ్రేలాడదీసినప్పుడు యేసు చనిపోయాడు. ఆయన శాపగ్రస్తుడయ్యాడు, తన స్వంత పాపం వల్ల కాదు, ఆయనలో పాపం లేదు, కేవలం పాపులైన మానవజాతి కోసమే అలా శాపగ్రస్తుడయ్యాడు. “ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా—ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. . . . క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను; ఇందునుగూర్చి—మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది” అని తర్వాత సౌలు తెలియజేశాడు.—గలతీయులు 3:10-13.
యేసు బలికి, విమోచనకు కావలసిన విలువ ఉంది. ఆ బలిని అంగీకరించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని, దాని శాపాన్ని యెహోవా అలంకారికంగా మేకుతో కొయ్యకు దిగగొట్టాడు. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకున్నప్పుడు సౌలు, హింసాకొయ్య దేవుని జ్ఞానమని గ్రహించగల్గాడు, ఆ హింసాకొయ్య “యూదులకు ఆటంకముగా” ఉంది. (1 కొరింథీయులు 1:18-25; కొలొస్సయులు 2:13) కాబట్టి, పాపుల పట్ల దేవుడు చూపిస్తున్న కృపవలన మాత్రమే కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల మనం రక్షణ పొందలేము గనుక, ధర్మశాస్త్రానికి బయటనున్నవారికి కూడా రక్షణ తెరవబడింది అని దీని అర్థం. అలాంటి పాపుల్లో సౌలు కూడా ఒకడు. ఆ అన్యజనాంగాల వద్దకే సౌలును యేసు పంపిస్తానన్నాడు.—ఎఫెసీయులు 3:3-7.
సౌలు తాను మారినప్పుడు ఇందులో ఎంత అర్థం చేసుకున్నాడన్నది మనకు తెలియదు. యేసు మరలా మాట్లాడనైయున్నాడు, జనాంగాలకు సౌలు చేసే సేవ విషయమై బహుశా అనేకసార్లు మాట్లాడనైయున్నాడు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ విషయాలన్నింటినీ దైవ ప్రేరేపణ ద్వారా ఆయన వ్రాశాడు. అపొస్తలుల కార్యములు 22:17-21; గలతీయులు 1:15-18; 2:1, 2) కొద్ది రోజుల తర్వాత సౌలు తన క్రొత్త ప్రభువు నుండి మరిన్ని నిర్దేశనాలను పొందాడు.
(అననీయ సందర్శనం
సౌలుకు ప్రత్యక్షమైన తర్వాత యేసు అననీయకు కూడా ప్రత్యక్షమై, “నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు [ఒక దర్శనంలో,] అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని” చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 9:11, 12.
సౌలు గురించి తెలిసివున్న అననీయ యేసు మాటలకు ఆశ్చర్యపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. “ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని” చెప్పాడు. అయితే యేసు అననీయతో ఇలా చెప్పాడు: “నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు.”—అపొస్తలుల కార్యములు 9:13-15.
ఆ హామీని పొందిన తర్వాత యేసు చెప్పిన ఆ ఇంటికి అననీయ వెళ్ళాడు. సౌలును కనుగొని పలకరించిన తర్వాత అననీయ ఆయనపై చేతులుంచాడు. ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: ‘అప్పుడే [సౌలు] కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగిం[ది].’ ఇప్పుడు సౌలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు మాటల నుండి సౌలు బహుశ అర్థం చేసుకున్నవాటిని అననీయ చెప్పిన ఈ మాటలు ధృవీకరించాయి: “మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు; నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసికొనుమని చెప్పెను.” ఫలితం? సౌలు “లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.”—అపొస్తలుల కార్యములు 9:17-19; 22:12-16.
అననీయ ఎంత త్వరగా వచ్చాడో అంత త్వరగా వెళ్ళిపోయాడు, ఇక అతని గురించి మనకేమి చెప్పబడడం లేదు. కానీ సౌలు చెబుతున్నది విని ప్రజలు ఆశ్చర్యపోయారు! ఇంతకుముందు హింసకుడు, యేసు శిష్యులను చెరపట్టుకొని వెళ్ళడానికి వచ్చిన వ్యక్తి అయిన సౌలు సమాజమందిరంలో ప్రకటించడానికి మొదలుపెట్టి, యేసే క్రీస్తు అని నిరూపిస్తున్నాడు.—అపొస్తలుల కార్యములు 9:20-22.
‘అన్యజనులకు అపొస్తలుడు’
దమస్కుకు వెళ్ళే మార్గంలో ఈ హింసకునికి ఎదురైన అనుభవం ఆయన కార్యకలాపాలకు పగ్గం వేసింది. మెస్సీయ ఎవరన్నది గుర్తించాడు గనుక సౌలు, హెబ్రీలేఖనాల్లోని ప్రవచనాలను వాటి భావాలను యేసుకు అన్వయించగల్గాడు. యేసు తనకు ప్రత్యక్షమయ్యాడనీ, తనను ‘పట్టుకొన్నాడనీ’, తనను ‘అన్యజనులకు అపొస్తలుని’గా నియమించాడనీ గ్రహించడం సౌలు జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. (ఫిలిప్పీయులు 3:12; రోమీయులు 11:13, 14) ఇప్పుడు అపొస్తలుడైన పౌలుగా, మిగిలిన తన భూజీవితాన్ని మాత్రమే కాదు, క్రైస్తవ చరిత్ర గతిని కూడా నిర్దేశించే ఆధిక్యతా అధికారమూ ఆయనకు లభించాయి.
సంవత్సరాల తర్వాత, పౌలు అపొస్తలత్వం విషయంలో కొందరు వివాదాన్ని రేపినప్పుడు, దమస్కుకు వెళ్ళే మార్గంలో జరిగిన తన అనుభవాన్ని చెప్పడం ద్వారా తన అధికారాన్ని సమర్థించుకున్నాడు. “నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా?” అని అడిగాడు. పునరుత్థానుడైన యేసు ఇతరులకు ప్రత్యక్షం కావడాన్ని గూర్చి వివరించిన తర్వాత సౌలు (పౌలు) ఇలా చెప్పాడు: “అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను.” (1 కొరింథీయులు 9:1; 15:8) యేసు పరలోక మహిమను దర్శనంలో చూడడం ద్వారా, సౌలు నిర్ణీతకాలానికి ముందే ఆత్మ ప్రాణిగా జన్మించే, లేదా పునరుత్థానమయ్యే ఘనతను అనుభవించినట్లు ఉంది.
సౌలు తన ఆధిక్యతను గుర్తించి, దానికి తగ్గట్లుగా జీవించడానికి కృషిచేశాడు. “నేను అపొస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను. . . . నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరి [మిగతా అపొస్తలులందరి]కంటె నేనెక్కువగా ప్రయాసడితిని.”—1 కొరింథీయులు 15:9, 10.
దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే దీర్ఘకాలంగా అనుసరిస్తున్న మత దృక్పథాలను మార్చుకోవాల్సిన అవసరముందని మీరు గ్రహించిన సమయం బహుశా సౌలుకున్నట్లుగానే మీకు కూడా జ్ఞాపకం ఉండవచ్చు. మీరు ఆ సత్యాన్ని గ్రహించేలా యెహోవా మీకు చేసిన సహాయానికి మీరు యెహోవాకు కృతజ్ఞత కలిగివుంటారనడంలో ఎటువంటి సందేహమూలేదు. సౌలు ఆ వెలుగును చూసినప్పుడు, తన నుంచి ఏమి కోరబడుతుందో తెలుసుకున్న తర్వాత ఆయన దాన్ని చేయడానికి వెనుకాడలేదు. తన మిగిలిన భూజీవితంలో ఆయన దాన్ని ఆసక్తితోనూ, పట్టుదలతోనూ చేస్తూనే ఉన్నాడు. నేడు యెహోవా అనుగ్రహం కావాలని కోరుకునే అందరికీ ఎంత చక్కని మాదిరి!
[అధస్సూచీలు]
^ పేరా 7 ఈ యూదా, స్థానిక యూదా సమాజానికి నాయకుడు గానీ లేక యూదులకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న పూటకూళ్ళ ఇంటి యజమాని గానీ అయివుంటాడని ఒక విద్వాంసుడు భావించాడు.
[27వ పేజీలోని చిత్రం]
ప్రస్తుత దిన దమస్కులో తిన్ననిదని పిలువబడే వీధి
[చిత్రసౌజన్యం]
Photo by ROLOC Color Slides